కృష్ణకుమారి
ఆమె అంత పొడగరి తెలుగు సినిమాల్లో లేదు. ఆమె అంత గ్లామర్ కూడా ఎవరూ కొనసాగించలేకపోయారు. హిందీలో ఆమెను ‘ముంతాజ్’తో పోల్చవచ్చు. కాంట్రవర్శీ లేకుండా అందరు హీరోలతో ఆమె పాతికేళ్ల పాటు చలన చిత్ర సీమలో తన ప్రభావం చూపారు. ఆమె సౌందర్యం మరపురానిది. ఊహలు గుసగుసలాడె.. అంటూ ఓ తరాన్ని ఉర్రూతలూగించారు కృష్ణకుమారి. 1933 మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లోని నౌహాతిలో జన్మించారు కృష్ణకుమారి. వీరిది రాజమండ్రి. తండ్రి వెంకోజీ ఉద్యోగరీత్యా కలకత్తా, అస్సామ్‌లలో పని చేస్తుండగా కృష్ణకుమారి అక్కడే పుట్టి, పెరిగారు. అస్సామ్‌లో టెన్త్ పూర్తయ్యాక ఈ కుటుంబం మదరాసులో స్థిరపడింది. సినిమాల్లో డ్యాన్సర్ అవ్వాలన్నది కృష్ణకుమారి కల. అయితే విధి వేరొకటి తలచింది. నటిని చేసింది.
అప్పటి ప్రముఖ దర్శక–నిర్మాత ఎస్. సౌందర రాజన్ కుమార్తె భూమాదేవి మదరాసులోని రాజకుమారి సినిమా థియేటర్‌లో కృష్ణకుమారిని చూశారు. సౌందర రాజన్ ఆ సమయంలో ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో కథానాయిక అమాయకురాలు. భూమాదేవికి కృష్ణకుమారిలో ఆ అమాయకురాలు కనిపించింది. ఆమెను హీరోయిన్‌గా చేస్తావా? అని అడిగారు. వెంటనే కృష్ణకుమారి వేరే రాష్ట్రంలో ఉన్న తండ్రికి ఉత్తరం ద్వారా విషయం చేరవేశారు. ‘నీ మీద నమ్మకం ఉంది. సినిమాల్లో నటించాలనుకుంటే ఓకే’ అని జాగ్రత్తలు చెబుతూ ఉత్తరం రాశారాయన.
మదరాసులోని న్యూటోన్ స్టూడియోలో ‘మేకప్ టెస్ట్’ చేశారు కృష్ణకుమారికి. ‘నవరసాలు చేసి చూపించు’ అన్నారు సౌందరరాజన్. నిజానికి కృష్ణకుమారికి నటన గురించి ఏమీ తెలియదు. వేదాంతం జగన్నాథశర్మ దగ్గర కూచిపూడి నృత్యం నేర్చు కుంది. అంతే. అయినా తడబడ లేదు. తనకు వచ్చినట్లుగా నటించి, చూపించింది. సౌందర రాజన్‌కి నచ్చడంతో ‘నవ్వితే నవరత్నాలు’కి నాయికగా తీసుకున్నారు.
ఆ సినిమా పనులు జరుగుతుండగానే కమెడి యన్ కస్తూరి శివరావ్.. కృష్ణకుమారి మేకప్ స్టిల్స్‌ని కొంతమంది నిర్మాతలకు చూపించారు.
అలా ‘మంత్రదండం’ సినిమాలో ఓ పాత్ర చేసే అవకాశం కృష్ణకుమారికి వచ్చింది. ‘మంత్రదండం’ ముందు విడుదల అవ్వడంతో ఆమె తొలి చిత్రం అదే అయింది. అయితే ‘నవ్వితే నవరత్నాలు’ ఆశించినంతగా ఆడలేదు. అయినప్పటికీ మొదటి వారంలో బెజవాడలో హౌస్‌ఫుల్. ‘బాగాలేని సినిమా హౌస్‌ఫుల్‌తో ఆడటమా?’ అని అప్పటి ఓ ప్రముఖ జర్నలిస్ట్ సౌందరరాజన్‌తో అంటే ‘సినిమా గురించి ఎవరు పట్టించుకున్నారు? కృష్ణకుమారిని చూడటం కోసం థియేటర్‌కు వెళ్తున్నారు’ అన్నారట. అమాయకత్వం నిండిన ఆ పాత్రను అద్భుతంగా చేయడంతో పాటు చూడచక్కగా ఉండటం వల్ల ఒక్క సినిమాతో ప్రేక్షకులకు దగ్గర కాగలిగారు.
1951లో నటిగా ప్రయాణం మొదలుపెట్టి రెండు దశాబ్దాల పాటు వెండితెరను ఏలారు కృష్ణకుమారి. పిచ్చి పుల్లయ్య, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు, నిత్యకల్యాణం పచ్చతోరణం, ఉమ్మడి కుటుంబం, తిక్క శంకరయ్య, చిలకా గోరింక, మానవుడు దానవుడు, శ్రీకృష్ణావతారం, పునర్జన్మ, సతీ సావిత్రి వంటి పలు చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు, జగ్గయ్య.. వంటి మహానటుల సరసన అవకాశాలు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ సరసన 25 సినిమాలు, ఏయన్నార్‌తో 18 సినిమాలు చేశారు. తెలుగులో 110 సినిమాలు, కన్నడ, తమిళ భాషలతో కలిపి దాదాపు 150 సినిమాల్లో నటించారు. 1963లో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత కృష్ణకుమారిది. తమిళ నటులు శివాజీగణేశన్, కన్నడ డా. రాజ్‌కుమార్ వంటి ప్రముఖ నటులతోనూ జతకట్టారామె.
నటిగా బిజీగా ఉన్నప్పుడే కృష్ణకుమారి వివాహం చేసుకున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ ఎడిటర్, స్క్రీన్ మ్యాగజీన్ ఫౌండర్, బిజినెస్‌మేన్ అజయ్ మోహన్ ఖైతాన్‌తో ఆమె వివాహం జరిగింది. రాజస్తానీ కుటుంబానికి చెందిన అజయ్ వ్యాపార రీత్యా కలకత్తాలో స్థిరపడ్డారు. ఆయనతో కృష్ణకుమారికి స్నేహితుల ద్వారా పరిచయమైంది. సినిమాల్లో చూసి, కృష్ణకుమారిని ఇష్టపడ్డారు అజయ్. పరిచయం తర్వాత ఆమెకూ ఆయనంటే ఇష్టం ఏర్పడింది. పెద్దల అంగీకారంతో పెళ్లయింది (1969). పెళ్లి తర్వాత భర్తతో కలిసి బెంగళూరు వెళ్లడంతో పాటు సినిమాలకు కూడా దూరమయ్యారు కృష్ణకుమారి. ఇది తనంతట తానుగా తీసుకున్న నిర్ణయం. కానీ అప్పటివరకూ బిజీగా ఉన్న ఆమెకు ఏదో వెలితిగా ఉండేది. ఆ సమయంలోనే గార్డెనింగ్ అలవాటు చేసుకున్నారు. అయినప్పటికీ నిర్మాతలు వదలకుండా సినిమాలు చేయమని అడుగుతుండే వారు. ముఖ్యంగా దర్శకుడు ఏవీ సుబ్బారావు అయితే అక్కినేని నాగేశ్వరరావుతో తాను ప్లాన్ చేసిన సినిమాలో కృష్ణకుమారిని కథానాయికగా నటింప జేయాలనుకున్నారు. అయితే ఆమె ఇష్టపడకపోయినా అత్తగారు, భర్త ప్రోత్సాహంతో మళ్లీ నటించారు. పెళ్లయ్యాక ఆమె చేసిన సినిమా ‘భార్యాభర్తలు’.
2003లో ‘ఫూల్స్’లో అతిథి పాత్రలో కనిపించారు కృష్ణకుమారి. అంతకుముందు ‘బంగారు భూమి’ (1982) చేశారు. 1982 నుంచి 2003 వరకూ గ్యాప్ తీసుకున్నారు. చిత్రపరిశ్రమలో ఎంతో మార్పు వచ్చేసింది. అందుకే ‘ఇక చాలు’ అనుకుని, సినిమా లకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ప్రశాంతమైన జీవితం గడపాలనే ఆలోచనతో బెంగళూరులోని తమ ఐదెకరాల ఎస్టేట్‌లో ప్రశాంత జీవనం మొదలుపెట్టారు. అనుకున్నట్లుగానే జీవించారు. ఐదేళ్ల క్రితం ఆమె భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కూతురు దీపికకు పెళ్లయ్యింది. ఆమెకు ఓ కొడుకు. మనవడితో ఎక్కువగా కాలక్షేపం చేసేవారు కృష్ణకుమారి.
కృష్ణకుమారిలో ఓ గంధర్వ కన్య (‘పాతాళ భైరవి’), అల్లరి పిల్ల (పిచ్చి పుల్లయ్య), శ్రీకృష్ణుడి సతీమణి రుక్మిణి (వినాయక చవితి), గృహిణి (భార్యాభర్తలు), మధ్యతరగతి అమ్మాయి (చదువుకున్న అమ్మాయిలు), డాక్టర్ (డాక్టర్ చక్రవర్తి), శ్రీకృష్ణుడి తల్లి దేవకి (యశోద కృష్ణ)... ఇలా ఎన్నో పార్శా్వలు. కృష్ణకుమారి ఏ పాత్ర చేసినా ఆ పాత్రకోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు. చలన చిత్ర చరిత్రలో కృష్ణకుమారిది చెరగని పేజీ. భౌతికంగా ఆమె లేకపోవచ్చు కానీ వెండితెరపై ఆమె నటన మళ్లీ మళ్లీ ఆమెను తలచుకునేలా చేస్తుంది.
గుర్రపు స్వారీ... పెద్ద రిస్క్
‘బందిపోటు’లో ఎన్టీఆర్, కృష్ణకుమారిపై దర్శకుడు విఠలాచార్య ‘వగలరాణివి నీవే..’ పాట తీస్తున్నారు. చెట్టు మీద కూర్చుని పాడుతున్న ఎన్టీఆర్‌ని గుర్రం మీద వెళ్లి కృష్ణకుమారి పట్టుకోవాలి. అయితే ఆమెకు గుర్రపు స్వారీ తెలియదు. ‘ఏం ఫర్వాలేదు. అది మంచి గుర్రం’ అని విఠలాచార్య అనడంతో ధైర్యం చేసి ఎక్కారు. తీరా సీన్ తీస్తున్న సమయంలో గుర్రం వేగంగా పరిగెత్తడంతో కృష్ణకుమారికి ఏం పాలుపోలేదు. దాన్నే గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. విఠలాచార్య వంటి పెద్ద దర్శకుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తీయరు కదా. లొకేషన్‌కి కొద్ది దూరంలో నాలుగు మగ గుర్రాల్ని నిలబెట్టారట. వాటిని చూసి, కృష్ణకుమారి ఎక్కిన ఆడగుర్రం ఆగిందట. అలా పెద్ద ప్రమాదం తప్పిందని ఓ ఇంటర్వ్యూలో కృష్ణకుమారి తెలిపారు.
కృష్ణకుమారిని కాపాడిన ఎన్టీఆర్
‘లక్షాధికారి’ షూటింగ్ అప్పుడు కృష్ణకుమారికి పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఎన్టీఆర్, కృష్ణకుమారిపై ‘దాచాలంటే దాగదులే..’ పాటను చిత్రీకరిస్తున్నారు. పాటలో భాగంగా ఒడ్డు నుంచి సముద్రం లోపలికి నడుచుకుంటూ వెళుతుందీ జంట. అప్పుడో పెద్ద అల వచ్చి, ఇద్దర్నీ లోపలికి లాగేసింది. భయంతో కృష్ణకుమారి నీళ్లు తాగేశారు. ఎన్టీఆర్ ఆమె చేయి వదిలి ఉంటే.. జరగరానిది జరిగేదేమో. కానీ ఆమె చెయ్యి పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. ఆ సంఘటన తలచుకున్నప్పుడల్లా చాలా భయం వేసేదని ఓ సందర్భంలో కృష్ణకుమారి
తెలిపారు.
అమ్మ తీరని కోరిక అదే!
‘‘అమ్మ మరణం మాకు తీరని లోటు. కానీ ఆమె సంపూర్ణమైన జీవితం గడిపినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు కృష్ణకుమారి ఏకైక కుమార్తె దీపిక. బెంగళూరులో భర్త విక్రమ్, తనయుడు పవన్‌తో ఉంటున్నారామె. తల్లి గురించి కొన్ని విశేషాలను దీపిక ‘సాక్షి’తో పంచుకున్నారు.
► మీ అమ్మగారి గురించి రెండు మాటలు..
ఆవిడకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. కానీ మా బంధువుల పిల్లలందరికీ అమ్మలానే వ్యవహరించేది. మనుషులను ప్రేమించే గుణం అమ్మకి ఎక్కువ.
► మనవడితో ఆమె ఎలా ఉండేవారు?
పవన్‌తో అమ్మ చాలా ఎటాచ్డ్‌గా ఉండేది. అమ్మ ఉంటున్న ఎస్టేట్‌కి మా ఇల్లు కొంచెం దూరం. వీలు చిక్కినప్పుడల్లా మేం వెళుతుంటాం.
► మీ అమ్మగారు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి?
‘గురువుని మించిన శిష్యులు’, ‘గుడి గంటలు’, ‘భార్యాభర్తలు’ అంటే చాలా ఇష్టం. అన్ని సినిమాల్లోనూ అమ్మ యాక్టింగ్ బాగుంటుంది. ఈ మూడు సినిమాలు నాకు స్పెషల్‌గా అనిపిస్తాయి.
► మీ అమ్మగారి నుంచి మీకు వచ్చిన లక్షణం ఏదైనా?
అమ్మ చాలా మొండిది. ఏదైనా చేయాలనుకుంటే అది చేయాల్సిందే. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తీసుకునేది కాదు. అయితే అమ్మ తీసుకున్న నిర్ణయాలు దాదాపు తప్పయ్యేవి కాదు. అమ్మ మొండితనం నాకు వచ్చింది.
► మిమ్మల్ని హీరోయిన్‌గా చేయమని చెప్పలేదా?
చేస్తే బాగుంటుంది అన్నది కానీ ఒత్తిడి చేయలేదు. చదువయ్యాక చూద్దామని నాన్న అనేవారు. బేసిక్‌గా నాకే ఇంట్రస్ట్ లేదు. అందుకే సినిమాల్లోకి రాలేదు.
► కృష్ణకుమారిగారికి ఏ వంటలు ఇష్టం?
బంగాళదుంప వేపుడంటే చాలా ఇష్టం. ఇంకా కారప్పొడులు ఇష్టంగా తినేది.
► అమ్మ వంటలో మీకు నచ్చినది?
బర్మీ బేల్ తయారు చేసేది. బేల్‌పురిలా అన్న మాట. బర్మా వాళ్లు చేస్తారు. టేస్టీగా చేసేది. చివరి సారిగా ఆమె బర్మీ బేల్ చేసింది రెండేళ్ల క్రితం.
► సినిమాల్లో పట్టుచీరలు, నగల్లో కనిపించిన పాత్రలు చాలా.. విడిగా ఆమె అలా డ్రెస్ చేసుకునేవారా?
చాలా ఇష్టం. చక్కగా చీర కట్టుకుని, నగలు పెట్టుకునేది. ఆరోగ్యం దెబ్బ తిన్నాక మానేసింది.
► కృష్ణకుమారిగారికి తీరని కోరిక ఏదైనా?
ఒకే ఒక్క కోరిక తీరకుండా వెళ్లిపోయింది. హిందీ సినిమా ‘పద్మావత్’ చూడాలనే కోరిక బాగా ఉండేది. ఆమెకు సినిమాలంటే ఇష్టం. తెలుగుతో పాటు హిందీ సినిమాలూ చూసేది. ‘పద్మావత్’ గురించి చాలాసార్లు చెప్పింది. అది మినహా అమ్మకు ఎలాంటి అసంతృప్తీ లేదు.
– డి.జి.భవాని
కాంతారావుతో
కుమార్తె దీపికతో కష్ణకుమారి
Comments
Please login to add a commentAdd a comment