మాయ..మార్కెట్‌..మనిషి | Indian stock markets | Sakshi
Sakshi News home page

మాయ..మార్కెట్‌..మనిషి

Published Sun, Nov 26 2017 12:28 AM | Last Updated on Sun, Nov 26 2017 12:28 AM

Indian stock markets - Sakshi

ముంబై.. దేశ ఆర్థిక రాజధాని... భారత స్టాక్‌మార్కెట్లకు నెలవు... నిమిషాల్లో ఫకీరును అమీరుగా, అమీరును ఫకీరుగా (ఫకీర్‌ జనాభానే ఎక్కువనుకోండి) మార్చే మాయలమరాఠీలకు మారు రూపాలు ఈ మార్కెట్లని గిట్టనివాళ్లు ఆడిపోసుకుంటారు. ఇప్పటి ముంబైలో ఈ స్టాక్‌ మార్కెట్లు కొలువై ఉన్న ప్రాంతంలోనే ఒకప్పుడు సూత మహామునికి తమ్ముడి వరుసయ్యే జూనియర్‌ సూతుడు అనేక సత్ర యాగాలు చేశాడని అదేదో పురాణంలో ఉంది.ఈ యాగాలకు ఓ అంటూ.. జూనియర్‌ శౌనకాది మునుల చుట్టాలు, పక్కాలు బోలెడుమంది వచ్చేవారు. ఒకేడాది అలాంటి సత్రయాగానికి విచ్చేసిన జూ.శౌనకాది మునులంతా జూ. సూతుడి చుట్టూ చేరి‘‘మహానుభావా! కలికాలం రాబోతోంది కదా, అప్పుడు రుషులు ఎలా ఉంటారు? సిద్ధులు ఎలా ఉంటారు? ఆ కాలంలో మాయ అంటే ఏంటి? మనిషిని ఏం చేస్తుంది?’’ అని ప్రశ్నించారు. 
జూ. సూతుడు పేద్ద పేద్ద గడ్డం మీసాల చాటున కనిపించని మందహాసం చేసి‘‘రుషులారా! తెలిసో తెలీకో మంచి ప్రశ్న అడిగారు. కలియుగంలో కొంత కాలం గడిచాక మనిషి మనీని సృష్టిస్తాడు. అంతా మాయ అనేది భారతీయ వేదాంతం. ఈ మాటను మనిషి సృష్టించే మనీ నొక్కి వక్కాణించేదిగా ఈ మనీ . మాయ అని తెలిసి కూడా మనీ కోసమే మెనీ తిప్పలు పడతాడు మానవుడు.’’‘‘ సృష్టికర్తే సృష్టిపై మోహపడటం అప్పట్లో బ్రహ్మ, సరస్వతి విషయంలో జరిగింది, భవిష్యత్‌లో మనిషి, మనీ విషయంలో జరుగుతుంది. అందుకు మనం కూర్చున్న ఈ ప్రాంతమే కేంద్రం అవుతుంది. ’’ అని సమాధానం చెప్పాడు. 

 జూ. శౌనక అండ్‌బ్యాచ్‌శ్రద్ధగా వింటున్నారా?లేదా గమనించి, తాను ఆశించిన ఎఫెక్ట్‌వాళ్ల మొహాల్లో కనిపించేసరికి ఆనందించి జూ. సూతుడు ఇలా కొనసాగించాడు..‘‘మనీ అంటేనే మాయ అనుకుంటే దాన్ని అమ్మమొగుడు లాంటి మాయ ఇంకోటుంది. అది అందరికీ తెలిసేది కాదు. మనలో కొందరు మాత్రమే తపస్సు చేసి మాయ స్వరూప స్వభావాలను తెలుసుకున్నట్లే, అప్పటి మనుషుల్లో కొందరు మాత్రమే ఈ ఆధునిక మాయను తెలుసుకుంటారు.(కనీసం తెలుసుకున్నామని అనుకుంటారు). ఆ మాయ పేరే మార్కెట్‌’’ అని చెప్పగా, జూ. శౌనకాది మునులు ఆత్రంగా ‘‘స్వామీ వీళ్లే కలియుగపు రుషులా?’’ అని ప్రశ్నించారు.‘‘ అలాగే అనుకోవచ్చు బిడ్డలారా.. కాకపోతే, పూర్వపు రుషులు మాయను జయించేవాళ్లు, కానీ ఈ ఆధునిక రుషులు త్రం మార్కెట్లంటేనే మాయని తెలుసుకొని కూడా, మత్తుగా అందులోనే ఉంటారు. ఈ కొత్త రుషులనే ట్రేడర్లంటారు..’’ అని చిరునవ్వుతో వివరించాడు జూ. సూతుడు. ‘‘స్వామీ, కొత్త రుషులు వారి గుణగణాదులు ఎలా ఉంటాయని’’ జూ. శౌనకాది అండ్‌బ్యాచ్‌మరింత ఆసక్తిగా ప్రశ్నించారు. (ఇక్కడనుంచి భాష మొత్తం ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొనసాగుతుంది)

జూ. సూత ఉవాచ:
‘‘ఎవరికి పడితే వాళ్లకు ట్రేడర్లయ్యే అర్హత లేదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.∙ఎవరి జాతకంలోనైతే సర్వ గ్రహాలు విలయతాండవం చేస్తుంటాయో, ∙ఎవరిని భగవంతుడు ప్రతిసారి చిన్నచూపు చూస్తాడో.∙ఎవరి రక్తంలో ఎ, బి, ఒ, ఎబి గ్రూపుల్లో ఏదోఒకగ్రూప్‌తో పాటు ‘తిమ్మిరి’ గ్రూప్‌ అనే ప్రొటీన్‌ అంతర్లీనంగా ఉంటుందో, ∙ఎవరైతే అపజయాలను, విజయాలను సమానంగా చూసే(నిజానికి మొదటివే ఎక్కువ ఉంటాయి) స్థిత ప్రజ్ఞతలాంటి మూర్ఖత్వం ఉంటుందో....అని కాస్త అలుపు తీర్చుకుని‘‘వాళ్లకే ట్రేడర్లయ్యే మహాద్భుత అవకాశం ఉంటుందని అదేదో పురాణంలో ఇంకేదో శ్లోకంలో మరెవడో చెప్పాడని వేరెవరో నాకు చెప్పారు.’’ ఇంతలో జూ. సూతని మేధోతలంలో భవిష్యత్‌లో తెలుగులో పాపులర్‌ కాబోతున్న ఒక డైలాగ్‌ వినిపించి/ కనిపించింది. ఇదేదో బాగుందనుకుంటూ.. అదే స్టైల్లో...‘‘ చూడప్పా శౌనప్పా, ఈ కొత్త రుషులు, పాతకాలం రుషుల్లాంటోళ్లే..  పాతకాలం రుషులు ఏకాంతాన్ని కోరుకుంటారు, కొత్త రుషులు మార్కెట్‌మాయలో ఏ ‘కాంత’నూ పట్టించుకోకుండా ఏకాంతాన్ని కోరుకుంటారు. మిగిలిందంతా సేమ్‌టు సేమ్‌’’. అన్నాడు. ముక్తాయింపుగా ‘‘ కాకపోతే వీళ్లు కోరే ఆ ‘కాంత’(లక్ష్మి) వీళ్ల మొఖం కూడా చూడదు. అది వేరే విషయం’’ అనికూడా సెలవిచ్చాడు జూ. సూతుడు.భవిష్యత్‌కు సంబంధించిన అత్యద్భుత గాధ వింటున్నామన్న ఆసక్తితో ఉన్న జూ. శౌనకాది మునులు అంతటితో ఆగకుండా ‘‘స్వామీ! వీళ్లలో రకాలున్నాయా? ఉంటే ఎలా గుర్తించాలి?’’ అని ప్రశ్నించారు.

జూ. సూత ఉవాచ: 
‘‘అనుభవం, దురదృష్టం, అత్యాశను బట్టి ఈ ఆధునిక రుషులను మూడు రకాలుగా వర్గీకరించింది ‘‘మనీ ధర్మ శాస్త్రం.’’పిల్ల ట్రేడర్లు– బెరుగ్గా ట్రేడింగ్‌ తపస్సును ప్రారంభించి స్వల్పలాభాలనే అప్సరసలను చూసి అదే నిజమని భ్రమపడుతూ ఉంటారు. సీనియర్‌ట్రేడర్లు– స్వల్పలాభాల అప్సరసలను కన్నెత్తి చూడరు, దీక్షగా మోక్షమనే భారీ లాభం కోసం ఎదురు చూస్తుంటారు( ఆ ‘భారీ’కి సరైన నిర్వచనం వీళ్లదగ్గరే ఉండదు) వీళ్ల తపస్సు నాశనం చేసేందుకు అప్పుడప్పుడు(ఎక్కువగా వీళ్ల ఎకౌంట్లో డబ్బులు లేనప్పుడు) మార్కెట్‌వీళ్ల అంచనాలను నిజం చేస్తుంటుంది. దీంతో వాళ్లకు వాళ్లు తపస్సు ఫలించే దశ వచ్చిందని భ్రమపడి మరింత గట్టిగా అప్పులు చేసి తపస్సులు కంటిన్యూ చేస్తుంటారు. 

ముదురు టెంక ట్రేడర్లు– స్వల్పలాభాలను, అప్పుడప్పుడు మార్కెట్లో తమ అంచనాలు నిజం కావడాన్ని పట్టించుకోరు. మార్కెట్‌ అంటేనే మాయ అని పూర్తిగా అర్ధం అవుతుంది. తపస్సు(ట్రేడింగ్‌) చేయాలని ఉంటుంది, నిధులుండవు. కానీ తపస్సులో ఎప్పుడే అడ్డంకి వస్తుందో అందరికీ అరటిపండు వలిచినట్లు చెబుతుంటారు. మార్కెట్‌పెరిగినా, తగ్గినా అంతా మాయ అని గుర్తించి కొత్తవాళ్లకు హితబోధలు చేస్తుంటారు. మనసులోమాత్రం ఒక్కచాన్స్‌వస్తేనా.. అన్న ఆశను మాత్రం వదలరు.’’ మామూలు మనుషుల్లో ఈ రుషులను గుర్తించేందుకు కొన్ని గుర్తులున్నాయని మగధీర సినిమాలో విలన్‌కు హీరోను గుర్తుపట్టే గుర్తులు చెప్పిన అఘోరా(ఈయన ఆ కాలం నుంచి ఉన్నట్లు చరిత్ర చెబుతోంది) చెప్పాడని జూ. సూతుడు సెలవిచ్చాడు. 

‘‘ 1. ఎక్కడబడితే అక్కడ తాము చేసిన చిన్న ట్రేడు గురించి, వచ్చిన స్వల్పలాభం గురించి అడక్కపోయినా ఊదరగొట్టేవాళ్లు– పిల్లట్రేడర్లు. 2. ఏ బ్రోకరేజ్‌సంస్థ ఎలాంటి అంచనా చెప్పినా దాన్ని ఖండిస్తూ, తాము మాత్రమే అసలైన అంచనాకారులమని అందరికీ చెప్పుకుంటూ, తమ అనుభవాన్ని ఎరగా చూపి ఎలాగైనా నిధులు సంపాదించి తపస్సు కొనసాగించాలని నిర్విరామంగా పనిచేసేవాళ్లు– సీనియర్‌ట్రేడర్లు. 3. మార్కెట్‌ దెబ్బకు ఏదో ఒక అలవాటును వ్యసనంగా మార్చుకొని (సిగరెట్లు తాగడం అత్యధికుల్లో కనిపిస్తుంది) సర్వ జ్ఞానాన్ని పంచేందుకు ఎవరొస్తారా అని చూస్తూ... ఖర్మకాలి ఎవరైనా చిన్న సందేహం అడిగినా దానికి జంధ్యాల సినిమాలో నూతన్‌ప్రసాద్‌లాగా మా తాతలు ముగ్గురు అని మొదలెట్టి, అడిగినోడు స్పృహ తప్పేదాకా జ్ఞాన విసర్జన చేసేవాళ్లు– ముదురు టెంక ట్రేడర్లు.’’ అని ఊపిరి పీల్చుకున్నాడు సూతుడు.శ్రద్ధగా కధ వింటున్న శౌనకాది బ్యాచ్‌కు కొత్త డౌట్‌ వచ్చింది. ‘‘స్వామీ, ఈ మగధీర సినిమా అంటే ఏమిటి? జంధ్యాల, నూతన ప్రసాద్‌ ఎవరు? ’’జూ. సూతుడికి కోపం వచ్చింది. 

‘‘మీకు మార్కెట్లు, మాయ గురించి చెబుతానన్నాను గానీ, సినిమాలు, మాయ గురించి చెబుతాననలేదు, అది వేరే, ఇది వేరే. ఎప్పుడు చూడు ప్రతోడికీ చెప్పేదాని మీదకన్నా పనికిరానిదానిమీదే దృష్టి’’ అని కస్సు బుస్సులాడాడు జూ. సూతుడు.జూ. శౌనక అండ్‌కో  ఉవాచ: (భయంతో)‘‘ అంతేనా!’’జూ. సూత ఉవాచ:(కొంచెం కోపం తగ్గి)‘‘ఇంకేం కావాలి?’’జూ. శౌనక అండ్‌కో ఉవాచ:(కొంచెం ధైర్యంగా)‘‘కుదిరితే కాస్త మధురసం.. వీలుంటే ఈ మార్కెట్‌మాయపై మరిన్ని వివరాలు’’జూ. సూత ఉవాచ:(శాంతంగా)‘‘ పైన చెప్పిన మూడు రకాల రుషులే కాకుండా, మార్కెట్‌మాయను జయించినవాళ్లు కూడా ఉంటారు. ఇప్పుడు నిజమైన సిద్ధులు ఉన్నట్లే అప్పుడు మార్కెట్‌సిద్ధులు కూడా ఉంటారు. వీళ్లనే  ఇన్వెస్టర్లంటారు. సిద్ధులకు, ఇన్వెస్టర్లకు పోలిక ఒక్కటే.. ఓపిక. పైన చెప్పుకున్న ట్రేడర్లలో సక్సెస్‌పాలు తక్కువగా ఉండటానికి, ఇన్వెస్టర్లలో సక్సెస్‌ ఎక్కువ ఉండటానికి ఇదే తేడా. వాళ్లకి ఓపిక ఉండదు, వీళ్లకు ఉండేదే ఓపిక.’’

జూ. శౌనక ఉవాచ: ‘‘ఆహా! మా అదృష్టం పుచ్చి ఈ రోజు మాకు ఈ కొత్త విషయాలు చెప్పారు, వీటిని రాబోయే తరాలకు అందిస్తాం, అయితే ఇంత అద్భుత గాధకు ఫల శ్రుతి లేదా స్వామి?’’
జూ. సూత ఉవాచ:‘‘ఎందుకు లేదు, వినండెహె! తొందరెక్కువ తింగరి రుషులారా!కలియుగంలో ఇన్వెస్టర్‌ అవుదామనుకుంటే పర్లేదు కానీ, పైన చెప్పిన రుషుల కేటగిరీల్లో చేరదామనుకుంటే మాత్రం మార్కెట్‌ జోలికి పోకపోవడమే మంచిది. అంతేకాదు, ఇంకోమాట.ఇందాక చెప్పిన రుషులు ఎవరు కనిపించినా కోప్పడటం, విసుక్కోవడం చేయకుండా, వీలైతే మళ్లీ అడగని అప్పులు ఇచ్చి ఆదుకుంటే మార్కెట్‌మహాతల్లి మీకు బోలెడు వరాలిస్తుందని పురాణాలు వక్కాణిస్తున్నాయి.  ఈ మాయ మార్కెట్‌గాధను చదివినా, విన్నా, తెలుసుకున్నా.. మార్కెట్ల మాయలో చిక్కుకోకుండా ఉంటారు.’’పీఎస్‌: అఫ్‌కోర్స్, రుషి కావాలని మీ నుదిటిన రాసి ఉంటే పైన చెప్పిన ఫలశ్రుతి వర్తించదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement