శుభాన్నే సంకల్పించాలి
ఆత్మీయం
భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయం అత్యంత ప్రాచీనమైనది, శాస్త్రీయమైనది. భూమి, సౌరవ్యవస్థలోని గ్రహాల పరిభ్రమణం మొదలైన వివరాలను మన మహర్షులు ఎంతో శోధించి మనకు అందించారు. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ ఆధ్యాత్మికమైనవే. కంటికి కనిపించని పరబ్రహ్మ దర్శనం వేదధర్మం వలన కలుగుతుంది. నీరు, నిప్పు, గాలి, సూర్యచంద్రులు, పర్వతాలు, పుడమి, చెట్టు, చేమా...అన్నీ ఈశ్వరమయాలు.
అవి మనకు శాంతిని, సుఖాన్ని కలిగించాలని అధర్వణ వేదం ఆకాంక్షిస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచంలోని స్థావర జంగమాలన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకోవడమే కాక ఏ పీడలూ లేకుండా ఉండాలని ఆకాంక్షించారు వేదర్షులు. వేదాలు మనకు బోధించింది ఏమిటంటే.. మనం చేయగలిగినదంతా చేసి, ఊహించని ఫలం ఎదురైనప్పుడు ప్రారబ్ధమనో, దైవ సంకల్పమనో సమాధానపడాలి.
ఆ ఫలం కూడా గతంలో మన కర్మకు ప్రతిఫలంగానే భావించాలి. ఏదేమైనా శుభాన్నే సంకల్పించడం, ఆశించడం మన విధి. భగవద్గీతను బోధించిన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వేదధర్మాన్ని బోధించాడు. వేదాలు, ఉపనిషత్తులు మనకేవో అర్థంకాని విషయాలు చెబుతాయని అనుకోనక్కర్లేదు. చిన్న చిన్న కథలతో జ్ఞానమార్గాన్ని చూపించే శక్తియుక్తులు వాటిలో చాలా ఉన్నాయి. మనిషి చేయాల్సిందల్లా ఆ జ్ఞానాన్ని పొందడానికి త్రికరణశుద్ధిగా గురువును అనుసరించడమే. అప్పుడు సమాజమంతా జ్ఞానమయమే అవుతుంది.