kanche
-
‘మీరు ప్రిన్సెస్.. సీతలా ఉండండి..’!
‘కంచె’లో సీతగా తెలుగు స్క్రీన్‌కి కనెక్ట్ అయిన జబల్పూర్ అమ్మాయి... ప్రగ్యా జైస్వాల్. అందులో ఆమె.. వెల్ మెచ్యూర్డ్. చీర వల్ల ఆ మెచ్యూరిటీ వచ్చిందా.. లేక, చిరునవ్వు వల్ల వచ్చిందా.. చెప్పడం కష్టం. మొత్తానికైతే.. ఆమె చీర కొంగు కంచెలో చిక్కుకుపోయింది! ఆ తర్వాత ప్రగ్యా ఎన్నో సినిమాల్లో మెరిశారు. కానీ ‘కంచె’ దాటలేకపోతున్నారు! సీతకు కంచె దాటాలని ఉంది.. ట్రెడిషనల్‌గానే కాదు.. ట్రెండీగా కూడా అందరూ తనను ఇష్టపడాలని ఉంది. ఎలా ఉన్నారు సీతగారూ? మీరూ అలానే పిలిచారా? ‘కంచె’ రిలీజై రెండేళ్లకు పైనే అయినా ఆ సినిమాలో నేను చేసిన సీత క్యారెక్టర్ని మాత్రం ఎవరూ మరచిపోవడంలేదు. ‘ఆ సినిమాలో మీరు సూపర్ అండి. బాగా యాక్ట్ చేశారు’ అని ఇప్పటికీ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అంత ఇంపాక్ట్ చూపించింది కాబట్టే, మీరు చీరల్లోనే కనపడాలని చాలామంది కోరుకుంటున్నారు.. మీరన్నది కరెక్టే. మొన్నా మధ్య మోకాళ్లకు కొంచెం పైన ఉండే డ్రెస్ ఒకటి వేసుకున్నాను. సోషల్ మీడియాలో ఆ ఫొటో షేర్ చేస్తే ‘మీరిలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు. మీరు ప్రిన్సెస్. సీతలా ఉండండి’ అని రిక్వెస్ట్ మెసేజులు వచ్చాయి. ‘కంచె’తో సీత ఓవర్. ప్రతి రోజూ నేను చీరలు కట్టుకోలేను కదా. ఇప్పుడు వేరేలా కనిపించాలన్నది నా ఆలోచన. ఒక ఆర్టిస్ట్ మీద ఏదైనా ఇమేజ్ పడితే దాన్నుంచి బయటపడటం టఫ్ కదా.. అవునండి. అలాగని ఆ ఇమేజ్‌కి తగ్గ క్యారెక్టర్సే చేస్తే రొటీన్ అంటారు. నిజానికి నాకు అన్ని రకాల రోల్స్ చేయాలని ఉంది. గ్లామరస్‌గా కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదు. మంచి కథల్లో కనిపించాలనుకుంటా. ఆ కథకు న్యాయం చేయడానికి అవసరమైతే చీర లేకపోతే జీన్స్, డీసెంట్‌గా ఉండే షార్ట్ డ్రెస్సెస్.. ఇలా ఏదైనా నాకు ఓకే. స్క్రిప్ట్ ముందు ఇమేజ్ ముఖ్యం కాదు కదా. ఇమేజ్‌లో ఇరుక్కుపోయినా, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయకపోయినా, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయినా కెరీర్‌కి నష్టం. ఎంతైనా మీ ప్రొఫెషన్ చాలా డిఫికల్ట్ అండి బాబూ... ఈ మాటలు కొంతవరకూ నిజమే. అందుకే నేను డిఫరెంట్ రోల్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సినిమా పరిశ్రమలోకి వచ్చాక నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం ‘బ్యాలెన్సింగ్’. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అలవాటైంది. లొకేషన్లో బోలెడంత మంది ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు. మనం వాళ్లలా ఉండం. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాలి. ఈ నాలుగేళ్లల్లో నేనది నేర్చుకున్నాను. సహనం పెరిగింది. మెంటల్లీ చాలా మెచ్యూర్టీ వచ్చింది. ఏ క్యారెక్టర్ అయినా మీరు బాగానే చేస్తారు కానీ పెద్ద రేంజ్‌కి ఎందుకు చేరుకోలేకపోతున్నారు? అనుకున్న రేంజ్ రావడం లేదన్నది కరెక్టే. అయితే ఏదీ మన చేతుల్లో ఉండదు. ప్రతిదానికీ ఓ టైమ్ ఉంటుంది. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కెరీర్‌కి ఉపయోగపడుతుందని నమ్మి చేసిన కొన్ని సినిమాలు వర్కవుట్ కాలేదు. అయితే ఎవర్నీ నిందించడంలేదు. ఎందుకంటే కావాలని ఎవరూ బ్యాడ్ మూవీ తీయరు కదా. ‘కంచె’ తర్వాత నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడు తున్నారంటే సీత వాళ్లకు బాగా నచ్చేసింది. ఈ మధ్య ముంబై వెళితే అక్కడ కూడా ఈ క్యారెక్టర్ గురించే మాట్లాడారు. అందుకే నేను డబుల్ హ్యాపీ. ఆ పాత్ర కోసం పడిన కష్టమే మిగతావాటికీ పడుతున్నాను. అయినా సీతను మరచిపోవడంలేదు. హీరోయిన్ అవుతానంటే మీ ఇంట్లో ఏమన్నారు? మా ఇంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినవాళ్లెవరూ లేరు. అయితే నాకు ముందు మోడలింగ్‌లోకి ఎంటరై, ఆ తర్వాత హీరోయిన్ అవ్వాలని ఉండేది. అమ్మానాన్న నన్ను డాక్టర్‌గానో, ఇంజినీర్‌గానో చూడాలనుకున్నారు. పిల్లల మీద తల్లిదండ్రులకు కోరికలు ఉండటం సహజం. అయితే ‘లా’ చదవాలనుకున్నాను. అమ్మానాన్న కాదనలేదు. చదువు పూర్తయ్యాక సినిమాల్లో ట్రై చేస్తానంటే ఎంకరేజ్ చేశారు. హీరోయిన్గా చేస్తూ అప్పుడప్పుడూ గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నారు. వాటివల్ల అడ్వాంటేజ్ ఏంటి? రాఘవేంద్రరావుగారిలాంటి డైరెక్టర్ సినిమాలో చిన్న పాత్ర అయినా బాగానే ఉంటుంది. అందుకే ‘నమో వెంకటేశాయ’కి అడగ్గానే ఒప్పుకున్నాను. నేను అనుకున్నట్లు ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. ఆ సినిమాలో ‘చిన్మయానందం..’ సాంగ్‌కి మంచి స్కోప్ దొరికింది. ఇక, బోయపాటి శ్రీనుగారు ఎంత మంచి డైరెక్టరో తెలుసు. ‘జయ జానకి నాయక’లో నాది గ్లామరస్ క్యారెక్టర్. ‘కంచె’ సీత ఇమేజ్ నుంచి కొంచెం బయటపడటానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఏ పాత్ర అయినా చేయగలుగుతానని ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా ఓ మంచి చాన్స్. భవిష్యత్తులో ఎవరైనా గెస్ట్ రోల్స్‌కి అడిగితే కెరీర్‌కి ఉపయోగపడేలా ఉంటేనే ఒప్పుకుంటాను. అవునూ.. ఈ నాలుగేళ్లల్లో మీ గురించి ‘లింక్ అప్స్’, ‘కాంట్రవర్శీస్’ రాలేదు. ఎలా జాగ్రత్తపడు తున్నారు? (నవ్వుతూ). ఏదైనా చేస్తే కదా జాగ్రత్తపడటానికి. ఒకరితో ఎక్కువ ఒకరితో తక్కువ అన్నట్లుగా కాకుండా అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాను. టైమ్‌కి షూటింగ్‌కి వెళ్లకపోయినా, షూటింగ్ స్పాట్లో అతిగా బిహేవ్ చేసినా వివాదాలు వచ్చేవి. నేనెప్పుడూ అలా చేయలేదు. మీతో పాటు మీ పేరెంట్స్ కనిపించరు.. నార్త్ నుంచి సౌత్ వచ్చి సోలోగా మేనేజ్ చేయడం గొప్ప విషయమే.. ఒంటరిగా లైఫ్ లీడ్ చేయడం నాకు కొత్త కాదు. కాలేజ్ డేస్‌లో హాస్టల్లో ఉండేదాన్ని. అమ్మవాళ్లు జబల్పూర్లో ఉంటే, నా హాస్టల్ పుణేలో. చదువు పూర్తయ్యాక ముంబైలో ఉండేదాన్ని. ఇప్పుడూ అక్కడే. అమ్మానాన్న ఫిజికల్‌గా నాతో లేకపోయినా రోజూ ఫోన్లో మాట్లాడుతుంటారు. ఏ మూమెంట్లోనూ నేను వీక్ అవ్వనంత సపోర్ట్ ఇస్తారు. ఆడపిల్ల ధైర్యంగా దూసుకెళ్లడానికి తండ్రి లేక తల్లి.. ఒక్కో ఇంట్లో ఇద్దరూ కారణమవుతారు. మీ ఇంట్లో? ఇద్దరూ. బట్ మా అమ్మ స్ట్రాంగ్ లేడీ. తన కూతురు కూడా అలాగే ఉండాలని కోరుకుంది. నాకు కరాటే నేర్పించింది. బేసిక్‌గా నేను సెన్సిటివ్ గర్ల్. సేమ్ టైమ్ స్ట్రాంగ్ గర్ల్. ఆ క్రెడిట్ పూర్తిగా మా అమ్మకే దక్కుతుంది. స్కూల్ డేస్‌లో కరాటే నేర్చుకున్నారంటే అబ్బాయిలు మీ జోలికి రావడానికి భయపడేవాళ్లేమో? భయం సంగతి పక్కపెడితే నేను చాలా బోరింగ్. వెరీ గుడ్ స్టూడెంట్‌ని. పైగా నేను చదువుకున్నది అమ్మాయిల స్కూల్లోనే. ప్లస్ వన్, ప్లస్ టూ అప్పుడు నేను కాలేజ్ ‘హెడ్ గర్ల్’. అంత పెద్ద రెస్పాన్సిబుల్టీ ఇచ్చారంటే ఎంత మంచి స్టూడెంట్నో ఊహించుకోవచ్చు. స్వీయానుభవంతో చెప్పండి... అమ్మాయిలందరూ సెల్ప్ డిఫెన్స్ ఆర్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా. కూతురు అందంగా ఉండాలి. బాగా చదివించాలి. మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని కలలు కంటారు. దాంతో పాటు ఏదైనా జరగకూడనిది జరిగితే మన అమ్మాయి ఎదుర్కోగలుగుతుందా? అని కూడా ఆలోచించాలి. నీడలా ఉండాలి కానీ వెలుగు లేనప్పుడు ఒంటరిగా నడిచే ఆత్మస్థయిర్యాన్ని కూడా ఇవ్వాలి. అడ్వైస్ చేస్తున్నాననుకో కండి... అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించండి. ప్రతి అమ్మాయి లైఫ్‌లో ఏదో ఒక టైమ్‌లో ఓ ‘బ్యాడ్ మేన్’ తారస పడకుండా ఉండడు. లేకపోతే లక్కీయే.. మరి మీ లైఫ్‌లో? మీరన్న లక్కీ గర్ల్స్‌లో నేనూ ఉన్నాను. నాకు తెలిసినవాళ్లు ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో చెడ్డవాళ్లు ఎక్కువట. ఎలా డీల్ చేస్తున్నావ్’ అని అడుగుతుంటా రు. అందరూ అంటున్న ఈ చెడ్డ అబ్బాయిలు ఎక్కడున్నారు? మనకెందుకు తారసపడలేదు అనుకుంటుంటా. నిజంగా ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు ఒక్క చేదు అనుభవం ఎదురు కాలేదు. లొకేషన్లో అందరూ చాలా కేర్ తీసుకుంటారు. ‘ఐయామ్ బ్లెస్డ్’. బయటికెళ్లినప్పుడు ఆటోగ్రాఫ్స్, ఫొటోగ్రాఫ్స్ అంటూ కామన్ పీపుల్ ఎగై్జట్ అవుతుంటారు కదా.. అప్పుడెలా అనిపిస్తుంది? ఐ లవ్ ఇట్. అసభ్యంగా ప్రవర్తించనంతవరకూ ఏదైనా బాగానే ఉంటుంది. ఆటోగ్రాఫ్స్ ఇవ్వడానికి, ఫొటోలు దిగడానికి ఇబ్బంది ఏం ఉంటుంది? మమ్మల్నే అడుగుతున్నారంటే మా మీద ఉన్న క్రేజే కారణం. ఆ క్రేజ్ వచ్చింది కూడా వాళ్లు మమ్మల్ని చూడటంవల్లే అని నా ఫీలింగ్. ఫైనల్లీ.. కలల రాకుమారుడు ఎవరైనా? ఇలాంటి అబ్బాయినే పెళ్లాడాలని ఏమైనా? ఎవరూ లేరండి. అమ్మాయిలకు, అబ్బాయిలకు లైఫ్ పార్టనర్ గురించి ఓ లిస్ట్ ఉంటుందనుకుంటా. అమ్మాయి అయితే అబ్బాయి అందగాడు, తెలివిగలవాడు, కేరింగ్‌గా చూసుకునేవాడు అయ్యుండాలని కోరుకుంటారు. తీరా ఎవరైనా నచ్చితే వాళ్లకు ఆ లిస్ట్‌లో ఉన్న క్వాలిటీస్ అన్నీ అతనిలో ఉన్నాయా? అని చూడటం మరచిపోతారేమోనని నా ఫీలింగ్ (నవ్వుతూ). నాకు పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏవీ లేవు. చూడచక్కగా ఉండాలి. తెలివైనవాడు, మంచి వ్యక్తి అయ్యుండాలి. మంచి ఎత్తు ఉండాలి. తను తనలానే ఉండాలి. ఒకర్ని ఇంప్రెస్ చేయడం కోసం తన మనస్తత్వాన్ని మార్చుకోకూడదు. – డి.జి. భవాని -
'కంచె'కు భరతముని ఫిల్మ్ అవార్డు
మదనపల్లె : భరతముని ఫిల్మ్ అవార్డ్స్ కింద ఉత్తమ చిత్రంగా కంచె సినిమా ఎంపిక అయింది. ఫెస్టివల్ వివరాలను భరతముని ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు రొమ్మాల మునికృష్ణారెడ్డి ప్రకటించా రు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2015 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు ఉత్తమ నటీనటులు, సాంకేతిక వర్గానికి అవార్డులను ఇస్తున్నట్లు తెలిపారు. అవార్డుల ఎంపికలో రన్నింగ్, బాక్స్ ఆఫీస్ హిట్ తదితర విషయాలనే కాకుండా చక్కని కళాత్మక విలువలు, సహజ చిత్రాలు, సామాజిక శ్రేయస్సు, సంప్రదాయం, జాతీయ సమైక్యత లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్‌లో హైదరాబాదులో జరుగుతుందన్నారు. ఉత్తమ చిత్రంగా కంచె, సందేశాత్మకచిత్రం దాగుడుమూతలు, హాస్య చిత్రం భలేభలే మగాడివోయ్, చారిత్రాత్మకచిత్రం రుద్రమదేవి, ప్రజాదరణ చిత్రం బాహుబలి, ఉత్తమ నటుడు రాజేంద్రప్రసాద్, ప్రత్యేక ప్రశంసానటుడు వరుణ్‌తేజ్, నటి అనుష్క, విలన్‌గా తనికెళ్ల భరణి ఎంపికయ్యారు. వివిధ కేటగిరీల్లో కూడా అవార్డులను ప్రకటించారు. -
ఇద్దరూ ఇద్దరే
తెనాలి : విశాఖలో పుట్టిన ఓ చిన్న ఆలోచన ఓ మంచి సినిమాకు పురుడు పోసింది. క్లిష్టతరమైన జార్జియా దేశానికి ఆ సినిమా యూనిట్‌ను తీసుకెళ్లింది. షూటింగ్ పూర్తి చేసుకుని ‘కంచె’గా తెలుగు తెరపైకొచ్చింది. ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. జాతీయ జ్యూరీని మెప్పించింది. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం, పల్లెటూరిలో అమలిన ప్రేమకథను మిళితం చేసి రెండు పొరలుగా అల్లుకున్న కథ, జాతీయ గౌరవాన్ని పొందిన ఆలోచన దర్శకుడు క్రిష్‌ది. సినిమాలోని దృశ్యాలు, పదునైన సంభాషణలు జనం గుండెల్లోకి దూసుకెళ్లేలా రాసిన కలం సాయిమాధవ్ బుర్రాది. కంచె సినిమా విజయంలో కీలకమైన ఈ ఇద్దరూ గుంటూరు జిల్లావాసులేనని చెప్పుకునే భాగ్యం మనది కృషి అంటే క్రిష్ ‘గమ్యం’తో తానేమిటో రుజువు చేసుకున్న దర్శకుడు క్రిష్. వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, తర్వాత వచ్చిన ‘కంచె’ తన వైవిధ్యమైన శైలికి నిదర్శనాలు. స్వస్థలం వినుకొండ. పెరిగిందీ, చదువుకుందీ గుంటూరులోనే. నమ్మిన భావజాలాన్ని ప్రేక్షకులు మనసుల్లోకి ఎక్కించుకునేలా తీస్తున్న దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆ క్రమంలో విశాఖలో కనిపించిన బాంబు శకలం ఆయనను ఆకర్షించింది. ఆరా తీస్తే అది రెండో ప్రపంచయుద్ధం నాటిదని తేలింది. గూగుల్‌లో జల్లెడ పట్టారు. మ్యూజియంలు చుట్టేశారు. మరోవైపు అందమైన ప్రేమకథకు రూపమిచ్చారు. యుద్ధం, ప్రేమ.. రెండు లేయర్లుగా అల్లుకున్న కథతో సినిమాకు ఉపక్రమించారు. తుపాకుల నుంచి దుస్తుల వరకూ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. రిటైర్డు మిటలరీ అధికారితో వారంరోజులు శిక్షణ ఇప్పించారు క్రిష్. సెల్యూట్ చేయడం, కమాండ్స్ ఇవ్వడం నేర్పించారు. హీరోయిన్గా ముద్దమందారంలాంటి ప్రగ్యా జైస్వాల్‌ను ఎన్నుకున్నారు. కంచెకు ఆయనే కలం కంచె సినిమా చూసిన ప్రేక్షకులు అందులోని సంభాషణలను వెంటనే మరిచిపోలేరు. ప్రేమ గురించి, కులమతాల కంచెల గురించి, దేశాల మధ్య యుద్ధంపై పాత్రల మధ్య వచ్చే మాటలు మనసును తాకుతాయి. ‘నేనంటే ఇష్టమా..?’, కాదండీ...ప్రేమ..!’, ‘రెండింటికీ తేడా ఏంటి?’, ‘గులాబి పువ్వు ఉందనుకోండి. దాన్ని కోస్తే ఇష్టం. నీళ్లు పోస్తే ప్రేమ’ అంటూ సాగిన సంభాషణలు కొత్త అనుభూతుల్లోకి తీసుకెళ్లాయి. కులాల గురించి చెప్పిన పదునైన మాటలూ అంతే. ఆ మాటలు సాయిమాధవ్ బుర్రా కలం నుంచి వచ్చిన వి. వర్ధమాన డైలాగ్ రైటర్లలో బాగా వినిపిస్తున్న పేరు అది. స్వస్థలం తెనాలి. బొల్లిముంత శివరామకృష్ణ శిష్యరికం, చిన్నతనం నుంచీ రంగస్థలంతో ఉన్న అనుబంధం కలిగిన సాయిమాధవ్ తన కలం పదునైందని నిరూపించుకొన్నాడు. క్రెడిట్ అంతా క్రిష్‌దే.. ప్రేమికులు విడిపోవడానికి కులం, డబ్బు వంటి అడ్డుగోడలు ఎప్పట్నుంచో ఉన్నవే. వీటిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కేవలం ప్రేమకే కాకుండా, మనిషి మనిషికి, దేశాలకు మధ్య ఎన్నో రకాల కంచెలున్నాయనే అంశాన్ని రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో కొత్తగా చెప్పడం అందరికీ కనెక్టయింది. తొలి కాపీ చూడగానే కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంద నుకున్నా. క్రిష్ గారితో చెప్పాను. అవార్డు రాగానే ఫోన్‌చేసి ‘నువ్వు అవార్డు వస్తుందన్నావుగా. వచ్చింది’ అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. మొత్తం క్రెడిట్ అంతా క్రిష్‌దే. మా వంతు కృషి ఉన్నా మమ్మల్ని చేయిపట్టుకుని నడిపించింది ఆయనే. - సాయిమాధవ్ బుర్రా,కంచె సినిమా మాటల రచయిత ప్రేమ+ప్రపంచ యుద్ధం పకడ్బందీ స్టోరీబోర్డుతో షూటింగ్‌ను 55 రోజుల్లో పూర్తిచేశారు క్రిష్. 30 రోజులు జార్జియా దేశంలో తీయడం మరో విశేషం. కేవలం 20 మంది యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కొన్ని పాత్రలకు జర్మన్ దేశస్థులను తీసుకున్నారు. ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో లోతైన భావజాలాన్ని, క్లిష్టమైన విషయాన్ని సగటు ప్రేక్షకులతో సహా అందరికీ అర్థమయ్యేలా తెరపై ఆవిష్కరించారు. దూపాటి హరిబాబు, సీత భావోద్వేగాలు, కులం చుట్టూ సాగిన సంభాషణలు, పాటల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం... అన్నీ అద్భుతంగా అమరాయి. అందుకే, అన్ని కంచెలను దాటి జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును గెలుచుకుంది. అవార్డు వస్తుందని ఊహించా.. నేను తీసుకున్న పాయింట్‌పై భిన్నాభిప్రాయాలొచ్చాయి. నా ముందు కొందరు ధైర్యం చెప్పినా, మరికొందరు పరోక్షంగా విమర్శించకపోలేదు. అయినా ధైర్యంగా ముందుకెళ్లాను. నేను చెప్పగలిగింది చెప్పగలిగాను. కొత్తదనం ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. తప్పకుండా అవార్డు వస్తుందని ఊహించాను. జాతీయ చలనచిత్ర జ్యూరీ నా అంచనాలను నిజం చేసింది. ధన్యవాదాలు. ఈ క్రెడిట్ నాతోపాటు పనిచేసిన చిత్ర యూనిట్ అందరికీ దక్కుతుంది. ఈ విజయంతో దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగింది. - క్రిష్, దర్శకుడు -
కంచె దాటింది
ఈ ప్రపంచం నిండా కంచెలే! మతాల మధ్య కంచెలు... కులాల మధ్య కంచెలు... ప్రాంతాల మధ్య కంచెలు... కుటుంబాల మధ్య కంచెలు... మనసుల మధ్య కంచెలు... ఇన్నింటికి కంచెలు కట్టినవారు ప్రేమకు మాత్రం కట్టలేరా? సినిమా అంటేనే క్రిష్‌కు ప్రసవ వేదన. కథ కోసం వెతుకులాట... కథ దొరికాక ఆ కథను మరింత చిక్కబరచడం కోసం పెనుగులాట... ప్రీ-ప్రొడక్షన్‌కే బోలెడంత టైమ్ తీసుకుంటాడు క్రిష్. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తర్వాత హిందీ ‘గబ్బర్’ టైమ్‌లో క్రిష్‌ని హాంట్ చేయడం మొదలు పెట్టిందో కాన్సెప్ట్. అదీ సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో. సెకండ్ వరల్డ్ వార్ గురించి వరల్డ్ లెవల్లో సినిమాలొచ్చాయి కానీ, ఇండియాలో ఎవరూ ఎటెంప్ట్ చేయలేదు. క్రిష్‌కి ఈ థాట్ రావడంతోనే పులకించిపోయాడు. దానికి తోడు ప్రేమకు కంచె కట్టడమనేది అమోఘమైన ఆలోచన. అటు సెకండ్ వరల్డ్ వార్- ఇటు లవ్ వార్ ఈ రెండింటినీ మిక్స్ చేసి టూ లేయర్స్‌లో కథ ఫిక్స్ చేశాడు.ఆరు నెలలు ఈ కథ గురించే ఆలోచన. సీన్ బై సీన్, షాట్ బై షాట్, తనలో ఆవహించుకున్నాడు. అందుకే 55 రోజుల్లో తీసేయగలిగాడు. నిజం చెప్పాలంటే - ఇంకో ఫిలిమ్ మేకరైతే ఏడాది పైగానే తీసేవాడు. ‘కంచె’ మేకింగ్ కోసం నానాకష్టాలు పడ్డాడు క్రిష్. మ్యూజియమ్స్ తిరిగాడు. గూగులంతా జల్లెడ పట్టాడు. ఆ కాలం నాటి బైక్‌లు- ట్రక్లు- హెల్మెట్లు... కొన్ని సెల్ఫ్ మేడ్. ఇంకొన్ని రెంట్‌కు. కెప్టెన్ దూపాటి హరిబాబు పాత్రకు ఒకే ఒక్క సినిమా వయసున్న వరుణ్‌తేజ్‌ను సెలక్ట్ చేసుకోవడమే క్రిష్ సాహసం. కానీ అవుట్‌పుట్ చూశాక గుడ్ సెలక్షన్ అంటారని క్రిష్‌కు ముందే తెలుసు. కొత్త నెరేషన్... సరికొత్త లొకేషన్స్... డిఫరెంట్ గెటప్స్... చిక ్కటి మాటలు... చక్కటి దృశ్యాలు... వీటన్నిటితో మనల్ని రెండో ప్రపంచయుద్ధ కాలంలోకి తీసుకెళ్లిపోయాడు.హరిబాబు- సీతల ప్రణయాన్ని ఫుల్‌గా ఆస్వాదించేలా చేశాడు. ఇదంతా క్రిష్ క్రెడిట్. అందుకే, ఇవాళ ఈ ‘కంచె’ జాతీయ స్థాయిలో కాలరెగరేసింది! తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిలిచింది! క్రిష్... వియ్ సెల్యూట్ యు!! -
అక్షయ్ తో రెండోసారి
టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్(రాధా కృష్ణ జాగర్లమూడి) బాలీవుడ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా గబ్బర్ సినిమాను తెరకెక్కించిన క్రిష్, మంచి విజయం సాధించాడు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నక్రిష్ ఇప్పుడు మరోసారి అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో తొలి ప్రయత్నంగా సీరియస్ సినిమాను తెరకెక్కించిన క్రిష్, ఈ సారి మాత్రం ఓ కామెడీ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నాడు. కంచె సినిమాతో మంచి విజయం సాధించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ తరువాత వరుణ్ తేజ్ హీరోగా మరో సినిమా చేయాలని భావించాడు. అయితే ఆ సినిమా అనుకున్న సమయానికి సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించకపోవటంతో మరోసారి బాలీవుడ్ బాట పట్టాడు. ట్రినిటీ పిక్చర్, ఇరోస్ ఇంటర్ నేషనల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు తమిళంలోనూ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో హీరో ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
'రాయబారి'ని పక్కన పెట్టేశారా..?
కంచె సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్‌కు మంచి సక్సెస్ అందించిన దర్శకుడు క్రిష్. మరోసారి అదే హీరోతో పని చేయాలని భావించాడు. కంచె సినిమాలో వరుణ్‌ను రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి సైనికుడిగా చూపించిన క్రిష్, రెండో సినిమాలో రా ఏజెంట్‌గా చూపించాలని భావించాడు. ఈ సినిమాకు రాయబారి అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశాడు క్రిష్. అయితే ఇక పట్టాలెక్కటమే తరువాయి అనుకున్న తరుణంలో రాయబారి ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవటంతో పాటు ఎక్కువ శాతం సినిమా విదేశాల్లో షూట్ చేయాల్సి ఉండటంతో అక్కడి లోకేషన్ల పర్మిషన్లు కూడా కష్టంగా మారాయట. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసి వేరే సినిమా స్టార్ట్ చేయటం బెటర్ అని భావిస్తున్నాడు వరుణ్. ఇప్పటికే వరుణ్ తేజ్, దిల్ రాజు నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే రాయబారి తరువాత ప్రారంభం కావాల్సిన ఈ సినిమాను ముందుగానే పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
మూడు సినిమాలు లైన్లో పెట్టాడు
మెగా వారసుడు వరుణ్ తేజ్ జోరు పెంచాడు. మాస్ ఇమేజ్ కోసం రిస్క్ చేయకుండా నెమ్మదిగా అడుగులేస్తున్న ఈ ఆరడుగుల అందగాడు 2016లో జోరు పెంచుతున్నాడు. తొలి సినిమా ముకుందతో పరవాలేదనిపించిన వరుణ్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన కంచె సినిమాతో మంచి మార్కులు సాధించాడు. అయితే ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఆకట్టుకోకపోవటంతో సొంతంగా మార్కెట్ క్రియేట్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. మాస్ ఇమేజ్ మీద దృష్టి పెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా చేసినా.. అది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ మూడు సినిమాలు వరుణ్‌కు కమర్షియల్ స్టార్ ఇమేజ్ తీసుకురాకపోయినా విషయం ఉన్న నటుడిగా నిరూపించాయి. అందుకే వరుణ్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ ఈ యంగ్ హీరో మాత్రం కథ ఎంపికలో తన మార్క్ స్పష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్వరలో మరోసారి క్రిష్ దర్శకత్వంలో 'రాయబారి' సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత పండగ చేస్కో సినిమాతో సక్సెస్ కొట్టిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో కమర్షియల్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్ మీదకు రాక ముందే మూడో సినిమాను కూడా కన్ఫామ్ చేసేశాడు. దిల్‌రాజు నిర్మాతగా కొత్త దర్శకుడితో ఈ ఏడాదిలోనే మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు వరుణ్, ఈ మూడు సినిమాలను 2016లోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట మెగా హీరో. -
క్రిష్ 'రాయబారి' ఎవరు.?
హీరోయిజానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం కథా బలాన్నే నమ్ముకొని సినిమా తీస్తున్న దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ). తొలి సినిమా నుంచే తన మార్క్ చూపిస్తూ వస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ కంచె సినిమాతో కమర్షియల్‌గా కూడా ఆకట్టుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా కంచె మంచి కలెక్షన్లు సాధించటంతో పాటు దర్శకుడిగా క్రిష్ స్థాయిని కూడా మరో మెట్టు పైకి చేర్చింది. ప్రస్తుతం అదే జోష్‌లో మరో సినిమాకు కథా కథనాలు రెడీ చేసే పనిలో ఉన్న క్రిష్, ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. అచ్చమైన తెలుగు టైటిళ్లతో ఆకట్టుకునే క్రిష్ మరోసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 'రాయబారి' అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడు. అయితే ఈ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరన్న విషయం పై మాత్రం ఇంతవరకు ప్రకటన చేయలేదు. తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, చాలా కాలంగా క్రిష్‌తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. దీంతో క్రిష్ రాయబారి అఖిలే.. అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే క్రిష్ పండించే స్థాయి ఎమోషన్స్‌కు రెండో సినిమాతోనే అఖిల్ న్యాయం చేయగలడా..? అసలు అఖిల్ తదుపరి సినిమా క్రిష్ తోనే ఉంటుందా అన్న విషయం తెలియాలంటే మాత్రం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. -
'కంచె' భామకు సెకండ్ ఛాన్స్
'కంచె' సినిమాలో హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్‌కు ఆ సినిమా ఆశించిన స్ధాయిలో బ్రేక్ ఇవ్వలేదు. సక్సెస్ క్రెడిట్ అంతా హీరో, డైరెక్టర్లకే వెళ్లిపోవటంతో, మరో లక్కీ ఛాన్స్ కోసం ఎదురుచూసింది ఈ బ్యూటీ. ఆ ఛాన్స్ రానే వచ్చింది. టాలీవుడ్ సీనియర్ రవితేజ్ హీరోగా నటిస్తున్న 'ఎవడో ఒకడు' సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది ప్రగ్యా. ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన నటించిన అనుభవం లేని ప్రగ్యాకు రవితేజ సినిమాలో ఆఫర్ రావటం చిన్న విషయమేమి కాదు. కంచె సినిమాలో నటనతో పాటు గ్లామర్‌తోను ఆకట్టుకున్న ఈ భామ తొలిసారిగా స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవుతోంది. మళయాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాతో ప్రగ్యా... స్టార్ స్టేటస్ అందుకుంటుదేమో చూడాలి. -
క్రిష్ దర్శకత్వంలో అఖిల్..?
తొలి సినిమా రిలీజ్‌కు ముందే స్టార్ స్టేటస్ అందుకున్న యంగ్ హీరో అఖిల్.. ఆ సినిమా రిజల్ట్‌తో సంబందం లేకుండా తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెడుతున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'అఖిల్' సినిమాకు డివైడ్ టాక్ రావటంతో నెక్ట్స్ సినిమాకు కమర్షియల్ డైరెక్టర్‌ను కాదని, ఓ ప్రయోగాత్మక దర్శకుడిని తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. తొలి సినిమా రిజల్ట్ విషయాన్ని పక్కన పెడితే హీరోగా అఖిల్ మాత్రం మంచి మార్కులే సాధించాడు. ముఖ్యంగా డ్యాన్సులు, ఫైట్ల విషయంలో యంగ్ హీరోస్‌కు షాక్ ఇచ్చాడు అక్కినేని వారసుడు. నెక్ట్స్ సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు అఖిల్. అందుకే ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో రెండో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. కంచె సినిమాతో కమర్షియల్ సక్సెస్ కూడా సాధించిన క్రిష్, అఖిల్ సినిమాకు తన మార్క్ కథను రెడీ చేస్తున్నాడు. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా, 2016 ప్రథమార్థంలోనే ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను అక్కినేని ఫ్యామిలీ ఆస్థాన నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు. -
మంచి చిత్రానికి ప్రేక్షకాదరణ తథ్యం :వరుణ్‌తేజ్
గుంటూరు : మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పడూ ఆదరిస్తారనే విషయం కంచె చిత్రం విజయంతో నిరూపితమయిందని, అందుకు ప్రేక్షకులందరికీ రుణ పడి ఉంటానని కంచె చిత్ర కథానాయకుడు వరుణ్‌తేజ్ అన్నారు. కంచె చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ బుధవారం నగరానికి వచ్చింది. నగరంలోని పల్లవి ధియేటర్, సినీస్క్వేర్ ధియేటర్లలో యూనిట్ సభ్యులు ప్రేక్షకులు, అభిమానులను పలకరించారు. అనంతరం అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కథ,నటనకే ప్రాధాన్యమిస్తాననని,నటుడిగా పేరు తెచ్చుకోవడానికే కృషి చేస్తానన్నారు. డ్యాన్స్‌లు తనకు ముఖ్యం కాదని కథలో అవసరమైతే డ్యాన్స్‌లు చేయడానికి తాను సిద్ధమేనన్నారు. సొంత జిల్లాలో ప్రేక్షకుల ఆదరణ చూద్దామని వచ్చా : క్రిష్ దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ తన సొంత జిల్లా గుంటూరులో ప్రేక్షకుల ఆదరణను ప్రత్యక్షంగా చూడటానికి వచ్చానన్నారు. మనుషుల మధ్య కులం,మతం పేరుతో ఏర్పడిన కంచెలను తొలగించి అందరూ మానవత్వమే మతంగా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తీశామన్నారు. ఈ చిత్రాన్ని తాము అనుకున్న దాని కంటే ఎక్కువగా ఆదరించారని, తనకు డబ్బు,పేరు,తృప్తి లభించాయని సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృత జ్ఞతలు తెలియజేశారు. సినీస్క్వేర్ ధియేటర్ యజమాని వడ్లమూడి అర్జున్, ఈవీవీ యువ కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి, చిత్ర డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ పాల్గొన్నారు. -
మరో ప్రయోగానికి రెడీ
మెగా ఫ్యామిలీ హీరో అంటే రెడీమేడ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో మాస్ హీరోగా ఎంట్రీ ఇస్తారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ సాఫ్ట్ లవ్ స్టోరీతో పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద' సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్, తొలి సినిమాతో కమర్షియల్ స్టార్ అనిపించుకోలేకపోయినా నటుడిగా మంచి మార్కులే సాధించాడు. అదే జోష్‌లో 'కంచె' సినిమాతో మరోసారి సమ్‌థింగ్ స్పెషల్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. 'కంచె' సినిమాతో కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయిన వరుణ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'మా అమ్మ సీతామాలక్ష్మీ' (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు. పూరితో చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ కావటంతో, నెక్ట్స్ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు వరుణ్. డాన్ శీను, బలుపు, పండగచేస్కో సినిమాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ మలినేని, తొలిసారిగా ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ కావటంతో పూరి సినిమా పూర్తి కాగానే వరుణ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
బాలీవుడ్లో 'కంచె' వేస్తున్నాడు
ఇటీవల 'కంచె' సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన క్రిష్, బాలీవుడ్ లోనూ అదే హవా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన 'కంచె' సినిమాను కమర్షియల్‌గా కూడా సక్సెస్ చేసిన క్రిష్, ఆ సినిమాను నార్త్ ఆడియన్స్‌కు కూడా చూపించాలని భావిస్తున్నాడట. కథా పరంగా యూనివర్సల్ రీచ్ ఉన్న సినిమా కావటంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా కంచె సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నారు. తెలుగులో ఘనవిజయం సాదించిన ఠాగూర్ సినిమాను గబ్బర్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేసిన క్రిష్, అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో క్రిష్ బాలీవుడ్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే వరుష్తేజ్ హీరోగా తెరకెక్కించిన రొమాంటిక్ వార్ ఫిలిం, బాలీవుడ్ సినీ విశ్లేషకులను సైతం మెప్పించింది. దీంతో మరోసారి క్రిష్‌కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను మాత్రమే మెప్పించిన కంచె సినిమాను బాలీవుడ్లో తెరకెక్కిస్తే ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందన్న ఆలొచనలో ఉన్నారు సినీ జనాలు. కంచె లాంటి సినిమాలు సౌత్‌లో కంటే నార్త్ లోనే పెద్ద విజయం సాధిస్తాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. యుద్ధ నేపధ్యం ఉన్న సినిమా కనుక బాలీవుడ్లో అయితే బడ్జెట్ పరంగా కూడా భారీగా తెరకెక్కించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి ఆఫర్స్‌ను క్రిష్ అంగీకరిస్తాడా లేదా చూడాలి. -
మహిళలకు సెల్యూట్
క్రిష్ చిత్రాల్లోని కంటెంట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. టేకింగ్... మేకింగ్ బాగుంటాయి. అందుకే‘కంటెంట్ ఉన్న దర్శకుడు’ అనిపించుకోగలిగాడు. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణ్ణం వందే జగద్గురుమ్’ వంటి వినూత్న కథలను ఆవిష్కరించిన క్రిష్ తాజాగా ‘కంచె’ అన్నారు. వరుణ్‌తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రంగత వారం విడుదలైన విషయం తెలిసిందే. గత మూడు చిత్రాలు ఒక ఎత్తయితే... ఈ చిత్రం మరో ఎత్తు అంటున్నారు క్రిష్. మరిన్ని విశేషాలు ... ఇక్కడ మాత్రమే కాదు.. ఓవర్సీస్లో కూడా ‘కంచె’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని అనువదించి, విడుదల చేయడానికి ఇతర భాషలవాళ్లు ముందుకు వస్తున్నారు. నాకు మాత్రం హిందీలో అనువదించాలని లేదు. రీమేక్ చేయాలని ఉంది. • ‘గమ్యం’ నుంచి ‘కంచె’ దాకా ఒక్కసారి మీ కెరీర్‌ను విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది? ‘గమ్యం’ నుంచి ‘కంచె’కి ముందు దాకా తీసిన సినిమాలు ఒక ఎత్తు. ‘కంచె’ మరో ఎత్తు అని చెప్పాలి. • ఎందుకలా అంటున్నారు? కమర్షియల్‌గా ‘కంచె’ సాధిస్తున్న విజయాన్ని ఉద్దేశించి అలా అంటున్నాను. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వసూళ్లు బాగున్నాయని చెబుతుంటే వినడానికి చాలా హాయిగా ఉంది. ఈ చిత్రాన్ని మహిళా ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. కొంతమంది స్వయంగా ఫోన్ చేసి, ‘ఎంత మంచి సినిమా తీశావ్’ అని అభినందిస్తున్నారు. ‘ఆఫ్ట్రాల్ ఆడది..’, ‘గర్భాన్ని వాడుకుని వదిలేస్తారు’, ‘ఆడతనం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.. కానీ, ఏ దేశంలో అయినా అమ్మతనం ఒకేలా ఉంటుంది..’ అనే డైలాగ్స్‌తో వచ్చే సన్నివేశాలు చాలా టచింగ్‌గా ఉన్నాయని చెబుతున్నారు. ఒకావిడ అయితే, ఈ సినిమాలోని సన్నివేశాలు తనను వెంటాడుతున్నాయంటూ ఉద్వేగానికి గురవుతూ చెప్పడం మర్చిపోలేని విషయం. అందుకే, ఈ సినిమా విజయం తాలూకు క్రెడిట్‌ను ఎక్కువగా మహిళలకు ఇస్తున్నా. వాళ్లకు సెల్యూట్ చేస్తున్నా. • క్రిష్ సినిమాలు బాగున్నా కమర్షియల్‌గా పెద్ద వర్కవుట్ కావనే అభిప్రాయాన్ని ‘కంచె’ తొలగించిందంటారా? అవును. ‘కంచె’ సాధిస్తున్న వసూళ్లే అందుకు సరైన సమాధానం. విడుదలైన అన్ని చోట్లా మంచి వసూళ్లు రాబడుతోంది. అమెరికాలో ఆదివారం వరకూ సాధించిన వసూళ్లు మూడున్నర కోట్ల రూపాయలు. సోమవారం కూడా వసూళ్లు ఏ మాత్రం తగ్గలేదు. ఈ చిత్రాన్ని కొన్న ప్రతి బయ్యర్, ఎగ్జిబిటర్ హ్యాపీ. సేఫ్ జోన్లోకొచ్చేశారు. ‘క్రిష్ మంచి సినిమాలు తీస్తాడు. డబ్బులు కూడా బాగా వస్తే బాగుంటుంది’ అనుకునేవాళ్లందరూ ‘కంచె’ సాధిస్తున్న వసూళ్లు గురించి విని, ఆనందపడుతున్నారు. • ‘కంచె’లో ధూపాటి హరిబాబు, సీతాదేవిల లవ్‌స్టోరీ చూసినప్పుడు, మీరు ప్రేమకథలను బాగా తీయగలరనిపించింది. మరి ప్యూర్ లవ్‌స్టోరీ ఎప్పుడు? నాకు లవ్‌స్టోరీస్ తీయడం ఇష్టం. ‘గమ్యం, కంచె’ అలాంటివే. భవిష్యత్తులో కూడా ప్రేమకథా చిత్రాలు తీస్తా. లేకపోతే ప్రేమ గురించి చెబుతా. • మీ ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. అది సింపుల్‌గా ఉంటేనే మీ సినిమా అందరికీ రీచ్ అవుతుందేమో. టేకింగ్, మేకింగ్ బాగున్నా సామాన్య జనానికి చేరువవుతున్నాయంటారా? (నవ్వుతూ...) ఈ ప్రపంచంలో ఎవరూ సామాన్యులు కాదు. అందరూ మాన్యులే. సినిమా చూపించేవాళ్లకన్నా చూసేవాళ్లు ఇంకా మేధావులు. థియేటర్‌కు వచ్చేవాళ్లు ఓపెన్ మైండ్‌తో వస్తారు. వాళ్లు ‘గుండమ్మ కథ’ను చూస్తారు. ‘అవతార్’ కూడా వాళ్ళకు అర్థమవుతుంది. అయినా ప్రేక్షకుల స్థాయిని తక్కువ అంచనా వేయడానికి మనం ఎవరం? నా గాలి శీను (‘గమ్యం’లో అల్లరి నరేశ్ పాత్ర), బీటెక్ బాబు (‘కృష్ణం వందే జగద్గురుమ్’లో రానా పాత్ర), ఇప్పుడు ధూపాటి హరిబాబు (‘కంచె’లో వరుణ్ తేజ్ పాత్ర) అందరికీ నచ్చారు. ఆలోచన బలమైనదే అయినా, చూపించే విధానం తేలికగా ఉంటుంది కాబట్టి, నా చిత్రాలు జనరంజకంగా ఉంటాయి. • ‘కంచె’లో వేరు వేరు కులానికి చెందిన హరిబాబు, సీతాదేవి మధ్య లవ్‌ట్రాక్ పెట్టి, ప్రేమకు కులంతో సంబంధం లేదన్నారు. కానీ, రెండు పాత్రలు చనిపోయినట్లు చూపించడం ద్వారా వేరు వేరు కులాలకు చెందినవాళ్లు ప్రేమించుకుంటే చనిపోవాల్సిందేనా అని ఫీలయ్యే అవకాశం ఉంది కదా? ఈ సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం సరికాదు. ఆ రెండు పాత్రలు అలా ముగిసిపోవడమే గొప్ప క్లయిమ్యాక్స్ అని నమ్మాను నేను. నేను నమ్మినది నిజమని ప్రేక్షకులు నిరూపించారు. ‘క్లయిమ్యాక్స్ మనసులో నిలిచిపోయిందండీ’ అంటున్నారు. దేశం కోసం భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వీర మరణం పొంది, లెజెండ్స్ అయ్యారు. సైనికుడు ప్రాణాలు వదిలితేనే ఈ కథ చిరకాలం నిలిచిపోతుంది. అందుకే ఈ ముగింపు ఇచ్చాను. హీరో, హీరోయిన్లను చంపి, ఇంత ఆనందంగా మాట్లాడే దర్శకుడు ఎవరుంటారు చెప్పండి? దీన్నిబట్టే క్లయిమ్యాక్స్కి వస్తున్న స్పందన ఏంటో ఊహించవచ్చు. మా నాన్నగారైతే ‘ఇదీ సినిమా అంటే’ అన్నారు. • దర్శకుడిగా మీ టార్గెట్ ఏంటి? నేను చేసే సినిమాకు ఇప్పుడు డబ్బులు రావాలి. ఇప్పుడు ఈ నాలుగు వారాలను టార్గెట్ చేసుకుని తీసే సినిమాలు నాలుగు దశాబ్దాల తర్వాత కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలి. అదే నా లక్ష్యం. • మీరు పుస్తకాలు బాగా చదువుతారనిపిస్తోంది. మీరు ఆదర్శంగా తీసుకునే ఇద్దరు రచయితల గురించి? రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథ శాస్త్రి)గారు, తిలక్ (దేవరకొండ బాలగంగాధర తిలక్)గారు నాకు చాలా ఇష్టం. రావి శాస్త్రిగారి రచనలు నాకు సమాజాన్ని, అందులో ఉండే రకరకాల మనస్తత్వాలను పరిచయం చేశాయి. తిలక్ రచనా శైలి నచ్చుతుంది. ఆయన పదాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిల్లా అనిపిస్తాయి. రచనలు విప్లవాత్మకంగా ఉంటాయి. వాళ్ల మీద ఉన్న మమకారంతో వాళ్ల పేరు వచ్చేట్లుగా సినిమాలో ‘రాచకొండ సంతానం’ అనీ, ‘దేవరకొండ గ్రామం’ అనీ పెట్టాను. • ఇప్పటివరకూ మీరు తీసిన చిత్రాల్లో స్టోరీయే స్టార్. మరి... స్టార్ హీరోలతో చిత్రాలు చేసినప్పుడు? అప్పుడు కూడా కథే స్టార్. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడానికి స్టార్ ఉపయోగపడతాడు. వచ్చినవాళ్లను కూర్చోబెట్టేది కథే. అందుకే స్టార్ మూవీ అయినా నాన్-స్టార్ మూవీ అయినా స్టోరీయే స్టార్‌గా ఉండాలి. అదే మంచిది. • ‘కంచె’ కమర్షియల్‌గా కూడా విజయం సాధించింది కాబట్టి, స్టార్ హీరోలు మీతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారనుకోవచ్చా? యాక్చువల్‌గా ‘కంచె’కి ముందు కూడా స్టార్ హీరోలు నాతో చేయడానికి రెడీగానే ఉన్నారు. నా శైలిలో సాగే కథాబలం ఉన్న చిత్రాలు చేయడానికి సుముఖత వ్యక్తపరిచారు. వాళ్ళకు కథలు తయారు చేసి, చెప్పాల్సింది నేనే. • మీ తదుపరి చిత్రాలు? ‘కంచె’ సక్సెస్‌ను ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. కొన్ని హిందీ చిత్రాలకు ఇప్పటికే సంతకాలు చేశా. తెలుగు ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు తరువాత చెబుతా. -
మంచి ప్రయత్నం : చిరంజీవి
‘‘ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ‘కంచె’ చూడ్డానికి వెళ్లాను. చూశాక ఇంటికి పిలిపించి చిత్రబృందాన్ని అభినందించాలనిపించింది. సినిమా ఆద్యంతం హృద్యంగా సాగింది. ఇది ఒక విజయవంతమైన ప్రయత్నం’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. క్రిష్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ‘కంచె’ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ- ‘‘పల్లె వాతావరణాన్ని ఎంత కళ్లకు కట్టినట్లు చూపించారో, రెండో ప్రపంచ యుద్ధం నాటి వార్ సీక్వెన్సెస్‌ను కూడా అంతే గొప్పగా ఆవిష్కరించారు. జార్జియాలో తీసిన వార్ సీన్స్ చూసి వంద రోజుల పాటు తీసుంటారేమో అనుకున్నా. కేవలం 55 రోజుల్లో మొత్తం సినిమా తీశారని తెలుసుకుని ఆశ్చర్యపోయా. హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఈ సినిమా ఉంది. వరుణ్ ఈ సినిమాలో 1940ల్లో నాటి హీరోలాగానే కనిపించాడు. సైనికుడిగా, పల్లె యువకునిగా ఒదిగిపోయాడు. సాయిమాధవ్ రాసిన సంభాషణలు చాలా అందంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అందరూ దీన్ని ఓ క్లాసిక్ అనుకుంటున్నారు కానీ ఇది అందరికీ నచ్చే కమర్షియల్ సినిమా. ఇదో మంచి ప్రయత్నం’’ అన్నారు. క్రిష్ మాట్లాడుతూ- ‘‘చిరంజీవి లాంటి అగ్ర నటుడు నా సినిమాలోని ప్రతి డైలాగ్‌ను గుర్తుపెట్టుకుని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజు. ఆయనకు విషెస్ చెప్పి, చిరంజీవిగారిని కలవడానికి వెళుతున్నానని చెప్పగానే ఒకే మాట అన్నారు. నువ్వు ‘గమ్యం’ తీసినప్పుడు నాకు ఇంత ఆనందం కలగలేదు. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది అని నన్ను హగ్ చేసుకున్నారు. అమ్మకి, నాన్నకి, పుడమికి, పుస్తకానికి నమస్కరిస్తూ అంటూ సినిమా స్టార్ట్ చేశాను. ఈసారి నుంచి మాత్రం తెలుగు ప్రేక్షకులకు సెల్యూట్ చేస్తూ నా మిగతా సినిమాలు తీస్తాను’’ అని చెప్పారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - కంచె
-
'కంచె'లో వరుణ్ నటనకు గర్వంగా ఫీలవుతున్నా: చిరు
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. క్రియేటివ్ డైరెక్రట్ క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా తెలుగు సినిమా స్ధాయిని మరో మెట్టు పైకి చేర్చిందంటున్నారు విశ్లేకులు. కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించిన కంచె సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కంచె సినిమా స్పెషల్ షో చూసిన మెగాస్టార్ చిరంజీవి యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ' ఈ సినిమా చూశాక యూనిట్ సభ్యులను అభినందించకుండా ఉండలేకపోయా. కంచె సినిమాను ప్రయోగాత్మక చిత్రం అనేకంటే, విజయవంతమైన ప్రయోగం అంటే సరిగ్గా సరిపోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ప్రేమకథతో పాటు అంతర్జాతీయ స్ధాయి యుద్ధ సన్నివేశాలను ఒకే సినిమాలో చూపించటంలో క్రిష్ మంచి విజయం సాధించాడు. ఓ తండ్రిగా వరుణ్ నటన చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా. సాయిమాధవ్ డైలాగ్స్ సినిమా స్ధాయిని మరింతగా పెంచాయి. చిన్న చిన్న పదాలతో బరువైన భావాలను పలికించారు. ముఖ్యంగా కుల వ్యవస్థ మీద రాసిన డైలాగ్ ఆలోచింప చేసేదిగా ఉంది. ఇంతటి భారీ చిత్రాన్ని ఇంత తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా' అంటూ యూనిట్ సభ్యులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. -
నెక్ట్స్ సినిమాకు భారీ ఫ్లాన్స్
కెరీర్లో ఇప్పటి వరకు లో బడ్జెట్లో ఇంట్రస్టింగ్ సినిమాలు చేస్తూ వచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి). ఇటీవల కంచె సినిమాతో మరోసారి తన మార్క్ చూపించి ప్రేక్షకుల్ని అలపించిన అతడు తన నెక్ట్స్ సినిమా విషయంలో భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇంట్రస్టింగ్ లైన్స్‌ను ఎంచుకొని లిమిటెడ్ బడ్జెట్లో సినిమాలు చేసిన ఈ స్టార్ డైరెక్టర్ తరువాత సినిమాను మాత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రీసెర్చ్ చేస్తున్న క్రిష్, ఇప్పటికే ఓ లైన్‌ను సిద్ధం చేసి పెట్టుకున్నాడు. అయితే హీరో ఎవరన్నదీ మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదు. మహేష్ బాబు హీరోగా క్రిష్ సినిమా ఉంటుందన్న వార్తలు చాలా కాలం క్రితమే వినిపించాయి. దీనికి తోడు కంచె సక్సెస్ తరువాత రామ్‌చరణ్ కూడా క్రిష్‌తో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ఇలా స్టార్ హీరోలు క్రిష్‌తో సినిమా కోసం వెయిట్ చేస్తుండటంతో భారీ బడ్జెట్ సినిమా చేయటం పెద్ద కష్టమేమి కాదు. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె దసరా కానుకగా గురువారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటంతో క్రిష్ తరువాతి ప్రాజెక్ట్స్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. -
ప్రేమ... ‘కంచె’
పాటలు: సీతారామశాస్త్రి కెమేరా: జ్ఞానశేఖర్ నిర్మాతలు: రాజీవ్‌రెడ్డి, సాయిబాబు రచన - దర్శకత్వం: క్రిష్ ‘కంచె’లో... మనసు లేని ముష్కరులు కొందరు జాత్యహంకారంతో ఒక పసికందునూ, జాతి సంకరం చేసిన కుటుంబాన్నీ చంపబోతారు. ఆ కుటుంబం కోసం వాళ్ళ భాషయినా తెలియని మరో దేశపు సైనికుడు ప్రాణాలకు తెగిస్తాడు. నిజానికి, వాళ్ళు అతనికి ‘సోకాల్డ్’ శత్రుదేశీయులు. అయినా, ఎందుకు తన మిషన్‌ను పక్కనపెట్టి మరీ, వాళ్ళను కాపాడినట్లు? సరిహద్దనేది మనం పెట్టుకున్న కంచె. శత్రుత్వమనేది ఎవరెవరివో, ఏవేవో ప్రయోజనాల కోసం మనం వేసుకున్న కంచె. మానవత్వాన్ని మర్చిపోవడం కోసం కాదు... రేపటి ఆశను ఇవాళ బతికించుకోవడం కోసం చేయాలి యుద్ధం అని ఆ సంఘటన చెబుతుంది. ‘కంచె’ చిత్రంలోని ఉదాత్తమైన సన్నివేశాల్లో ఇది ఒకటి. మనుషుల మధ్య, మనసుల మధ్య - కులాలు, మతాలు, డబ్బు, అధికారం, జాత్యహంకారం - ఇలా కనపడని కంచెలు ఎన్నెన్నో! విద్వేషం నిండిన సమాజంలో, మనుషుల్ని మనుషులు చంపుకొనే విచిత్ర రాక్షస ప్రవృత్తిలో - దేశాల మధ్యే కాదు, మన మధ్య కూడా ఈ కంచెల్ని కూల్చడం ఎలా? ప్రేమ ఒక్కటే దానికి పరిష్కారమని ‘కంచె’ గుర్తు చేస్తుంది. ఇలాంటి గొప్ప సందేశం ఇచ్చింది ఏ ఇరానియన్ సినిమానో, ఇటాలియన్ సినిమానో అయితే, దాని గురించి గొప్పగా చెప్పుకొంటాం. అలాంటి సినిమాలు తీయని ‘మనవాళ్ళు వట్టి వెధవాయిలోయ్’ అంటాం. మరి, మన సోకాల్డ్ కమర్షియల్ సినిమా లెక్కలు చూసుకోకుండా, ఇలాంటి సినిమా తీసిన భావుక దర్శకుడు క్రిష్‌ను ఇప్పుడు ఏమనాలి? కథగా చెప్పాలంటే... రెండో ప్రపంచ యుద్ధకాలం... తెలుగు గడ్డ మీది ఒక పల్లెటూరు. కోటలోని జమీందార్ గారి మనవరాలు సీత (ప్రజ్ఞా జైస్వాల్). పేటలో కులవృత్తిని నమ్ముకున్న కొండయ్య (గొల్లపూడి మారుతిరావు) మనవడు దూపాటి హరిబాబు (వరుణ్‌తేజ్). చెన్నపట్నంలో వాళ్ళిద్దరి స్నేహం ప్రేమ అవుతుంది. ఊరికొచ్చాక వాళ్ళ ప్రేమకు కులం, అంతస్థుల కంచె అడ్డమవుతుంది. సీత అన్న ఈశ్వర్ (‘చెన్నైఎక్స్ప్రెస్’లో తంగబలి పాత్రధారి నికితిన్ధీర్) వారి పెళ్ళికి అడ్డం తిరుగుతాడు. కథలో ఆ తరువాత హీరోయిన్ అన్నయ్య లానే హీరో కూడా మిలటరీలో చేరతాడు. రెండో ప్రపంచ యుద్ధం (1939 - ’45)లో అప్పటి బ్రిటీషు పాలనలోని భారతీయులు జర్మనీకి వ్యతిరేకంగా బ్రిటన్ సైన్యంలో భాగమై యుద్ధం చేశారు. ఆ యుద్ధ సమయంలో హీరో యిన్ అన్నయ్య సహా బ్రిటన్ సైన్యంలోని ప్రధాన సైనిక ప్రధానాధికారులు కొందరు జర్మన్ సైనికుల చేతిలో బందీలవుతారు. మిగిలిన కొందరితో కలసి వాళ్ళను రక్షించడానికి హీరో ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే హిట్లర్ నేతృత్వంలో జర్మనీలో యూదులకూ, జర్మన్లకూ మధ్య వేసిన జాత్యంహకారపు కంచె హీరోకు అర్థమవుతుంది. మానవత్వానికి ఈ కంచెలు అడ్డు కాకూడదని హీరో అక్కడ వీరోచిత పోరాటమే చేస్తాడు. హీరోయిన్ అన్ననూ కాపాడతాడు. విదేశంలో సరే... మరి స్వదేశంలో సీతతో హీరో ప్రేమ ఏమైంది? ఊళ్ళోని జనాల్ని విభజిస్తున్న కంచెలు ఏమయ్యాయి? ఇదంతా తెరపై చూడాల్సిన కథ. నటీనటుల సంగతికొస్తే... హరిబాబు పాత్రలో నాగబాబు కుమారుడైన హీరో వరుణ్‌తేజ్ శ్రమించారు. పాత్రలో పర కాయ ప్రవేశానికి అతను చేసిన కృషి, దర్శకుడి విజన్ తెలుస్తాయి. ‘మిర్చి లాంటి కుర్రాడు’లో పలకరించిన ప్రజ్ఞా జైస్వాల్ జమీందారీ పిల్ల సీతగా నిండుగా ఉన్నారు. అలాగే, ఆమె అన్న పాత్రధారి కూడా! కొండయ్యగా గొల్ల పూడి, బామ్మగా ‘షావుకారు’ జానకి లాంటి సీనియర్లకున్నవి కీలకంగా ఒకటి రెండు సీన్లయినా, అవి పండడా నికి వారి అనుభవం ఆలంబనయింది. ఒకరు కాదు ముగ్గురు హీరోలు... ఈ సినిమాకు. రెండో సినిమాకే ఇలాంటి స్క్రిప్ట్‌ను ఎంచుకున్న కథానాయక పాత్రధారి వరుణ్‌తేజ్ కచ్చితంగా హీరోనే! మిగిలిన ఇద్దరూ ఎవరంటే - ఒకరు సహజంగానే ఈ కాన్సెప్ట్‌ను అనుకొని, భుజానికెత్తుకున్న దర్శక - నిర్మాత క్రిష్. మరొకరు - ఆ భావానికి భావోద్వేగభరిత గీతాల రూపమిచ్చిన రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. ‘గ్యాప్ ఫిల్లర్స్’లానో, ఫస్టాఫ్ మూడు - సెకండాఫ్ మూడు అనే బాక్సాఫీస్ లెక్కలతో కాకుండా, సిచ్యుయేషన్ సాంగ్స్‌గా చిరకాలం వినిపించే లక్షణం ‘కంచె’ పాటలది. వాటిలోని ఆయన భావావేశానికి తడిసి ముద్దవని పాటల ప్రియులుండరు. ‘‘విద్వేషం పాలించే దేశం ఉంటుందా’’ లాంటి ఆయన ప్రశ్నలకు సమాధానం ఆలోచిస్తే, కళ్ళకు నీటి పొర, మాటకు గొంతు జీర అడ్డం పడతాయి. హిందీ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ అందించిన బాణీలు, పాటల్లో ఆలాప్‌లు, ఇంటర్ల్యూడ్స్లోని బీజియమ్లు, వాద్యగోష్ఠి ప్రత్యేకంగా ధ్వనిస్తాయి. సాఫ్ట్ మెలొడీ ‘నిజమేననీ నమ్మనీ’ (గానం శ్రేయాఘోశల్) అందుకో ఉదాహరణ. సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు సినిమాలో చాలా ఘట్టాల్ని మామూలు కన్నా పెయైత్తున నిలబెట్టాయి. దాసు పాత్రధారి అవసరాల శ్రీనివాస్ ప్రస్తావించే శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవితలు, పలకించిన కామెడీ ఈ సీరియస్ ఫిల్మ్‌లో కొంత రిలీఫ్. ఇక, తలదాచుకున్న సైనికుల్ని కాపాడే టైమ్‌లో బేకరీ తాత మనవరాలు చూపే త్యాగం, ఆడవాళ్ళ గర్భాన్నే వాడుకొంటున్న సంస్కృతి పట్ల హీరోయిన్ బామ్మ (‘షావుకారు’ జానకి) ఆవేదన, క్లైమాక్స్ మనసుల్ని కుదిపేస్తాయి. మనసు పెట్టి చూడాల్సిన సినిమా ... ఇది. అందుకే, సగటు సినిమాల్లో ఉండే మూస ఎంటర్టైన్మెంట్నే వెతుక్కుంటే ఈ సెల్యులాయిడ్ హ్యుమానిటీ డాక్యుమెంట్లో అది దొరకదు. తీసుకున్న నేపథ్యానికి బోలెడంత రీసెర్చ్ చేసి, వార్ సీన్సను కూడా వీలైనంత ప్రామాణికంగా తీసేందుకు దర్శక, నిర్మాతలు సిన్సియర్‌గా చేసిన ప్రయత్నం మాత్రం అడుగడుగునా కనిపిస్తుంది. ‘‘ప్రేమ యుద్ధంలోనూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది’’ అని ‘కంచె’లో ఒక డైలాగ్. నిజమే... సినిమా మీద ప్రేమ - బాక్సాఫీస్ యుద్ధంలోనూ ఉంటుంది. కోట్లఖర్చుతో చేసే సాహసం కాబట్టి, అది అక్షరాలా యుద్ధంలానే ఉంటుంది. సెకండ్ వరల్డ్‌వార్ నేపథ్యంలో క్రిష్ ఇప్పుడా యుద్ధం చేశారు. సినిమాపై ప్రేమ ఉన్న సగటు ప్రేక్షకులు ఈ సృజనాత్మక దర్శకుడి భావావేశాన్ని బాక్సాఫీస్ కంచె దాటిస్తారా? జార్జియాలో వార్ సీన్స్ తీశారు. హీరోయిన్ గెటప్‌కి రాణి గాయత్రీ దేవిని రిఫరెన్స్‌గా తీసుకున్నారు. క్రిష్ హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చేసినప్పుడు ప్రజ్ఞా జైస్వాల్ ఆడి షన్స్కెళ్లారు. ఇప్పుడీ పాత్ర దక్కింది. {పీ ప్రొడక్షన్‌కి 6 నెలలు శ్రమించారు. షూటింగ్ డేస్ మాత్రం 55 రోజులే. సినిమా బడ్జెట్ దాదాపు 19 కోట్లు. -రెంటాల జయదేవ -
ప్రయోగానికి రెడీ అంటున్న అఖిల్
తొలి సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో అఖిల్. అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం తన తొలి సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకపోయిన అఖిల్ చేయబోయే తరువాత ప్రాజెక్ట్స్ పై రకరకాల వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు అఖిల్‌తో సినిమాకు రెడీ అంటూ టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ జానర్‌కు దూరంగా డిఫరెంట్ టేకింగ్‌తో సినిమాలను తెరకెక్కించే క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయనున్నాడట. అల్లు అర్జున్, రానా, అల్లరి నరేష్, మనోజ్ లాంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసిన క్రిష్, తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కంచె సినిమాను తెరకెక్కించాడు. వినాయక్ దర్శకత్వంలో, నితిన్ నిర్మాతగా తెరకెక్కించిన అఖిల్, ఈ దసరాకు రిలీజ్ కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా రిజల్ట్ చూసిన తరువాతే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాడు అక్కినేని వారసుడు. -
'కంచె' మూవీ రివ్యూ
టైటిల్ : కంచె జానర్ ; పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా తారాగణం ; వరుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్, నికితిన్ ధీర్ దర్శకత్వం ; రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) సంగీతం ; చిరంతన్ భట్ సినిమాటోగ్రఫి ; గుణశేఖర్ వియస్ నిర్మాత ; సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. అతని దర్శకత్వంలో, మెగా వారసుడిగా భారీ మాస్ ఇమేజ్ ఉన్నా, ముకుందా లాంటి ఓ క్లాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా కంచె. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన ప్రేమ కథ సన్నివేశాన్ని తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ సర్కిల్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరుణ్‌తో పాటు క్రిష్‌కు కూడా ఓ భారీ కమర్షియల్ సక్సెస్ అవసరమైన సమయంలో చేసిన కంచె, ఈ ఇద్దరికి ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం. కథ ; 1930 నాటి కథతో కంచె సినిమా మొదలవుతుంది. ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్) ఎంతో హుందా ఉండే మధ్య తరగతి అబ్బాయి. భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో శ్రద్దగా చదువుకుంటుంటాడు. అదే సమయంలో సమాజంలో జరిగే అన్యాయాలను చూసి సహించలేకపోతాడు. మనుషుల మధ్య దూరాలు పెరగటం ఎవరికి వారు కంచె వేసుకోని జీవించటం హరిబాబుకు నచ్చదు. అదే గ్రామంలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్) హరిబాబుతో ప్రేమలో పడుతుంది. అయితే అక్కడి సామాజిక పరిస్థితులు కొంత మంది వ్యక్తులు వారి ప్రేమకు అడ్డుపడతారు.ఇలాంటి పరిస్థితుల్లో హరిబాబు తన ప్రేమను గెలిపించుకున్నాడా..? అసలు హరిబాబు సైనికుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది.? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలి సినిమాతో పోలిస్తే వరుణ్ నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు రొమాంటిక్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించటంలో అతడు విజయం సాధించాడు. తొలి పరిచయం అయినా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తన నటనతో మెప్పించింది. రెండు మూడు సీన్స్‌లో తప్ప పర్ఫామెన్స్‌కు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో మంచి మార్కులే సాధించింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. విలన్‌గా నటించిన నికితిన్ ధీర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంత బలమైన విలన్ ఉంటే హీరో అంత గొప్పగా కనిపిస్తాడు. అందుకే నికితిన్ తన నటనతో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా తరువాత నికితిన్ టాలీవుడ్లో బిజీ విలన్ అయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. కథను మలుపు తిప్పే పాత్రలో అవసరాల శ్రీనివాస్, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్, గొల్లపూడి మారుతిరావులు తమ పరిధి మేరకు అలరించారు. సాంకేతిక నిపుణులు : దర్శకుడిగా క్రిష్ గురించి కొత్తగా చెప్పకోవాల్సింది ఏమీలేదు. తన గత సినిమాల మాదిరిగానే, ఈ సినిమాలో కూడా హ్యమన్ ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించాడు. ఇంత వరకు సౌత్ స్క్రీన్ మీద రాని ఓ కొత్త కథను ఎంచుకున్న క్రిష్, ఆ కథను వెండితెర మీద ఆవిష్కరించటంలో వంద శాతం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం ఆర్ట్. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్. తొలిసారిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ కూడా పర్వాలేదనిపించాడు. ఈ సినిమాకు మరో ఇంపార్టెంట్ ఎసెట్ గుణశేఖర్ వియస్ సినిమాటోగ్రఫి, పీరియాడిక్ లుక్, వార్ ఎపిసోడ్స్ ను అద్బుతంగా తెరకెక్కించాడు. ప్లస్ పాయింట్స్ : యుద్ధ సన్నివేశాలు వరుణ్, ప్రగ్యల నటన దర్శకత్వం డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ స్క్రీన్ ప్లే ఓవరాల్‌గా 'కంచె' తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే సక్సెస్ఫుల్ సినిమా -
'కంచె' మరో ట్రైలర్..
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కంచె' దసరా కానుకగా అక్టోబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 'కంచె' ట్రైలర్‌తో అభిమానుల్లో అంచనాలను పెంచేయగా.. తాజాగా మంగళవారం సాయంత్రం హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్లో మరో బ్రాండ్ న్యూ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీంతో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాలతో కమర్షియల్ కథలకు భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ చాలా కాలం తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా 'కంచె'. గతంలో తెలుగులో ఎన్నడూ రాని ఓ సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమా ఉంటుందని క్రిష్ ఇంతకుముందే చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఓ సైనికుడి ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మెగా హీరో వరుణ్ కెరీర్‌కి మంచి ఫ్లస్ అవుతుందని భావిస్తున్నారు. Here you go the new release trailer of #Kanche #KancheOnOct22 http://bit.ly/KancheOn22 — #KancheOnOct22nd (@IAmVarunTej) October 20, 2015 -
ముహూర్తబలం బాగుంది... అందుకే..!
క్రిష్... ఏం చేసినా ఇంట్రస్ట్‌తో చేస్తాడు, ఇన్డెప్త్తో చేస్తాడు. అందుకే, క్రిష్ సినిమాలకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఆయన చేసిన భారీ ప్రయత్నం ‘కంచె’ ఈ దసరాకు బాక్సాఫీస్ సరిహద్దులు చెరిపేస్తుందని భావిసు ్తన్నారు. ఈ 22న వస్తున్న ‘కంచె’ గురించి క్రిష్ చెప్పిన విశేషాలు... రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సినిమా అంటే... సాహసమే! గత వందేళ్ల చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం మార్చినంతగా మానవ జాతి గతిని మార్చింది ఇంకేదీ లేదు. పాతిక లక్షల మంది భారతీయులు ఆ యుద్ధంలో పాల్గొన్నారు. మన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పక్కన ఉన్న ‘మిలటరీ మాధవరం’ అనే గ్రామం నుంచి రెండువేల మంది వెళ్లి, వరల్డ్ వార్ వన్‌లో, టూలో పోరాడారు. మనవాళ్లు పాతిక లక్షల మంది పోరాడిన ఆ యుద్ధ నేపథ్యంలో సినిమా ఎందుకు తీయకూడదని పించింది. భారతీయ తెరపై ఇప్పటివరకూ ఎవరూ చూపించని విషయాన్ని చూపించాలన్నది నా ఆశయం. చరిత్ర తీయడమంటే రిస్కే. కానీ, ఎవరూ ప్రయత్నించనిది చేస్తున్నప్పుడు తెలియని ఎనర్జీ ముందుకు డ్రైవ్ చేస్తుంది. ఇలాంటి ఓ బలమైన చరిత్రకు ఎస్టాబ్లిష్డ్ హీరోను ఎందుకు అనుకోలేదు? ఎస్టాబ్లిష్డ్ హీరో వల్ల నాకు ఒరిగేది బడ్జెట్ మాత్రమే. వరుణ్ తేజ్ వల్ల నాకు ఒరిగేది హానెస్టీ. వరుణ్ మొదటి సినిమా నేనే చేయాల్సింది. అప్పట్లో తనతో ట్రావెల్ చేసినప్పుడు తన కళ్లల్లో నిజాయతీ చూశాను. ఈ సినిమాకి అది కావాలి. దూపాటి హరిబాబు పాత్రకు నూటికి నూరుపాళ్ళు తనే యాప్ట్. ఒక సైనికుడి ప్రేమకథ ఇది. సైనికుడికి కావల్సిన దేహదారుఢ్యం వరుణ్‌కి ఉంది. 1940లో టీనేజ్‌లో ఉన్నవాళ్లు కూడా మ్యాన్లీగా కనిపించే వారు. వరుణ్‌లో ఆ మ్యాన్లీనెస్ ఉంది. 1936లో కాలేజీలో చదువుకునే కాలేజీ కుర్రాడిలా, 1944లో యుద్ధంలో పోరాడే కెప్టెన్‌గా కనిపిస్తాడు. సీతారామశాస్త్రిగారు ఇందులోని మూడు సీన్స్ చూసి, ‘వరుణ్ని ఈ సినిమా కోసమే నాగబాబు కన్నారా’ అన్నారంటే ఆలోచించండి. వరుణ్‌కి ఏమైనా శిక్షణ ఇప్పించారా? మాజీ ఆర్మీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో బూట్ క్యాంప్ చేశాం. అంటే... ఒక సైనికుడి ప్రవర్తన ఎలా ఉండాలి? తుపాకీ ఎలా పట్టుకోవాలి? ఎలా షూట్ చేయాలి? అనే దాని మీద శిక్షణ ఉంటుంది. మామూలుగా ఆరు నెలలు బూట్ క్యాంప్ చేస్తారు. కానీ, సినిమాకి అన్ని నెలలు కుదరదు కదా. ఏడు రోజులు చేశాం. హరిబాబు ఈ సినిమాలో ‘ప్రియమైన సీతకు’ అని లెటర్ రాస్తూ ఉంటాడు. సైనికుడిగా కుటుంబానికి దూరంగా ఉంటాడని చెప్పక్కర్లేదు. బూట్ క్యాంప్ చేసిన ఆ ఏడు రోజులూ వరుణ్ ఫ్యామిలీ నిజంగానే హైదరాబాద్‌లో లేరు. ‘ఫ్యామిలీస్‌కి దూరంగా సైనికులు ఎలాంటి వేదన అనుభవించి ఉంటారో’ అనేవాడు. అందరూ ఈ పాత్ర చేయచ్చు, కానీ, వరుణ్ తప్ప ఎవరూ నప్పరని బలంగా చెబుతాను. అప్పటి వాతావరణాన్ని ఇప్పుడెలా? ఆయుధాలు, కాస్ట్యూమ్స్ సంగతి? గూగుల్‌లో రిఫరెన్స్ తీసుకుని చేశాం. ఆర్ట్ డెరైక్టర్ సురేశ్ వర్క్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ పనితనం ఆ వాతావరణాన్ని తెచ్చాయి. కొన్ని ఆయుధాలు మ్యూజియమ్స్‌లో దొరికాయి. కొన్ని అద్దెకు తీసుకున్నాం. వందలకొద్దీ మోటార్ బైక్స్, ట్రక్స్, హెల్మెట్స్ అన్నీ తయారు చేయించాం. మిలటరీ యూనిఫామ్స్ కుట్టించాం. ఫోన్స్, టెలీగ్రాఫ్స్, అప్పట్లో రొట్టెలు తయారు చేసే మిషన్, ట్యాంకర్స్ - ఇలా ప్రతిదీ తయారు చేశాం. సైనికుల తరహా ప్రత్యేక హెయిర్ కట్ కాబట్టి, లొకేషన్లో పదిమంది బార్బర్లుండేవాళ్లు. లొకేషన్లో వందల కొద్దీ ఆర్టిస్టులు ఉండేవాళ్లు. ఈ సినిమా నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టింది? 55 రోజుల్లో పూర్తి చేసేయగలిగాం. ఇంత పెద్ద సినిమాను అన్ని రోజుల్లోనే పూర్తి చేయగలిగామంటే కారణం - ప్రీప్రొడక్షన్ కోసం మేం ఆరు నెలలు కేటాయించడమే. బౌండ్ స్క్రిప్ట్‌తో షూటింగ్ ప్రారంభించాం. ఒక్క రోజు షూటింగ్‌కి 20 నుంచి 30 లక్షల రూపాయలకు పైనే ఖర్చయ్యేది. సినిమా నిడివి మొత్తం రెండు గంటల ఐదు నిమిషాలు. ఈ చిత్రం ముహూర్త బలం చాలా గొప్పదని నా నమ్మకం. అందుకే అన్నీ బ్రహ్మాండంగా కుదిరాయి. 20 కోట్లలో తీయాలనుకున్నాం. 19 కోట్లలో పూర్తి చేశాం. మార్కెట్ శక్తికి మించిన ఖర్చు పెట్టాం. సినిమా మొదలు పెట్టినప్పుడు, ‘ఇండియన్ స్క్రీన్‌పై చూడని సినిమా చేస్తున్నాం అన్నావు కదా. బడ్జెట్ గురించి ఆలోచించవద్దు’ అని నిర్మాత రాజీవ్‌రెడ్డి అన్నారు. అసలెందుకీ సినిమా చేశావ్? అని కొంతమంది నన్నడిగితే ‘నేనింతవరకూ ఇలాంటి సినిమా చూడలేదు.. అందుకే’ అన్నాను. అప్పటి సైనికులను కలిసి సమాచారం సేకరించారా? అప్పట్లో నాథూరామ్ గాడ్సే గురించి ‘బట్ ఇండియా డివెడైడ్’ అనే సినిమా కథ రాసుకుంటున్నప్పుడు ఆయన సోదరుడు వినాయకరావు గాడ్సేని కలిశా. కానీ, ఇప్పుడు గూగూల్లో దొరకనిది లేదు. యూ ట్యూబ్‌లో బోల్డన్ని ఉన్నాయి. అయినప్పటికీ కొంతమందిని కలిశాను. ఇలాంటి చిత్రాలకు సంభాషణలు ఆయువుపట్టు కదూ... ఎగ్జాక్ట్లీ. నాకు బాగా నచ్చిన రైటర్ నాగరాజు గంధంగారు. బ్లాక్ టికెట్ నుంచి భగవద్గీత వరకూ చిన్న చిన్న మాటల్లో చెప్పేయగలుగుతారాయన. నాగరాజుగారు చనిపోవడం తీరని లోటు. ఈ మధ్యకాలంలో ప్రాస డైలాగ్స్ ఎక్కువయ్యాయి. నవ్వించడంతో పాటు జోల పాడినట్లుగా ఉండేలా డైలాగ్స్ రాసేవాళ్లు చాలా అరుదు. సాయిమాధవ్ ఈ కోవకు చెందిన రచయితే. ‘వేదం’కి నేనే డైలాగ్స్ రాశాను. ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’కి అప్పుడు సాయిమాధవ్ కలిసినప్పుడు, ‘ఏడు నెలల ముందు ఎక్కడున్నావ్? ‘వేదం’కి కూడా రాయించే వాణ్ణి’ అన్నాను. ఈ కథ గురించి ముందు నాగబాబు గారికి చెప్పింది ఆయనే. ఈ సినిమాకి సిరివెన్నెలగారి సాహిత్యం ఓ ప్రాణం. నేను టాకీ దగ్గర వదిలినప్పుడు పాటతో కథను నడిపించారు సిరివెన్నెలగారు. ఇందులో ఉన్న యుద్ధ సన్నివేశాల గురించి? చిన్న చిన్న యుద్ధాలు చాలా ఉన్నాయి. కానీ, 12 నిమిషాల పాటు సాగే పెద్ద యుద్ధం ఒకటుంది. దాని కోసం గుంతలు తవ్వినప్పుడు మా నాన్నగారు ‘ఏంటి డబ్బులన్నీ గుంతల్లో పోస్తున్నారా?’ అనేవారు. నాటి ప్రపంచ యుద్ధం నేటి తరాన్ని ఉద్విగ్నతకు గురి చేస్తుందంటారా? ఇది ఫోక్లోర్ మూవీ కాదు. సింపుల్ లవ్‌స్టోరీ కాదు. రొటీన్ కమర్షియల్ మూవీ కాదు. ఇది ఒక పీరియడ్ మూవీ. ఓ వార్ డ్రామా, లవ్‌స్టోరీతో సాగే సినిమా. నాటి యుద్ధం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పటి తరానికి ఉంటుంది. సో.. ఎగ్జయిట్ అవుతారు. ప్రపంచ యుద్ధం నేపథ్యంలో అంటే హిందీలో తీస్తే రీచ్ ఎక్కువేమోగా? నిజమే. కానీ, నాకెందుకో మన భాషలో చూపించాలనిపించింది. ఇంతకీ... అనుకోకుండా ఈ దసరాకి 22వ తేదీన రిలీజ్ చేయడం...? అక్టోబర్ 2న అనుకున్నాం. కుదరలేదు. దసరా చాలా మంచి రోజు. సెలవులు కూడా ఉంటాయి కాబట్టి, ఆ రోజు రిలీజవడం హ్యాపీ. క్లయిమ్యాక్స్ కుదరకే వరుణ్ మొదటి సినిమా ఆపేశాం! వరుణ్ తొలిచిత్రం నేనే చేయాల్సింది. దాని కోసం ఆరు నెలలు కర్రసాములో వరుణ్‌కి శిక్షణ ఇప్పించాం. కానీ, క్లయిమ్యాక్స్ కుదరలేదని పించింది. నాగబాబుగారి దగ్గరకి వెళ్లి క్షమించమని అడిగాను. ‘కంచె’ కథ పూర్తయ్యాక నాగబాబు గారికి చెప్పా. ఆయనకు నచ్చింది. రామ్‌చరణ్‌కి ఫస్టాఫ్ చెప్పా! రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కథ రెడీ చేశా. ఫస్టాఫ్ చెప్పా. బ్రహ్మాండంగా కుదిరింది. సెకండాఫ్ రెడీ చేసుకొని చెప్పా. ఇంకా కరెక్షన్స్ చేయాలనిపించింది. చేయాలి. ఆ ఛాన్సొచ్చింది... మహేశ్‌బాబు వల్లే! ‘గబ్బర్’తో నేను హిందీ రంగానికి వెళ్లడానికి హిందీ దర్శక-నిర్మాత సంజయ్ లీలాభన్సాలీ గారు ఎంత కారణమో, మహేశ్‌బాబు, ఆయన భార్య నమ్రత అంతకన్నా ఎక్కువ కారణం. ‘గబ్బర్’ చిత్ర సహ నిర్మాత షబీనాఖాన్కి నన్ను రికమెండ్ చేసింది మహేశ్, నమ్రతలే. అలాగే, ‘కంచె’ టీజర్ విడుదలైన గంటలోనే మహేశ్ ట్వీట్ చేశారు. తారక్ (ఎన్టీఆర్) లండన్ నుంచి ఫోన్ చేశాడు. ఇంకా రాజమౌళి, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఇలా అందరూ అభినందించారు. మహేశ్‌కి ‘శివమ్’ అనే ఒక కథ చెప్పాను. ‘కథ చెప్పేటప్పుడే సినిమా చూసేశా. ఇక సినిమా తీయక్కర్లేదేమో అన్నా’ను. చివరకు అదే జరిగింది (నవ్వుతూ). -
ఆ గ్యాప్ వాడేసుకుంటున్నాడు
దసరా బరిలో భారీగా రిలీజ్ అవుతుందని భావించిన 'అఖిల్' సినిమా వాయిదా పడటంతో ఆ గ్యాప్‌ను వాడుకోవడానికి రెడీ అయ్యాడు మెగా హీరో వరుణ్ తేజ్. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమాను అక్టోబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ మేరకు తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించినా... పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేసుకున్నారు. ఆ తరువాత ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయంలో ఎలాంటి ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. తాజాగా అక్టోబర్ 22న రిలీజ్ కావాల్సిన 'అఖిల్' వాయిదా వేస్తున్నట్టుగా నితిన్ ప్రకటించటంతో ఆ గ్యాప్ లో 'కంచె' రిలీజ్ చేస్తే పండుగ సెలవులను క్యాష్ చేసుకోవచ్చని, అదే రోజు రిలీజ్ ప్లాన్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగే ప్రేమకథగా 'కంచె' సినిమాను తెరకెక్కించారు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. Kanche is all set to entertain you this Dusshera . October 22nd release!! pic.twitter.com/Dgc4FGI4pH — Varun Tej Konidela (@IAmVarunTej) October 16, 2015 -
మెగా మూవీ వాయిదా
ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మెగా వారసుడు వరుణ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకత చూపించిన వరుణ్, రెండో సినిమాతో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా చేశాడు వరుణ్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో, ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమాను నవంబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు హీరో వరుణ్. వాయిదాకు కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపాడు. ముఖ్యంగా అక్టోబర్ 2న రామ్ హీరోగా తెరకెక్కిన శివం రిలీజ్ అవుతుండటంతో పాటు వరుసగా రుద్రమదేవి, బ్రూస్లీ, అఖిల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో కంచెను నవంబర్‌కు వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్లో ఆలస్యంగా రిలీజ్ అయిన సినిమాలు ఆకట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ కావటంతో కంచె యూనిట్‌తో పాటు అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. Hey guys...there has been a change in the release date of our movie #kanche to November 6th.. The reason behind this will be answered soon.. — Varun Tej Konidela (@IAmVarunTej) September 22, 2015 -
వరుణ్ వెనుకడుగు వేస్తున్నాడా..?
ముకుంద సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మెగా వారసుడు వరుణ్ తేజ్. తొలి ప్రయత్నంలోనే తన ప్రత్యేకత చూపించిన వరుణ్, రెండో సినిమాతో కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా చేశాడు వరుణ్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామాలో వరుణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో, ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో మరిన్ని సినిమాల రిలీజ్ ఉండటంతో కంచె రిలీజ్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా అక్టోబర్ 2న రామ్ హీరోగా తెరకెక్కిన శివం రిలీజ్ అవుతుండటంతో పాటు వరుసగా రుద్రమదేవి, బ్రూస్లీ, అఖిల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో కంచెను నవంబర్‌కు వాయిదా వేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా వరుణ్, క్రిష్‌ల కంచె వాయిదా పడటం దాదాపుగా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తోంది. -
'కంచె' ఆడియో హైలెట్స్
-
వరుణ్ గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు : రామ్‌చరణ్
‘‘ఐదేళ్లుగా సినిమా చేద్దామని క్రిష్‌ని అడుగుతున్నాను. ఒకరోజు కథ ఉందంటే, చెప్పమన్నాను. ఫస్టాఫ్ చెప్పాడు. సెకండాఫ్ చెప్పలేదు. మరి.. ఆ కథతోనే ఇప్పుడు వరుణ్‌తో సినిమా తీశాడా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ తీస్తే మాత్రం క్రిష్ అయిపోతాడు(నవ్వుతూ). మా ఫ్యామిలీలో వరుణ్ అందగాడు. హైట్పరంగా చెప్పాలంటే నాకు అన్నయ్యలా ఉన్నాడు. వరుణ్ గట్స్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకుంటాడు’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన చిత్రం ‘కంచె’. బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆవిష్కరించి, నిర్మాత అల్లు అరవింద్‌కి ఇచ్చారు. ‘‘ప్రపంచంలో ఎన్ని ఫార్ములాల్లో సినిమాలు వచ్చినా వార్ బ్యాక్‌డ్రాప్‌కి లవ్ స్టోరీ మిక్స్ అయిన సినిమా పెద్ద హిట్ అవుతుంది. నేను చేయాలనుకున్న కథను క్రిష్ చేశాడు’’ అని ఈ చిత్రంలో ఓ పాత్ర చేసిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అన్నారు. నటుడిగా వరుణ్‌లో ఉన్న ఇంటెన్సిటీ ట్రైలర్లో కనిపించిందని అల్లు అరవింద్ చెప్పారు. అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని వరుణ్ తేజ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తీశానని క్రిష్ చెప్పారు. గొప్ప పాటలు రాసే వీలు చిక్కిందని సిరివెన్నెల, అద్భుతమైన సినిమాకి పని చేశానని సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ అన్నారు. నాగబాబు, సి. కల్యాణ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘కంచె' ఆడియో విడుదల
-
ఆ షాట్ చూసి... రాజమౌళి ఒళ్లు ఝల్లుమంది!
‘‘ ‘కంచె’ లాంటి పీరియాడిక్ మూవీ తీయడమంటే చాలా కష్టం. క్రిష్ ఎంతో ప్రేమతో, మనసుపెట్టి ఈ సినిమా తీశారని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవు తోంది’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మిస్తున్న చిత్రం ‘కంచె’. ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ‘‘ట్రైలర్‌లోని యుద్ధ ట్యాంకర్ షాట్ చూడగానే ఒళ్లు ఝల్లుమంది. క్రిష్ సినిమాలకు విమర్శకుల ప్రశంసలు వస్తాయి. కానీ, ఆయనకు ఇంకా నిజమైన కమర్షియల్ సక్సెస్ రాలేదు. ఈ ‘కంచె’’ సినిమా ఆ కంచె కూడా దాటుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఆ చారిత్రక నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటిదాకా సినిమా రాలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 70 ఏళ్లవుతోంది. ఇప్పుడు దేశాల మధ్య కంచెలు వేసుకుంటున్నారు. మనుషు లకూ, మనసులకూ మధ్య కూడా కంచె వేసుకుంటున్నారు. ఈ అంశంతోనే ఈ సినిమా చే శా’’ అని దర్శకుడు క్రిష్ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్‌తేజ్, ఆయన తండ్రి నాగబాబు మాట్లా డారు. ఈ చిత్రానికి సంగీతం: చిరంజన్ భట్, సాహిత్యం: సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా. -
సినిమా ట్రైలర్‌పై ప్రశంసల జల్లు
మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ రెండో సినిమాగా తెరకెక్కిన 'కంచె' ట్రైలర్ సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటుంది. ప్రముఖ హీరోలతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ట్రైలర్ బాగుందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీమంతుడు సినిమా సక్సెస్ తరువాత ఫారిన్ టూర్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ ట్రైలర్‌పై స్పందించాడు. 'కంచె' టీజర్ పై తన ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించాడు. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంతో తెరకెక్కిన కంచె ట్రైలర్‌ను చిత్ర యూనిట్ .. ఆ యుద్దం మొదలైన సెప్టెంబర్ 1న రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. 'ముకుంద' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్... ఆ సినిమాలో క్లాసీ మాస్‌గా కనిపిస్తే...కంచెలో మాత్రం డిఫరెంట్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. The trailer of Kanche is stunning . All the best to the entire team .. — Mahesh Babu (@urstrulyMahesh) September 1, 2015 మహేశ్ బాబుతో పాటు ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మరో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, హీరో రామ్, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్, కెమెరామన్ సెంథిల్.. ఇలా అనేకమంది ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ట్రైలర్ స్టన్నింగ్‌గా ఉందని మెచ్చుకున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ రెండో సినిమా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించినట్లయింది. Very impressive. Can see lot of research and hard work going into this one..all the best to team #Kanche https://t.co/Q5TZsdu7Kb — rajamouli ss (@ssrajamouli) September 1, 2015 #Kanche trailer is fab.Hpy 2 c this change in Telugu Cinema.Congrats @DirKrish & @IAmVarunTej .Tough competition on Oct2..I LIKE ;) #SHIVAM — Ram Pothineni (@ramsayz) September 2, 2015 Just one word for the trailer of director Krish's #Kanche: STUNNING. Here's the link to the trailer. Watch it! http://t.co/cT4fvWfqEU — taran adarsh (@taran_adarsh) September 1, 2015 The Trailer looks Stunning, WOW what an effort, Hats off to #Krish and the Whole team of #Kanche. https://t.co/L6shZ3BE5h — KK Senthil Kumar (@DOPSenthilKumar) September 1, 2015 Guys welcome @nikitindheer this is his first Telugu movie.playing a pivotal role in #Kanche ..looking great brother! https://t.co/AMHKZeHeLQ — Varun Tej Konidela (@IAmVarunTej) September 1, 2015 -
’కంచె’ట్రైలర్ లాంచ్ చేసిన రాజమౌళి
-
ప్రేమికుడిగా, సైనికుడిగా.. వరుణ్
మెగా హీరో వరుణ్ తేజ్ రెండో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సినిమాతో సాఫ్ట్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ రెండో సినిమాతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నాడు. అందుకే గమ్యం, వేదం లాంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ఈ సినిమాతో వరుణ్ ను యాక్షన్ హీరోగా పరిచయం చేస్తున్నాడు. వరుణ్ హీరోగా చేస్తున్ రెండో సినిమా'కంచె' టీజర్ మంగళవారం విడుదలైంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న 'కంచె' సినిమాలో యుద్ధ సన్నివేశాలతో పాటు, రొమాంటిక్ సీన్స్ కూడా హైలైట్ గా నిలుస్తాయని చెపుతున్నారు. ప్రస్తుతం నిర్మణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు ( సెప్టెంబర్ 1)న విడుదల చేశారు. వరుణ్ సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్ లో కనిపిస్తున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
చిన్న సినిమాలైనా చేస్తాను..
♦ అన్నీ భారీ సినిమాలే ♦ సబ్జెక్టు నచ్చితే రెమ్యూనరేషన్ పట్టించుకోను ♦ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ తెనాలి : అవకాశం తలుపు తట్టినపుడు ప్రతిభను నిరూపించుకున్న ఎవరినైనా సినిమా ప్రపంచం అక్కున చేర్చుకుంటుంది...అందలం ఎక్కిస్తుంది. తెనాలికి చెందిన బుర్రా సాయిమాధవ్ ఆ తరహా ప్రతిభావంతుడైన అదృష్టవంతుడు. గతేడాది కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాతో మొదలుపెట్టి ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే విడుదలయిన ‘గోపాల గోపాల’, ‘మళ్లీ మళ్లీ రానిరోజు’ ‘దొంగాట’ సినిమాలకు మాటల రచయితగా హాట్రిక్ విజయం సాధించారు. ముత్యాల్లాంటి మాటల్లో సందర్భానుసారం తూటామందును కూరుస్తూ, అంతే బలంగా జీవన సత్యాల్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల నాడిని పట్టుకున్నారు. మళ్లీ మరో నాలుగు భారీ సినిమాలకు సంభాషణలు సమకూరుస్తున్నారు. అతి స్వల్పకాలంలో విభిన్నమైన సినిమాలతో ముందుకు సాగుతున్న సాయిమాధవ్, స్వస్థలానికి వచ్చిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొత్త ప్రాజెక్టులపై చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే... ► ఇప్పటివరకు చేసిన నాలుగు సినిమాలు నాలుగు రకాలు. ఒక్కో సినిమా ఒక్కో జానర్. అన్నీ హిట్ కావటం చాలా ఆనందంగా ఉంది. ఎలా వ్యక్తం చేయాలో తెలియటం లేదు. ఇంకో సినిమాకు రాయటం తప్ప. ప్రస్తుతం తొలి సినిమా అవకాశం ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో మెగా ఫ్యామిలీలో నాగబాబు కొడుకు వరుణ్‌తేజ హీరోగా కంచె, పవన్‌కళ్యాణ్ హీరోగా గబ్బర్‌సింగ్-2, అక్కినేని నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్నినాయన సినిమాలకు, సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ దగ్గర కో-డెరైక్టర్‌గా చేసిన నరసింహారావు చేస్తున్న ఒక ప్రాజెక్టులో తెలుగు వెర్షనుకు నేను సంభాషణలు సమకూరుస్తున్నారు. ► కంచె సినిమా పూర్తిగా డిఫరెంట్. సౌత్ఇండియాలో ఇప్పటివరకు రాని బ్యాక్‌డ్రాప్‌తో ఒక పీరియాడికల్ మూవీగా తీశారు. టీజరు చూస్తే యుద్ధం బ్యాక్‌డ్రాప్‌గా తెలిసిపోతుంది. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంగా తీసిన ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. అక్టోబర్ 2న విడుదల కావొచ్చు. ► సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి గోపాల గోపాల సినిమా తీసిన నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థవాళ్లు ఇప్పుడు గబ్బర్‌సింగ్-2 తీస్తున్నారు. పవన్‌కళ్యాణ్ ఆప్తమిత్రుడైన శరత్ పరార్ నిర్మాత. పక్కా కమర్షియల్ సినిమా. క్లాసిక్ కమర్షియల్‌గా ఉంటుది. -
సైనికుడిగా మెగా వారసుడు
-
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంచె
-
వరుణ్‌తేజ్‌తో క్రిష్ ప్రయోగం
-
గోదావరి ఒడ్డున హీరో వరుణ్ తేజ్ సందడి
నరసాపురం అర్బన్: నరసాపురం వశిష్ట గోదావరి గట్టు ఒడ్డున బుధవారం ‘ముకుంద’ ఫేమ్ హీరో వరుణ్‌తేజ్ సందడి చేశాడు. లాకు ప్రాంతంలో గోదావరి గట్టు ఒడ్డున నంబర్ 1 ఫ్రేమ్స్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ‘కంచె’ చిత్రం షూటింగ్ నిర్వహించారు. చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన కొత్త నటి ప్రజ్ఞ పరిచయమవుతోంది. హీరో, హీరోయిన్ల మధ్య పడవపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఒక జాతర పాటను కూడా చిత్రీకరించారు. పాటలో దేవుని ఊరేగింపు, కోలాటం తదితర సన్నివేశాల్లో పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఈ చిత్ర షూటింగ్ నరసాపురం, పాలకొల్లు పరిసరాల్లో 15 రోజులపాటు కొనసాగుతుందని చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ సునీల్ తెలిపారు. -
కంచె వేస్తున్నారు!
‘వీడు ఆరడుగుల బుల్లెట్టు...’ అని ‘అత్తారింటికి దారేది’లో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఓ పాట ఉంటుంది. బాబాయే కాదు.. అబ్బాయి కూడా ఆరడుగుల బుల్లెట్టే అని ‘ముకుంద'లో వరుణ్ తేజ్‌ను చూసినవాళ్లు అన్నారు. మంచి ఎత్తు, ఎత్తుకి తగ్గ బరువుతో.. ఒక మంచి మాస్ హీరో ఎలా ఉండాలో వరుణ్ అచ్చంగా అలా ఉంటాడు. లుక్పరంగా మార్కులు కొట్టేసిన వరుణ్ నటనపరంగా కూడా భేష్ అనిపించుకున్నాడు. తొలి చిత్రంతో పాస్ అయిన ఉత్సాహంతో ఈ యువ హీరో కొన్ని రోజులుగా మలి చిత్రానికి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ చిత్రం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో రాజీవ్‌రెడ్డి ఈ చిత్రం నిర్మిస్తున్నారనీ, ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందనీ వరుణ్ తేజ్ ట్విట్టర్లో పేర్కొనడంతో పాటు, క్లాప్ బోర్డ్ ఫొటోను కూడా పొందుపరిచారు. ఆ క్లాప్ బోర్డ్‌పై ‘కంచె' అని రాసి ఉంది. మరి.. ఇది వర్కింగ్ టైటిలా? లేక దీన్నే ఖరారు చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.