జీవన్
తెలుగు నటుల్లో జీవన్‌ను సిఎస్సార్‌తో పోల్చవచ్చా? ఆ రూపం, మాట విరుపు, చూపులో విషం... ప్రేక్షకులకు భయం కలిగించిన హిందీ విలన్లలో జీవన్ ఒకడు. పుట్టుకతోనే తల్లిని కోల్పోయాడు. మూడేళ్ల వయసుకే తండ్రిని కోల్పోయాడు. మొత్తం 24 మంది సంతానంలో ఇతను 24వ వాడట. పాకిస్తాన్‌లో వీళ్లది కలిగిన కుటుంబం. కాని సినిమాల పిచ్చితో చేతిలో 26 రూపాయలు పట్టుకుని 18 ఏళ్ల వయసులో లాహోర్ నుంచి బొంబైకి పారిపోయి వచ్చాడు.
షోలేకు కెమెరామేన్‌గా పని చేసిన ద్వారకా ద్వివేచాతో కలిసి స్టూడియోల్లో రిఫ్లెక్టర్లు మోసేవాడు. తర్వాత యాక్టర్ అయ్యాడు. హిందీ సినిమాల్లో ఆ మాటకొస్తే భారతీయ సినిమాల్లో 60సార్లు నారదముని పాత్ర పోషించిన నటుడు జీవన్‌లా మరొకడు లేడు. ‘మేలా’ ,‘కానూన్’, ‘నయాదౌర్’, ‘వక్త్’ వంటి సినిమాలు జీవన్‌కు చాలా పేరు తెచ్చాయి. అమర్ అక్బర్ ఆంటోనీ, నసీబ్ వంటి సినిమాల్లో కూడా కనిపించాడు. బాలీవుడ్‌లో క్రమశిక్షణ కలిగిన నటుడిగా పేరు. మరో విలన్ కిరణ్ కుమార్ ఇతని కుమారుడే.