అమ్మకు బెంగ వద్దు | Kids Safery Awareness on Coronavirus Mothers | Sakshi
Sakshi News home page

అమ్మకు బెంగ వద్దు

Published Thu, Jun 4 2020 9:00 AM | Last Updated on Thu, Jun 4 2020 9:00 AM

Kids Safery Awareness on Coronavirus Mothers - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టి.వి. చూస్తున్నాడు. ఓ.కే. ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్నాడు. ఓ.కే.ఇంట్లో అటూ ఇటూ చక్కర్లు కొడుతున్నాడు.ఓ.కే.కాని ఫ్రెండ్స్‌ని కలవట్లేదు. ఫ్రెండ్స్‌తో ఆడే వీలు లేదు.ఇంట్లో తమ్ముడో చెల్లెలో లేరు. ఒక్కడే పిల్లాడు.లాక్‌డౌన్‌లో నెలల తరబడి ఒంటరితనంవాణ్ణి ఏం చేస్తుందో.అమ్మకు ఈ బెంగ సహజం.కాని అమ్మా... బెంగ అక్కర్లేదు.

ఆమెకు థైరాయిడ్‌ ఉంది. భర్తకు డయాబెటిస్‌ ఉంది. ఉన్న ఒక్క కొడుకును బాగా పెంచితే సరిపోతుంది అని రెండో కాన్పుకు వెళ్లలేదు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో ఉన్నారు. అక్కడే పరిచయం. పెళ్లి చేసుకున్నారు. ప్రెగ్నెంట్‌ అయ్యాక చేస్తున్న ఉద్యోగం మానేసి మూడేళ్లు ఇంట్లో ఉండిపోయింది. ‘అలా ఎందుకు... ఆప్షన్స్‌ చూద్దాం’ అని భర్త చెప్పినా వినలేదు. పిల్లాడికి నాలుగో సంవత్సరం వచ్చినప్పటి నుంచి ప్రీ స్కూల్‌కు పంపించి ఉద్యోగానికి వెళ్లడం మొదలెట్టింది. ప్రీ స్కూల్‌ వాళ్లు క్రెష్‌ కూడా నడుపుతారు. సాయంత్రం తను వచ్చేదాకా బాబు బాగోగులు చూసుకుంటారు. బాబు అక్కడ ఎలా ఉంటాడో అని ముందు బెంగపడింది.  కాని అక్కడ తను వదిలినట్టే మరికొంత మంది కూడా పిల్లలను వదిలివెళ్లడం వల్ల వాళ్లతో ఆడుకోవడం వాడికి అలవాటైంది. ఇప్పుడు పదేళ్లు వచ్చాయి. స్కూల్‌ బస్‌ నుంచి ఒక్కడే దిగి ఫ్లాట్స్‌ లోపలికి వస్తాడు. డూప్లికేట్‌ కీ ఉంటుంది. తీసుకుని లోపలికి వెళతాడు. ఫ్రెష్‌ అయ్యి, స్నాక్స్‌ తిని తను వచ్చేవరకు టీవీ చూస్తూ కూచుంటాడు. వచ్చాక, అప్పటికి పిల్లలందరూ గ్రౌండ్‌ ఫ్లోర్‌కు వచ్చేసి ఉంటారు కనుక ఆడుకోవడానికి వెళ్లిపోతాడు. చాలా హుషారు వాడు. అందరూ వాడు వస్తేనే ఆట మొదలెడతారు. ఎప్పుడైనా పైకి రావడం లేట్‌ అయితే పైన కారిడార్‌లో నిలబడి కిందకు వినపడేలా కేక వేసి పిలుస్తుంది. కాని పిల్లలంతా ‘ప్లీజ్‌ ఆంటీ... వస్తాళ్లే ఆంటీ’ అని బతిమిలాడుతారు. అంత ఇష్టం వాడంటే. అది చూసి ఆమెకు చాలా సంతోషంగా ఉండేది. తోడు ఇంకొకరిని కనకపోయినా ఫ్రెండ్స్‌ ఉన్నారు... ఏం పర్లేదు అనుకునేది. మొన్నటి వరకూ అలానే అనుకుంది. కరోనా దేశంలోకి వచ్చేవరకు.

బయట ఆడుకునే పిల్లలను కట్టడి చేయాలంటే పెద్దవాళ్లు తలుపుకు తాళం వేస్తారు. కాని పని చేసుకునే పెద్దవాళ్లను కట్టడి చేయడానికి ప్రభుత్వం తాళం వేసుకోమని చెప్పింది. లాక్‌డౌన్‌. భయంతో కూడిన లాక్‌డౌన్‌. సందేహంతో కూడిన లాక్‌డౌన్‌. పక్కఫ్లాట్‌ వారిని కూడా పలకరించడానికి, ఇంట్లోకి పిలిచి టీ ఇవ్వడానికి సందేహించే లాక్‌డౌన్‌. పిల్లలందరినీ పెద్దలు దాచేసిన లాక్‌డౌన్‌. ఇద్దరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చారు. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. వాడు కూడా. కంప్యూటర్, టీవీ, ఫోన్‌... ఈ మూడు వాడిని ఎంగేజ్‌ చేస్తాయని అనుకున్నారు. చేశాయి. కాని కొంతసేపే చేశాయి. అమ్మా నాన్నలు ఇంట్లో ఉంటే పిల్లలు వాళ్లను కదిలించకుండా ఎలా ఉంటారు? మధ్య మధ్య వచ్చి పలకరించేవాడు. ఏవో అడిగేవాడు. ఇంకేదో ఆడదామని రమ్మనేవాడు. ఇద్దరికీ పని ఉంటుంది. టెన్షన్‌ ఉంటుంది. ఈ క్రిమి ఇంటి దాకా వస్తే ఎలా అనే ఆందోళన అసలుకే పని చేస్తోంది. ఆ టెన్షన్‌ ఒకటి... పని టెన్షన్‌ ఒకటి... పిల్లవాడి టెన్షన్‌ ఒకటి.... ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లవాడు. తోటి పిల్లలను కలిసి రెండు నెలలు. ఆడుకొని రెండు నెలలు. తాము పనిలో మునిగి ఉంటే వాడు ఇంట్లో ఎక్కడో ఒక చోట ఒక్కడే ఏదో ఒకటి ఆడుకుంటూ. మెల్ల మెల్లగా వాడిలో మౌనంగా ఉండే సమయం పెరిగింది. తుళ్లిపడటం తగ్గింది. ఒక్కోసారి డల్‌గా పడిపోతున్నాడు. ఆమెకు టెన్షన్‌ మొదలైంది. రెండో సంతానం కనకపోవడం గురించి మొదటిసారి తనను తాను తిట్టుకుంది. ఏం చేయాలి?

‘డాక్టర్‌. ఫ్యూచర్‌లో స్కూళ్లు కూడా ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ద్వారా నడిచేలా ఉన్నాయి. వాడు స్కూల్లో ఫ్రెండ్స్‌ని కలవక, ఇంటి దగ్గరా ఫ్రెండ్స్‌ని కలవక ఏమవ్వాలి? నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ప్లీజ్‌ అడ్వయిజ్‌ మీ’ అందామె సైౖకియాట్రిస్ట్‌కు కాల్‌ చేసి. ‘మీవాడు ఏమైనా డిప్రెస్డ్‌గా కనిపిస్తున్నాడా? కంప్లయింట్‌ చేస్తున్నాడా?’
‘లేదు’
‘లాక్‌డౌన్‌ రోజుల్లో ఏం చేశాడు?’
‘పెయింటింగ్‌ చేశాడు. అంతకు ముందు చేసేవాడు కాదు. కొన్ని బుక్స్‌ కూడా చదివాడు’
‘ఇది మంచి విషయమే కదా. ఉట్టినే గేమ్స్‌ ఆడుకుంటూ ఉండటం కన్నా’
‘మంచిదే’
‘మీవాణ్ణి మీరుగాని, మీ వారుగాని గట్టిగా తిడితే ఏం చేస్తాడు?’
‘కాసేపు అలిగి పక్క రూమ్‌లోకి వెళ్లిపోతాడు’
‘తర్వాత?
‘మేం బుజ్జగిస్తే మర్చిపోయి నార్మల్‌ అయిపోతాడు’

‘ఇక్కడ కూడా అంతే. పిల్లలు పరిస్థితులను చాలా బాగా అర్థం చేసుకుంటారు. బయట ఏం జరుగుతున్నదో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో వారికి తెలుస్తుంది. ఆ సమయంలో వారు ఊరికే ఉండిపోతారు. కాని ఆ పరిస్థితి వెళ్లాక మళ్లీ నార్మల్‌ అయిపోతారు. పాతది మర్చిపోతారు. మీ అబ్బాయికే కాదు. ప్రపంచంలో ఉన్న పిల్లలందరికీ ఈ పరిస్థితి కొత్త. దీనిని ఎలా డీల్‌ చేయాలో రోజులు గడిచే కొద్దీ వాళ్లు నేర్చుకుంటారు. మనం చేయవలసిందల్లా వాళ్లకు మనం ఉన్నామన్న కాన్ఫిడెన్స్‌ను ఇవ్వడమే. వాళ్లతో రెగ్యులర్‌గా ఇంటరాక్ట్‌ అవుతూ ఉండటమే. ఒక్కళ్లే ఉన్న పిల్లలు సిబ్లింగ్స్‌ ఉన్న పిల్లల కంటే ఒక రకంగా ఒంటరితనం ఫీలవుతారు. కాని వారు ఇండిపెండెంట్‌గా ఉండటం కూడా నేర్చుకుంటారు. మీవాడు తన స్నేహాలను ఎలా పునరుద్ధరించుకోవాలో ఆలోచించుకుంటాడు. ఇన్‌ఫాక్ట్‌... అందరు పిల్లలూ ఒక రకమైన అండర్‌స్టాండింగ్‌కు వచ్చి తమ రిలాక్సేషన్‌ను, ఎమోషనల్‌ బర్డన్‌ షిఫ్టింగ్‌ను ఎలా చేసుకోవాలో తెలుసుకుంటారు. కొత్త ఆటలు వస్తాయి. గ్రూప్‌గా ఆన్‌లైన్‌లో ఆడటం మొదలెడతారు. కాలం ఇంకా అర్థం కావాల్సి ఉంది. తలుపులే కదా మూసుకున్నాం. కిటికీలు బాల్కనీలు కూడా స్నేహం నిలబెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. మీవాడికి కొంచెం టైమ్‌ ఇవ్వండి. కొత్తకొత్త స్నేహవిధానాలను ఎంకరేజ్‌ చేయండి. అంతా సర్దుకుంటుంది’ అని వివరించాడు సైకియాట్రిస్ట్‌.

కరోనా నుంచి పిల్లలను సంరక్షించాలి. అయితే వారి స్నేహవికాసాన్ని కూడా కాపాడాలి.పిల్లలను గమనించుకుంటూ వారి భావాలను వింటూ పోతే వారికి తోడు నిలిస్తే వారు ఈ కష్టకాలాన్ని దాటేస్తారని ఆమెకు ధైర్యం కలిగింది. బెంగ పోయింది. సాక్షి ఫ్యామిలీ ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement