ఒక్క మాట జ్ఞాపకం ఉంటే చాలు! | Just remember one word | Sakshi
Sakshi News home page

ఒక్క మాట జ్ఞాపకం ఉంటే చాలు!

Published Tue, May 8 2018 12:02 AM | Last Updated on Tue, May 8 2018 12:02 AM

Just remember one word - Sakshi

‘‘నాన్నా, ఈ పరీక్షలు బాగా రాయి. మంచి మార్కులొస్తే చెన్నై లో ఒక కాలేజిఉంది. అక్కడ సీటు వస్తుంది. అక్కడ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ అని బ్రాంచ్‌ ఉంటుంది, దానిలో చేరితే నీవు కోరుకున్న వ్యక్తివి అవుతావు’’ అన్నారు. ఒక్కమాట... ఆ ఒక్కమాటను ఆయన జ్ఞాపకం పెట్టుకుని చెల్లెలు అత్తగారు బంగారం ఇస్తే తాకట్టు పెట్టుకుని చదువుకున్నాడు. తాను కోరుకున్న వ్యక్తి అయ్యాడు. మనకు ప్రాతః స్మరణీయుడయ్యాడు. 

అబ్దుల్‌ కలామ్‌ చదువుకునే రోజుల్లో శివసుబ్రమణ్యం అయ్యర్‌ అని ఒక మేష్టారుండేవారు. తెల్లవారు ఝామునలేచి స్నానం చేసి వెళ్ళిన 10 మందికే లెక్కలు చెప్పేవారు. స్కూల్లో పాఠం చెప్పేవారు. ఒక రోజు పాఠం చెబుతూ చెబుతూ... పక్షి ఎలా ఎగురుతుందో బ్లాక్‌ బోర్డుమీద బొమ్మలు వేశాడు. పక్షి ఎలా కూర్చుంటుంది, ఎగిరేటప్పుడు రెక్కలు ఎలా విప్పుతుంది, శక్తినంతా కూడ దీసుకుని రెక్కలు అల్లారుస్తూ శరీరాన్ని పైకి ఎలా లేపుతుంది, తోకతో దిశను ఎలా మార్చుకుంటుందో చెప్పి ‘మీకర్థమయిందా?’ అని అడిగారు. కలాం నిలబడి ‘సార్, మీరు చెప్పడంలో ఏమీ దోషంలేదు, కానీ మేమే అందుకోలేక పోయాం, అర్థంకాలేదు’ అన్నారు.
 
‘’అయితే ఈ సాయంత్రం 5 గంటలకు సముద్రపు ఒడ్డుకురండి (ఆ ఊరు సముద్రం పక్కనే ఉంది), నేనూ వస్తాను’’ అని అయ్యర్‌ చెప్పారు. ఆ సాయంత్రం పక్షులు బారులు బారులుగా వచ్చి వెడుతుంటే వాటి కదలికలను చూపుతూ వివరించి చెప్పారు. కలాం వాటిని చూస్తూ తాదాత్మ్యం చెందాడు. వేకువఝామునే వెళ్ళి గురువుగారిని కలిసి ‘‘నిన్న మీరు చెప్పిన పాఠం విన్నాను, పక్షులను చూశాను. విమానం గురించి విన్నాను. నాకు కూడా అలా గాలిలో ఎగిరేవి నిర్మించాలని ఉంది’’ అని చెప్పారు.‘అదెలా సాధ్యం?’ అని గురువుగారు అనలేదు. ‘‘నాన్నా, ఈ పరీక్షలు బాగా రాయి. మంచి మార్కులొస్తే చెన్నై లో ఒక కాలేజి ఉంది. అక్కడ సీటు వస్తుంది. అక్కడ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ అని బ్రాంచ్‌ ఉంటుంది, దానిలో చేరితే నీవు కోరుకున్న వ్యక్తివి అవుతావు’’ అన్నారు. ఒక్కమాట... ఆ ఒక్కమాటను ఆయన జ్ఞాపకం పెట్టుకుని చెల్లెలు అత్తగారు బంగారం ఇస్తే తాకట్టుపెట్టుకుని చదువుకున్నాడు. తాను కోరుకున్న వ్యక్తి అయ్యాడు. మనకు ప్రాతః స్మరణీయుడయ్యాడు.  భారతదేశానికి ఉపగ్రహాలను నిర్మించడంలో సాటిలేని మేటియై, ఏ మేష్టారు ఎంత ఓర్పుగా మాట్లాడితే ఈ అబ్దుల్కలాం ఇంతటివాడయ్యాడో, రాష్ట్రపతి భవన్లో కూర్చోగలిగాడో అలాటి అయ్యర్‌ని దృష్టిలో పెట్టుకుని... ‘‘ఆయనలాగా అంతమంది పిల్లలను తయారు చేయడానికి రాష్ట్రపతి భవన్‌ను విడిచిపెట్టి విశ్వవిద్యాలయాలకు, పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులను కలవడానికి ఇష్టపడి వెళ్ళిపోతున్నాను’’ అని రాసుకున్నారు కలాం, తను రచించిన ‘ఇన్‌డామిటబుల్‌ స్పిరిట్‌’ అనే గ్రంథంలో. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement