రక్తానికీ ఇన్ఫెక్షన్‌ | Infection in Blood Septisimiya | Sakshi
Sakshi News home page

రక్తానికీ ఇన్ఫెక్షన్‌

Published Thu, Feb 27 2020 10:10 AM | Last Updated on Thu, Feb 27 2020 10:10 AM

Infection in Blood Septisimiya - Sakshi

మన దేహంలోని ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్‌ రావడం మనం చూస్తుంటాం. కళ్లకు వస్తే కళ్లకలక (కంజెక్టివైటిస్‌) అనీ, కాలేయానికి వస్తే హెపటైటిస్‌ అనీ, అపెండిక్స్‌కు వస్తే అపెండిసైటిస్‌ అని చెప్పుకోవడం మనందరికీ తెలిసిందే. మరి శరీరంలోని అన్ని అవయవాలకూ వచ్చినప్పుడు రక్తానికి కూడా ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉందా? ఉంది. కాకపోతే దీని గురించి మనకు అంతగా తెలియదు. రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్‌ను మనం వాడుక భాషలో ‘రక్తం విషంగా మారిపోయింది’ అని వ్యవహరిస్తుంటాం. నిజానికి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైది. ప్రతి ఏటా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ రక్తానికి ఇన్ఫెక్షన్‌ వచ్చే కండిషన్‌ బారిన పడుతున్నారు. వైద్య పరిభాషలో సెప్టిసీమియా లేదా సెప్సిస్‌ అని పిలిచే ఈ కండిషన్‌ ఎందుకు ఏర్పడుతుంది? అదెంత ప్రమాదకరం? అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?... ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.

ముందుగా సెప్టిసీమియా అంటే ఏమిటో చూద్దాం. ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో ఎలాంటి సూక్ష్మజీవులూ ఉండకూడదు. రక్తంలోకి బ్యాక్టీరియా లేదా వైరస్‌ చొరబడితే అవి రక్తప్రవాహంలోకి ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తూ ఉంటాయి. రక్తం మన దేహంలోని ప్రతి అవయవానికీ చేరి పోషకాలను అందిస్తుంది కాబట్టి... ఈ హానికారక సూక్ష్మజీవులు, అలాగే ఆ ప్రమాదకర రసాయనాలు సైతం ప్రతి అవయవానికీ చేరి అంతర్గత అవయవాలన్నీ వాచే ప్రమాదం ఉంది. అంటే ఏదైనా అవయవానికి ఇన్ఫెక్షన్‌ వస్తే అది చాలా సేపటి వరకు ఆ అవయవానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందోమోగానీ... రక్తానికి ఇన్ఫెక్షన్‌ వస్తే మాత్రం అది చాలా త్వరితంగా దేహమంతా పాకే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలా రక్తం ఇన్ఫెక్షన్‌కు గురికావడాన్ని సెప్టిసీమియా అంటారు. దీన్నే డాక్టర్లు సంక్షిప్తంగా ‘సెప్సిస్‌’ అని కూడా వ్యవహరిస్తుంటారు.

ఎందుకిలా జరుగుతుంది?
నిజానికి సెప్సిస్‌ అనేది ఓ ప్రాణాంతకమైన పరిస్థితే అయిన్పటికీ... ఇది ఒక అనివార్యమైన స్థితి. ఎందుకంటే... మన దేహంలో ఏదైనా అవయవానికి ఇన్ఫెక్షన్‌ సోకడమో, గాయాలు కావడమో జరిగినప్పుడు మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. అలాంటి ప్రతిస్పందన కాస్తా వికటించి, దేహమంతా పాకుతూ పోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

సెప్సిస్‌లో రకాలు
సెప్సిస్‌ రెండు రకాలుగా కనిపిస్తుంది. 1. సెప్సిస్, 2. సెప్టిక్‌ షాక్‌. ఈ రెండు పరిస్థితుల్లోనూ  యాంటీబయాటిక్స్‌ ఇస్తూ సదరు ఇన్ఫెక్షన్‌ను కట్టడి చేసేలా చికిత్స చేయాల్సి ఉంటుంది.
ప్రమాదకరమైన స్థితి ఎవరెవరిలో...
సెప్టిసీమియా లేదా సెప్సిస్‌ ఎవరికైనా సోకవచ్చు. అయితే కొంతమందిలో సెప్సిస్‌ ఏర్పడే పరిస్థితి మరింత ఎక్కువ. దీనికి తేలిగ్గా గురయ్యేవారు ఎవరంటే...
బాగా పసివాళ్లు, పిల్లలు, వయోవృద్ధులు
డయాబెటిస్, క్యాన్సర్, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులతో బాధపడుతున్నవారు
తీవ్రంగా ఒళ్లు కాలిపోయి గాయాలకు గురైనవారు, ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులు.
శస్త్రచికిత్స చేయించుకున్న పేషెంట్లు
రోగనిరోధకవ్యవస్థ బాగా బలహీనంగా ఉన్న ఎయిడ్స్‌ రోగులు, కీమోథెరపీ చేయించుకుంటున్న వ్యక్తులు.

సెప్టిక్‌ షాక్‌లో...
రోగి చురుకుదనాన్ని పూర్తిగా కోల్పోయి, అయోమయానికి గురవుతాడు.
తన పరిస్థితి పూర్తిగా దిగజారిందనీ, మరణం ఖాయమని అనిపిస్తోందని చెబుతుంటాడు.
తలతిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మాటలు తొట్రుపడుతుంటాయి. వేగంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు.
పొట్టలో వికారం, వాంతులు, విరేచనాలు విపరీతమైన కండరాలనొప్పి మూత్రం కొద్దిగా మాత్రమే వస్తుంది.
చర్మం చల్లబడుతుంది. వివర్ణమవుతుంది. స్పృహ ఉండదు.

చికిత్స
సెప్సిస్‌ ప్రధానంగా బ్యాక్టీరియా వల్లనే ఏర్పడుతుంది. అది ఏ బ్యాక్టీరియా కారణంగా వచ్చిందన్న అంశాలను పక్కనబెట్టి, రోగి రక్తానికి ఇన్ఫెక్షన్‌ వచ్చిందని తెలియగానే అత్యవసరంగా రెండు అంచెల్లో చికిత్స అందించాల్సి ఉంటుంది. మొదటిది యాంటీబయాటిక్స్‌ ఇవ్వడం. రెండోది దేహంలోని అంతర్గత అవయవాలను రక్షించడం. ఇందుకోసం కృత్రిమంగా శ్వాస అందిస్తారు. సెలైన్‌తో సహా అవసరమైన ఇతర ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించడం మొదలుపెడతారు. సెప్సిస్‌ అని అనుమానించినప్పుడు అందుకు కారణం అయివుంటుందనుకున్న బ్యాక్టీరియాను అదుపు చేసేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్‌ ఇవ్వడం మొదలుపెట్టేస్తారు. ఆ వెంటనే... సదరు ఇన్ఫెక్షన్‌కు కారణమైన సూక్ష్మజీవిని గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేసి, నిర్దిష్టంగా ఆ సూక్ష్మజీవిని నిర్ధారణ చేశాక అందుకు అవసరమైన మందులను మారుస్తారు. రోగి శరీరంలో సెప్సిస్‌ ఏ భాగం నుంచి వ్యాపించడం ప్రారంభమైందో గుర్తించి వెంటనే దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి చేస్తున్న కణజాలాన్నీ, వాచిన ప్రాంతంలోని చీమును తొలగించడం మొదలు పెడతారు. ఇందుకోసం అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స చేసిన వారికి ఉపయోగించిన ట్యూబ్స్‌ ద్వారా ఇన్ఫెక్షన్‌ వస్తోందని గుర్తించినప్పుడు వాటిని తొలగించడమో చేస్తారు.

నివారణ...
ఒక అంచనా ప్రకారం దేశ జనాభాలో ప్రతీ ఏటా దాదాపు రెండు శాతం మంది సెప్సిస్‌ బారినపడుతున్నారు. ఒక ఉజ్జాయింపుగా ప్రతి ఏటా రెండున్నర కోట్ల మందికి సెప్సిస్‌ సోకుతోంది. కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవచ్చు.
ఫ్లూ, నిమోనియా వంటివి సోకకుండా ఎప్పుడూ చేతులను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
గాయాలైనప్పుడు లేదా చర్మం గీసుకుపోయినప్పుడు ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడుక్కుని గాయం తగ్గే చికిత్స తీసుకోవాలి.
గోళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. డయాబెటిస్‌ రోగులు శరీరంపై ఎక్కడా పుండ్లు, గాయాలు లేకుండా జాగ్రత్త పడాలి.
సెప్సిస్‌ను గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు.  అది ఇతర కీలకమైన అవయవాలకు చేరితే చాలా ప్రమాదకరమని గుర్తించి జాగ్రత్తపడాలి.

సెప్సిస్‌ లక్షణాలు – ముందస్తు హెచ్చరికలు
సెప్సిస్‌కు సంబంధించిన ఈ లక్షణాలను ముందస్తు హెచ్చరికలుగా భావించి, అత్యవసర వైద్యచికిత్స అందించాలి. ఈ లక్షణాలను గుర్తించడం, ప్రతిస్పందించడం సెప్సిస్‌ ఏర్పడిన వ్యక్తిని రక్షించుకోవడంలో చాలా కీలక భూమిక వహిస్తాయి.
జ్వరం వల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. లేదా కొంతమందిలో దేహ ఉష్ణోగ్రత చాలా తక్కువకు పడిపోయి చలితో వణికిపోతూ ఉంటారు.
గుండె అధిక వేగంతో కొట్టుకుంటుంది.
శ్వాసవేగమూ విపరీతంగా పెరిగిపోతుంది.
విపరీతంగా చెమటలు పడుతుంటాయి.
చర్మంలోని చిన్న రంధ్రాల నుంచి రక్తస్రావమై దద్దుర్లు ఏర్పడతాయి.
రోగి మానసిక స్థితిలోనూ తీవ్రమైన మార్పులు వస్తాయి. నిద్రమత్తు ఆవరిçస్తుంది. రోగి అయోమయానికి గురవుతాడు. ప్రతి విషయంలోనూ నిరాసక్తత.
సెప్సిస్‌ మరింత తీవ్రంగా మారినప్పుడు ఇంకా ప్రమాదకమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది సెప్టిక్‌ షాక్‌ స్థితి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు తక్షణం రోగిని ఆసుపత్రికి తరలించాలి. ఆ వ్యక్తికి ఇటీవలై ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉన్నా, లేదా శస్త్రచికిత్సలేమైనా జరిగినా, ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సెప్సిస్‌ చికిత్సకి ముందుగానే డాక్టరుకు ఆ విషయాన్ని తప్పక తెలియజేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement