ఇటలీ
చరిత్ర: ఇటలీ దేశానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. వేల సంవత్సరాలుగా ఈ దేశం గొప్ప గొప్ప రాజుల ఏలుబడిలో ఉండి, ఎంతో అభివృద్ధి చెందిన దేశంగా పేరు గాంచింది. మధ్యధరా సముద్రంలోకి ఒక తోకలా చొచ్చుకొన్న ద్వీపకల్పం ఇటలీ.
దేశంలోని అనేక నగరాలు వేలాది సంవత్సరాల క్రితం నాడే అభివృద్ధి చెంది ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యం ఒకప్పుడు ఇటలీ అంతా విస్తరించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సామ్రాజ్యంగా వెలుగొందింది. ఆ తర్వాత ఫ్రెంచి రాజులు, అరబ్బులు ఈ దేశాన్ని పాలించారు. ప్రపంచ ప్రసిద్ధ యోధుడు నెపొలియన్ కూడా ఈ దేశాన్ని పరిపాలించాడు. ప్రపంచ ప్రసిద్ధ రోమ్ నగరం, మిలన్ నగరాలు ఈ దేశంలోనే ఉన్నాయి. క్రైస్తవులకు గుండెకాయలాంటి వాటికన్ పవిత్ర నగరం కూడా ఇటలీ దేశంలోనే ఉంది. దేశంలో ఉత్తరం నుండి దక్షిణం దాకా ఆలివ్ తోటలు విస్తరించి ఉన్నాయి.
ప్రపంచవీక్షణం
నైసర్గిక స్వరూపం
ఖండం - యూరప్ వైశాల్యం - 3,01,338 చదరపు కిలోమీటర్లు,
జనాభా - 60,923,964 (తాజా అంచనాల మేరకు), రాజధాని - రోమ్, ప్రభుత్వం - యూనిటరీ పార్లమెంటరీ కాన్‌స్టిట్యూషనల్ రిపబ్లిక్,
భాషలు - ఇటాలియన్ (అధికారభాష), ఫ్రెంచ్, జర్మన్, కరెన్సీ- లీరా, మతస్థులు - క్రైస్తవులు 83%, ముస్లిములు 2.6%, హిందువులు 2%, వాతావరణం - జనవరిలో 4 నుండి 11 డిగ్రీలు, జులైలో 20 నుండి 30 డిగ్రీలు. సరిహద్దులు - స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, యుగొస్లావియా, ఫ్రాన్స్ మధ్యధరా సముద్రం, స్వాతంత్య్రం దినం: 1946 జాన్ 2.
పాలనా విధానం: పాలనా సౌలభ్యం కోసం ఇటలీ దేశాన్ని 20 రీజియన్లుగా విభజించారు. ఇటలీలో 15 మెట్రోనగరాలను కలుపుకొని మొత్తం 20 నగరాలు అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాలుగా చలామణి అవుతున్నాయి. అవి రోమ్, మిలన్, నేపుల్స్, టురిమ్, పావెర్మో జెనోవా, బొలోగ్నా, ఫ్లారెన్స్, బారి, కాటానియా, వెనిస్, వెరోనా, మెస్సినా, పడువా, ట్రిస్టే, టరాంటో, బ్రెసియా, ప్రాటో, పర్మా, రెగ్గియె కలబ్రియో. ఇటలీలో లక్షా యాభైవేల మంది భారతీయులు నివసిస్తున్నారు.
రోమ్ నగరం: రోమ్ నగరాన్ని సంవత్సరానికి దాదాపు కోటి మంది సందర్శిస్తుంటారు. ఇక్కడ ఉన్న కలోజియం, వాటికన్ మ్యూజియం, పాంథియన్, ట్రెవి ఫౌంటెన్, సెయింట్ పీటర్స్ బసిలాకా, సెయింట్ జాన్ బసిలికా సాంటాంజిలో గుహలు చూడదగ్గవి. మొత్తం ప్రపంచంలో రోమ్‌నగరాన్ని సందర్శించే జనాభా 22 శాతంగా ఉంది. రోమ్ నగరం మధ్యలో ఉన్న కలోజియం ఒక అద్భుత కట్టడం. వేలాది సంవత్సరాల క్రితం నిర్మించినా, ఇప్పుడు అది ఒక నిర్మాణ అద్భుతంగా దర్శనమిస్తుంది. నగరంలో చూడాల్సిన మరో ప్రదేశం సెయింట్ పీటర్స్ స్క్వేర్. ఇది కూడా ఒక అద్భుతమైన కట్టడం. చూడగానే ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. నగరంలోనే టైబర్‌నది ప్రవహిస్తూ ఉంటుంది. నదికి ఇరువైపులా నీళ్ళలోనే కట్టినట్లుగా ఉండే ఎత్తై భవనాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.
1. మిలన్ నగరం: మిలన్ నగరం ప్రపంచపు ఫ్యాషన్ నగరాలలో ప్రముఖమైనది. ఇక్కడ ఎన్నో ఫ్యాషన్ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నగరంలో డ్యూమో, సాన్ సిరో స్టేడియం, విట్టోరియో గ్యాలరీ, సెయింట్ ఆమ్‌బ్రోజియో బ్యాసిలికా మొదలగు కట్టడాలు ప్రసిద్ధి.
ఇక్కడ 12వ శతాబ్దంలో కట్టిన గోడలు ఒక ప్రత్యేక ఆకర్షణ. మిలన్ నగరంలో మొత్తం ఏడు ముఖ్యద్వారాలతో అప్పటి నగరం చుట్టూ గోడ కట్టారు. దాని ఆనవాళ్ళు నేటికీ నిలిచి ఉన్నాయి.రోమ్ నగరాన్ని క్రీస్తుపూర్వం 49లో నిర్మించారని చరిత్ర చెబుతోంది. మిలన్‌లోని కాథెడ్రల్ ఒక అద్భుత కట్టడం.
2. ఫ్లారెన్స్: ఇది టస్కనీ రీజియన్‌కు రాజధాని. ఈ నగరంలో దాదాపు 20 లక్షల జనాభా ఉంది. ఒకప్పటి ఇటలీ రాజ్యానికి రాజధానిగా వెలుగొందింది. 1982లో యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపునిచ్చింది. ఇక్కడి శిల్పకళ, సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రపంచంలోనే అద్భుతం అని చెప్పవచ్చు.
ఇక్కడ పాలాజో డెగ్లీ ఉఫిజి కట్టడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ నగరాన్ని క్రీస్తుపూర్వం 80వ సంవత్సరంలో నిర్మించారు. నగరంలో పాలజో వెచ్చియో, ఫ్లారెన్స్ సిటీహల్, ఆర్నోనది ఒడ్డున ఉన్న పోంటే వెచ్చియో, డ్యూమో, పాలరాతితో నిర్మించిన
నెఫ్ట్యూన్ ఫౌంటెన్, క్యాథెడ్రల్, సాన్ లోరెంజో చర్చి, పాలాజా డెల్లా సిగ్నోరియా, పియాజాలె డెగ్లి ఉఫిజి, పాలాజో పిట్టి, బొబొలి గార్డెన్స్, సాంటామారియా క్యాథెడ్రల్, ఫ్లారెన్స్ కాథడ్రల్, లొగ్గియూ డిలాంజి, ఆర్కియోలాజికల్ మ్యూజియం, సైన్స్ హిస్టరీ మ్యూజియం, జూలాజికల్ మ్యూజియం మొదలైనవి చూడదగ్గవి.
3. వెనిస్ నగరం: వెనిస్ నగరానికి అనేక పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా లాడామినెంటె, సెరెనిస్సియా, అడ్రియాటిక్ క్వీన్, సిటీ ఆఫ్ వాటర్, సిటీ ఆఫ్ మాస్క్స్, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్, ది ఫ్లోటింగ్ సిటీ, సిటీ ఆఫ్ కెనాల్స్, యూరప్ దేశపు శృంగార నగరం ఇలా అనేక పేర్లు ఉన్నాయి. దీనిని క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో నిర్మించారు. నగరం మొత్తం యునెస్కో వారసత్వపు నగరంగా గుర్తింపు పొందింది. నగరం అంతా చిన్న చిన్న ద్వీపాలుగా ఉంటుంది. నగరం నిండా నీళ్ళతో నిండిన కాలువలే కనిపిస్తాయి. ప్రజలు ఈ కాలువల్లో చిన్న చిన్న పడవలలో ప్రయాణిస్తూ ఉంటారు. వందలాది సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. గ్రాండ్ కెనాల్ ఈ నగరానికే గొప్ప శోభ.
4. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా
పీసా నగరంలో ఉన్న ఈ కట్టడం ప్రపంచ వింతలలో ఒకటిగా పేరుగాంచింది. 11వ శతాబ్దంలో ఈ కట్టడం నిర్మాణం ఆరంభమైంది. మూడో అంతస్తు నిర్మాణం పూర్తయ్యేసరికి ఈ కట్టడం కాస్త కుంగి ఓ వైపుకు ఒరిగింది. కొంతకాలానికి మళ్ళీ ఆరంభించి 8 అంతస్తులు నిర్మించారు. అది ఇప్పటికీఅలాగే ఓ పక్కకు ఒరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. నేటికీ పడిపోకపోవడం అనేదే దీని ప్రత్యేకత.
పంటలు-పరిశ్రమలు: ఇటలీ దేశంలో గోధుమలు, మొక్కజొన్న, వరితో పాటు టమోటాలు, ఆలివ్ ఎక్కువగా పండిస్తారు. ఈ రెండింటినీ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. బంగాళదుంపలు, కమలాపళ్ళు, బార్లీ, ఆపిల్స్, ద్రాక్ష కూడా బాగా పండుతాయి. మిలన్ పరిశ్రమల ప్రాంతాలలో అనేక పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. మోటరు వాహనాల పరిశ్రమలు, టైర్ల తయారీ, రసాయనాలు, పెట్రో రసాయనాలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరిశ్రమలు, గృహోపకరణాలు, హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు, వస్త్రపరిశ్రమ, ఆహార ఉత్పత్తులు, లగ్జరీ కార్లు, క్రీడా పరికరాలు, పడవలు ఇంకా ఇతర పరిశ్రమలు ఉన్నాయి. ఇటలీ దేశం పవన విద్యుత్తును, సోలార్ విద్యుత్తును గణనీయంగా ఉత్పత్తి చేస్తోంది.
ప్రజలు- సంస్కృతి: దేశంలో వివిధ దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తూ ఉండడం వల్ల విభిన్న సంస్కృతులు దర్శనిమిస్తుంటాయి. ఇటలీ ప్రజలు ఫ్యాషన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. మిలన్ నగరం ఆధునిక ఫ్యాషన్‌కు కేంద్ర బిందువు అయితే, రోమ్ నగరం పురాతన ఫ్యాషన్‌కు ప్రతీకగా నిలుస్తుంది. బెనెట్టన్, గుచి అనే ఫ్యాషన్ దుస్తులు ఇటలీ తయారీయే.ఇక ఇటలీ ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ ప్రసిద్ధ మోనాలిసా చిత్రాన్ని గీసిన చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ ఈ దేశానికి చెందిన వాడే.
ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన కలోజియం ఈ దేశంలోనే ఉంది. ఇది రోమ్ నగరం మధ్యలో నిలిచి ఉంది. దీనిని రోమన్ రాజులు నిర్మించారు.
ఆహారం: ఇటలీ దేశం పిజ్జా, పాస్తాలకు ప్రసిద్ధి. బ్రెడ్డు, సాస్ తింటూ వైన్ తాగుతూ ఆనందిస్తారు ఇక్కడి ప్రజలు. ఫ్రూట్‌సలాడ్, పిజ్జా, పాస్తా, మాంసం, చేపలు, సారాయి వీరి ముఖ్య ఆహారపు అలవాట్లు. ఏదైనా ఆహారం తీసుకోగానే టమాటా సూప్ తాగడం వీరికి తప్పనిసరి. ఉదయం పూట ‘కాపుసినో’ అనే కాఫీ తాగుతారు.