ఇద్దరూ ఇద్దరే | burra sai madhav and director krish both are successful | Sakshi
Sakshi News home page

ఇద్దరూ ఇద్దరే

Published Fri, Apr 1 2016 9:10 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఇద్దరూ ఇద్దరే - Sakshi

ఇద్దరూ ఇద్దరే

తెనాలి : విశాఖలో పుట్టిన ఓ చిన్న ఆలోచన ఓ మంచి సినిమాకు పురుడు పోసింది. క్లిష్టతరమైన జార్జియా దేశానికి ఆ సినిమా యూనిట్‌ను తీసుకెళ్లింది. షూటింగ్ పూర్తి చేసుకుని ‘కంచె’గా తెలుగు తెరపైకొచ్చింది. ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. జాతీయ జ్యూరీని మెప్పించింది. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కించుకుంది.

రెండో ప్రపంచ యుద్ధం, పల్లెటూరిలో అమలిన ప్రేమకథను మిళితం చేసి రెండు పొరలుగా అల్లుకున్న కథ, జాతీయ గౌరవాన్ని పొందిన ఆలోచన దర్శకుడు క్రిష్‌ది. సినిమాలోని దృశ్యాలు, పదునైన సంభాషణలు జనం గుండెల్లోకి దూసుకెళ్లేలా రాసిన కలం సాయిమాధవ్ బుర్రాది. కంచె సినిమా విజయంలో కీలకమైన ఈ ఇద్దరూ గుంటూరు జిల్లావాసులేనని చెప్పుకునే భాగ్యం మనది            
 
 
కృషి అంటే క్రిష్
‘గమ్యం’తో తానేమిటో రుజువు చేసుకున్న దర్శకుడు క్రిష్. వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, తర్వాత వచ్చిన ‘కంచె’ తన వైవిధ్యమైన శైలికి నిదర్శనాలు. స్వస్థలం వినుకొండ. పెరిగిందీ, చదువుకుందీ గుంటూరులోనే. నమ్మిన భావజాలాన్ని ప్రేక్షకులు మనసుల్లోకి ఎక్కించుకునేలా తీస్తున్న దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆ క్రమంలో విశాఖలో కనిపించిన బాంబు శకలం ఆయనను ఆకర్షించింది. ఆరా తీస్తే అది రెండో ప్రపంచయుద్ధం నాటిదని తేలింది. గూగుల్‌లో జల్లెడ పట్టారు.

మ్యూజియంలు చుట్టేశారు. మరోవైపు అందమైన ప్రేమకథకు రూపమిచ్చారు. యుద్ధం, ప్రేమ.. రెండు లేయర్లుగా అల్లుకున్న కథతో సినిమాకు ఉపక్రమించారు. తుపాకుల నుంచి దుస్తుల వరకూ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. రిటైర్డు మిటలరీ అధికారితో వారంరోజులు శిక్షణ ఇప్పించారు క్రిష్. సెల్యూట్ చేయడం, కమాండ్స్ ఇవ్వడం నేర్పించారు. హీరోయిన్‌గా ముద్దమందారంలాంటి ప్రగ్యా జైస్వాల్‌ను ఎన్నుకున్నారు.
 
కంచెకు ఆయనే కలం
 కంచె సినిమా చూసిన ప్రేక్షకులు అందులోని సంభాషణలను వెంటనే మరిచిపోలేరు. ప్రేమ గురించి, కులమతాల కంచెల గురించి, దేశాల మధ్య యుద్ధంపై పాత్రల మధ్య వచ్చే మాటలు మనసును తాకుతాయి. ‘నేనంటే ఇష్టమా..?’,  కాదండీ...ప్రేమ..!’, ‘రెండింటికీ తేడా ఏంటి?’, ‘గులాబి పువ్వు ఉందనుకోండి. దాన్ని కోస్తే ఇష్టం. నీళ్లు పోస్తే ప్రేమ’ అంటూ సాగిన సంభాషణలు కొత్త అనుభూతుల్లోకి తీసుకెళ్లాయి.

కులాల గురించి చెప్పిన పదునైన మాటలూ అంతే. ఆ మాటలు సాయిమాధవ్ బుర్రా కలం నుంచి వచ్చిన వి.   వర్ధమాన డైలాగ్ రైటర్లలో బాగా వినిపిస్తున్న పేరు అది. స్వస్థలం తెనాలి. బొల్లిముంత శివరామకృష్ణ శిష్యరికం, చిన్నతనం నుంచీ రంగస్థలంతో ఉన్న అనుబంధం కలిగిన సాయిమాధవ్ తన కలం పదునైందని నిరూపించుకొన్నాడు.
 
క్రెడిట్ అంతా క్రిష్‌దే..

ప్రేమికులు విడిపోవడానికి కులం, డబ్బు వంటి అడ్డుగోడలు ఎప్పట్నుంచో ఉన్నవే. వీటిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కేవలం ప్రేమకే కాకుండా, మనిషి మనిషికి, దేశాలకు మధ్య ఎన్నో రకాల కంచెలున్నాయనే అంశాన్ని రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో కొత్తగా చెప్పడం అందరికీ కనెక్టయింది.

తొలి కాపీ చూడగానే కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంద నుకున్నా. క్రిష్ గారితో చెప్పాను. అవార్డు రాగానే ఫోన్‌చేసి ‘నువ్వు అవార్డు వస్తుందన్నావుగా. వచ్చింది’ అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. మొత్తం క్రెడిట్ అంతా క్రిష్‌దే. మా వంతు కృషి ఉన్నా మమ్మల్ని చేయిపట్టుకుని నడిపించింది ఆయనే.                                  
 - సాయిమాధవ్ బుర్రా,కంచె సినిమా మాటల రచయిత
 
 ప్రేమ+ప్రపంచ యుద్ధం
 పకడ్బందీ స్టోరీబోర్డుతో షూటింగ్‌ను 55 రోజుల్లో పూర్తిచేశారు క్రిష్. 30 రోజులు జార్జియా దేశంలో తీయడం మరో విశేషం. కేవలం 20 మంది యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కొన్ని పాత్రలకు జర్మన్ దేశస్థులను తీసుకున్నారు. ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో లోతైన భావజాలాన్ని, క్లిష్టమైన విషయాన్ని సగటు ప్రేక్షకులతో సహా అందరికీ అర్థమయ్యేలా తెరపై ఆవిష్కరించారు. దూపాటి హరిబాబు, సీత భావోద్వేగాలు, కులం చుట్టూ సాగిన సంభాషణలు, పాటల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం... అన్నీ అద్భుతంగా అమరాయి. అందుకే, అన్ని కంచెలను దాటి జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం  అవార్డును గెలుచుకుంది.
 
 
అవార్డు వస్తుందని ఊహించా..

నేను తీసుకున్న పాయింట్‌పై భిన్నాభిప్రాయాలొచ్చాయి. నా ముందు కొందరు ధైర్యం చెప్పినా, మరికొందరు పరోక్షంగా విమర్శించకపోలేదు. అయినా ధైర్యంగా ముందుకెళ్లాను. నేను చెప్పగలిగింది చెప్పగలిగాను. కొత్తదనం ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. తప్పకుండా అవార్డు వస్తుందని ఊహించాను. జాతీయ చలనచిత్ర జ్యూరీ నా అంచనాలను నిజం చేసింది. ధన్యవాదాలు. ఈ క్రెడిట్ నాతోపాటు పనిచేసిన చిత్ర యూనిట్ అందరికీ దక్కుతుంది. ఈ విజయంతో దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగింది.                                                        

     - క్రిష్, దర్శకుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement