ఇజ్రాయెల్‌ టీనేజర్‌ బందీ వీడియో...విడుదల చేసిన హమాస్‌ | Hamas Releases Israeli 19 Years Old Hostage Soldier Video, Family Says Hearts Torn To Pieces | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ టీనేజర్‌ బందీ వీడియో...విడుదల చేసిన హమాస్‌

Published Sun, Jan 5 2025 10:09 AM | Last Updated on Mon, Jan 6 2025 4:51 AM

Hamas Releases Israel Hostage Soldier Video

గుండె ముక్కలైందన్న తల్లిదండ్రులు 

క్షేమంగా విడుదల చేయించాలని డిమాండ్‌

జెరూసలేం: ఏడాదికి పైగా బందీగా ఉన్న 19 ఏళ్ల ఇజ్రాయెల్‌ సైనికురాలి వీడియోను హమాస్‌ విడుదల చేసింది. మూడున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో అల్‌బాగ్‌ హిబ్రూ భాషలో మాట్లాడారు. తనను 450 రోజులకు పైగా నిర్బంధించారని,  ఇజ్రాయెల్‌తనను, ఇతర బందీలను మరిచిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన వయసు 19 ఏళ్లని, కానీ ఇప్పుడు జీవితం మొత్తం తన కళ్లముందుందని చెప్పారు. వీడియో తమ గుండెను ముక్కలు చేసిందని అల్‌బాగ్‌ తల్లిదండ్రులు పేర్కొన్నారు.

 కూతురు వీడియో చూసిన అనంతరం వారు ఓ వీడియో ప్రకటన చేశారు. తమ కూతురు తీవ్ర మానసిక క్షోభను అనుభవించినట్లు కనిపిస్తోందన్నారు. ఆమె క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహుకు విజ్ఞప్తి చేశారు. బందీల కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అల్‌బాగ్‌ కుటుంబ ప్రకటనపై ప్రధాని స్పందించారు. బం«దీలను స్వదేశానికి రప్పించేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. బందీలకు హాని తలపెట్టే సాహసం చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. 

కుటుంబం అనుమతితో... 
సాధారణంగా కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా హమాస్‌ విడుదల చేసే బందీల ఫొటోలు, వీడియోలను  ఇజ్రాయెల్‌ మీడియా ప్రచురించదు. వీడియోను విడుదల చేయడానికి అల్‌ బాగ్‌ కుటుంబం తొలుత నిరాకరించినా.. తరువాత అంగీకరించింది. బందీల ఫొటోలు, వీడియోలను హమాస్‌ ప్రచురించడాన్ని ఇజ్రాయెల్‌ గతంలో ఖండించింది. 

 

హమాస్‌ చెరలో 96 మంది.. 
ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి సమయంలో 250 మందిని బందీలుగా గాజాకు తరలించారు. వారిలో కొందరిని రక్షించారు. 34 మంది మరణించారు. ప్రస్తుతం హమాస్‌ చెరలో 96 మంది మిగిలారు. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌(ఐడీఎఫ్‌)లో నిఘా సైనికురాలిగా ఉన్న లిరీ అల్‌బాగ్‌ను గాజా సరిహద్దులోని నహల్‌ ఓజ్‌ సైనిక స్థావరంలో ఉండగా హమాస్‌ ఉగ్రవాదులు పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సైతం బంధించారు. వీరిలో ఒకరిని రక్షించగా, మరొకరు హత్యకు గురయ్యారు. అల్‌బాగ్‌తోపాటు నలుగురు బందీలుగా మిగిలారు. 

చర్చల నేపథ్యంలో వీడియో.. 
ఖతార్‌లో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు కాల్పుల విరమణ చర్చలు పునఃప్రారంభమయ్యాయి.  చర్చల్లో మధ్యవర్తులుగా ఖతార్, ఈజిప్‌్ట, అమెరికాలు ఉన్నాయి. ఒప్పందం కోసం నెలల తరబడిగా చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. తాజాగా శుక్రవారం నుంచి గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో హమాస్‌ లిరీ వీడియోను విడుదల చేసింది.  

ఇదీ చదవండి: గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్‌ దాడులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement