‘మీరు ప్రిన్సెస్‌.. సీతలా ఉండండి..’! | interview with Pragya Jaiswal | Sakshi
Sakshi News home page

ప్రగ్యకు కంచె?

Published Sun, Jan 28 2018 1:25 AM | Last Updated on Sun, Jan 28 2018 3:48 AM

interview with Pragya Jaiswal - Sakshi

‘కంచె’లో సీతగా తెలుగు స్క్రీన్‌కి కనెక్ట్‌ అయిన జబల్పూర్‌ అమ్మాయి... ప్రగ్యా జైస్వాల్‌. అందులో ఆమె.. వెల్‌ మెచ్యూర్డ్‌. చీర వల్ల ఆ మెచ్యూరిటీ వచ్చిందా.. లేక, చిరునవ్వు వల్ల వచ్చిందా.. చెప్పడం కష్టం. మొత్తానికైతే.. ఆమె చీర కొంగు కంచెలో చిక్కుకుపోయింది! ఆ తర్వాత ప్రగ్యా ఎన్నో సినిమాల్లో మెరిశారు. కానీ ‘కంచె’ దాటలేకపోతున్నారు! సీతకు కంచె దాటాలని ఉంది.. ట్రెడిషనల్‌గానే కాదు.. ట్రెండీగా కూడా అందరూ తనను ఇష్టపడాలని ఉంది.


ఎలా ఉన్నారు సీతగారూ?  
మీరూ అలానే పిలిచారా? ‘కంచె’ రిలీజై రెండేళ్లకు పైనే అయినా ఆ సినిమాలో నేను చేసిన సీత క్యారెక్టర్‌ని మాత్రం ఎవరూ మరచిపోవడంలేదు. ‘ఆ సినిమాలో మీరు సూపర్‌ అండి. బాగా యాక్ట్‌ చేశారు’ అని ఇప్పటికీ కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి.

అంత ఇంపాక్ట్‌ చూపించింది కాబట్టే, మీరు చీరల్లోనే కనపడాలని చాలామంది కోరుకుంటున్నారు..
మీరన్నది కరెక్టే. మొన్నా మధ్య మోకాళ్లకు కొంచెం పైన ఉండే డ్రెస్‌ ఒకటి వేసుకున్నాను. సోషల్‌ మీడియాలో ఆ ఫొటో షేర్‌ చేస్తే ‘మీరిలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు. మీరు ప్రిన్సెస్‌. సీతలా ఉండండి’ అని రిక్వెస్ట్‌ మెసేజులు వచ్చాయి. ‘కంచె’తో సీత ఓవర్‌. ప్రతి రోజూ నేను చీరలు కట్టుకోలేను కదా. ఇప్పుడు వేరేలా కనిపించాలన్నది నా ఆలోచన.

ఒక ఆర్టిస్ట్‌ మీద ఏదైనా ఇమేజ్‌ పడితే దాన్నుంచి బయటపడటం టఫ్‌ కదా..
అవునండి. అలాగని ఆ ఇమేజ్‌కి తగ్గ క్యారెక్టర్సే చేస్తే రొటీన్‌ అంటారు. నిజానికి నాకు అన్ని రకాల రోల్స్‌ చేయాలని ఉంది. గ్లామరస్‌గా కనిపించడానికి నాకేం  అభ్యంతరం లేదు. మంచి కథల్లో కనిపించాలనుకుంటా. ఆ కథకు న్యాయం చేయడానికి అవసరమైతే చీర లేకపోతే జీన్స్, డీసెంట్‌గా ఉండే షార్ట్‌ డ్రెస్సెస్‌.. ఇలా ఏదైనా నాకు ఓకే. స్క్రిప్ట్‌ ముందు ఇమేజ్‌ ముఖ్యం కాదు కదా.

ఇమేజ్‌లో ఇరుక్కుపోయినా, డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేయకపోయినా, ఎమోషన్స్‌ కంట్రోల్‌ చేసుకోలేకపోయినా కెరీర్‌కి నష్టం. ఎంతైనా మీ ప్రొఫెషన్‌ చాలా డిఫికల్ట్‌ అండి బాబూ...
ఈ మాటలు కొంతవరకూ నిజమే. అందుకే నేను డిఫరెంట్‌ రోల్స్‌ చేయడానికి ట్రై చేస్తున్నాను. సినిమా పరిశ్రమలోకి వచ్చాక నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం ‘బ్యాలెన్సింగ్‌’. ఎమోషన్స్‌ కంట్రోల్‌ చేసుకోవడం అలవాటైంది. లొకేషన్‌లో బోలెడంత మంది ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు. మనం వాళ్లలా ఉండం. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగానే డీల్‌ చేయాలి. ఈ నాలుగేళ్లల్లో నేనది నేర్చుకున్నాను. సహనం పెరిగింది. మెంటల్లీ చాలా మెచ్యూర్టీ వచ్చింది.

ఏ క్యారెక్టర్‌ అయినా మీరు బాగానే చేస్తారు కానీ పెద్ద రేంజ్‌కి ఎందుకు చేరుకోలేకపోతున్నారు?
అనుకున్న రేంజ్‌ రావడం లేదన్నది కరెక్టే. అయితే ఏదీ మన చేతుల్లో ఉండదు. ప్రతిదానికీ ఓ టైమ్‌ ఉంటుంది. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కెరీర్‌కి ఉపయోగపడుతుందని నమ్మి చేసిన కొన్ని సినిమాలు వర్కవుట్‌ కాలేదు. అయితే ఎవర్నీ నిందించడంలేదు. ఎందుకంటే కావాలని ఎవరూ బ్యాడ్‌ మూవీ తీయరు కదా. ‘కంచె’ తర్వాత నా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి.

తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడు తున్నారంటే సీత వాళ్లకు బాగా నచ్చేసింది. ఈ మధ్య ముంబై వెళితే అక్కడ కూడా ఈ క్యారెక్టర్‌ గురించే మాట్లాడారు. అందుకే నేను డబుల్‌ హ్యాపీ. ఆ పాత్ర కోసం పడిన కష్టమే మిగతావాటికీ పడుతున్నాను. అయినా సీతను మరచిపోవడంలేదు.

హీరోయిన్‌ అవుతానంటే మీ ఇంట్లో ఏమన్నారు?
మా ఇంట్లో ఫిల్మ్‌ ఇండస్ట్రీకి సంబంధించినవాళ్లెవరూ లేరు. అయితే నాకు ముందు మోడలింగ్‌లోకి ఎంటరై, ఆ తర్వాత హీరోయిన్‌ అవ్వాలని ఉండేది. అమ్మానాన్న నన్ను డాక్టర్‌గానో, ఇంజినీర్‌గానో చూడాలనుకున్నారు. పిల్లల మీద తల్లిదండ్రులకు కోరికలు ఉండటం సహజం. అయితే ‘లా’ చదవాలనుకున్నాను. అమ్మానాన్న కాదనలేదు. చదువు పూర్తయ్యాక సినిమాల్లో ట్రై చేస్తానంటే ఎంకరేజ్‌ చేశారు.

హీరోయిన్‌గా చేస్తూ అప్పుడప్పుడూ గెస్ట్‌ రోల్స్‌ కూడా చేస్తున్నారు. వాటివల్ల అడ్వాంటేజ్‌ ఏంటి?
రాఘవేంద్రరావుగారిలాంటి డైరెక్టర్‌ సినిమాలో చిన్న పాత్ర అయినా బాగానే ఉంటుంది. అందుకే ‘నమో వెంకటేశాయ’కి అడగ్గానే ఒప్పుకున్నాను. నేను అనుకున్నట్లు ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. నాకు డ్యాన్స్‌ చేయడం ఇష్టం. ఆ సినిమాలో ‘చిన్మయానందం..’ సాంగ్‌కి మంచి స్కోప్‌ దొరికింది.

ఇక, బోయపాటి శ్రీనుగారు ఎంత మంచి డైరెక్టరో తెలుసు. ‘జయ జానకి నాయక’లో నాది గ్లామరస్‌ క్యారెక్టర్‌. ‘కంచె’ సీత  ఇమేజ్‌ నుంచి కొంచెం బయటపడటానికి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ ఇచ్చారు. ఏ పాత్ర అయినా చేయగలుగుతానని ప్రూవ్‌ చేసుకోవడానికి ఈ సినిమా ఓ మంచి చాన్స్‌. భవిష్యత్తులో ఎవరైనా గెస్ట్‌ రోల్స్‌కి అడిగితే కెరీర్‌కి ఉపయోగపడేలా ఉంటేనే ఒప్పుకుంటాను.

అవునూ.. ఈ నాలుగేళ్లల్లో మీ గురించి ‘లింక్‌ అప్స్‌’, ‘కాంట్రవర్శీస్‌’ రాలేదు. ఎలా జాగ్రత్తపడు తున్నారు?
(నవ్వుతూ). ఏదైనా చేస్తే కదా జాగ్రత్తపడటానికి. ఒకరితో ఎక్కువ ఒకరితో తక్కువ అన్నట్లుగా కాకుండా అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాను. టైమ్‌కి షూటింగ్‌కి  వెళ్లకపోయినా, షూటింగ్‌ స్పాట్‌లో అతిగా బిహేవ్‌ చేసినా వివాదాలు వచ్చేవి. నేనెప్పుడూ అలా చేయలేదు.

మీతో పాటు మీ పేరెంట్స్‌ కనిపించరు.. నార్త్‌ నుంచి సౌత్‌ వచ్చి సోలోగా మేనేజ్‌ చేయడం గొప్ప విషయమే..
ఒంటరిగా లైఫ్‌ లీడ్‌ చేయడం నాకు కొత్త కాదు. కాలేజ్‌ డేస్‌లో హాస్టల్‌లో ఉండేదాన్ని. అమ్మవాళ్లు జబల్‌పూర్‌లో ఉంటే, నా హాస్టల్‌ పుణేలో. చదువు పూర్తయ్యాక ముంబైలో ఉండేదాన్ని. ఇప్పుడూ అక్కడే. అమ్మానాన్న ఫిజికల్‌గా నాతో లేకపోయినా రోజూ ఫోన్‌లో మాట్లాడుతుంటారు. ఏ మూమెంట్‌లోనూ నేను వీక్‌ అవ్వనంత సపోర్ట్‌ ఇస్తారు.

ఆడపిల్ల ధైర్యంగా దూసుకెళ్లడానికి తండ్రి లేక తల్లి.. ఒక్కో ఇంట్లో ఇద్దరూ కారణమవుతారు. మీ ఇంట్లో?
ఇద్దరూ. బట్‌ మా అమ్మ స్ట్రాంగ్‌ లేడీ. తన కూతురు కూడా అలాగే ఉండాలని కోరుకుంది. నాకు కరాటే నేర్పించింది. బేసిక్‌గా నేను సెన్సిటివ్‌ గర్ల్‌. సేమ్‌ టైమ్‌ స్ట్రాంగ్‌ గర్ల్‌. ఆ క్రెడిట్‌ పూర్తిగా మా అమ్మకే దక్కుతుంది.

స్కూల్‌ డేస్‌లో కరాటే నేర్చుకున్నారంటే అబ్బాయిలు మీ జోలికి రావడానికి భయపడేవాళ్లేమో?
భయం సంగతి పక్కపెడితే నేను చాలా బోరింగ్‌. వెరీ గుడ్‌ స్టూడెంట్‌ని. పైగా నేను చదువుకున్నది అమ్మాయిల స్కూల్‌లోనే. ప్లస్‌ వన్, ప్లస్‌ టూ అప్పుడు నేను కాలేజ్‌ ‘హెడ్‌ గర్ల్‌’. అంత పెద్ద రెస్పాన్సిబుల్టీ ఇచ్చారంటే ఎంత మంచి స్టూడెంట్‌నో ఊహించుకోవచ్చు.

స్వీయానుభవంతో చెప్పండి... అమ్మాయిలందరూ సెల్ప్‌ డిఫెన్స్‌ ఆర్ట్‌ నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా?
తప్పకుండా. కూతురు అందంగా ఉండాలి. బాగా చదివించాలి. మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని కలలు కంటారు. దాంతో పాటు ఏదైనా జరగకూడనిది జరిగితే మన అమ్మాయి ఎదుర్కోగలుగుతుందా? అని కూడా ఆలోచించాలి. నీడలా ఉండాలి కానీ వెలుగు లేనప్పుడు ఒంటరిగా నడిచే ఆత్మస్థయిర్యాన్ని కూడా ఇవ్వాలి. అడ్వైస్‌ చేస్తున్నాననుకో కండి... అమ్మాయిలకు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించండి.

ప్రతి అమ్మాయి లైఫ్‌లో ఏదో ఒక టైమ్‌లో ఓ ‘బ్యాడ్‌ మేన్‌’ తారస పడకుండా ఉండడు. లేకపోతే లక్కీయే.. మరి మీ లైఫ్‌లో?
మీరన్న లక్కీ గర్ల్స్‌లో నేనూ ఉన్నాను. నాకు తెలిసినవాళ్లు ‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చెడ్డవాళ్లు ఎక్కువట. ఎలా డీల్‌ చేస్తున్నావ్‌’ అని అడుగుతుంటా రు. అందరూ అంటున్న ఈ చెడ్డ అబ్బాయిలు ఎక్కడున్నారు? మనకెందుకు తారసపడలేదు అనుకుంటుంటా. నిజంగా ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు ఒక్క చేదు అనుభవం ఎదురు కాలేదు. లొకేషన్లో అందరూ చాలా కేర్‌ తీసుకుంటారు. ‘ఐయామ్‌ బ్లెస్డ్‌’.

బయటికెళ్లినప్పుడు ఆటోగ్రాఫ్స్, ఫొటోగ్రాఫ్స్‌ అంటూ కామన్‌ పీపుల్‌ ఎగై్జట్‌ అవుతుంటారు కదా.. అప్పుడెలా అనిపిస్తుంది?
ఐ లవ్‌ ఇట్‌. అసభ్యంగా ప్రవర్తించనంతవరకూ ఏదైనా బాగానే ఉంటుంది. ఆటోగ్రాఫ్స్‌ ఇవ్వడానికి, ఫొటోలు దిగడానికి ఇబ్బంది ఏం ఉంటుంది? మమ్మల్నే అడుగుతున్నారంటే మా మీద ఉన్న క్రేజే కారణం. ఆ క్రేజ్‌ వచ్చింది కూడా వాళ్లు మమ్మల్ని చూడటంవల్లే అని నా ఫీలింగ్‌.

ఫైనల్లీ.. కలల రాకుమారుడు ఎవరైనా? ఇలాంటి అబ్బాయినే పెళ్లాడాలని ఏమైనా?
ఎవరూ లేరండి. అమ్మాయిలకు, అబ్బాయిలకు లైఫ్‌ పార్టనర్‌ గురించి ఓ లిస్ట్‌ ఉంటుందనుకుంటా. అమ్మాయి అయితే అబ్బాయి అందగాడు, తెలివిగలవాడు, కేరింగ్‌గా చూసుకునేవాడు అయ్యుండాలని కోరుకుంటారు. తీరా ఎవరైనా నచ్చితే వాళ్లకు ఆ లిస్ట్‌లో ఉన్న క్వాలిటీస్‌ అన్నీ అతనిలో ఉన్నాయా? అని చూడటం మరచిపోతారేమోనని నా ఫీలింగ్‌ (నవ్వుతూ). నాకు పెద్ద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏవీ లేవు. చూడచక్కగా ఉండాలి. తెలివైనవాడు, మంచి వ్యక్తి అయ్యుండాలి. మంచి ఎత్తు ఉండాలి. తను తనలానే ఉండాలి. ఒకర్ని ఇంప్రెస్‌ చేయడం కోసం తన మనస్తత్వాన్ని మార్చుకోకూడదు.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement