ప్రతీకాత్మక చిత్రం
స్త్రీల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఇప్పటికీ మనకు ఆ దుశ్శాసనుడే గుర్తుకు వస్తాడు. టెక్నాలజీ పెరిగింది. స్త్రీలకు రక్షణా పెరిగింది. అయినప్పటికీ.. ఏదో ఒక మూల దుశ్శాసనులు డిజిటల్ వరల్డ్‌లోకి దూరి
మగువల వలువల్ని లాగి.. విలువల్ని నాశనం చేస్తున్నారు. డిజిశాసనులై పట్టి పీడిస్తున్నారు. ఆమె పేరు శోభా సజ్జు. కేరళలోని కొచ్చి. భర్త పేరు సజ్జు. ఉద్యోగస్తుడు. ఆయన ఆఫీస్‌లోని వాట్సాప్ గ్రూప్‌లో ఒక అమ్మాయి న్యూడ్ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది సజ్జు భార్య శోభ అంటూ అతడి కొలీగ్ లిట్లో ప్రచారం చేశాడు. ఒక యువతి కెమెరా వైపు తిరిగి దుస్తులు మార్చుకుంటున్న వీడియో అది.
శోభా సజ్జు
ఈ విషయం ఇంటి వరకు తెచ్చాడు సజ్జు. ఖంగు తింది శోభ. వీడియో చూసింది. మరింత షాక్. అసలు అందులో ఉన్నది తను కానేకాదు! ఎవరో ప్రచారం చేస్తే.. తన భర్త ఎలా నమ్మాడు? ఆమె వెళ్లి కమిషనర్‌కి కంప్లయింట్ ఇచ్చింది. కమిషనర్ సైబర్ సెల్‌కు కేసును రిఫర్ చేశారు. వీడియోను పరిశీలించిన పోలీసులు అందులో ఉన్నది తను కాదు అన్న శోభ మాటను ధృవపరిచారు. పైగా శోభలా మార్ఫింగ్ కూడా చేయలేదనీ నిర్ధారించారు. కాబట్టి తొలి విచారణకు ఆమె పోలీస్ స్టేషన్‌కు రావల్సిన అవసరమూ లేదని శోభతో చెప్పారు. కాని ఆమె భర్తను పిలిచారు. ఆ వీడియోలో ఉన్నది తన భార్య శోభే అని సజ్జు వాదించాడు. అప్పటికి శోభ తన తల్లిగారింట్లో ఉంది.
భర్త నుంచి విడాకుల నోటీస్
కంప్లయింట్ ఇచ్చిన నాలుగు రోజులకు శోభకు భర్త నుంచి విడాకుల పిటిషన్ కాపీ అందింది. తన భార్య స్వయంగా తనే తన న్యూడ్ వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసిందనే అభియోగం కింద! శోభకు ఇది ఇంకో షాక్. ఈలోపు పోలీసులు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. ఆ వీడియోలో ఉన్నది శోభ కాదని ఘంటాపథంగా రిపోర్ట్ ఇవ్వకపోయినా.. ఆమె కాదు అనే అర్థంలోనే అసంపూర్తి నివేదికను ఇచ్చారు. ఇంకోవైపు లిట్టో మీద ఐపీసీ సెక్షన్ కింద, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. దీని వల్ల శోభకు ఒనగూడిన లాభం ఏమీలేదు. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి స్పష్టమైన నివేదిక రాలేదు. అందుకే శోభ తన పోరాటం ఆపలేదు. వీడియోలో ఉన్నది తను కాదు అని పోలీసులు తేల్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా శోభే అని చెప్పలేదు. అందుకే తను కాదని అస్పష్టంగా చెప్పడం కాదు స్పష్టంగా చెప్తూ నివేదిక కావాలనే పట్టు వీడలేదు శోభ.పిల్లల్నీ దూరం చేశాడు!
శోభకు ముగ్గురు పిల్లలు. ఈ గొడవ మొదలైనప్పటి నుంచి పిల్లలు తండ్రి దగ్గరే ఉంటున్నారు. ప్రతి రెండో శనివారం పిల్లల్ని కలిసే విజిటింగ్ రైట్‌ను శోభకు ఇచ్చింది కోర్టు. నాలుగు శనివారాలు సాఫీగా గడిచాయి. అయిదో శనివారం వచ్చేసరికి.. పిల్లలతో ఆమె సరిగ్గా ప్రవర్తించట్లేదు కాబట్టి పిల్లలు ఆమెను కలవడానికి ఇష్టపడట్లేదంటూ భర్త రిపోర్ట్ చేశాడు. న్యూడ్ వీడియోస్ బ్యాక్‌గ్రౌండ్‌గా వేసుకున్న డైవోర్స్ పిటిషన్‌కు ఈ కంప్లయింట్ కూడా తోడై పిల్లలను కలిసే విజిటింగ్ రైట్‌ను తాత్కాలికంగా కోల్పోయిన శోభకు గుండె ఆగినంత పనైంది.
రెండోసారి కోర్టును ఆశ్రయించింది శోభ. న్యూడ్ వీడియో వ్యవహారం వెనక తన భర్త పాత్ర గురించి ఆరా తీయమని. ఆమె విజ్ఞప్తిని మన్నించింది కోర్టు. రీ ఇన్వెస్టిగేషన్‌లో ఆ వీడియోను మొదట పంపించిన ఫోరెన్సిక్ ల్యాబ్‌కి కాకుండా ఇతర ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కి పంపించమని కోరింది శోభ. కాని పోలీసులు మొదటి ల్యాబ్‌కే పంపించారు. నివేదిక కూడా మొదటిసారిలాగే అసంపూర్తిగా వచ్చింది. విసిగెత్తిపోయింది శోభ. అయినా తమాయించుకుని సైబర్ ఫోరెన్సిక్స్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ బాడీకి పంపించమని అడిగింది. ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా ‘‘అందులో ఉన్నది మీరు కాదుకదా.. వదిలేయండి’ అనే సమాధానమిచ్చారు పోలీసులు.
ఆఖరి ప్రయత్నంగా డీసీపీ లోక్‌నాథ్ బెహరాను కలిసింది. వీడియోను చూపించింది. వీడియో చూశాక.. ఆమెను చూశాడు లోక్‌నాథ్. ఇందులో ఉన్నది ససేమిరా నువ్వు కాదు అన్నాడు. ఇన్నాళ్లూ భరించావా? ‘‘ఎప్పుడో వచ్చేస్తే నీ పిల్లలు నీ దగ్గరుండే వాళ్లు కదమ్మా’’ అంటూ శోభ కేస్ ఇన్వెస్టిగేషన్‌ను ఎర్నాకులంలోని లాల్జీ. కే అనే ఏసీపీకి అప్పజెప్తూ ట్రాన్స్‌ఫర్ ఉత్తర్వులు జారీ చేశాడు. లాల్జీ ఆ వీడియోను, సంబంధిత నివేదికను తిరువనంతపురంలో ఉన్న ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్)కు పంపించాడు. ఆర్నెల్ల తర్వాత.. అంటే పదిరోజుల కిందట సీడాక్ పూర్తి నివేదికను ఇచ్చింది. ఆ వీడియోలో ఉన్నది శోభ కాదు అని స్పష్టం చేస్తూ! ఆమె చేపట్టిన ఒక యుద్ధం ముగిసింది. విజేతగా నిలిచింది. ఇప్పుడిక పిల్లల కస్టడీ కోసం యుద్ధం ప్రారంభించింది.
‘‘నా భర్త నాకు సపోర్ట్ ఇచ్చి ఉంటే.. ఆ వీడియో నాది కాదు అని తేలగానే దాన్ని వదిలేసేదాన్ని. ఇవ్వకుండా మూలం తెలుసుకునేలా చేశాడు. మంచిదే అయింది. నేనొక మామూలు కుటుంబం నుంచి వచ్చా. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నా పోరాటంలో వాళ్లంతా తోడుగా ఉన్నా.. ఒంటరిగానే అనిపించింది. నా పిల్లలను కలవాలి. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోతుంది’’ అంటోంది శోభ. ఈమె పోరాట పటిమ తక్కిన వారికి స్ఫూర్తి కావాలి. బాధపడడం మాని, నిజాన్ని నెట్ నుంచి బయటికి కక్కించాలి.
డబ్బులిస్తే వస్తారని ఫేక్ పోస్ట్
కోల్‌కతాలోని జయదేవ్‌పూర్‌లో ఓ కుటుంబం తన ఇంటి ముందు సీసీటీవీ బిగించుకుంది. ఇంటి తలుపులపై ఇంగ్లిష్, బెంగాలీ, హిందీ భాషల్లో ‘ఈ ఇల్లు అలాంటిది కాదు. దయచేసి మమ్మల్ని వేధించకండి’ అని రాసి ఉన్న బోర్డును వేలాడదీసుకుంది. దీనంతటికీ కారణం.. ‘‘ఆ ఇంట్లోని ఇద్దరు మహిళలు డబ్బులిస్తే వస్తారు అని వాళ్ల ఫొటోలు, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్‌లతో సహా ఆన్‌లైన్‌లో ఎవరో అప్‌లోడ్ చెయ్యడం! అప్పట్నుంచీ ఎవరెవరో ఫోన్‌లు చేసి ఆ ఇంట్లోని ఆడవాళ్లను మాటలతో చంపుతున్నారు. కొందరైతే నేరుగా ఇంటికే వచ్చి తలుపు తడుతున్నారు! అదెలా జరిగిందో ఆ ఇంటివారికి తెలియదు. ఆ ఇంటి యజమాని సైబర్ కేఫ్ నడుపుతుంటాడు. 27 ఏళ్ల భార్య, పెద్దవాళ్లయిన తల్లిదండ్రులు, 40 ఏళ్ల అక్క.. ఇదీ అతడి కుటుంబం.
‘‘అక్టోబర్ మొదటివారంలో నా పేరుతో, అడ్రస్‌తో ఎవరో ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు. మా ఇంట్లో వాళ్ల ఫోన్ నెంబర్లు, మెట్రో స్టేషన్‌కు మా ఇల్లు ఎంత దూరంలో ఉంటుందో వివరాలు ఇచ్చారు. తర్వాత నా తమ్ముడి ఫొటో (సైబర్‌కేఫ్ ఓనర్), మా నాన్న ఫొటో అప్‌లోడ్ చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి నాకు అసభ్యకరమైన వాట్సాప్‌కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి’’ అని ఆ నలభై ఏళ్ల మహిళ కోల్‌కతా సైబర్ పోలీస్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెకు పెళ్లయింది. అక్కడికి కాస్త దగ్గర్లోనే తన అత్తమామలతో కలిసి ఉంటోంది. తరచు పుట్టింటికి వచ్చి వెళుతుంటుంది. ఇలాంటి వేధింపులే ఆమె ఆడపడుచుకూ (సైబర్ కేఫ్ యజమాని భార్య) వస్తున్నాయి. పైశాచికత్వానికి పరాకాష్ట అయిన ఈ ఆన్‌లైన్ క్రూరత్వంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య ఫొటోలు పంచి పెట్టాడు!
అతను నేవీ కమాండర్. వయసు 39. భార్య ఒకప్పుడు ఆర్మీలో కెప్టెన్. కుటుంబం ఢిల్లీలో ఉంటోంది. అతడికి పుణె నుంచి ఢిల్లీకి పోస్టింగ్ పడడంతో అక్కడ ఉంటున్నారు. అయితే కొన్నాళ్ల క్రితమే ఆమె భర్తను వదిలేసి, ఇద్దరు పిల్లలతో పుణె వచ్చి వేరుగా ఉంటోంది. మంగళవారం పుణె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి భర్త మీద ఫిర్యాదు చేసింది. పోర్నోగ్రఫీ అంటే అతడికి పిచ్చి. పదకొండేళ్లుగా చెబుతోంది, ఆ పాడు అలవాటు మానుకొమ్మని. మానుకోలేదు. అత్తమామల చేత చెప్పించింది.
మారలేదు. అక్టోబర్‌లో పుణె ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ పెట్టింది. íపిటిషన్ ఇచ్చేందుకు కోర్టుకు వెళుతుంటే దారిలో ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఆమెను కలిశాడు. అతను కూడా నేవీ ఆఫీసరే. ఆమె భర్తకు స్నేహితుడు. తన భార్యతో కూడా ఆమె భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. ఆమె నిర్ఘాంతపోయింది. ఈ వివరాలన్నీ స్టేట్‌మెంట్‌లో రాసిచ్చింది. ఫిర్యాదు స్టేట్‌మెంట్‌లో ఇవన్నీ వెల్లడించింది కానీ, ఇవన్నీ వెల్లడించడానికి ఆమె ఫిర్యాదు ఇవ్వలేదు. అసలు కేసు వేరు.
భార్య ఫొటోలను, ఫ్రెండు భార్య ఫొటోలను, ఇంకో గుర్తు తెలియని మహిళ ఫొటోలను అశ్లీల చిత్రాలకు మార్ఫింగ్ చేసి తన జీ మెయిల్ అకౌంట్ నుంచి బట్వాడా చేస్తున్నాడట ఆమె భర్త. ఆ విషయం చెబుతూ ఈ వివరాలన్నీ ఇచ్చింది. పోలీసులు అతడిపై సెక్షన్ 509 (మహిళ గౌరవాన్ని కించపరిచి, అవమానాలపాలు చెయ్యడం), సెక్షన్ 67 (అశ్లీల సమాచారాన్ని, చిత్రాలను ముద్రించడం లేదా నెట్‌లో సరఫరా చెయ్యడం) కింద కేసు పెట్టారు. అతడిని అరెస్టు చేసి విచారించడం కోసం భారత నౌకాదళంలోని అధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment