భారీ మూల్యం తప్పదంటూ హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా ప్రసంగం
వెనువెంటనే దక్షిణ లెబనాన్‌పై దాడులకు దిగిన ఇజ్రాయెల్
ప్రతిదాడులతో యుద్ధక్షేత్రంగా మారుతున్న సరిహద్దు ప్రాంతాలు
ఇద్దరు ఇజ్రాయెలీ సైనికుల దుర్మరణం
పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు
బీరుట్: చేతిలో ఇమిడే చిన్నపాటి పేజర్‌లు, వాకీటాకీలను పేల్చేసి హెజ్‌బొల్లాపై అనూహ్య దాడులకు దిగిన ఇజ్రాయెల్ శుక్రవారం ఏకంగా లెబనాన్ రాజధాని బీరుట్ గగనతలంలో జెట్‌విమానాలతో రంగ ప్రవేశం చేసి ఒక్కసారిగా యుద్ధవాతావరణాన్ని సృష్టించింది. అనూహ్య పేలుళ్లతో వేలాది మంది హెజ్‌బొల్లా సాయుధుల, పౌరుల రక్తం కళ్లజూసిన ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రసంగించిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై దాడులు చేసి పశ్చిమాసియాలో సమరాగ్నిని మరింత రాజేసింది.
ఇజ్రాయెల్ బలగాలకు హెజ్‌బొల్లా దీటుగా బదులిస్తున్నాయి. ఈ సందర్భంగా అల్–మర్జ్ ప్రాంతంలో హెజ్‌బొల్లా జరిపిన దాడిలో ఇజ్రాయెల్ సైన్యంలోని 43 ఏళ్ల రిజర్వ్ మేజర్ నేయిల్ ఫార్సీ, 20 ఏళ్ల సర్జెంట్ టోమర్ కెరెన్ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు డ్రోన్ దాడిలో, మరొకరు ట్యాంక్ విధ్వంసక క్షిపణి దాడిలో చనిపోయారని ఇజ్రాయెల్ ఎన్12 న్యూస్ వార్తాసంస్థ ప్రకటించింది. బీరుట్ నగరం మీదుగా ఒక్కసారిగా ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు తక్కువ ఎత్తులో చెవులు చిల్లులుపడేలా ధ్వని వేగంతో దూసుకుపోవడంలో అసలేం జరుగుతుందో తెలీక జనం భయపడి పోయారు. తాము చాలా డ్రోన్లను ఆకాశంలో చక్కర్లు కొట్టడం చూశామని స్థానికులు చెప్పారు.
హెజ్‌బొల్లా స్థావరాలపై దాడులు
హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా ప్రసంగిస్తుండగానే∙ హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దాదాపు 150 రాకెట్ లాంఛర్లను ధ్వంసంచేసింది. హెజ్‌బొల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. చాలా సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల పౌరుల ఇళ్లను ఆయుధాలతో నింపి వాటి కింద సొరంగాలు తవ్విందని హెజ్‌బొల్లాపై ఆరోపణలు గుప్పించింది. పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటూ దక్షిణ లెబనాన్‌ను యుద్ధ భూమిగా మార్చిందని ఆరోపించింది. ‘‘ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులతో తరలిపోయిన ఇజ్రాయెలీలు మళ్లీ సరిహద్దు ప్రాంతాల సొంతిళ్లకు తిరిగి చేరుకోవడం మాకు ముఖ్యం. వారి రక్షణ, భద్రత లక్ష్యంగా ఎలాంటి సైనిక చర్యలకైనా మేం సిద్ధం.
సమస్యను మరింత జఠిలం చేస్తూ, ఆలస్యం చేసేకొద్దీ హెజ్‌బొల్లా మరింతగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యవ్ గాలంట్ హెచ్చరించారు. ‘‘ ఈ దాడులు ఆగవు. అయితే హెజ్‌బొల్లాతో పోరు చాలా సంక్లిష్టతో కూడుకున్న వ్యవహారం’’ అని సైన్యాధికారులతో భేటీలో గాలంట్ వ్యాఖ్యానించారు. పరస్పర దాడులతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించకుండా సంయమనం పాటించాలని, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని ఇరుపక్షాలకు అమెరికా, ఫ్రాన్స్ సూచించాయి.
ఈ విపరిణామంతో లెబనాన్‌లో ప్రజారోగ్యం కుదేలవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ గెబ్రియేసిస్ ఆందోళన వ్యక్తంచేశారు. లెబనాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యే వీలుంది. యుద్ధభయాలతో అక్కడి తమ పౌరులు లెబనాన్‌ను వీడాలని బ్రిటిషర్లకు బ్రిటన్ విదేశాంగ శాఖ శుక్రవారం అత్యవసర అడ్వైజరీ జారీచేసింది. మరోవైపు లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు, సోలార్ వ్యవస్థల పేలుళ్లలో చనిపోయిన వారి సంఖ్య గురువారానికి 37కు పెరిగింది.
బీరుట్ ఎయిర్‌పోర్ట్‌లో పేజర్, వాకీటాకీలపై నిషేధం
వేలాది పేజర్‌లు, వాకీటాకీల పేలుళ్లతో కొంతమంది మరణాలు, వేలాదిగా హెజ్‌బొల్లా సభ్యులు క్షతగాత్రులైన ఘటనతో లెబనాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికుల, పౌర విమానయాన సంస్థల విమానాల భద్రతపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా బీరుట్ నగరంలోని రఫీక్ హరీరీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే ఏ విమానంలోనూ పేజర్, వాకీటాకీలను అనుమతించబోమని స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని విమానయాన సంస్థలకు గురువారం మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ ఈ నిషేధం అంశం తెలియజేయాలని విమానయాన సంస్థలకు సూచించింది.
రెడ్‌లైన్ దాటి భారీ తప్పిదం చేసింది: నస్రల్లా
పరస్పర దాడులు మొదలుకావడానికి ముందే గుర్తుతెలియని ప్రదేశం నుంచి హమాస్ చీఫ్ నస్రల్లా టెలివిజన్‌లో ప్రసంగించారు. ‘‘పేజర్‌లు, వాకీటాకీల పేలుళ్లతో వేలాది మంది ప్రాణాలు హరించేందుకు బరితెగించి ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. వేల మందిని రక్తమోడేలా చేసి యుద్ధనేరానికి పాల్పడింది. పరికరాల విధ్వంసంతో మా కమ్యూనికేషన్‌కు భారీ నష్టం వాటిల్లిన మాట వాస్తవమే. అయినాసరే దాడులతో మాలో నైతిక స్థైర్యం మరింత పెరిగింది. ఇజ్రాయెల్‌పై పోరుకు మరింత సంసిద్ధమయ్యాం. అనూహ్య పేలుళ్లతో శత్రువు తన పరిధి దాటి ప్రవర్తించాడు.
అన్ని నియమాలను, రెడ్‌లైన్‌ను దాటేశాడు. వాళ్లు ఊహించినట్లే దాడులు చేస్తాం. ఊహించనంతగా దాడి చేస్తాం. గాజాలో దాడులు ఆపేదాకా మేం ఉత్తరలెబనాన్ సరిహద్దులో దాడులు ఆపబోం. మా దాడుల దెబ్బకి పారిపోయిన సరిహద్దు ప్రాంతాల ఇజ్రాయెలీలు ఎన్నటికీ తమ సొంతిళ్లకు రాలేరు. దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ బలగాలు అడుగుపెడితే అది మాకు సువర్ణావకాశం. వాళ్లు దారుణ ఫలితాలను చవిచూస్తారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment