అచ్చం అలాగే..! అపురూపమైన ఆభరణాలు! | Just as well ..! Heighten the jewels! | Sakshi
Sakshi News home page

అచ్చం అలాగే..! అపురూపమైన ఆభరణాలు!

Published Wed, Apr 30 2014 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM

అచ్చం అలాగే..! అపురూపమైన ఆభరణాలు!

అచ్చం అలాగే..! అపురూపమైన ఆభరణాలు!

ముస్తాబు
 
అచ్చమైన బంగారానికైనా మెరుగు అవసరం... మరి అచ్చతెలుగు అమ్మాయికి...?!
 వజ్రాలు, వైఢూర్యాలకైనా వన్నెలు అద్దాలి... మరి నిలువెత్తు సౌందర్యానికి..?!
 బంగారంతో పనిలేదు... వజ్రాల వెలుగులూ అక్కర్లేదు... ఎంపిక సులువుగా, అలంకరణ త్వరగా పూర్తవ్వాలి.
 అంతేనా... అందరిలోనూ కొత్తగా.. ఇంకాస్త బ్రైట్‌గా కనిపించాలి.
 ప్రత్యేకం అనిపించే డిజైన్లను ఎప్పటికప్పుడు సొంతం చేసుకోవాలి.
 అదీ తక్కువ ధరలో... బంగారు నగలకు పోటీగా... ఇమిటేషన్, ఫంకీ, కాస్ట్యూమ్, ప్లేటెడ్.. ఆభరణాలెన్నో
 అతివల మనసులను ఆకట్టుకుంటున్నాయి. ఇవే ఇప్పటి ట్రెండ్‌గా మారాయి.

 
కళగానూ, మెరుపులుగానూ ఉండే ఈ డిజైనరీ ఆభరణాలను ఇష్టపడేవారు కొన్నేళ్లపాటు ధరించాలంటే మన్నిక కోసం జాగ్రత్తలూ ఎంతో అవసరం.
 
 బంగారు ఆభరణాలకు ఎలాంటి జాగ్రత్తలైతే తీసుకుంటామో వీటికీ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి.  
 
 క్రిస్టల్స్, రంగురాళ్లు మెరుపు పోకుండా ఉండాలంటే ధరించిన ఆభరణాలను తీసి, భద్రపరిచేటప్పుడు మెత్తటి తడి, పొడి వస్త్రంతో(కళ్లజోడుతో పాటు వచ్చే మెత్తటి క్లాత్ లాంటిది అయి ఉండాలి) మృదువుగా తుడిచి, భద్రపరచాలి.  
 
 రాళ్లు, క్రిస్టల్స్, లోహం, ముత్యాలు నీరు తగిలినప్పుడు రంగుమారవచ్చు. చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఈత కొట్టడం వంటి సందర్భాలలో ధరించిన ఆభరణాలను తీయడం మంచిది.
 
 పెర్‌ఫ్యూమ్, హెయిర్ స్ప్రే, నూనె, మద్యం... లాంటివి  ఆభరణాల పై పూతను దెబ్బతీస్తాయి. అలాగే మెరుపు కోల్పోవచ్చు. మెరుపు కోల్పోయిన రాళ్లు, పూసలు, ముత్యాలు ధరించడానికి అనువుగా ఉండవు. బాడీ లోషన్‌కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో వాటిని జాగ్రత్తపరచాలి.  
 
 ఆభరణాలను ధరించిన తర్వాత పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకోకూడదు. పెర్‌ఫ్యూమ్ ఆభరణాలకు తగిలేలా స్ప్రే చేయకూడదు.  
 
 అన్ని ఆభరణాలనూ ప్లాస్టిక్/పేపర్ బ్యాగ్‌లో పెట్టి ఒకే చోట ఉంచరాదు. ఆభరణాలు విరిగిపోవఛిం, రాళ్లు పోవడం వంటివి జరగవచ్చు. ఆభరణాల పెట్టెలో పట్టు/వెల్వెట్ పౌచ్‌లలో భద్రపరచాలి.  
 
 ఆభరణాలు ధరించి నిద్రపోతే అసౌకర్యంగా ఉండటమే కాదు, అవి విరిగిపోవడం, రంగురాళ్లు ఊడిపోవడం.. వంటివి జరగవచ్చు.  
 
 అలాగే ఎక్కువ ఎండపడే చోట కూడా భద్రపరచకూడదు. ఆభరణాలు పెట్టే బాక్స్‌లలో భద్రపరచాలి. ఆ బాక్స్ కూడా పెద్ద పెద్ద విభాగాలతో కూడి ఉండాలి.
 
ఆభరణాలు ధరించేవారు...
ఆభరణాలను తగిలించే హోల్డర్స్, కంఠాభరణాల స్టాండ్‌లు, ఆభరణాలు తీసుకోవడానికి అనువైన బాక్స్‌లను సిద్ధం చేసుకోవాలి.
 
 ప్రయాణాల సమయంలో ఆభరణాలను తీసుకువెళ్లేటప్పుడు అన్నీ ఒక చోట చుట్టేయకూడదు. దేనికది విడి విడిగా పెట్టాలి.  
 
 సబ్బు, ఫేస్‌క్రీములు, మాయిశ్చరైజర్లు ఆభరణాలకు అంటకూడదు.  
 
 దూది ఉండతోనూ, మెత్తని టూత్‌బ్రష్‌తో కొద్దిగా నీళ్లను అద్దుతూ శుభ్రపరచాలి.
 
 ఉన్న ఆభరణాలు కొద్దిగా పాడైపోయినా.. మరికొన్ని ఆభరణాలను జత చేసి కొత్తగా తయారుచేయించుకోవచ్చు. ఇందుకు ఇమిటేషన్ జ్యుయలరీ నిపుణులను సంప్రదించవచ్చు. ఆసక్తి ఉండాలేగాని పూసలు, రాళ్లు, చైన్లను ఉపయోగించి కొత్త తరహా ఆభరణాలను రూపొందించుకోవచ్చు. కొన్ని చైన్‌లను చెవి రింగులు గానూ, నెక్‌లెస్ ఎక్స్‌టెండర్స్‌గానూ వాడవచ్చు. లేదా పెంపుడు జంతువులకు ట్యాగ్‌గానూ వాడచ్చు.
 
ఆభరణాల ఎంపిక, ధరించడం అనేది వ్యక్తిగత విషయం. కుటుంబసభ్యులకు లేదా స్నేహితులకు మీ గుర్తుగా ఆభరణాలను కానుకగా ఇచ్చేటప్పుడు వారి ఇష్టాయిష్టాలను గమనించాలి. మీరు ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా తీసుకున్నవారికి అది ఆనందాన్ని కలిగించాలి. ఉపయోగపడాలి.
 
బంగారు ఆభరణాలంటే అతివలకు అమితమైన ప్రీతి. ఆభరణాల అలంకరణలో పుత్తడిబొమ్మలా మెరిసిపోవాలని కోరుకుంటారు. కానీ, బంగారం అందరికీ అందుబాటులో లేదు. అలాగని చుక్కల లోకం చేరిన బంగారం ధరలు చూసి ఇప్పుడెవరూ డీలా పడటం లేదు. బంగారు ఆభరణాల డిజైన్లను పోలినవి, వాటిని మించినవి, రకరకాల లోహాలతో తయారైనవి, దుస్తులకు తగినవి... ఎన్నింటినో సృజనాత్మకత గల నిపుణులు కళ్లు చెదిరేలా సృష్టిస్తున్నారు. మార్కెట్లో కళ్ల ముందు పెడుతున్నారు.  
 
ఇమిటేషన్ ఆభరణాలు: బంగారు ఆభరణాలను పోలిన డిజైన్లు ఇప్పుడు అన్నిచోట్లా లభిస్తున్నాయి. వీటిని వన్‌గ్రామ్ గోల్డ్ జ్యుయలరీ అని కూడా అంటుంటారు. వీటిలో విలువైన రాళ్లు, రత్నాలను కూడా పొదిగి అందంగా తీర్చిదిద్దుతుంటారు. బంగారం మాత్రం ఉపయోగించని ఈ డిజైన్లు తక్కువ ధరకే లభిస్తూ అతివలను ఆకట్టుకుంటున్నాయి. వెండితో తయారుచేసిన ఆభరణాలపై పై పూతగా గోల్డ్ కోటింగ్ వేసే జ్యుయలరీ కూడా ఈ జాబితాలో చేరుతుంది.  
 
కాస్ట్యూమ్/ఫ్యాషన్ ఆభరణాలు:
ఖరీదు చాలా తక్కువగా ఉండే లోహాలు, రంగురాళ్లు, పూసలతో తయారుచేసిన ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఇవి ఫ్యాషన్ దుస్తుల అందాన్ని మరింత బహిర్గతం చేసే విధంగా డిజైనర్లు సృష్టిస్తారు. చాలా వరకు దుస్తులకు మ్యాచింగ్ అయ్యే ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యుయలరీ అంటారు. ఈ ఆభరణాలు ఎప్పుడూ చాలా తక్కువ ఖరీదులో ఉంటాయి. 1930ల కాలంలో ఈ తరహా ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి.
 
 జంక్/ఫంకీ ఆభరణాలు: కలప, పూసలు, ఎముకలు, బ్రాస్, టైటా, జంతువుల దంతాలు, కొమ్ములు, పట్టు దారాలు... ఇలాంటివాటితో తయారుచేసిన ఆభరణాలను జంక్ జ్యూయలరీ అంటారు. ప్రపంచంలోని స్త్రీలంతా బంగారు, వజ్రాలు, వెండి, ప్లాటినమ్ ఆభరణాలనే కోరుకుంటారు అనుకోవడం పొరపాటు. జంక్ జ్యుయలరీని ధరించడం ఇప్ప టి ట్రెండ్. ఫంకీ జ్యుయలరీగా కూడా ఇది ప్రసిద్ధి పొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement