కెనడీ మెచ్చిన యథార్థ గాథ | Kennedy favored by the actual story | Sakshi
Sakshi News home page

కెనడీ మెచ్చిన యథార్థ గాథ

Published Wed, Jun 8 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

కెనడీ మెచ్చిన యథార్థ గాథ

కెనడీ మెచ్చిన యథార్థ గాథ

హాలీవుడ్ బయోపిక్ థ్రిల్లర్ / బ్రిడ్జి ఆఫ్ స్పైస్ (2015)

 

‘జాస్’, ‘ఇ.టి’, జురాసిక్ పార్క్’, ‘ఇండియానా జోన్స్’ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకి కూడా తెలిసిన హాలీవుడ్ మాస్ డెరైక్టర్ స్టీవెన్ స్పీల్‌బెర్గ్ 69 ఏళ్ల వయసులో కూడా కొత్తకొత్త సబ్జెక్ట్‌లకోసం స్క్రిప్ట్‌లు చదువుతుంటాడు.

  

బ్రిటన్‌కు చెందిన రచయిత మాట్ చార్మెన్ అనుకోకుండా అమెరికా మాజీ ప్రెసిడెంట్ జీవిత చరిత్ర ‘యాన్ అన్ ఫినిష్డ్ లైఫ్’ అనే పుస్తకం చదివాడు. అందులో అమెరికాలో సంచలనం రేపిన ఓ లాయర్ జేమ్స్ డొనవన్ గురించి కెనెడీ స్వయంగా ప్రస్తావించాడు. 1964 నుంచి 2012 వరకు అతని గురించి పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. రెండు శత్రుదేశాల మధ్య గూఢచారుల మార్పిడికి ముందుకొచ్చి నిలబడ్డ లాయర్ జేమ్స్ డొనొవన్.

 
అసలేం జరిగింది?

1957 ... ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలు - అమెరికా, రష్యా మధ్య శత్రుత్వం. ఏ నిమిషాన మూడో ప్రపంచయుద్ధం ఈ రెండు దేశాల కారణంగా తలెత్తుతుందో ఏమోనని భయం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కారణాలు ఏమైనా కానీ - రష్యా మీద, కమ్యూనిజం మీద అమెరికాలో తీవ్ర వ్యతిరేక భావాలు నెలకొని ఉన్నాయి.  అటువంటి పరిస్థితుల్లో ఓ సోవియట్ గూఢచారి రుడాల్ఫ్ ఎబెల్, అమెరికన్ గూఢచార వ్యవస్థ సిఐఏకి దొరికాడు. ఆ గూఢచారికి ఉరిశిక్ష విధించాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. బయటి సమాజం దాన్ని సమర్థించింది. ఆ పరిస్థితుల్లో లాయర్ డొనొలిన్ -  ఆ రష్యా గూఢచారి మరణశిక్ష రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానంలో పోరాడాడు. అతణ్ణి జైల్లో ఉంచితే, అవసరమైనప్పుడు ఉపయోగపడతాడని డొనొవిన్ ఆలోచన.

 
1962లో ఓ యుద్ధ విమానంతో అమెరికన్ పెలైట్ ఫ్రాన్సిస్ గారీ పవర్స్ రష్యన్లకి దొరికాడు.తమ దేశపు పైలట్‌ని విడుదల చేస్తే, బందీగా ఉన్న రుడాల్ఫ్ ఎబెల్‌ని రష్యాకి అప్పగిస్తామని సిఐఏ తరఫున లాయర్ డొనొలిన్ బేరసారాలు జరిపించాడు.  అలా ఇద్దరు గూఢచారుల మార్పిడి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో తన అనుభవాలను పేర్కొంటూ - డొనొమిన్ 1964లో ‘స్ట్రేంజర్స్ ఆన్ ఎ బ్రిడ్జి : ది కేస్ ఆఫ్ కల్నల్ ఎబెల్ అండ్ ఫ్రాన్సిస్ గారీ పవర్స్’ అనే పుస్తకం రాశాడు. అలాగే ఈ ఉదంతం గురించి ‘ఆపరేషన్ గోల్డ్’, ‘ఎ హౌస్ ఆన్ ది హైట్స్’ అనే పుస్తకాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది.

  

స్క్రీన్‌ప్లే రచయిత మాట్ చార్మెన్ కెనడీ రాసిన విషయాల ఆధారంగా ఈ సంఘటనపై మరింత లోతుగా పరిశోధించాడు. లాయర్ జేమ్స్ డొనొవన్ కుమారుణ్ణి కలిశాడు. ఆసక్తికరమైన సమాచారం సేకరించి, సినిమాకి అనుగుణంగా స్క్రిప్ట్ రాశాడు మాట్. అయితే చాలా స్టూడియోలు ఈ స్క్రిప్ట్‌ని తిరస్కరించాయి. చివరికి స్టీవెన్ స్పీల్‌బర్గ్ దృష్టిలో ఈ స్క్రిప్ట్ పడింది. తన సొంత నిర్మాణ సంస్థ డ్రీమ్‌వర్క్స్ స్టూడియో నిర్మాణంలో ఈ కథని తెరకి ఎక్కించాడు స్పీల్‌బర్గ్.

 
కథ విషయానికొస్తే -  1957 - న్యూయార్క్ బ్రూక్లిన్‌లో రుడాల్ఫ్ అబెల్ తనకొచ్చిన రహస్య సమాచారాన్ని చదువుతుండగా ఎఫ్‌బిఐ ఏజెంట్లు అతడ్ని అరెస్ట్ చేశారు. అతడి ఇంట్లో పలు కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించి, అతణ్ణి సోవియెట్ గూఢచారిగా నిర్ధారించారు. సోవియట్ రష్యాకి సంబంధించిన విషయాలు చెప్పి, అప్రూవర్‌గా మారితే శిక్ష తగ్గించే అవకాశం ఉంటుందని ఎఫ్‌బిఐ హితబోధ చేసింది. కానీ ఎబెల్ అంగీకరించలేదు.

 
విచారణ ప్రారంభమైంది. లాయర్ జేమ్స్ డొనొవన్ ఎబెల్ తరఫున వాదించసాగాడు. డొనొవన్ కుటుంబ సభ్యులు, మిత్రులు, చివరికి జడ్జితో సహా ఈ కేసుని వదిలేయలేమని డొనొవన్‌కి చెప్పాడు. తనకేమాత్రం సంబంధం లేని ఈ లాయర్ తనని సమర్థిస్తూ వాదించడం ఎబెల్‌ని ఆకట్టుకుంది. ఎబెల్‌కి ఉరిశిక్ష విధించబోతుంటే, డొనొవన్ అడ్డుపడ్డాడు. అమెరికా విదేశాంగ విధానం ప్రకారం - విదేశీయులకి ఉరిశిక్ష విధించకూడదని, పైగా అలా చేస్తే సోవియట్ రష్యా ఈ అంశాన్ని ఓ అస్త్రంగా వాడుకుంటుందని డొనొవన్ తీవ్రంగా వాదించాడు. ఆ ఉరిశిక్ష 30 సంవత్సరాల కారాగార శిక్షగా మారింది. ఓ రష్యన్ గూఢచారిని వెనకేసుకొచ్చినందుకు లాయర్ డొనొలిన్ ఇంటి మీద దాడులు జరిగాయి.

 
కొన్నేళ్ల తర్వాత అమెరికా గూఢచార విమానం పెలైట్ ఫ్రాన్సిస్ గారీ పవర్స్ - రష్యన్ గూఢచార సంస్థ కెజిబికి బందీగా దొరికాడు. రష్యా ప్రభుత్వం బేరసారాలు ప్రారంభించింది. ఎబెల్‌ని అప్పగిస్తే, ఫ్రాన్సిస్‌ని తిరిగి ఇస్తారు. అయితే ఎబెల్‌ని తమ గూఢచారిగా అంగీకరించలేదు రష్యా. అందుకే గూఢచారుల మార్పిడి తూర్పు జర్మనీలో జరగాలని ప్లాన్ చేశాడు. డొనొవన్ ఎలా ఈ గూఢచారుల్ని మార్పిడి చేశాడనేది మిగిలిన సినిమా. టామ్ హాంక్స్ డొనొవన్‌గా నటించగా, ఎబెల్‌గా మార్క్ రెలాన్స్‌గా నటించాడు.

 - తోట ప్రసాద్

 

ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు సెయింట్ జేమ్స్ ప్లేస్. అయితే ‘బ్రిడ్జి ఆఫ్ స్పైస్’గా తర్వాత మార్చారు.ఈ టైటిల్‌పై ఇప్పుడు పెద్ద వివాదం నెలకొంది. ఈ చారిత్రక సంఘటన ఆధారం చేసుకుని - బ్రిటన్‌కి చెందిన జర్నలిస్ట్, రచయిత గిల్స్ వెటైల్ 2010లో ‘బిడ్జి ఆఫ్ స్పైస్’ అనే పుస్తకం రాశాడు. తన పుస్తకం పేరు సినిమా టైటిల్‌గా వాడుకున్నందుకు స్పీల్‌బర్గ్ మీద, డ్రీమ్‌వర్క్స్, ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ స్టూడియోలపై కేసు వేశాడు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 40 మిలియన్ల డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 166 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. మార్క్ రెలాన్స్ ఉత్తమ సహాయ నటుడిగా ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నాడు. {ఫాన్సిస్ గారీ పవర్స్ కుమారుడు కోల్డ్‌వార్ మ్యూజియం ఏర్పాటు చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన చారిత్రక ఆధారాలు, సాంకేతిక  సహకారం అందించడంలో గారీ కుమారుడి పాత్ర ఉంది. 1960 నాటి నేపథ్యాన్ని గుర్తుచేసేలా బ్రూక్లిన్ సమీపంలో సెట్స్ వేశారు.బెర్లిన్‌లో ఏ బ్రిడ్జి మీద అయితే గూఢచారుల మార్పిడి జరిగిందో, అదే ప్రదేశంలో ఆ సన్నివేశాలు చిత్రీకరించారు. షూటింగ్ జరిగినన్నాళ్లూ బెర్లిన్, పాట్రోడామ్ మధ్య ఉన్న ఆ బ్రిడ్జి మీద ట్రాఫిక్ నిషేధించారు. జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మార్కెల్ షూటింగ్ స్పాట్‌కి వచ్చి, ఆ సన్నివేశాలు తిలకించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement