బాలీవుడ్లో 'కంచె' వేస్తున్నాడు
ఇటీవల 'కంచె' సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన క్రిష్, బాలీవుడ్ లోనూ అదే హవా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన 'కంచె' సినిమాను కమర్షియల్గా కూడా సక్సెస్ చేసిన క్రిష్, ఆ సినిమాను నార్త్ ఆడియన్స్కు కూడా చూపించాలని భావిస్తున్నాడట. కథా పరంగా యూనివర్సల్ రీచ్ ఉన్న సినిమా కావటంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా కంచె సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నారు.
తెలుగులో ఘనవిజయం సాదించిన ఠాగూర్ సినిమాను గబ్బర్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేసిన క్రిష్, అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా కమర్షియల్గా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో క్రిష్ బాలీవుడ్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే వరుష్తేజ్ హీరోగా తెరకెక్కించిన రొమాంటిక్ వార్ ఫిలిం, బాలీవుడ్ సినీ విశ్లేషకులను సైతం మెప్పించింది. దీంతో మరోసారి క్రిష్కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.
తెలుగులో మల్టీప్లెక్స్ ఆడియన్స్ను మాత్రమే మెప్పించిన కంచె సినిమాను బాలీవుడ్లో తెరకెక్కిస్తే ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందన్న ఆలొచనలో ఉన్నారు సినీ జనాలు. కంచె లాంటి సినిమాలు సౌత్లో కంటే నార్త్ లోనే పెద్ద విజయం సాధిస్తాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. యుద్ధ నేపధ్యం ఉన్న సినిమా కనుక బాలీవుడ్లో అయితే బడ్జెట్ పరంగా కూడా భారీగా తెరకెక్కించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి ఆఫర్స్ను క్రిష్ అంగీకరిస్తాడా లేదా చూడాలి.