37 ఏళ్ల తర్వాత ఇండియాలో షూటింగ్
జగమెరిగిన దర్శకుడు... జగదేక దర్శకుడు... హాలీవుడ్ మాంత్రికుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్. ప్రపంచమంతా ఆయనకు అభిమానులున్నారు. మరో మూడేళ్లు పూర్తయితే స్పీల్‌బర్గ్ ఏడు పదుల వయసులోకి ఎంటరవుతారు. అయినప్పటికీ ఇరవైఏళ్ల క్రితం ‘జురాసిక్ పార్క్’ తీసినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నారో, ఇప్పుడూ అంతే ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఓ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, క్యాచ్ మీ ఇఫ్ యు కెన్, ది టెర్మినల్.. ఇలా స్పీల్‌బర్గ్ రూపొందించిన పలు చిత్రాల్లో కథానాయకునిగా నటించిన టామ్ హాంక్స్ ఈ తాజా చిత్రంలోనూ నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను భారతదేశంలో చిత్రీకరించాలనుకుంటున్నారట స్పీల్‌బర్గ్. 1977లో ‘క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’ అనే చిత్రం కోసం భారతదేశంలో స్పీల్‌బర్గ్ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇక్కడ షూటింగ్ చేయాలనుకోవడం విశేషం. గత ఏడాది ముంబయ్ వచ్చినప్పుడు ‘మళ్లీ ఇండియాలో షూటింగ్ చేయాలనుకుంటున్నాను’ అని స్పీల్‌బర్గ్ పేర్కొన్నారు.