
పాకిస్తాన్ సెనేట్‌కు ఎన్నికైన హిందూ దళిత మహిళ కృష్ణకుమారి
థార్ అనేది ఒక ఎడారి ప్రాంతమన్న సంగతి అందరికీ తెలిసిందే. మన దేశంలోనే కాదు... థార్‌లోని కొంత భాగం పొరుగున్న పాకిస్తాన్‌లోనూ విస్తరించి ఉంది. అది భౌగోళికంగా, వాతావరణపరంగానే కాదు... అమ్మాయిల చదువులు, మహిళల హక్కుల వంటి సామాజిక అంశాల్లోనూ అక్షరాలా ఎడారే. ఎడారిలోని ఆ ప్రాంతంలో తల్లడిల్లుతున్న అనేక మందికి ఒయాసిస్‌గా మారారు ఓ మహిళ. అవకాశాలన్నీ పుష్కలంగా ఉన్న మాములు మహిళ కూడా కాదామె.
ఆమె అన్ని విషయాల్లోనూ వివక్షను ఎదుర్కొనే దళిత మహిళ. కానీ... పెళ్లి తర్వాత కూడా పట్టుదలతో చదివి పోస్ట్‌గ్రాడ్యుయేట్ అయ్యారు. అన్న పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని అనేక మందిని వెట్టిచాకిరి నుంచి విముక్తులను చేశారు. బాల్యవివాహాలు, పరువు హత్యలు, పనిచేసేచోట వేధింపులకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించారు.ఇలాంటి సామాజిక జాడ్యాలు కొనసాగే ఎడారిలాంటి చోట అనేక మంది అభాగినులకు అండగా మారే ఆ ఒయాసిస్ పేరే కృష్ణకుమారి. ఇదీ ఆ ఒయాసిస్ కథ... చదవండి.
ఇండియా, పాకిస్తాన్... క్రికెట్ నుంచి పాలిటిక్స్ వయా కశ్మీర్! సమస్య ఏదైనా అది ఆసక్తికరమే! అన్నీ దేశభక్తిని చాటుకోవడానికి ఉపయోగపడే అంశాలే! ఆ గాలి ఇటు వీచకుండా చేసే ఉక్కపోతలో కాస్త గాలాడేలా చేసే కొన్ని అరుదైన పవనాల నుంచి అప్పుడప్పడూ కాస్త చల్లని గాలులూ వీస్తాయి! అలాంటి చల్లటి వార్తే ఇది కూడా.
ఇంతకూ ఆ న్యూస్ ఏమిటంటే... కృష్ణకుమారి కొహ్లీ అనే దళిత మహిళ పాకిస్తాన్ ఎగువ సభ (సెనెట్)కు ఎన్నిక కావడం. ఆమె వివరాలు తెలుసుకునేలా కుతూహలాన్ని రేకెత్తించే అంశమది. ఇస్లామిక్ రాజ్యమైన పాకిస్తాన్‌లో సెనేట్‌కు ఎన్నికైన తొలి దళిత హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు కృష్ణకుమారి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున సింద్ ప్రావిన్స్ నుంచి ఎగువ సభకు ఎన్నికయ్యారు ఆమె.
పూర్వాపరాలు...
పాకిస్తాన్ సిం«ద్ ప్రావిన్స్‌లోని నాగర్‌పార్కర్‌లో పుట్టారు కృష్ణకుమారి. పేద కుటుంబం. తండ్రి జుగ్నో కొహ్లీ సహా ఆ పరివారమంతా ఉమేర్‌కోట్ జిల్లాలోని కున్రీ ఊళ్లోని భూస్వామి దగ్గర వెట్టి చేసేవారు. ఎనిమిదేళ్లు వచ్చేవరకు చిన్నారి కృష్ణకుమారి కూడా వెట్టి చేసింది. అంతేకాదు దాదాపు తన తల్లి, తండ్రి, అన్నతోపాటు తనూ మూడేళ్లు ఆ భూస్వామి నిర్భంధంలో మగ్గింది. తిండిలేని రాత్రుళ్లు గడిపింది. నీళ్లతో కడుపు నింపుకుంది. పిల్లల అవస్థ చూసి తమలాగే వాళ్ల బతుకులూ వెట్టితోనే వెలిసిపోతాయేమోనని ఆవేదన చెందేవాడు కృష్ణకుమారి తండ్రి.
పిల్లలను చదివించాలని ఆశపడేవాడు. మొత్తానికి కృష్ణకుమారికి ఊహ వచ్చేటప్పటికీ ఆ చెర నుంచి బయటపడింది ఆ కుటుంబం. పిల్లలు చదువుకోవడానికి ఆ ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. కిరసనాయిల్ దీపపు వెలుతురులోనే కృష్ణకుమారి, ఆమె అన్న వీర్‌జీ కొహ్లీ చదువుకునేవారు. అయితే ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగానే మంచి సంబంధం రావడంతో ఆమెకు పెళ్లి చేశాడు జుగ్నో.
చదివించాలని అంత ఆశపడిన ఆ తండ్రి పట్టుమని పదహారేళ్లు కూడా నిండని బిడ్డకు పెళ్లి చేయడానికి కారణం... నాగర్‌పార్కర్‌లో ఆడవాళ్లకు పెద్ద చదువులు చదివే హక్కు లేదు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో చదువు, సాధికారత స్త్రీ చేరుకోలేని గమ్యాలే. అయితే ఆమె భర్త లాల్‌చంద్... చదువుపట్ల కృష్ణకుమారికి ఉన్న ఆసక్తిని చూసి పెళ్లయిన తర్వాత కూడా ఆమె చదువుకోవడానికి అనుమతించాడు. దాంతో డ్రాపవుట్‌గా మిగిలిపోవాల్సిన ఆమె సోషియాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌గా నిలబడ్డారు.
రాజకీయాలు..
కృష్ణకుమారి అన్న వీర్‌జీ మొదటి నుంచీ చురుకైన వ్యక్తి. అన్యాయం మీద గొంతెత్తేవాడు. సిం«ద్ ప్రాంతంలోని అణగారిన ప్రజల హక్కుల కోసం పిడికిలి బిగించాడు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్‌గా పేరుపొందాడు. కృష్ణకుమారి రాజకీయాల్లోకి రావడానికి తన అన్న వీర్‌జీయే ప్రేరణ. ఆయన ధైర్యమే ఆమెకు స్ఫూర్తి. దాంతో కాలేజ్‌లో ఉన్నప్పటి నుంచే అన్నతోపాటు మానవహక్కుల ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడారు. బాల్యవివాహాలు, పరువు హత్యలు, పనిచేసే చోట వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తారు.
మహిళల హక్కుల కోసం ఉద్యమించారు. ఉద్యమిస్తూనే ఉన్నారు.ఆ పోరాట పటిమే ఆమెను ఈ రోజు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున (థార్ నుంచి) ఎగువ సభలో నిలబెట్టింది. ‘‘నేను ఒక్క థార్ మహిళల ప్రథినిధిని మాత్రమే కాదు దేశంలోని మొత్తం మహిళల ప్రతినిధిని. నాగర్‌పార్కర్, థార్‌లలో స్త్రీలకు నేటికీ టాయ్‌లెట్ వంటి కనీస సౌకర్యాలు లేవు. బాల్యవివాహాలతో బాలికలు చదువుకు దూరమవుతున్నారు. ముక్కుపచ్చలారని వయసుకే తల్లులవుతున్నారు. అనారోగ్యంతో యవ్వనంలోనే వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి ఇంకెన్నో మహిళా సమస్యలెన్నిటినో సభలో ప్రభుత్వం దృష్టికి తెస్తాను.
పరిష్కారం కోసం పోరాడుతాను. మహిళలు, బాలికల ఆరోగ్యం, చదువు ఈ విషయాల్లో దృష్టిపెట్టదల్చాను. వీటిల్లో కొంత మార్పు తేగలిగినా నా అభ్యర్థిత్వానికి న్యాయం చేసినట్టే. ఎన్ని ఆటంకాలెదురైనా ఆగను’’ అన్నారు కృష్ణకుమారి కొహ్లీ. మహిళల మీద దాడులు, బాల్యవివాహాలు, పరువు హత్యలు జరిగినప్పుడు నిరసనలు, ధర్నాలు, ర్యాలీల్లో ఆమె ముందుంటారు. వెట్టినుంచి విముక్తి పోరాటంలోనూ కృష్ణకుమారిది మొదటినుంచీ మొదటి అడుగే. ఆ పోరాట సమయాల్లో కృష్ణకుమారి అత్తింటి బంధువులు, పుట్టింటి బంధువులు అంతా ఆమెను దూషించేవారట.
‘ఒక స్త్రీ అయ్యుండి, తల మీద పమిట లేకుండా మగవాళ్లతో సమానంగా ఎలా వెళ్తుందో చూడండి. అసలు ఆమె ఆడమనిషేనా? కులంలోని ఆడవాళ్ల మర్యాదంతా మంటగలుపుతోంది’ అని తిట్టేవారట. కృష్ణకుమారి భర్త దగ్గరకు వచ్చి ‘నీ భార్యను అదుపులో పెట్టుకో’ అని మగవాళ్లు హెచ్చరించేవారట. ఇలాంటివి కనీసం రెండు రోజులకు ఒక్కసారైనా ఉండేవట. ‘అన్నీ విని నేను, లాల్‌చంద్ ఇద్దరం నవ్వుకునేవాళ్లం’’ అని చెప్తారు 39 ఏళ్ల కృష్ణకుమారి. అందునా స్వేచ్ఛాస్వాంత్రాలకు అంతగా ఆస్కారమూ, అవకాశమూ లేని ఆ దేశంలో సాగిస్తున్న కృష్ణకుమారి పోరాటం... ఎందరికో స్ఫూర్తిదాయకం.
స్వాతంత్య్ర సమరం నుంచే..
కృష్ణకుమారి కుటుంబానికి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న నేపథ్యం ఉంది. ఆమె పూర్వీకుల్లో ఒకరైన రూప్లో కొహ్లీ 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటులో పాలుపంచుకున్నారు. సిం«ద్‌లోని నాగర్‌పార్కర్‌లోని తిరుగుబాటును అణచడానికి బ్రిటిషర్స్ దాడి చేసినప్పుడు రూప్లో బ్రిటిష్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడారు. ఆ సాహసమే ఈ అన్నచెల్లెళ్లకు వచ్చినట్టుంది అంటారు కృష్ణకుమారి సన్నిహితులు.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment