'కంచె'లో వరుణ్ నటనకు గర్వంగా ఫీలవుతున్నా: చిరు
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. క్రియేటివ్ డైరెక్రట్ క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా తెలుగు సినిమా స్ధాయిని మరో మెట్టు పైకి చేర్చిందంటున్నారు విశ్లేకులు. కమర్షియల్గా కూడా మంచి విజయం సాధించిన కంచె సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కంచె సినిమా స్పెషల్ షో చూసిన మెగాస్టార్ చిరంజీవి యూనిట్ను ప్రత్యేకంగా అభినందించారు. ' ఈ సినిమా చూశాక యూనిట్ సభ్యులను అభినందించకుండా ఉండలేకపోయా. కంచె సినిమాను ప్రయోగాత్మక చిత్రం అనేకంటే, విజయవంతమైన ప్రయోగం అంటే సరిగ్గా సరిపోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ప్రేమకథతో పాటు అంతర్జాతీయ స్ధాయి యుద్ధ సన్నివేశాలను ఒకే సినిమాలో చూపించటంలో క్రిష్ మంచి విజయం సాధించాడు. ఓ తండ్రిగా వరుణ్ నటన చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా.
సాయిమాధవ్ డైలాగ్స్ సినిమా స్ధాయిని మరింతగా పెంచాయి. చిన్న చిన్న పదాలతో బరువైన భావాలను పలికించారు. ముఖ్యంగా కుల వ్యవస్థ మీద రాసిన డైలాగ్ ఆలోచింప చేసేదిగా ఉంది. ఇంతటి భారీ చిత్రాన్ని ఇంత తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా' అంటూ యూనిట్ సభ్యులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.