పన్నువసూలు చేసే వృత్తిలో ఉన్న మత్తయిని చూసి యేసుప్రభువు ‘నన్ను వెంబడించు’ అని పలకగానే అతను వచ్చి ఆయన శిష్య బృందంలో చేరాడు. ప్రభువు పలికిన ఆ ఒక్కమాట అతని జీవిత గమ్యాన్ని సమూలంగా మార్చేసింది. మత్తయి జీవితంలోకి ప్రభువు ఆహ్వానం ఎంతటి ఆనందాన్ని నింపిందంటే, అది వెల్లడించడానికి ఒక గొప్ప విందు చేసి ప్రభువును కూడా ఆహ్వానించాడు. నాటి రోమా ప్రభుత్వానికి తొత్తులైన పన్నులు వసూలు చేసే మత్తయి లాంటి సుంకరులను సాధారణ ప్రజలు ఏవగించుకునేవారు. శాస్త్రులు పరిసయ్యుల వంటి యూదు మత ప్రముఖులు ఎలాగూ రోమాప్రభుత్వానికి మద్దతుదారులు కాబట్టి వారు సుంకరులకు కూడా స్నేహితులు. అందువల్ల ఆ విందుకు పాపులుగా ప్రజలు ముద్రవేసిన ఎంతోమంది సుంకరులు, పరిసయ్యులు కూడా హాజరయ్యారు. యేసుప్రభువు ఎంతో ఆనందంగా వారందరితో కలిసి విందారగించడం యూదుమత ప్రముఖులైన పరిసయ్యులకు నచ్చలేదు.
‘మీ బోధకుడు సుంకరులతో, పాపులతో కలిసి భోజనం ఎందుకు చేస్తున్నాడు’ అని పరిసయ్యులు ఆయన శిష్యులను ప్రశ్నించారు. పరిసయ్యులు తమకు తాము చాలా నీతిమంతులమని భావిస్తారు. యూదు మత సంబంధమైన దాదాపు 615 నియమాలను ఎంతో నిష్టగా పాటిస్తారు. అవి పాటించని యూదులు, అన్యులతో కలిసి భోజనం చేయకూడదన్నది వాటిలో ఒకటి. అందువల్ల ఆ విందులో పరిసయ్యుల కోసం ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసి ఉంటారు కానీ తమతో కలిసి భోంచేస్తాడనుకున్న యేసుప్రభువు సుంకరులతో కలిసి వారి విభాగంలో కూర్చోవడంతో వాళ్ళు ఈ వివాదానికి తెర లేపారు. ‘వైద్యుని అవసరం రోగులకే గాని ఆరోగ్యవంతులకు కాదుకదా.
నేను నీతిమంతులను కాదు, పాపులనే పిలవవచ్చాను. బలిని కాదు, కనికరాన్నే కోరుతున్నాను. ఆ వాక్యభావమేమిటో ముందు నేర్చుకోండి’ అంటూ ఒక్కమాటతో ప్రభువు వారి నోళ్లు మూసివేశాడు (మత్త 9:9–13).నిజానికి ఆ రాత్రి విందులో సుంకరులను చూసీ చూడగానే ‘మీరెప్పుడు మారుతారు?’ అని ప్రభువు వారిని నిలదీస్తూ ప్రశ్నించాలి. అక్కడికక్కడే ఎడాపెడా ‘మారుమనస్సు’ అనే అంశంపై ప్రసంగం చేసి వారినందరిని గద్దించాలి. నిజానికి తన శిష్యుడిగా చేర్చుకున్న మత్తయికే ప్రభువు ఆ ప్రశ్న వెయ్యలేదు. అది ఎవరో తనను అతిథిగా ఆహ్వానించిన ఒక విందు స్థలం. అందువల్ల అక్కడి వాతావరణాన్ని పాడుచెయ్యకుండా, విందు సాంప్రదాయాన్ని గౌరవించి తన పద్ధతి చొప్పున ఆయన అందరితో కలిసిపోయాడు. అదే ఆయన సంస్కారం, గొప్పదనం. అందరినీ తిట్టి దూరం పెట్టగలిగిన స్థాయి తనకున్నా వాళ్ళందరినీ అక్కున చేర్చుకున్న ఎంతో విశాల హృదయమున్న గొప్ప రక్షకుడాయన.
అయితే కొన్ని నియమాలను నిష్టగా పాటిస్తున్నారన్న మాటే గాని దేవుని హృదయాన్ని ఏమాత్రం ఎరుగని పరిసయ్యులు మాత్రం యేసుప్రభువు పాపులతో ప్రభువు కలవడమేమిటన్న వివాదాన్ని విందులో లేపి తమ కుసంస్కారాన్ని చాటుకున్నారు. ఈనాడు విశ్వాసులది కూడా అదే పద్ధతి. చర్చిల్లో తమకన్నా ఆత్మీయంగా తక్కువ స్థాయి గలవారొస్తే వారితో కలవరు, మాట్లాడరు సరికదా సూటిపోటిమాటలంటారు. చర్చిలు పాపుల వైద్యశాలలుగా ఉండాలని ప్రభువు నిర్దేశిస్తే, ‘నీతిమంతుల’ విశ్రామ స్థలాలు, సోషల్ క్లబ్బులుగా మారాయి. పాపిగా ముద్రపడ్డ వ్యక్తి చర్చికి పరుగెత్తుకెళ్లి అక్కడి విశ్వాసుల ప్రేమతో తడిసి పరివర్తన చెంది సమాజామోదం పొందే పరిస్థితి లేదు సరికదా, చర్చి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితిని ఈనాటి పరిసయ్యుల్లాంటి విశ్వాసులు కల్పించారు. ఇదే ఈనాటి అతి పెద్ద విషాదం.
ప్రభువు హృదయాన్ని తెలుసుకోకుండా ప్రభువు అనుచరులమని చెప్పుకునే ‘నకిలీ క్రైస్తవం’ బాగా ప్రబలుతోంది. చర్చిల్లో దేవుని మాటలు వినబడతాయి, కానీ దేవుని హృదయం, ఆయన ప్రేమ, కనికరం మాత్రం కనిపించడం లేదు. పాటలు, ప్రసంగాలు, ప్రార్థన చేసే కొద్ది సమయం వదిలేస్తే మిగతా సమయమంతా ‘గెట్ టుగెదర్’లు, సోషల్ క్లబ్బుల కార్యకలాపాలే! అన్యులతో కాదు కదా, కనీసం ఇతర చర్చిలవారితో కూడా చాలామంది విశ్వాసులు కలవరు, ఇతరులను తమతో కలవనివ్వరు. ఇలా తమను తాము గొప్పగా, ఎంతో ప్రత్యేకమైన వారుగా భావించుకునే సంçస్కృతిని యేసుప్రభువు ఏవగించుకుంటాడు, అలాంటి జీవనశైలికి తన ఆమోదాన్ని అసలే ఇవ్వడు.
అపురూపం స్వర్ణముఖి శిల
పంచాయతన పూజలో కీలకంగా ఉపయోగించే స్వర్ణముఖి శిల చాలా అరుదైన వస్తువు. దక్షిణభారత దేశంలో చిత్తూరు జిల్లా మీదుగా ప్రవహించే స్వర్ణముఖి నది ఒడ్డున స్వర్ణముఖి శిలలు అక్కడక్కడా దొరుకుతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా తలచే స్వర్ణముఖి శిలకు బంగారాన్ని ఆకర్షించే శక్తి ఉందని నమ్ముతారు. ముఖ్యంగా అక్షయతృతీయ నాడు స్వర్ణముఖి శిలను శాస్త్రోక్తంగా పూజించిన ఇంట సంపద దినదిన ప్రవర్ధమానంగా వృద్ధిచెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. స్వర్ణముఖి శిలలు మామూలు రాళ్లమాదిరిగానే ఉన్నా, వాటిలో బంగారు వెండి కలగలసిన ఛాయ కనిపిస్తుంది.
స్వర్ణముఖి శిలను ఇళ్లలోను, కార్యాలయాల్లోను, వ్యాపార ప్రదేశాల్లోనూ ఎక్కడైనా సరే, పూజమందిరం ఏర్పాటు చేసిన చోట ఉంచి పూజించుకోవచ్చు. స్వర్ణముఖి శిలకు నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించే చోట సంతోషానికి, సంపదకు లోటు ఉండదు. స్వర్ణముఖి శిలను ఏదైనా సుముహూర్తంలో తీసుకువచ్చి, పూజమందిరంలో పసుపు వస్త్రంపై ఉంచి ధూప దీప నైవేద్యాలను సమర్పించి, పూజించాలి. దీనిని పూజించడం వల్ల ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అనాయాసంగా కార్యసిద్ధి కలుగుతుంది.
– పన్యాల జగన్నాథదాసు
Comments
Please login to add a commentAdd a comment