
ఎందుకిలా..?!
మొన్నటిదాకా అత్తగారు, ఆడపడచుల చేతిలో నానా ఆరళ్లకూ గురైన స్త్రీ కూడా, తాను అత్తగారిగా మారినప్పుడు మరికాసిన్ని హంగులు కలిపి మరీ అత్తగారి హోదానే ప్రదర్శిస్తుంది కానీ, కొత్తకోడలిని ఆదరించి అక్కున చేర్చుకోవాలనుకోదు!
‘‘అత్తయ్యగారూ... మా అమ్మకి బొత్తిగా ఒంట్లో బాగోలేదట. ఒక్కసారి చూసివస్తాను’’ సూటిగా అత్తగారి ముఖంలోకి చూడటానికి కూడా భయపడుతూనే కాలిబొటనవేలిని నేలకు రాస్తూ అడిగింది అమల.
‘‘ఇదిగో అమ్మాయ్! మా అమ్మకి బాగోలేదు, మా అక్క పురిటికి పుట్టింటికొచ్చింది, చెల్లాయికి పెళ్లిచూపులు, నాన్నకి యాక్సిడెంటయింది, తమ్ముడికి పరీక్షలు... అంటూ రెండు మూడు నెలలకోసారి పుట్టింటికెళ్లి పదేసి రోజులు అక్కడ కూచుంటుంటే ఇంటిల్లిపాదికీ వండిపెట్టడం నా వల్ల కాదమ్మా...’’ అంటూ ముఖం చిట్లించింది కనకమ్మ. చేసేదేమీ లేక గుడ్లల్లో నీళ్లు గుడ్లలోనే కుక్కుకుని అర్జంటుగా ఏదో పనున్నట్టు వంటింట్లోకి దూరింది అమల.
కోడలు పుట్టింటికెళ్లిన సమయంలో బాత్‌రూమ్‌లో తను పడిపోయినప్పుడు చిన్న కూతురు వచ్చి పది రోజులుండి మరీ సపర్యలు చేయటం, తన భర్తకు సుస్తీ చేసినప్పుడు పెద్దకూతురికి బదులు అల్లుడే ఉద్యోగానికి లీవ్ పెట్టి వచ్చి హాస్పిటల్‌లో ఆయనతోబాటే ఉండి సేవలు చేయడం కనకమ్మకి ఎందుకో గుర్తులేదు!
బస్సులో స్త్రీలకు రిజర్వ్ చేసిన సీటులో దర్జాగా కూర్చుని ఉంటాం... చంటిపిల్ల తల్లి వచ్చి మనవైపు నిస్సహాయంగా చూసినప్పుడు ‘అన్నింటిలోనూ సమాన హక్కులుండాలని బ్యానర్లు పట్టుకుంటారు, ఇందులో మాత్రం రిజర్వేషనుండాలని కొట్లాడతారు’ అంటూ చీప్‌గా కామెంట్ చేసి, ఉదారంగా సీటిచ్చినట్టు పోజుకొడతారు కొందరు ప్రబుద్ధులు. అలాంటివారికి అంతకు మునుపు తను భార్యతో, తల్లితో కలిసి బస్సెక్కినప్పుడు లేడీస్ సీటులో కూర్చున్న వాళ్లని లేపి మరీ తన వాళ్లని కూర్చోబెట్టిన విషయం గుర్తురాదెందుకో!
కొందరింతే! తమకో న్యాయం... తమ పొరుగువారికో న్యాయం అన్నట్టు ప్రవర్తిస్తారు. వీళ్లనేమనాలో అర్థం కాదు... అక్కడిదాకా ఎందుకు... మొన్నటిదాకా అత్తగారు, ఆడపడచుల చేతిలో నానా ఆరళ్లకూ గురైన కోడలు కూడా, తాను అత్తగారిగా మారినప్పుడు మరికాసిన్ని హంగులు కలిపి మరీ అత్తగారి హోదానే ప్రదర్శిస్తుంది కానీ, కొత్తకోడలిని ఆదరించి అక్కున చేర్చుకోవాలనుకోదు. కూతురిని కట్టుకోబోయే వాడికి కట్నం ఇచ్చేటప్పుడు వియ్యాలవారిని కాళ్లావేళ్లా పడి బతిమాలిన ఆడపిల్ల తల్లిదండ్రులు రేపు తమ ఇంటికి కోడలిగా రాబోయే పిల్ల ఉత్తచేతులతో రావడాన్ని హర్షించరు. కట్నకానుకలు ఇవ్వలేని వియ్యాలవారిని అస్తమానం ఆడిపోసుకోవడం మానుకోరు. అల్లుడేమో అత్తమామలకు విధేయంగా ఉండాలి, కొడుకు అలా ఉంటే మాత్రం వాళ్ల దృష్టిలో వాజమ్మగా మిగిలిపోతాడు. రెండు నాలుకల ధోరణి అంటే ఇదేనేమో...