హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయం నేలమట్టం
ఇద్దరి మృతి, 76 మందికి గాయాలు
హమాస్ అగ్రనేత నస్రల్లా పరిస్థితిపై రాని స్పష్టత
బీరుట్: హెజ్‌బొల్లాను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రతిజ్ఞచేసిన కొద్దిసేపటికే.. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై భారీ బాంబు దాడులు జరిగాయి. బంకర్లను సైతం భూస్థాపితం చేసే భారీ బాంబులతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. బీరుట్ నగరంలోని దహియే పరిధిలోని హరేట్ రీక్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఆరు ప్రధాన భవనాలు నేలమట్టమయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. 76 మంది గాయపడ్డారు.
మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఘటనాస్థలి వద్ద పెద్దసంఖ్యలో జనం గుమికూడారు. హెజ్‌బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను మట్టుపెట్టే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ టీవీఛానెళ్లు పేర్కొన్నాయి. ఏకధాటిగా బాంబులు వేయడం, పెద్ద సైజు బాంబులు వాడటం చూస్తుంటే హమాస్ అగ్రనేతను అంతంచేయడానికే ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా పరిస్థితిపై ఎలాంటి స్పష్టత రాలేదు.
బీరుట్‌లో గత ఏడాదికాలంలో ఇంతటి భారీస్థాయిలో బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి. దాడుల ధాటికి ఆరు ప్రధాన భవంతులు నేలమట్టమయ్యాయి. అవి కూలాక బాంబులను వేయడం చూస్తుంటే అక్కడి భూగర్భంలో నిర్మించిన బంకర్లను కూల్చేయడమే అసలు లక్ష్యమని తెలుస్తోంది.
‘‘ఈ బంకర్లలో∙నస్రల్లా ఉన్నట్లు భావిస్తున్నాం. ఖచ్చితత్వంతో కూడిన లక్షిత దాడి చేశాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. బాంబు పేలుళ్ల ప్రభావంతో ఏకంగా 30 కి.మీ.ల దూరంలోని ఇళ్ల గాజు కిటికీలు, అద్దాలు సైతం పగిలిపోయాయి. గురువారం చనిపోయిన హెజ్‌బొల్లా కమాండర్ అంత్యక్రియలు జరిగిన గంటకే బీరుట్‌పై దాడులు జరగడం గమనార్హం.
పర్యటనను అర్థంతరంగా ముగించిన నెతన్యాహూ
అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూ ఈ దాడుల వార్త తెల్సి వెంటనే తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశం బయల్దేరారు. నస్రల్లా మరణిస్తే తదుపరి కార్యాచరణపై రక్షణ, సైనిక, పాలనా వర్గాలతో చర్చించేందుకు ఆయన తిరిగొస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా దాడి ప్రాంతంలో లేడని హెజ్‌బొల్లా ప్రకటించింది. నస్రల్లా సురక్షితంగా వేరే ప్రాంతంలో ఉన్నారని ఇరాన్ అధికార ‘తస్నీమ్’ వార్తాసంస్థ ప్రకటించింది. దాడులపై అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని ఇజ్రాయెల్ చెబుతుండగా, అలాంటి సమాచారం తమకు అందలేదని అమెరికా స్పష్టంచేసింది.
ఇరాన్ ఆరా..
నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి జరగడంతో ఇరాన్ సుప్రీం ఖమేనీ తన నివాసంలో జాతీయ భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరిచారు. బీరుట్‌పై ఐడీఎఫ్(ఇజ్రాయెల్ రక్షణ బలగాలు) దాడుల నేపథ్యంలో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో కమ్యూనికేషన్ తెగిపోయినట్లు తెలిసింది. అయితే.. ఓ మీడియా సంస్థతో అతడు బతికే ఉన్నాడని హెజ్‌బొల్లా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. అలాగే.. ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి సైతం మీడియాతో మాట్లాడుతూ.. టెహ్రాన్ వర్గాలు అతడి సమాచారం గురించి ఆరా తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment