కృష్ణకుమారి కన్నుమూత | Actress Krishna Kumari Passed Away | Sakshi
Sakshi News home page

కృష్ణకుమారి కన్నుమూత

Published Wed, Jan 24 2018 10:05 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

Actress Krishna Kumari Passed Away - Sakshi

సాక్షి, బెంగళూరు: తెలుగు చలనచిత్ర రంగంలో తన ముగ్ధ మనోహర రూపంతో, అద్వితీయ నటనా కౌశలంతో ప్రేక్షకులను కట్టిపడేసిన అలనాటి అందాల తార, ప్రముఖ నటీమణి కృష్ణకుమారి ఇకలేరు. సుమారు పాతికేళ్లపాటు వెండితెరను ఏలిన ఈ నటీమణి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. 1933, మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లోని నౌహతిలో కృష్ణకుమారి జన్మించారు. ఆమె భర్త ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ దినపత్రిక మాజీ ఎడిటర్‌ అజయ్‌ మోహన్‌ ఖైతాన్‌. ఆయన కొన్నేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి తన ఏౖMðక కుమార్తె దీపిక, అల్లుడు, మనవడితో కలిసి నివసిస్తున్నారు. ప్రముఖ నటీమణి షావుకారు జానకి కృష్ణకుమారికి స్వయానా సోదరి. బుధవారం మధ్యాహ్నం బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య కృష్ణకుమారి అంత్యక్రియలను పూర్తిచేశారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

నవ్వితే నవరత్నాలతో వెండితెర ప్రస్థానం 

1951లో ‘నవ్వితే నవరత్నాలు’ చిత్రం ద్వారా కృష్ణకుమారి తెరంగ్రేటం చేశారు. అనంతరం పల్లెపడుచు, బంగారు పాప, ఇలవేల్పు, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించి తెలుగు చిత్ర సీమపై చెరగని ముద్ర వేశారు. అందచందాలకు తోడు నటనను మేళవించి తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకుల మది దోచుకున్నారు. కన్నడ కంఠీరవ దివంగత డాక్టర్‌ రాజ్‌కుమార్‌తో ఎన్నో చిత్రాల్లో ఆడిపాడారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటులు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కాంతారావులతో కృష్ణకుమారి నటించిన చిత్రాలు సూపర్‌హిట్లుగా నిలిచాయి. తమిళుల ఇలవేల్పు శివాజీ గణేషన్‌తోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో ఎన్టీఆర్‌తో ఆమె అధిక సినిమాల్లో హీరోయిన్‌గా నటించి హిట్‌పెయిర్‌గా ఖ్యాతి పొందారు. ఆమె నటనా కౌశలానికి మూడుసార్లు జాతీయ అవార్డు, రాష్ట్ర స్థాయి నంది అవార్డు, కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్‌ జాతీయ అవార్డులు వరించాయి. 

కృష్ణ కుమారి భౌతికకాయం

కలలో కూడా హాని చేయని మనిషి - షావుకారు జానకి, ప్రముఖ నటి 
నా సోదరి కృష్ణకుమారి ఇంత హఠాత్తుగా నన్ను విడిచి వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. నేను చెన్నై నుంచి వచ్చాక 20 ఏళ్ల నుంచి ఒకే కాంపౌండ్‌లో కలసి ఉంటున్నాం. ఆమె ఎంతో సున్నిత మనస్కురాలు. కలలో కూడా ఎవరికీ హాని చేసే మనిషి కాదు. సినీ పరిశ్రమలో అందరి దగ్గర ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. సినిమాలంటే తనకు ఎంతో మక్కువ. ఎంతో మంది చదువుకోవడానికి ఆర్థికంగా సహాయపడింది. ఆమె మనవడు పవన్‌ అంటే కృష్ణకుమారికి ఎనలేని ప్రేమ. పవన్‌ పెద్దవాడయ్యే వరకు జీవించాలని ఉంది అని తరచూ నాతో చెప్పేది. 

అమ్మ నాకు అన్నీ ఇచ్చింది -దీపిక, కృష్ణకుమారి కుమార్తె

అమ్మ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. కొద్దినెలలుగా తరచూ అనారోగ్యంతో బాధ పడుతూ ఉంది. ఆస్పత్రిలో చికిత్స తర్వాత కొద్దిగా ఆరోగ్యం కుదుటపడింది. మళ్లీ కొద్ది రోజులకే జబ్బు తిరగబెట్టింది. అమ్మ నాకు అన్నీ ఇచ్చింది. ఎంతో మందికి ఎన్నో రకాలుగా అమ్మ సహాయం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement