
ప్రమాదవశాత్తూ లేదా.. ఆరోగ్య సమస్యల కారణంగా పక్షవాతానికి గురైన వారికి లూయివిల్లీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరిష్కారాన్ని సిద్ధం చేశారు. వెన్నెముకను మళ్లీ చైతన్యవంతం చేసేందుకు ఓ పరికరాన్ని అమర్చడం.. నెలల తరబడి ఫిజియోథెరపీ కొనసాగించడం అనే రెండు పనులను కలిపి ప్రయోగించడం ద్వారా పక్షవాతానికి గురైన వారు ఇతరుల సాయం లేకుండా నడిచేలా చేయవచ్చునని వీరు అంటున్నారు.
పక్షవాతానికి గురైన నలుగురికి తామీ వినూత్న పద్ధతి ద్వారా చికిత్స అందించామని, ఇద్దరు తమంతట తాము లేచి నుంచోగలిగారని, కొన్ని అడుగులు వేయగలిగారని, మిగిలిన ఇద్దరు ఎటువంటి సాయం అవసరం లేకుండా నడవగలిగారని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేవడ్ డారో తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్ మెడిసిన్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఈ పద్ధతి వెన్నెముక గాయాల చికిత్సలో కొత్త అధ్యాయమని చెప్పారు. అయితే ప్రస్తుతం జరిగింది చాలా చిన్న స్థాయి అధ్యయనం మాత్రమేనని, వేర్వేరు గాయాలు, ఆరోగ్య సమస్యలున్న వారికీ ఇదేస్థాయి ఫలితాలు వచ్చినప్పుడే విస్తృత వినియోగానికి అవకాశముంటుందని చెప్పారు.