
కరోనా సమయంలో పెద్దలకే చాలా కష్టంగా ఉంది. పిల్లలకు ఇది ఇంకా అర్థం కావాల్సి ఉంది. మరి స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లల పరిస్థితి? వారి బాగోగులు ఎలా? ఈ వొత్తిడి సమయంలో వారిని ఎలా చూసుకోవాలి? డా.టి.కృష్ణకుమారి అందుకు సహాయం చేస్తున్నారు. వారికి కనీస విషయాల మీద అవగాహన కల్పిస్తున్నారు తన చేతన సంస్థ ద్వారా. సుమారు ముప్పై సంవత్సరాలుగా చేతన సంస్థను నడుపుతున్న కృష్ణకుమారి వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యులు. ఆమెకు పుట్టిన ఆడపిల్ల స్పెషల్లీ చాలెంజ్‌డ్. ఆ విషయాన్ని కొద్దిగా ఆలస్యంగా గుర్తించారు ఆమె. అటువంటి పిల్లలను ముందరలోనే గమనిస్తే కొంతవరకు వారిని విద్యావంతులను చేయవచ్చు, అందుకే తాను అటువంటి పిల్లల కోసం ఈ సంస్థను స్థాపించినట్లు చెబుతున్నారు డా. కృష్ణకుమారి.
‘‘లాక్‌డౌన్ సమయంలో మా స్కూల్‌కు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. అయినప్పటికీ నెలకోసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టి, ప్రతి విద్యార్థికి సంబంధించి వారి తల్లిదండ్రులకు ఒక్కో గంట కేటాయించి వారితో మాట్లాడుతున్నాను. మా సంస్థలో వంద మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్లు ఎలా ఉన్నారో ప్రతి రోజూ వీడియో ద్వారా గమనిస్తాను. ఆ పిల్లలను క్రమశిక్షణలో ఉంచటానికి నేను స్కూల్‌లో ఏయే సూత్రాలు అనుసరిస్తానో అవన్నీ తల్లిదండ్రులకు వివరిస్తాను. పిల్లలకు హోమ్‌వర్క్ ఇస్తాను. వారు పూర్తి చేసిన పని తాలూకు వీడియో పోస్టు చేయగానే, వారికి రిపోర్ట్ కార్డు ఇస్తాను. పిల్లల్లో ఎంత పరిణతి కలిగిందో తల్లిండ్రులు తెలుసుకుంటారు. ఉదాహరణకి బ్రష్ పట్టుకుని పళ్లు తోముకోవటం రాని పిల్లవాడికి బ్రష్ పట్టుకోవటం ఒక గోల్. ఆ తరవాత అది నోట్లో పెట్టుకోవటం మరో గోల్. ఆ తరవాత వాటిని వాటి స్థానాల్లో ఉంచటం పెద్ద గోల్. ఇలా ప్రతి పనీ వారికి వారు చేసుకునేలా నేర్పిస్తాం’ అన్నారామె.
‘‘ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడకూడదని పేరెంట్స్‌కి చెబుతాను. మన పిల్లల్ని మనమే బాగు చేసుకోవాలి అనుకోవాలి. పిల్లలు ఏదైనా అడిగితే మొండిగా, ‘నేను చెయ్యను, నువ్వే చేసుకోవాలి’ అనాలి. నేను తల్లిని కాదు కనుక చేయను అనగలను. కాని తల్లి అలా అనలేదు. అలా అనకపోతే పిల్లలకు పని రాదు. కొన్ని విషయాలలో మొండితనం చాలా అవసరం. ఇటువంటి పిల్లలు తమ పనులను సింపుల్‌గా, షార్ట్‌కట్‌తో చేయలేరు. ప్రతి చిన్నపనీ వారికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే వారికి ఒక పనిని చిన్న చిన్న పనులుగా విడగొట్టి ఒక్కొక్కటిగా నేర్పిస్తాను. ఈ లాక్‌డౌన్ సమయంలో కొందరు పిల్లలకు వంట చేయటం గోల్‌గా ఇచ్చాను. వాళ్లు తయారు చేస్తున్న వంటను వీడియోగా తీసి మా వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. వారికి ప్రశంసలు ఇస్తుంటాను. ఇది వారి ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతోంది’’ అన్నారు కృష్ణకుమారి. –డా. వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment