krishna kumari
-
అందుకే సావిత్రి చనిపోయిన చూడటానికి వెళ్ళలేదు..!
-
సావిత్రి ఆ పని చేసినందుకు మానసికంగా కృంగిపోయింది
-
పెళ్లి చేసుకొని హింసించడమే తెలుసు అంటున్న కృష్ణ కుమారి
-
11 మంది పిల్లలు ఉన్నవాడికి మా చెల్లెల్ని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాం..
-
అందుకే సావిత్రిపై కృష్ణకుమారికి కోపం..చనిపోయినా వెళ్లలేదు!
తెలుగు చిత్ర పరిశ్రమలో ముగ్ధ మనోహర రూపంతో, ప్రేక్షకులను కట్టిపడేసిన అలనాటి అందాల తార, హీరోయిన్ కృష్ణకుమారి. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా నటించి మెప్పించింది. ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్,ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీగణేషన్ వంటి స్టార్ హీరోలతో ఆమె జతకట్టింది. 16ఏళ్ల వయసప్పుడే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృష్ణకుమారి నటించిన తొలి చిత్రం నవరత్నాలు. ఆ సినిమా విడుదల కాకముందే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమా మొదలుకొని “బంగారు పాప” వరకూ వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో కృష్ణకుమారిని “ఫ్లాపుల హీరోయిన్” అంటూ కొందరు ప్రచారం చేశారు. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృష్ణకుమారి.. కావాలనే వేరే హీరోయిన్స్ కోసం అబద్దాలు ఆడి కొందరు ప్రొడ్యూసర్స్ తనను సినిమాల్లో తప్పించారని పేర్కొంది. ఇక అప్పట్లోనే ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'లక్షాధికారి' అనే సినిమాలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అలనాటి తార సావిత్రి గురించి చెబుతూ ఆమె ఏమన్నారంటే.. 'సావిత్రి జీవితం చివరిరోజుల్లో అలా అయ్యేసరికి చాలా కోపం వచ్చింది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఆవిడ. ఆమె ఇంటిలిజెన్స్ ఏమైంది? పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు ఉన్నాయని అలా దిగజారిపోకూడదు కదా? అందుకే ఆమె చనిపోతే చూడటానికి కూడా వెళ్లలేదు' అంటూ గతంలో ఆమె మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా అనారోగ్యంతో ఆమె 2018, జనవరి 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
ఆ హీరోయిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న సీనియర్ ఎన్టీఆర్
సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకే వన్నె వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన భగవంతుడిగా వేషం కట్టినప్పుడయితే.. నిజంగానే ఆ దేవుడే ఈయన రూపంలో ఉన్నాడేమో అనేంతగా తేజస్సుతో ఉట్టిపడేవారు. ఎంతోమంది ఆయన్ను దైవంగా కొలిచేవారు కూడా! ఇక సీనియర్ ఎన్టీఆర్ నిజ జీవిత విషయానికి వస్తే ఆయన మొదటి భార్య పేరు బసవతారకం. వీరికి 12 మంది సంతానం. సినిమా షూటింగ్స్ సమయంలో ఎన్టీఆర్ హీరోయిన్ కృష్ణ కుమారితో లవ్‌లో పడ్డారు. ఆమెను పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. ఆనాటి వారి ప్రేమ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది కృష్ణ కుమారి సోదరి, నటి షావుకారు జానకి. 'ఎన్టీఆర్- కృష్ణ కుమారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటూ ఓ టాక్ నడిచింది. కానీ అప్పటికే ఆయనకు 11 మంది పిల్లలు. నిజంగా వీరి పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలికి అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో! అయితే వీళ్లు విడిపోయారో, గొడవపడ్డారో తెలీదు కానీ, కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో కృష్ణ కుమారి ఒక్క ఫోన్ కాల్‌తో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుంది. తర్వాత ఆమె ఓ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ కైఠాన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ అప్పుడు ఓ బడా నిర్మాత ఫోన్ చేసి కైఠాన్‌తో మీ చెల్లి పెళ్లి ఆపండన్నారు. కానీ నేను ఆ పని చేయనని చెప్పాను' అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది షావుకారు జానకి. చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్ -
ఆ పిల్లల కోసం ఆమె
కరోనా సమయంలో పెద్దలకే చాలా కష్టంగా ఉంది. పిల్లలకు ఇది ఇంకా అర్థం కావాల్సి ఉంది. మరి స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లల పరిస్థితి? వారి బాగోగులు ఎలా? ఈ వొత్తిడి సమయంలో వారిని ఎలా చూసుకోవాలి? డా.టి.కృష్ణకుమారి అందుకు సహాయం చేస్తున్నారు. వారికి కనీస విషయాల మీద అవగాహన కల్పిస్తున్నారు తన చేతన సంస్థ ద్వారా. సుమారు ముప్పై సంవత్సరాలుగా చేతన సంస్థను నడుపుతున్న కృష్ణకుమారి వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యులు. ఆమెకు పుట్టిన ఆడపిల్ల స్పెషల్లీ చాలెంజ్డ్. ఆ విషయాన్ని కొద్దిగా ఆలస్యంగా గుర్తించారు ఆమె. అటువంటి పిల్లలను ముందరలోనే గమనిస్తే కొంతవరకు వారిని విద్యావంతులను చేయవచ్చు, అందుకే తాను అటువంటి పిల్లల కోసం ఈ సంస్థను స్థాపించినట్లు చెబుతున్నారు డా. కృష్ణకుమారి. ‘‘లాక్డౌన్ సమయంలో మా స్కూల్‌కు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. అయినప్పటికీ నెలకోసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టి, ప్రతి విద్యార్థికి సంబంధించి వారి తల్లిదండ్రులకు ఒక్కో గంట కేటాయించి వారితో మాట్లాడుతున్నాను. మా సంస్థలో వంద మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్లు ఎలా ఉన్నారో ప్రతి రోజూ వీడియో ద్వారా గమనిస్తాను. ఆ పిల్లలను క్రమశిక్షణలో ఉంచటానికి నేను స్కూల్లో ఏయే సూత్రాలు అనుసరిస్తానో అవన్నీ తల్లిదండ్రులకు వివరిస్తాను. పిల్లలకు హోమ్‌వర్క్ ఇస్తాను. వారు పూర్తి చేసిన పని తాలూకు వీడియో పోస్టు చేయగానే, వారికి రిపోర్ట్ కార్డు ఇస్తాను. పిల్లల్లో ఎంత పరిణతి కలిగిందో తల్లిండ్రులు తెలుసుకుంటారు. ఉదాహరణకి బ్రష్ పట్టుకుని పళ్లు తోముకోవటం రాని పిల్లవాడికి బ్రష్ పట్టుకోవటం ఒక గోల్. ఆ తరవాత అది నోట్లో పెట్టుకోవటం మరో గోల్. ఆ తరవాత వాటిని వాటి స్థానాల్లో ఉంచటం పెద్ద గోల్. ఇలా ప్రతి పనీ వారికి వారు చేసుకునేలా నేర్పిస్తాం’ అన్నారామె. ‘‘ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడకూడదని పేరెంట్స్‌కి చెబుతాను. మన పిల్లల్ని మనమే బాగు చేసుకోవాలి అనుకోవాలి. పిల్లలు ఏదైనా అడిగితే మొండిగా, ‘నేను చెయ్యను, నువ్వే చేసుకోవాలి’ అనాలి. నేను తల్లిని కాదు కనుక చేయను అనగలను. కాని తల్లి అలా అనలేదు. అలా అనకపోతే పిల్లలకు పని రాదు. కొన్ని విషయాలలో మొండితనం చాలా అవసరం. ఇటువంటి పిల్లలు తమ పనులను సింపుల్‌గా, షార్ట్‌కట్‌తో చేయలేరు. ప్రతి చిన్నపనీ వారికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే వారికి ఒక పనిని చిన్న చిన్న పనులుగా విడగొట్టి ఒక్కొక్కటిగా నేర్పిస్తాను. ఈ లాక్డౌన్ సమయంలో కొందరు పిల్లలకు వంట చేయటం గోల్‌గా ఇచ్చాను. వాళ్లు తయారు చేస్తున్న వంటను వీడియోగా తీసి మా వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. వారికి ప్రశంసలు ఇస్తుంటాను. ఇది వారి ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతోంది’’ అన్నారు కృష్ణకుమారి. –డా. వైజయంతి పురాణపండ -
మై మదర్ టి.కృష్ణకుమారి
చక్కటి ఒడ్డూ పొడుగు, పెద్ద పెద్ద కళ్లు, పొందికైన శరీరంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా మెరిశారామె. జానపదాలలో ఎక్కువ నటించారు. వాటిలో కత్తుల కాంతారావుతో కలసికట్టుగా చేసినవే అధికం. ఒక కంట కన్నీటిని, మరోకంట పన్నీటిని కూడా అలవోకగా అభినయించిన ఆ అభినేత్రి కృష్ణకుమారి. కెరీర్లో బాగా బిజీగా ఉన్న కృష్ణకుమారి, ఒక అనాథ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెను సినిమాలకు దూరంగా అల్లారు ముద్దుగా పెంచారు. ‘తనను కన్న తల్లి కంటె గారంగా పెంచారు’ అని తల్లి గురించి సాక్షికి వివరించారు దీపిక. ఆమె తెలిపిన వివరాలే ఈ వారం మన సినీ పరివారం. అమ్మీకి దత్తుకుమార్తె అని ఇప్పుడు అంటున్నారు కానీ నాకసలు 19 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఆమె నన్ను దత్తు తీసుకుందనే విషయమే తెలియదు. విషయం తెలిశాక నాకు అమ్మ మీద గౌరవం పెరిగింది. మా పెద్దమ్మ షావుకారు జానకి. ఆవిడ తన పిల్లలతో సమానంగా చూస్తుంది నన్ను కూడా. ఇంకా చెప్పాలంటే, నాతో మరింత ఎక్కువ ప్రేమగా ఉంటుంది. అమ్మ కెరీర్ సుదీర్ఘ కాలం నడిచింది. అందువల్ల వివాహం కూడా ఆలస్యంగా అయ్యింది. 1978లో నేను మూడు నెలల పసిపిల్లగా ఉన్నప్పుడు, వన్శంకరిలో ఉన్న అనాథాశ్రమం నుంచి నన్ను దత్తత తీసుకుంది అమ్మ. నేను అమ్మను అమ్మీ అని పిలిచేదాన్ని. నేను మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాను. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ వాళ్లతో పచ్చీస్, చింతగింజలు, క్యారమ్ బోర్డులాంటివి ఆడేదాన్ని. అమరచిత్ర కథలు, పిల్లల మహాభారతం చదివించేది. నా హిందీ టెక్ట్స్ చదివి, అమ్మీ హిందీ నేర్చుకుంది. అమ్మీకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అమ్మతో గడిపిన రోజులు నేను మరచిపోలేను అమ్మీ షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాక ఆ రోజు జరిగిన షూటింగ్ వివరాలతోపాటు, నటీనటులంతా ఒకే కుటుంబంలా ఎంత సరదాగా ఉండేవారో చెప్పేది. చిన్నతనంలో అమ్మీ నాకు అన్నం తినిపిస్తూ, తను నటించిన సినిమాలు చూపించేది. నాకు మైథాలజీ, మాయలు మంత్రాల చిత్రాలంటే చాలా ఇష్టం. నేను ఒక సెలబ్రిటీలాగే ఎదిగాను. ఇంట్లో మాత్రం మామూలుగానే ఉండేవాళ్లం. కుటుంబం కోసం అమ్మీ చదువు ఆపేయవలసి వచ్చింది. అందుకు అమ్మీ అప్పుడప్పుడు బాధపడుతుండేది. నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్లని ఇంటికి తీసుకువస్తే అమ్మీనే స్వయంగా వండి పెట్టేది. అమ్మీ వంటలు చాలా బాగా చేసేది. ఇడ్లీలు చేయడంలో ఎక్స్పర్ట్. వంట అమ్మీనే స్వయంగా చేసేది. నాన్నకి అమ్మీ అంటే చాలా ఇష్టం. అమ్మ సినిమాలు కాదు, అమ్మీ చేతి వంట అంటే ప్రీతి. అమ్మ ప్రతి వంటకం తయారీ గురించీ ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంది. ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఉంది. మాది పెద్ద ఫామ్ హౌస్. అన్ని కూరలు అమ్మీ స్వయంగా పండించేది. ఒక్క కూర కూడా బయట నుంచి కొనలేదు మేం. మా అబ్బాయంటే ప్రాణం నా పెళ్లి అమ్మ వాళ్లే చేయాలనుకుని, చాలా సంబంధాలే తెచ్చారు, నేను రిజెక్ట్ చేశాను. చాలామంది నిర్మాతలు కూడా నన్ను కోడలు చేసుకోవాలని అమ్మని అడిగారట. అందరూ మా డబ్బుకోసం చూసినవారు కావడంతో అమ్మ నిరాకరించింది. నా స్నేహితులే విక్రమ్ అనే అబ్బాయిని ఎంపిక చేసి, 2003లో నా వివాహం జరిపించారు. మా వివాహాన్ని అమ్మ వాళ్లు మొదట్లో అంగీకరించలేకపోయారు. కొంత కాలం తరవాత అంగీకరించారు. 2006లో నాకు బాబు పుట్టాడు. పవన్ మయ్యా అని పేరు పెట్టుకున్నాం. వాడు పుట్టినప్పుడు ‘ఆపిల్ ఆఫ్ ద ఐ’ డిజైన్‌లో మాకు ఇల్లు కట్టించారు అమ్మీవాళ్లు. మా అబ్బాయిని చాలా ప్రేమగా చూసేది. అమ్మీ చాలా లవింగ్ అండ్ ఓపెన్ హార్టెడ్ పర్సన్. ఇంటికి ఎవరు వచ్చినా మర్యాదగా చూసేది. షాపింగ్ బాగా చేసేది. ఒకే ఒక్క హిందీ సినిమాలో నటించింది. నాన్న వద్దనడంతో మానుకుంది. అమ్మ 20 సంవత్సరాల పాటు నాన్నతో లివ్ ఇన్ టుగెదర్‌గా ఉంది. నాన్నగారు అజయ్ మోహన్ ఖైతాన్ చాలా బాగా చదువుకున్నారు. పెళ్లి అయిపోయిందని తెలిస్తే సినిమా అవకాశాలు రావని ఉద్దేశంతో అమ్మ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచింది. పిల్లలు లేని ఇంటికి నేను ఇంటికి దీపంలా వచ్చాననే ఉద్దేశంతో నాకు దీపిక అని పేరు పెట్టారు. నా 21వ ఏట, డ్రీమ్ డ్రీమ్ పేరున ఒక ఎన్జీవో ప్రారంభించాను. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారి పిల్లలకి, క్యాన్సర్ బాధితుల పిల్లలకి వృత్తివిద్యలలో శిక్షణ ఇప్పిస్తున్నాం. అది నేటికీ విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం అందులో నేను యాక్టివ్‌గా ఉండట్లేదు. మయ్యా పబ్లిషింగ్ హౌస్ ప్రారంభించి, అన్ని రకాల పుస్తకాలను ఆన్లైన్లో పెడుతున్నాం. నాకు కుక్కలంటే ప్రాణం. ప్రాణిక్ హీలింగ్ నమ్ముతాను. గతంలో మోటరోలా, జీ కంపెనీలలో పనిచేశాను. సొంతగా ఇంటీరియర్ కంపెనీ కొంతకాలం నడిపాను. నాన్నగారు గ్లకోమాతో బ్లైండ్ అయ్యారు. అప్పుడు నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. 2012లో నాన్న పోయాక చాలా ఇబ్బందులు పడ్డాం. అమ్మ 2018లో మరణించారు. ‘మై మదర్ టి. కృష్ణకుమారి’ అని అమ్మ మీద ఇంగ్లీషులో బయోగ్రఫీ రాశాను. ప్రస్తుతం కుటుంబం, గార్డెనింగ్, ప్రాణిక్ హీలింగ్ పనుల్లో బిజీగా ఉన్నాను. మా వారు మధ్వులు. ఉడిపి నుంచి వచ్చారు. లాల్ బాగ్ హోటల్‌తో పాటు సుమారు 15 రెస్టారెంట్లు ఉన్నాయి. -
పొరుగు దేశపు ఎడారిలో ఉద్యమాల ఒయాసిస్...
థార్ అనేది ఒక ఎడారి ప్రాంతమన్న సంగతి అందరికీ తెలిసిందే. మన దేశంలోనే కాదు... థార్‌లోని కొంత భాగం పొరుగున్న పాకిస్తాన్‌లోనూ విస్తరించి ఉంది. అది భౌగోళికంగా, వాతావరణపరంగానే కాదు... అమ్మాయిల చదువులు, మహిళల హక్కుల వంటి సామాజిక అంశాల్లోనూ అక్షరాలా ఎడారే. ఎడారిలోని ఆ ప్రాంతంలో తల్లడిల్లుతున్న అనేక మందికి ఒయాసిస్‌గా మారారు ఓ మహిళ. అవకాశాలన్నీ పుష్కలంగా ఉన్న మాములు మహిళ కూడా కాదామె. ఆమె అన్ని విషయాల్లోనూ వివక్షను ఎదుర్కొనే దళిత మహిళ. కానీ... పెళ్లి తర్వాత కూడా పట్టుదలతో చదివి పోస్ట్‌గ్రాడ్యుయేట్ అయ్యారు. అన్న పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని అనేక మందిని వెట్టిచాకిరి నుంచి విముక్తులను చేశారు. బాల్యవివాహాలు, పరువు హత్యలు, పనిచేసేచోట వేధింపులకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించారు.ఇలాంటి సామాజిక జాడ్యాలు కొనసాగే ఎడారిలాంటి చోట అనేక మంది అభాగినులకు అండగా మారే ఆ ఒయాసిస్ పేరే కృష్ణకుమారి. ఇదీ ఆ ఒయాసిస్ కథ... చదవండి. ఇండియా, పాకిస్తాన్... క్రికెట్ నుంచి పాలిటిక్స్ వయా కశ్మీర్! సమస్య ఏదైనా అది ఆసక్తికరమే! అన్నీ దేశభక్తిని చాటుకోవడానికి ఉపయోగపడే అంశాలే! ఆ గాలి ఇటు వీచకుండా చేసే ఉక్కపోతలో కాస్త గాలాడేలా చేసే కొన్ని అరుదైన పవనాల నుంచి అప్పుడప్పడూ కాస్త చల్లని గాలులూ వీస్తాయి! అలాంటి చల్లటి వార్తే ఇది కూడా. ఇంతకూ ఆ న్యూస్ ఏమిటంటే... కృష్ణకుమారి కొహ్లీ అనే దళిత మహిళ పాకిస్తాన్ ఎగువ సభ (సెనెట్)కు ఎన్నిక కావడం. ఆమె వివరాలు తెలుసుకునేలా కుతూహలాన్ని రేకెత్తించే అంశమది. ఇస్లామిక్ రాజ్యమైన పాకిస్తాన్లో సెనేట్‌కు ఎన్నికైన తొలి దళిత హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు కృష్ణకుమారి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున సింద్ ప్రావిన్స్ నుంచి ఎగువ సభకు ఎన్నికయ్యారు ఆమె. పూర్వాపరాలు... పాకిస్తాన్ సిం«ద్ ప్రావిన్స్‌లోని నాగర్పార్కర్లో పుట్టారు కృష్ణకుమారి. పేద కుటుంబం. తండ్రి జుగ్నో కొహ్లీ సహా ఆ పరివారమంతా ఉమేర్కోట్ జిల్లాలోని కున్రీ ఊళ్లోని భూస్వామి దగ్గర వెట్టి చేసేవారు. ఎనిమిదేళ్లు వచ్చేవరకు చిన్నారి కృష్ణకుమారి కూడా వెట్టి చేసింది. అంతేకాదు దాదాపు తన తల్లి, తండ్రి, అన్నతోపాటు తనూ మూడేళ్లు ఆ భూస్వామి నిర్భంధంలో మగ్గింది. తిండిలేని రాత్రుళ్లు గడిపింది. నీళ్లతో కడుపు నింపుకుంది. పిల్లల అవస్థ చూసి తమలాగే వాళ్ల బతుకులూ వెట్టితోనే వెలిసిపోతాయేమోనని ఆవేదన చెందేవాడు కృష్ణకుమారి తండ్రి. పిల్లలను చదివించాలని ఆశపడేవాడు. మొత్తానికి కృష్ణకుమారికి ఊహ వచ్చేటప్పటికీ ఆ చెర నుంచి బయటపడింది ఆ కుటుంబం. పిల్లలు చదువుకోవడానికి ఆ ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. కిరసనాయిల్ దీపపు వెలుతురులోనే కృష్ణకుమారి, ఆమె అన్న వీర్జీ కొహ్లీ చదువుకునేవారు. అయితే ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగానే మంచి సంబంధం రావడంతో ఆమెకు పెళ్లి చేశాడు జుగ్నో. చదివించాలని అంత ఆశపడిన ఆ తండ్రి పట్టుమని పదహారేళ్లు కూడా నిండని బిడ్డకు పెళ్లి చేయడానికి కారణం... నాగర్పార్కర్లో ఆడవాళ్లకు పెద్ద చదువులు చదివే హక్కు లేదు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో చదువు, సాధికారత స్త్రీ చేరుకోలేని గమ్యాలే. అయితే ఆమె భర్త లాల్‌చంద్... చదువుపట్ల కృష్ణకుమారికి ఉన్న ఆసక్తిని చూసి పెళ్లయిన తర్వాత కూడా ఆమె చదువుకోవడానికి అనుమతించాడు. దాంతో డ్రాపవుట్‌గా మిగిలిపోవాల్సిన ఆమె సోషియాలజీలో పోస్ట్గ్రాడ్యుయేట్గా నిలబడ్డారు. రాజకీయాలు.. కృష్ణకుమారి అన్న వీర్జీ మొదటి నుంచీ చురుకైన వ్యక్తి. అన్యాయం మీద గొంతెత్తేవాడు. సిం«ద్ ప్రాంతంలోని అణగారిన ప్రజల హక్కుల కోసం పిడికిలి బిగించాడు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్‌గా పేరుపొందాడు. కృష్ణకుమారి రాజకీయాల్లోకి రావడానికి తన అన్న వీర్జీయే ప్రేరణ. ఆయన ధైర్యమే ఆమెకు స్ఫూర్తి. దాంతో కాలేజ్‌లో ఉన్నప్పటి నుంచే అన్నతోపాటు మానవహక్కుల ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడారు. బాల్యవివాహాలు, పరువు హత్యలు, పనిచేసే చోట వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తారు. మహిళల హక్కుల కోసం ఉద్యమించారు. ఉద్యమిస్తూనే ఉన్నారు.ఆ పోరాట పటిమే ఆమెను ఈ రోజు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున (థార్ నుంచి) ఎగువ సభలో నిలబెట్టింది. ‘‘నేను ఒక్క థార్ మహిళల ప్రథినిధిని మాత్రమే కాదు దేశంలోని మొత్తం మహిళల ప్రతినిధిని. నాగర్‌పార్కర్, థార్లలో స్త్రీలకు నేటికీ టాయ్‌లెట్ వంటి కనీస సౌకర్యాలు లేవు. బాల్యవివాహాలతో బాలికలు చదువుకు దూరమవుతున్నారు. ముక్కుపచ్చలారని వయసుకే తల్లులవుతున్నారు. అనారోగ్యంతో యవ్వనంలోనే వృద్ధాప్యాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి ఇంకెన్నో మహిళా సమస్యలెన్నిటినో సభలో ప్రభుత్వం దృష్టికి తెస్తాను. పరిష్కారం కోసం పోరాడుతాను. మహిళలు, బాలికల ఆరోగ్యం, చదువు ఈ విషయాల్లో దృష్టిపెట్టదల్చాను. వీటిల్లో కొంత మార్పు తేగలిగినా నా అభ్యర్థిత్వానికి న్యాయం చేసినట్టే. ఎన్ని ఆటంకాలెదురైనా ఆగను’’ అన్నారు కృష్ణకుమారి కొహ్లీ. మహిళల మీద దాడులు, బాల్యవివాహాలు, పరువు హత్యలు జరిగినప్పుడు నిరసనలు, ధర్నాలు, ర్యాలీల్లో ఆమె ముందుంటారు. వెట్టినుంచి విముక్తి పోరాటంలోనూ కృష్ణకుమారిది మొదటినుంచీ మొదటి అడుగే. ఆ పోరాట సమయాల్లో కృష్ణకుమారి అత్తింటి బంధువులు, పుట్టింటి బంధువులు అంతా ఆమెను దూషించేవారట. ‘ఒక స్త్రీ అయ్యుండి, తల మీద పమిట లేకుండా మగవాళ్లతో సమానంగా ఎలా వెళ్తుందో చూడండి. అసలు ఆమె ఆడమనిషేనా? కులంలోని ఆడవాళ్ల మర్యాదంతా మంటగలుపుతోంది’ అని తిట్టేవారట. కృష్ణకుమారి భర్త దగ్గరకు వచ్చి ‘నీ భార్యను అదుపులో పెట్టుకో’ అని మగవాళ్లు హెచ్చరించేవారట. ఇలాంటివి కనీసం రెండు రోజులకు ఒక్కసారైనా ఉండేవట. ‘అన్నీ విని నేను, లాల్‌చంద్ ఇద్దరం నవ్వుకునేవాళ్లం’’ అని చెప్తారు 39 ఏళ్ల కృష్ణకుమారి. అందునా స్వేచ్ఛాస్వాంత్రాలకు అంతగా ఆస్కారమూ, అవకాశమూ లేని ఆ దేశంలో సాగిస్తున్న కృష్ణకుమారి పోరాటం... ఎందరికో స్ఫూర్తిదాయకం. స్వాతంత్య్ర సమరం నుంచే.. కృష్ణకుమారి కుటుంబానికి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న నేపథ్యం ఉంది. ఆమె పూర్వీకుల్లో ఒకరైన రూప్లో కొహ్లీ 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటులో పాలుపంచుకున్నారు. సిం«ద్‌లోని నాగర్పార్కర్లోని తిరుగుబాటును అణచడానికి బ్రిటిషర్స్ దాడి చేసినప్పుడు రూప్లో బ్రిటిష్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడారు. ఆ సాహసమే ఈ అన్నచెల్లెళ్లకు వచ్చినట్టుంది అంటారు కృష్ణకుమారి సన్నిహితులు. – శరాది -
కృష్ణ సౌందర్యం
ఆమె అంత పొడగరి తెలుగు సినిమాల్లో లేదు. ఆమె అంత గ్లామర్ కూడా ఎవరూ కొనసాగించలేకపోయారు. హిందీలో ఆమెను ‘ముంతాజ్’తో పోల్చవచ్చు. కాంట్రవర్శీ లేకుండా అందరు హీరోలతో ఆమె పాతికేళ్ల పాటు చలన చిత్ర సీమలో తన ప్రభావం చూపారు. ఆమె సౌందర్యం మరపురానిది. ఊహలు గుసగుసలాడె.. అంటూ ఓ తరాన్ని ఉర్రూతలూగించారు కృష్ణకుమారి. 1933 మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లోని నౌహాతిలో జన్మించారు కృష్ణకుమారి. వీరిది రాజమండ్రి. తండ్రి వెంకోజీ ఉద్యోగరీత్యా కలకత్తా, అస్సామ్‌లలో పని చేస్తుండగా కృష్ణకుమారి అక్కడే పుట్టి, పెరిగారు. అస్సామ్‌లో టెన్త్ పూర్తయ్యాక ఈ కుటుంబం మదరాసులో స్థిరపడింది. సినిమాల్లో డ్యాన్సర్ అవ్వాలన్నది కృష్ణకుమారి కల. అయితే విధి వేరొకటి తలచింది. నటిని చేసింది. అప్పటి ప్రముఖ దర్శక–నిర్మాత ఎస్. సౌందర రాజన్ కుమార్తె భూమాదేవి మదరాసులోని రాజకుమారి సినిమా థియేటర్లో కృష్ణకుమారిని చూశారు. సౌందర రాజన్ ఆ సమయంలో ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో కథానాయిక అమాయకురాలు. భూమాదేవికి కృష్ణకుమారిలో ఆ అమాయకురాలు కనిపించింది. ఆమెను హీరోయిన్గా చేస్తావా? అని అడిగారు. వెంటనే కృష్ణకుమారి వేరే రాష్ట్రంలో ఉన్న తండ్రికి ఉత్తరం ద్వారా విషయం చేరవేశారు. ‘నీ మీద నమ్మకం ఉంది. సినిమాల్లో నటించాలనుకుంటే ఓకే’ అని జాగ్రత్తలు చెబుతూ ఉత్తరం రాశారాయన. మదరాసులోని న్యూటోన్ స్టూడియోలో ‘మేకప్ టెస్ట్’ చేశారు కృష్ణకుమారికి. ‘నవరసాలు చేసి చూపించు’ అన్నారు సౌందరరాజన్. నిజానికి కృష్ణకుమారికి నటన గురించి ఏమీ తెలియదు. వేదాంతం జగన్నాథశర్మ దగ్గర కూచిపూడి నృత్యం నేర్చు కుంది. అంతే. అయినా తడబడ లేదు. తనకు వచ్చినట్లుగా నటించి, చూపించింది. సౌందర రాజన్‌కి నచ్చడంతో ‘నవ్వితే నవరత్నాలు’కి నాయికగా తీసుకున్నారు. ఆ సినిమా పనులు జరుగుతుండగానే కమెడి యన్ కస్తూరి శివరావ్.. కృష్ణకుమారి మేకప్ స్టిల్స్‌ని కొంతమంది నిర్మాతలకు చూపించారు. అలా ‘మంత్రదండం’ సినిమాలో ఓ పాత్ర చేసే అవకాశం కృష్ణకుమారికి వచ్చింది. ‘మంత్రదండం’ ముందు విడుదల అవ్వడంతో ఆమె తొలి చిత్రం అదే అయింది. అయితే ‘నవ్వితే నవరత్నాలు’ ఆశించినంతగా ఆడలేదు. అయినప్పటికీ మొదటి వారంలో బెజవాడలో హౌస్‌ఫుల్. ‘బాగాలేని సినిమా హౌస్‌ఫుల్‌తో ఆడటమా?’ అని అప్పటి ఓ ప్రముఖ జర్నలిస్ట్ సౌందరరాజన్‌తో అంటే ‘సినిమా గురించి ఎవరు పట్టించుకున్నారు? కృష్ణకుమారిని చూడటం కోసం థియేటర్‌కు వెళ్తున్నారు’ అన్నారట. అమాయకత్వం నిండిన ఆ పాత్రను అద్భుతంగా చేయడంతో పాటు చూడచక్కగా ఉండటం వల్ల ఒక్క సినిమాతో ప్రేక్షకులకు దగ్గర కాగలిగారు. 1951లో నటిగా ప్రయాణం మొదలుపెట్టి రెండు దశాబ్దాల పాటు వెండితెరను ఏలారు కృష్ణకుమారి. పిచ్చి పుల్లయ్య, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు, నిత్యకల్యాణం పచ్చతోరణం, ఉమ్మడి కుటుంబం, తిక్క శంకరయ్య, చిలకా గోరింక, మానవుడు దానవుడు, శ్రీకృష్ణావతారం, పునర్జన్మ, సతీ సావిత్రి వంటి పలు చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు, జగ్గయ్య.. వంటి మహానటుల సరసన అవకాశాలు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ సరసన 25 సినిమాలు, ఏయన్నార్‌తో 18 సినిమాలు చేశారు. తెలుగులో 110 సినిమాలు, కన్నడ, తమిళ భాషలతో కలిపి దాదాపు 150 సినిమాల్లో నటించారు. 1963లో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత కృష్ణకుమారిది. తమిళ నటులు శివాజీగణేశన్, కన్నడ డా. రాజ్‌కుమార్ వంటి ప్రముఖ నటులతోనూ జతకట్టారామె. నటిగా బిజీగా ఉన్నప్పుడే కృష్ణకుమారి వివాహం చేసుకున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ ఎడిటర్, స్క్రీన్ మ్యాగజీన్ ఫౌండర్, బిజినెస్‌మేన్ అజయ్ మోహన్ ఖైతాన్‌తో ఆమె వివాహం జరిగింది. రాజస్తానీ కుటుంబానికి చెందిన అజయ్ వ్యాపార రీత్యా కలకత్తాలో స్థిరపడ్డారు. ఆయనతో కృష్ణకుమారికి స్నేహితుల ద్వారా పరిచయమైంది. సినిమాల్లో చూసి, కృష్ణకుమారిని ఇష్టపడ్డారు అజయ్. పరిచయం తర్వాత ఆమెకూ ఆయనంటే ఇష్టం ఏర్పడింది. పెద్దల అంగీకారంతో పెళ్లయింది (1969). పెళ్లి తర్వాత భర్తతో కలిసి బెంగళూరు వెళ్లడంతో పాటు సినిమాలకు కూడా దూరమయ్యారు కృష్ణకుమారి. ఇది తనంతట తానుగా తీసుకున్న నిర్ణయం. కానీ అప్పటివరకూ బిజీగా ఉన్న ఆమెకు ఏదో వెలితిగా ఉండేది. ఆ సమయంలోనే గార్డెనింగ్ అలవాటు చేసుకున్నారు. అయినప్పటికీ నిర్మాతలు వదలకుండా సినిమాలు చేయమని అడుగుతుండే వారు. ముఖ్యంగా దర్శకుడు ఏవీ సుబ్బారావు అయితే అక్కినేని నాగేశ్వరరావుతో తాను ప్లాన్ చేసిన సినిమాలో కృష్ణకుమారిని కథానాయికగా నటింప జేయాలనుకున్నారు. అయితే ఆమె ఇష్టపడకపోయినా అత్తగారు, భర్త ప్రోత్సాహంతో మళ్లీ నటించారు. పెళ్లయ్యాక ఆమె చేసిన సినిమా ‘భార్యాభర్తలు’. 2003లో ‘ఫూల్స్’లో అతిథి పాత్రలో కనిపించారు కృష్ణకుమారి. అంతకుముందు ‘బంగారు భూమి’ (1982) చేశారు. 1982 నుంచి 2003 వరకూ గ్యాప్ తీసుకున్నారు. చిత్రపరిశ్రమలో ఎంతో మార్పు వచ్చేసింది. అందుకే ‘ఇక చాలు’ అనుకుని, సినిమా లకు ఫుల్స్టాప్ పెట్టేశారు. ప్రశాంతమైన జీవితం గడపాలనే ఆలోచనతో బెంగళూరులోని తమ ఐదెకరాల ఎస్టేట్‌లో ప్రశాంత జీవనం మొదలుపెట్టారు. అనుకున్నట్లుగానే జీవించారు. ఐదేళ్ల క్రితం ఆమె భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కూతురు దీపికకు పెళ్లయ్యింది. ఆమెకు ఓ కొడుకు. మనవడితో ఎక్కువగా కాలక్షేపం చేసేవారు కృష్ణకుమారి. కృష్ణకుమారిలో ఓ గంధర్వ కన్య (‘పాతాళ భైరవి’), అల్లరి పిల్ల (పిచ్చి పుల్లయ్య), శ్రీకృష్ణుడి సతీమణి రుక్మిణి (వినాయక చవితి), గృహిణి (భార్యాభర్తలు), మధ్యతరగతి అమ్మాయి (చదువుకున్న అమ్మాయిలు), డాక్టర్ (డాక్టర్ చక్రవర్తి), శ్రీకృష్ణుడి తల్లి దేవకి (యశోద కృష్ణ)... ఇలా ఎన్నో పార్శా్వలు. కృష్ణకుమారి ఏ పాత్ర చేసినా ఆ పాత్రకోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు. చలన చిత్ర చరిత్రలో కృష్ణకుమారిది చెరగని పేజీ. భౌతికంగా ఆమె లేకపోవచ్చు కానీ వెండితెరపై ఆమె నటన మళ్లీ మళ్లీ ఆమెను తలచుకునేలా చేస్తుంది. గుర్రపు స్వారీ... పెద్ద రిస్క్ ‘బందిపోటు’లో ఎన్టీఆర్, కృష్ణకుమారిపై దర్శకుడు విఠలాచార్య ‘వగలరాణివి నీవే..’ పాట తీస్తున్నారు. చెట్టు మీద కూర్చుని పాడుతున్న ఎన్టీఆర్‌ని గుర్రం మీద వెళ్లి కృష్ణకుమారి పట్టుకోవాలి. అయితే ఆమెకు గుర్రపు స్వారీ తెలియదు. ‘ఏం ఫర్వాలేదు. అది మంచి గుర్రం’ అని విఠలాచార్య అనడంతో ధైర్యం చేసి ఎక్కారు. తీరా సీన్ తీస్తున్న సమయంలో గుర్రం వేగంగా పరిగెత్తడంతో కృష్ణకుమారికి ఏం పాలుపోలేదు. దాన్నే గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. విఠలాచార్య వంటి పెద్ద దర్శకుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తీయరు కదా. లొకేషన్‌కి కొద్ది దూరంలో నాలుగు మగ గుర్రాల్ని నిలబెట్టారట. వాటిని చూసి, కృష్ణకుమారి ఎక్కిన ఆడగుర్రం ఆగిందట. అలా పెద్ద ప్రమాదం తప్పిందని ఓ ఇంటర్వ్యూలో కృష్ణకుమారి తెలిపారు. కృష్ణకుమారిని కాపాడిన ఎన్టీఆర్ ‘లక్షాధికారి’ షూటింగ్ అప్పుడు కృష్ణకుమారికి పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఎన్టీఆర్, కృష్ణకుమారిపై ‘దాచాలంటే దాగదులే..’ పాటను చిత్రీకరిస్తున్నారు. పాటలో భాగంగా ఒడ్డు నుంచి సముద్రం లోపలికి నడుచుకుంటూ వెళుతుందీ జంట. అప్పుడో పెద్ద అల వచ్చి, ఇద్దర్నీ లోపలికి లాగేసింది. భయంతో కృష్ణకుమారి నీళ్లు తాగేశారు. ఎన్టీఆర్ ఆమె చేయి వదిలి ఉంటే.. జరగరానిది జరిగేదేమో. కానీ ఆమె చెయ్యి పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. ఆ సంఘటన తలచుకున్నప్పుడల్లా చాలా భయం వేసేదని ఓ సందర్భంలో కృష్ణకుమారి తెలిపారు. అమ్మ తీరని కోరిక అదే! ‘‘అమ్మ మరణం మాకు తీరని లోటు. కానీ ఆమె సంపూర్ణమైన జీవితం గడిపినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు కృష్ణకుమారి ఏకైక కుమార్తె దీపిక. బెంగళూరులో భర్త విక్రమ్, తనయుడు పవన్‌తో ఉంటున్నారామె. తల్లి గురించి కొన్ని విశేషాలను దీపిక ‘సాక్షి’తో పంచుకున్నారు. ► మీ అమ్మగారి గురించి రెండు మాటలు.. ఆవిడకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. కానీ మా బంధువుల పిల్లలందరికీ అమ్మలానే వ్యవహరించేది. మనుషులను ప్రేమించే గుణం అమ్మకి ఎక్కువ. ► మనవడితో ఆమె ఎలా ఉండేవారు? పవన్‌తో అమ్మ చాలా ఎటాచ్డ్గా ఉండేది. అమ్మ ఉంటున్న ఎస్టేట్‌కి మా ఇల్లు కొంచెం దూరం. వీలు చిక్కినప్పుడల్లా మేం వెళుతుంటాం. ► మీ అమ్మగారు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి? ‘గురువుని మించిన శిష్యులు’, ‘గుడి గంటలు’, ‘భార్యాభర్తలు’ అంటే చాలా ఇష్టం. అన్ని సినిమాల్లోనూ అమ్మ యాక్టింగ్ బాగుంటుంది. ఈ మూడు సినిమాలు నాకు స్పెషల్‌గా అనిపిస్తాయి. ► మీ అమ్మగారి నుంచి మీకు వచ్చిన లక్షణం ఏదైనా? అమ్మ చాలా మొండిది. ఏదైనా చేయాలనుకుంటే అది చేయాల్సిందే. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తీసుకునేది కాదు. అయితే అమ్మ తీసుకున్న నిర్ణయాలు దాదాపు తప్పయ్యేవి కాదు. అమ్మ మొండితనం నాకు వచ్చింది. ► మిమ్మల్ని హీరోయిన్గా చేయమని చెప్పలేదా? చేస్తే బాగుంటుంది అన్నది కానీ ఒత్తిడి చేయలేదు. చదువయ్యాక చూద్దామని నాన్న అనేవారు. బేసిక్‌గా నాకే ఇంట్రస్ట్ లేదు. అందుకే సినిమాల్లోకి రాలేదు. ► కృష్ణకుమారిగారికి ఏ వంటలు ఇష్టం? బంగాళదుంప వేపుడంటే చాలా ఇష్టం. ఇంకా కారప్పొడులు ఇష్టంగా తినేది. ► అమ్మ వంటలో మీకు నచ్చినది? బర్మీ బేల్ తయారు చేసేది. బేల్పురిలా అన్న మాట. బర్మా వాళ్లు చేస్తారు. టేస్టీగా చేసేది. చివరి సారిగా ఆమె బర్మీ బేల్ చేసింది రెండేళ్ల క్రితం. ► సినిమాల్లో పట్టుచీరలు, నగల్లో కనిపించిన పాత్రలు చాలా.. విడిగా ఆమె అలా డ్రెస్ చేసుకునేవారా? చాలా ఇష్టం. చక్కగా చీర కట్టుకుని, నగలు పెట్టుకునేది. ఆరోగ్యం దెబ్బ తిన్నాక మానేసింది. ► కృష్ణకుమారిగారికి తీరని కోరిక ఏదైనా? ఒకే ఒక్క కోరిక తీరకుండా వెళ్లిపోయింది. హిందీ సినిమా ‘పద్మావత్’ చూడాలనే కోరిక బాగా ఉండేది. ఆమెకు సినిమాలంటే ఇష్టం. తెలుగుతో పాటు హిందీ సినిమాలూ చూసేది. ‘పద్మావత్’ గురించి చాలాసార్లు చెప్పింది. అది మినహా అమ్మకు ఎలాంటి అసంతృప్తీ లేదు. – డి.జి.భవాని కాంతారావుతో కుమార్తె దీపికతో కష్ణకుమారి -
కృష్ణకుమారి కన్నుమూత
సాక్షి, బెంగళూరు: తెలుగు చలనచిత్ర రంగంలో తన ముగ్ధ మనోహర రూపంతో, అద్వితీయ నటనా కౌశలంతో ప్రేక్షకులను కట్టిపడేసిన అలనాటి అందాల తార, ప్రముఖ నటీమణి కృష్ణకుమారి ఇకలేరు. సుమారు పాతికేళ్లపాటు వెండితెరను ఏలిన ఈ నటీమణి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. 1933, మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లోని నౌహతిలో కృష్ణకుమారి జన్మించారు. ఆమె భర్త ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక మాజీ ఎడిటర్ అజయ్ మోహన్ ఖైతాన్. ఆయన కొన్నేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి తన ఏౖMðక కుమార్తె దీపిక, అల్లుడు, మనవడితో కలిసి నివసిస్తున్నారు. ప్రముఖ నటీమణి షావుకారు జానకి కృష్ణకుమారికి స్వయానా సోదరి. బుధవారం మధ్యాహ్నం బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య కృష్ణకుమారి అంత్యక్రియలను పూర్తిచేశారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నవ్వితే నవరత్నాలతో వెండితెర ప్రస్థానం 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ చిత్రం ద్వారా కృష్ణకుమారి తెరంగ్రేటం చేశారు. అనంతరం పల్లెపడుచు, బంగారు పాప, ఇలవేల్పు, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర సీమపై చెరగని ముద్ర వేశారు. అందచందాలకు తోడు నటనను మేళవించి తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకుల మది దోచుకున్నారు. కన్నడ కంఠీరవ దివంగత డాక్టర్ రాజ్‌కుమార్‌తో ఎన్నో చిత్రాల్లో ఆడిపాడారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావులతో కృష్ణకుమారి నటించిన చిత్రాలు సూపర్హిట్లుగా నిలిచాయి. తమిళుల ఇలవేల్పు శివాజీ గణేషన్తోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో ఎన్టీఆర్‌తో ఆమె అధిక సినిమాల్లో హీరోయిన్గా నటించి హిట్‌పెయిర్‌గా ఖ్యాతి పొందారు. ఆమె నటనా కౌశలానికి మూడుసార్లు జాతీయ అవార్డు, రాష్ట్ర స్థాయి నంది అవార్డు, కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు వరించాయి. కృష్ణ కుమారి భౌతికకాయం కలలో కూడా హాని చేయని మనిషి - షావుకారు జానకి, ప్రముఖ నటి నా సోదరి కృష్ణకుమారి ఇంత హఠాత్తుగా నన్ను విడిచి వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. నేను చెన్నై నుంచి వచ్చాక 20 ఏళ్ల నుంచి ఒకే కాంపౌండ్‌లో కలసి ఉంటున్నాం. ఆమె ఎంతో సున్నిత మనస్కురాలు. కలలో కూడా ఎవరికీ హాని చేసే మనిషి కాదు. సినీ పరిశ్రమలో అందరి దగ్గర ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలంటే తనకు ఎంతో మక్కువ. ఎంతో మంది చదువుకోవడానికి ఆర్థికంగా సహాయపడింది. ఆమె మనవడు పవన్ అంటే కృష్ణకుమారికి ఎనలేని ప్రేమ. పవన్ పెద్దవాడయ్యే వరకు జీవించాలని ఉంది అని తరచూ నాతో చెప్పేది. అమ్మ నాకు అన్నీ ఇచ్చింది -దీపిక, కృష్ణకుమారి కుమార్తె అమ్మ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కొద్దినెలలుగా తరచూ అనారోగ్యంతో బాధ పడుతూ ఉంది. ఆస్పత్రిలో చికిత్స తర్వాత కొద్దిగా ఆరోగ్యం కుదుటపడింది. మళ్లీ కొద్ది రోజులకే జబ్బు తిరగబెట్టింది. అమ్మ నాకు అన్నీ ఇచ్చింది. ఎంతో మందికి ఎన్నో రకాలుగా అమ్మ సహాయం చేసింది. -
కొమరవోలు జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత
మచిలీపట్నం: కృష్ణాజిల్లా పామర్రు మండలం కొమరవోలులో శనివారం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపైకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వచ్చారు. ఆమెతో పాటు వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ కృష్ణకుమారి కూడా వేదికపైకి రావడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహించారు. దాంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు. -
లాహిరి లాహిరి-కృష్ణ కుమారి