నస్రల్లా బంకర్‌లో భారీ సంపద | Israel claims it found 500 million in gold cash in Hassan Nasrallah bunker | Sakshi
Sakshi News home page

నస్రల్లా బంకర్‌లో భారీ సంపద

Published Wed, Oct 23 2024 5:16 AM | Last Updated on Wed, Oct 23 2024 5:16 AM

Israel claims it found 500 million in gold cash in Hassan Nasrallah bunker

50 కోట్ల డాలర్ల విలువైన బంగారం, నగదు

వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయెల్‌

జెరూసలేం: బీరుట్‌లోని ఓ ఆస్పత్రి కింద హెజ్‌బొల్లా మాజీ చీఫ్‌ హసన్‌ నస్రల్లా గడిపిన రహస్య బంకర్‌లో 50 కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే బంగారం, నగదు లభ్యమైనట్టు ఇజ్రాయెల్‌ తెలిపింది. హమాస్‌తో పాటు హెజ్‌బొల్లా కూడా ఇలా ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర సున్నితమైన ప్రదేశాలను ఆయుధాల నిల్వకు, మిలిటెంట్లకు ఆశ్రయానికి వాడుతోందని ఆరోపించింది. బంకర్‌ నిర్మాణానికి సంబంధించిన గ్రాఫిక్‌ ఫొటో, అనుకరణ వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగరీ ఆదివారం విడుదల చేశారు.

ఆస్పత్రికి కింద ఉన్నందుననీ బంకర్‌ను కూల్చే ఆలోచన లేదని వెల్లడించారు. హెజ్‌బొల్లాపై చర్యలు తీసుకోవాలని లెబనాన్‌ అధికారులకు హగరి విజ్ఞప్తి చేశారు. హెజ్‌బొల్లా డబ్బును ఉగ్రవాదానికి, ఇజ్రాయెల్‌పై దాడికి వాడేందుకు అనుమతించొద్దని లెబనాన్‌ ప్రభుత్వాన్ని, అధికారులను, అంతర్జాతీయ సంస్థలను కోరారు. ఇందులో హెజ్‌బొల్లా ఆర్థిక విభాగమైన అల్‌–ఖర్ద్‌ అల్‌– హసన్‌ పాత్ర ఉందన్నారు. హెజ్‌బొల్లా కార్యకలాపాలకు నిధులు సమకూ రుస్తున్న తీరును కూడా హగరి వివరించారు.

లెబనాన్‌ ప్రజలు, ఇరాన్‌ ప్రభుత్వం హెజ్‌బొల్లాకు ప్రధాన ఆదాయ వనరులన్నారు. లెబనాన్, సిరియా, యెమెన్, టర్కీల్లో హెజ్‌బొల్లా నడిపే ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఆదాయాన్ని ఉగ్ర కార్యకలాపాలకు వాడుతున్నట్టు చెప్పారు. ‘‘ఇజ్రాయెల్‌ పోరాటం లెబనాన్‌ పౌరులపై కాదు. కానీ వారిని హెజ్‌బొల్లా ఇలా కవచాలుగా వాడుకుంటోంది’’ అని ఆరోపించారు. లెబనాన్‌లో మరో బంకర్లో కూడా కోట్లాది డాలర్ల విలువైన బంగారం, నగదును సోమవారం గుర్తించినట్టు హగరి తెలిపారు.  

బీరుట్‌పై ఇజ్రాయెల్‌ దాడి..13 మంది మృతి
బీరుట్‌/టెల్‌అవీవ్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 13 మంది చనిపోగా 57 మంది గాయపడ్డారు. బీరుట్‌ దక్షిణ శివారుల్లో జరిపిన దాడిలో రఫిక్‌ హరారీ యూనివర్సిటీ ఆస్పత్రికి సమీపంలోని భవనం పూర్తిగా ధ్వంసమైందని అధికా రులు తెలిపారు. అయితే, తాము హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడి చేశామని, ఆస్పత్రిపై కాదని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. అంతకు మించి వివరాలను వెల్లడించలేదు. ఆస్పత్రి ప్రవేశ ద్వారానికి సమీపంలో జరిగిన దాడి దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రచార మవుతున్నాయి. ఇలా ఉండగా, సెంట్రల్‌ ఇజ్రాయె ల్‌పైకి మంగళవారం హెజ్‌బొల్లా పలు రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు తమ గగన తల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకున్నాయని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఒక రాకెట్‌ బహిరంగ ప్రదేశంలో పడిందని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement