నెట్‌ను మితిమీరి ఉపయోగిస్తే జబ్బుల బారిన పడ్డట్లే! | infections excessive use of the net! | Sakshi
Sakshi News home page

నెట్‌ను మితిమీరి ఉపయోగిస్తే జబ్బుల బారిన పడ్డట్లే!

Published Sun, Jul 10 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

నెట్‌ను మితిమీరి ఉపయోగిస్తే జబ్బుల బారిన పడ్డట్లే!

నెట్‌ను మితిమీరి ఉపయోగిస్తే జబ్బుల బారిన పడ్డట్లే!

పరిపరి శోధన


మీకు తరచూ జలుబు చేస్తోందా? మీరు తరచూ జబ్బుల బారిన పడుతున్నారా? బహుశా మీరు ఇంటర్‌నెట్‌పై ఎక్కువగా ఉంటున్నారేమో? నిజమే. ఇంటర్‌నెట్‌కూ... జలుబూ, ఫ్లూ జ్వరాలూ, తరచూ జబ్బు పడటానికి సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. పద్దెనిమిది ఏళ్లు పైబడ్డ కొందరిపై నిర్వహించిన పరిశోధనల్లో విచిత్రమైన విషయాలు తెలిశాయి. శ్వాన్సీ యూనివర్సిటీ  కాలేజ్ ఆఫ్ హ్యూమన్ అండ్ హెల్త్ సెన్సైస్‌లో నిర్వహించిన ఈ అధ్యయనంలో అనేక అంశాలతో పాటు ఇంటర్‌నెట్ వల్ల ఆరోగ్యం దెబ్బతినే తీరు కూడా తేటతెల్లమైంది. ఈ అధ్యయనంలో పాలు పంచుకున్న ప్రొఫెసర్ ఫిల్ రీడ్ మాటల్లో చెప్పాలంటే... ‘మామూలు వారితో పోలిస్తే ఇంటర్‌నెట్‌పై గంటల తరబడి ఉండేవారిలో వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. ఆన్‌లైన్‌లో ఉండేవారు దానికి బానిసలైపోవడంతో వారు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మళ్లీ ఆన్‌లైన్‌కి వెళ్తారు. ఇలా వెళ్లే వాళ్లలో సాధారణ స్థాయులతో పోలిస్తే కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా వెలువడుతుంది. దాంతో ఒకలాంటి ఊరటకు గురవుతుంటారు. ఆ ఊరటను పొందడం కోసం మళ్లీ మళ్లీ ఇంటర్‌నెట్‌ను ఆశ్రయిస్తుంటారు.


అయితే ఇలా ఇంటర్‌నెట్‌ను ఆశ్రయించేవాళ్లలో మామూలు పాళ్ల కంటే ఎక్కువగా కార్టిసోల్ వెలువడుతుండటం వల్ల వాళ్ల రోగనిరోధక శక్తి కూడా దెబ్బ తింటుంది. ఫలితంగా ఇది పూర్తి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుందని  పరిశోధకులు  పేర్కొంటున్నారు. ఇక ఇదే తరహా పరిశోధనల్లో పాలుపంచుకున్న మిలాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాబర్టో ట్రుజోలీ మాట్లాడుతూ ‘ఇంటర్‌నెట్ ఉపయోగించడం పెరుగుతున్న కొద్దీ వ్యాధుల బారిన పడే అవకాశాలూ అంతే పెరుగుతున్నాయి. వ్యాధి బారిన పడటం ఎలా జరుగుతుందన్న విషయం వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు. కానీ వ్యాధుల బారిన పడుతున్న మాట మాత్రం వాస్తవం’ అని వ్యాఖ్యానించారు. ఇలా ఆరోగ్యం దెబ్బతినే విషయంలో  మహిళలు, పురుషులకు తేడాలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇంటర్‌నెట్‌ను ఉపయోగించే విషయంలో మహిళలు, పురుషుల ప్రాధాన్యాలు వేరుగా ఉన్నాయి. మహిళలు ప్రధానంగా షాపింగ్, సోషల్ మీడియా కోసం ఇంటర్‌నెట్‌ను వాడుతున్నారు. అదే పురుషులు మాత్రం పోర్నోగ్రఫీ, గేమింగ్ కోసం ఎక్కువగా నెట్‌ను ఉపయోగిస్తున్నట్లు కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement