లెబనాన్ | lebanon Country | Sakshi
Sakshi News home page

లెబనాన్

Published Sun, May 25 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

lebanon Country

ప్రపంచ వీక్షణం
రాజధాని: బీరూట్  
జనాభా: 48,31,233  (తాజా అంచనాల ప్రకారం)  
అధికారిక భాష: అరబ్బీ, ఫ్రెంచ్
విస్తీర్ణం: 10,452 చ.కి.మీ   
ద్రవ్యం: లెబనీస్ పౌండ్  
ప్రభుత్వం: గణతంత్ర పార్లమెంట్ తరహా ప్రభుత్వం

 
బాంబుల దేశం - లెబనాన్: నిత్యం బాంబు పేలుళ్లతో దద్దరిల్లే లెబనాన్, నిజానికి ఎంతో అందమైన ప్రకృతి సౌందర్యం కలిగిన దేశం. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం నుండి చరిత్రలో ఉనికిని కలిగి వున్న దేశం లెబనాన్. దేశంలో సగభాగం పర్వత సానువులతో నిండి ఉంటుంది. ఏడాదిలో ఎక్కువ కాలం మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రకృతి సోయగాలతో పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది.

ఒకప్పుడు బాబిలోనియా, ఈజిప్టు, పర్షియా, గ్రీక్, రోమ్... దేశస్థులతో నిండి ఉండేది. ప్రస్తుతం లెబనాన్‌లో ఆర్మేనియన్లు, అస్సీరియన్లు, కుర్దులు, గ్రీకులు, యూదులు కలిపి దాదాపు 30 లక్షల జనాభా ఉన్నారు.
 1941లో లెబ నాన్‌కు, ఫ్రాన్స్ స్వాతంత్య్రం ప్రకటించింది. 1943లో ఏర్పరచుకున్న ఒప్పందం ప్రకారం లెబనాన్‌లో రాష్ట్రపతిగా మెరోనైట్ జాతివాడు, ప్రధానిగా సున్నీ మతస్థుడు, స్పీకర్‌గా షియా మతస్థుడు ఉండాలి.
 కానీ తర్వాతి కాలంలో ఈ ఒప్పందాన్ని కాలగర్భంలో కలిపేశారు. 1960 తర్వాత ముస్లిం మతస్థులు దేశంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.
 
పర్యాటకుల పాలిట స్వర్గం - బీరూట్ నగరం: ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట బాంబులు పేలుతున్నా పర్యాటకులు మాత్రం లెబనాన్ దేశాన్ని ఎంతో ఇష్టంగా చూడడానికి వస్తుంటారు. ముఖ్యంగా బీరూట్ నగరం పర్యాటకులకు స్వర్గం లాంటిదే. ఇజ్రాయెల్, సిరియా దేశాల దాడులతో బీరూట్ నగరం సగానికి పైగా నాశనమైపోయింది. హోటళ్ళు, విమానాశ్రయం తరచుగా మూతపడుతుంటాయి.ఈ దేశ ప్రజలు అక్కడకు వచ్చే పర్యాటకులను ఎంతో గౌరవంగా చూసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఎవరింటికైనా వెళితే, ముందుగా టీ లేదా కాఫీ ఇవ్వడం వీరి సంప్రదాయం. ఐతే పర్యాటకులు ఇంటిలో ఉండే పెద్దలకు, తర్వాత చిన్నవారికి అభివాదం చేయాలి.
 
ముఖ్యమైన పండుగలు: క్రైస్తవులు క్రిస్‌మస్ పండుగను ఘనంగా జరుపుకుంటా రు. అయితే క్యాథలిక్కులు, ప్రొటెస్టంట్‌లు, మెన్కైట్ క్రిస్టియన్స్... క్రిస్‌మస్‌ను డిసెంబర్ 25న జరుపుకొంటే, ఆర్మేనియన్ క్రిస్టియన్లు మాత్రం క్రిస్‌మస్ పండుగను జనవరి 6వ తేదీన జరుపుకుంటారు. ముస్లిమ్‌లు రంజాన్, బక్రీద్ పండుగలు జరుపుకొంటారు.

 


 
జీవనాధారం - వ్యవసాయం
జనాభాలో అత్యధికులు వ్యవసాయం చేస్తారు. పళ్ళు, కూరగాయలు ముఖ్యంగా ఆలివ్, ద్రాక్ష, ఆప్రికాట్, ఆపిల్, ఉల్లి, బంగాళదుంపలను ఎక్కువగా పండిస్తారు. వీటితో పాటు పత్తి, పొగాకు, చెరకులను అధికంగా పండిస్తారు. ఇప్పుడిప్పుడే సిమెంటు, చక్కెర పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయి.
 
 

 

టైరె నగరం:  టైరె నగరాన్ని 1984లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. ప్రకృతిని చూడాలంటే లెబనాన్‌లో మధ్య తూర్పు ప్రాంతానికి వెళ్ళాల్సిందే. అక్కడ కొండలు, పర్వతాలు, అబ్రహం నది ఎంతో సుందరంగా దర్శనమిస్తాయి. లెబనాన్‌లో ఎక్కడ, ఎప్పుడు శత్రువులు విరుచుకుపడతారో, ఎక్కడ బాంబుల వర్షం కురుస్తుందో చెప్పడం కష్టం. అయినా ప్రతి సంవత్సరం లెబనాన్ దేశాన్ని 20 లక్షల మందికి పైగా యాత్రికులు దర్శిస్తుంటారు.
 
ప్రైవేటు ఆర్మీ: అరబ్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండడంతో అందరూ ప్రైవేటు ఆర్మీలను ఏర్పరచుకున్నారు. 1948 మొదలు ఇప్పటివరకూ ఈ ప్రైవేటు ఆర్మీలను ముందుంచుకొని తమ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆయా నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు ఇజ్రాయెల్ దేశస్థులు ఈ దేశంలోకి విపరీతంగా వలస రావడం, లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడిచేసి కొంత భూభాగాన్ని ఆక్రమించడంతో లెబనాన్ రావణకాష్ఠంగా మారిపోయింది.
 
ప్రత్యేక ఆహార పదార్థం కిబ్బె:  లెబనాన్‌ల ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. వీరు తీసుకునే ముఖ్యమైన ఆహారం - కిబ్బె. ఇది... గొర్రె మాంసం, గోధుమ నూక కలిపి ఉడికించిన పదార్థం. దీనికి తోడు టొమాటో రసం ఉంటుంది. ఇక వీరిలో చాలామంది ఆహారంతో పాటు అరక్ అనే బీరు లాంటి పానీయాన్ని తీసుకుంటారు. ఇది ద్రాక్షరసంతో తయారవుతుంది.ఇక హోటళ్ళలో ‘మెజ్జె’ అనే ఆహారపదార్థం లభిస్తుంది. దీనిని చేపలు, గొర్రె మాంసంతో కలిపి తయారుచేస్తారు. దీనితోపాటు పళ్ళ రసాలు, కాఫీ, పళ్ళు కూడా లభిస్తాయి. అప్పుడప్పుడు అన్నం, ఉల్లిపాయ కూర కూడా దొరుకుతాయి. ఇక ఆర్థికంగా బీదరికంలో ఉన్నవాళ్ళు మాత్రం రోజూ బ్రెడ్ తింటారు. దీనికి తోడు హమ్మస్, ఫూల్ అనే మాంసం, బీన్స్ ముక్కలను తింటారు.
 
సీ క్యాజిల్ కట్టడం
ఇన్ సిడాన్ నగరంలో సముద్రంలో నిర్మించిన సీ క్యాజిల్ కట్టడం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దీనిని 13వ శతాబ్దంలో నిర్మించారు. బిబ్లోస్ నగరంలో ఉన్న బిబ్లోస్ కోటను 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇక, ట్రిపోరీ ఓడరేవు నగరం. ఇది అత్యంత పురాతన నగరం. బాట్రౌన్ నగరం లెబనాన్ దేశంలో మరొక పురాతన నగరం. సముద్రపు ఒడ్డున ఉన్న ఈ నగరంలో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఈ నగరానికి ఒక వైపు సముద్రమే రక్షణగా ఉందా అనిపిస్తుంది. తూర్పు లెబనాన్ ప్రాంతంలో ఉన్న జెష్లే నగరం తూర్పు లెబనాన్‌కు రాజధాని నగరంగా పరిగణన పొందుతోంది.
 
మెసీల్లా కోట
మెసీల్లా కోట బాట్రౌన్ నగరంలో ఉంది. ఇది అతి పురాతనమైన కోట. మధ్య యుగ కాలానికి చెందిన ఈ కోట ఉత్తర బాట్రౌన్ నగరంలో ఉంది. ఈ కోటను అమీర్ ఫక్రుద్దీన్ అనే రాజు సన్నని పొడవైన సున్నపురాతితో 17వ శతాబ్దంలో  నిర్మించాడు. ఇది సహారా ఎన్‌జాజ్ నది ఒడ్డున ఉంది.
 
 

నేషనల్ మ్యూజియం
ఇక బీరూట్ నగరంలోని నేషనల్ మ్యూజియం తప్పక చూడాల్సిందే. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వస్తు సేకరణ మొదలై, అధికారికంగా 1942లో ఇది ప్రారంభమైంది. పురాతన శాఖ డెరైక్టరేట్ జనరల్ చేపట్టిన తవ్వకాల నుండి లభించిన మధ్యయుగానికి చెందిన వస్తువులు, మధ్యయుగం లో ఆవిష్కరించిన వస్తువులు దాదాపు లక్షకు పైగా ఉన్నాయి. చరిత్ర పూర్వకాలంలో నుండి మధ్య యుగ మామ్లుక్ కాలానికి చెందిన 1300 పైగా కళాఖండాలు ప్రదర్శించబడుతున్నాయి.
 అంజార్ నగరంలో ఉన్న టెట్రాపైలాన్‌ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. దీనిని 1300 సంవత్సరాల క్రితం నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement