స్వీపర్‌గా చేసిన స్కూల్లోనే ఇంగ్లిష్‌ టీచర్‌గా! | Kerala Iqbal School English Teacher Linja Success Story | Sakshi
Sakshi News home page

స్వీపర్‌గా చేసిన స్కూల్లోనే ఇంగ్లిష్‌ టీచర్‌గా!

Published Wed, Mar 18 2020 8:42 AM | Last Updated on Wed, Mar 18 2020 8:42 AM

Kerala Iqbal School English Teacher Linja Success Story - Sakshi

విద్యార్థినులతో ఇంగ్లిష్‌ టీచర్‌ లింజా

కన్హన్‌గడ్‌లోని ఇక్బాల్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఆరో తరగతి గదిలోకి వచ్చిన కొత్త ఇంగ్లిష్‌ టీచర్‌ను చూసి పిల్లలు ‘ఆ’ అని నోరు తెరిచారు.‘గుడ్మాణింగ్‌ స్టూడెంట్స్‌’ అని టీచర్‌ లింజా చెప్పినా, తిరిగి వారు
గుడ్మాణింగ్‌ చెప్పడం మర్చిపోయిట్లుగా ఆమెనే చూస్తుండిపోయారు.ఆమె పేరు లింజా అని, రోజూ స్కూల్‌ ఊడ్చి, శుభ్రం చేసే ఆయా అనిమాత్రమే వారికి తెలుసు. మరైతే ఇదేమిటి!!

ఇంగ్లిష్‌ టీచర్‌గా లింజాకు అది తొలి రోజు. స్కూలు ఆమెకు కొత్త కాదు కానీ, స్కూల్లోని క్లాసు కొత్తగా ఉంది. అయితే బడిని శుభ్రం చేసే ఒక ఆయమ్మ ఇంగ్లిష్‌ను ‘టీచ్‌’ చేయడం ఏంటి అనే సందేహాన్ని పిల్లల్లో చాలా త్వరగానే పోగొట్టారు లింజా. టీచరుగా చేరిన 2018 నుంచి ఈ రోజు వరకు ఆరు, ఏడు తరగతులకు తను తీసుకున్న ఒక్క క్లాసులో కూడా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ని మలయాళంలో చెప్పలేదు ఆమె. పిల్లల్ని కూడా ఇంగ్లిష్‌లో తప్ప వేరే భాషలో మాట్లాడనివ్వలేదు! ఇప్పుడా పిల్లలంతా మంచి ఇంగ్లిష్‌ గడగడ మాట్లాడేస్తున్నారు. లింజా 2013 నుంచి 2018 వరకు ఇక్బాల్‌ స్కూల్‌లో స్వీపర్‌గా ఉన్నారు. అంతక్రితం 2001 నుంచి 2006 వరకు కూడా స్వీపర్‌గానే ఉన్నారు. ఈ మధ్యలో (2006–2013 ) వచ్చిన విరామంలోనే తనకు తెలియకుండానే టీచర్‌ కావడానికి అవసరమైన అన్ని అర్హతలూ సంపాదించారు లింజా! ఆ అర్హతలకు కోసం ఆమె ఎంత శ్రమపడ్డారన్న విషయం కన్నా, అసలు ఆమెకు ఆ విరామం ఎలా వచ్చిందన్నదే ఎక్కువ ఆసక్తి కలిగించే సంగతి. అదేమిటో తెలుసుకోడానికి మనం పందొమ్మిదేళ్లు వెనక్కి వెళ్లాలి.

‘నేనేమిటి? స్వీపర్‌ ఏమిటి?’
అప్పట్లో లింజా తండ్రి రాజన్‌ ఇక్బాల్‌ స్కూల్‌లోనే సంస్కృతం టీచర్‌గా పని చేస్తున్నారు. లింజా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. అది 2001. రాజన్‌ హఠాత్తుగా మరణించారు. అందుకు పరిహారంగా తండ్రి స్థానంలో కూతురికి.. అప్పటికి ఆమెకున్న విద్యార్హతలను బట్టి.. ఖాళీగా ఉన్న పోస్టును ఇచ్చారు. ఖాళీగా ఉన్న ఆ పోస్టు.. ‘స్వీపర్‌’. అదైనా ఆ పని చేస్తున్నవారెవరో దీర్ఘకాలపు సెలవు మీద వెళ్లిపోవడంతో తాత్కాలికంగా ఖాళీ అయిన పోస్టు. లిజా తమ్ముడు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. వాడిని చదివించాలి. కుటుంబాన్నీ పోషించాలి. ఇంకేం ఆలోచించకుండా స్వీపర్‌గా చేరిపోయారు లింజా. అయితే ఆ సెలవు పెట్టిన వాళ్లు 2006 తిరిగొచ్చారు. దాంతో ఆమె పోస్టు పోయింది. పోస్ట్‌ అయితే పోయింది కానీ, అప్పటికే ఆమె స్కూల్లో పనిచేస్తూనే బి.ఎ. పూర్తి చేశారు. ఎం.ఎ. ఇంగ్లిష్‌ చేశారు. బి.ఇడి. కూడా పాస్‌ అయి, ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ చెబుతున్నారు.

ఆ సమయంలో  ఆమెకు స్కూల్‌ నుంచి పిలుపు! మళ్లీ అదే స్వీపర్‌ పోస్ట్‌. మొదటిసారి ‘నేనేమిటి? స్వీపింగ్‌ ఏమిటి?’ అనుకున్న లింజా.. రెండోసారి స్వీపర్‌గా మళ్లీ చేరుతున్నప్పుడు అలా అనుకోలేదు. పనిపై తనకున్న గౌరవం అది. మరి తన చదువుకు ఆమె ఇచ్చిన గౌరవం మాటేమిటి? ఉద్యోగం చేస్తూనే టీచర్స్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ రాసి, పాస్‌ అయ్యారు. ‘స్టేట్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌’ కూడా రాయమని ప్రధానోపాధ్యాయురాలు ప్రవీణ ప్రోత్సహించారు. అయితే అప్పటికే ఆమెకు ఆరేళ్ల కొడుకు, నెలల వయసున్న కూతురు. ఇద్దర్నీ చూసుకోవాలి. ‘‘టెస్ట్‌కు ప్రిపేర్‌ అవడం నా వల్ల కాదు మేడమ్‌’’ అన్నారు లింజా. ‘వాళ్లిద్దర్ని కూడా స్కూల్‌కి తెచ్చేయ్‌. నేను చూసుకుంటాను. నువ్వు ప్రిపేర్‌ అవు’’ అన్నారు ప్రవీణ! అంతకన్నా కావల్సిందేముంది. స్టేట్‌ టెస్ట్‌ కూడా పూర్తయింది. టీచర్‌గా అదే స్కూల్‌లో పోస్టింగ్‌ వచ్చింది. ‘‘చూస్తుండండి.. ఇదే స్కూల్‌కి లింజా ఏనాటికైనా హెడ్‌మిస్ట్రెస్‌ అవుతారు’’అని నవ్వుతూ అంటున్నారు ప్రవీణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement