నలుగురు సైనికులు మృతి
మరో 61 మందికి గాయాలు..
ఏడుగురి పరిస్థితి విషమం
డెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై ఆదివారం హెజ్‌బొల్లా చేపట్టిన భీకర దాడిలో నలుగురు సైనికులు చనిపోగా మరో 61 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. రెండు వారాల క్రితం లెబనాన్‌లో తాము భూతల దాడులు మొదలు పెట్టాక హెజ్‌బొల్లా జరిపిన అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ పేర్కొంది.
గురువారం బీరుట్‌పై చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఆదివారం బిన్యామియా నగరంపై డ్రోన్‌లతో దాడి చేశామని హెజ్‌బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలైన ‘గొలాన్ బ్రిగేడ్’లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను నిరీ్వర్యం చేసేందుకు డజన్ల కొద్దీ మిస్సైళ్లను, అదే సమయంలో పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించామని పేర్కొంది. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలున్నప్పటికీ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం చాలా అరుదైన విషయమని చెబుతున్నారు.
స్కూలుపై దాడి..20 మంది మృతి
గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంలోని స్కూలుపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో పలువురు చిన్నారులు సహా 20 మంది చనిపోయారు. సోమవారం ఉదయం డెయిర్ అల్–బలాహ్‌లోని అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వెలుపల జరిగిన మరో దాడిలో ముగ్గురు చనిపోయారు. దాడులతో టెంట్లతో మంటలు చెలరేగి, 50 మందికి కాలిన గాయాలయ్యాయి.
లెబనాన్‌లో 21 మంది మృత్యువాత
లెబనాన్‌లో ఉత్తర ప్రాంత అయిటో నగరంలోని ఓ చిన్న అపార్టుమెంట్ భవనంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది చనిపోయారని రెడ్ క్రాస్ తెలిపింది. హెజ్‌బొల్లా బలంగా ఉన్న దక్షిణ లెబనాన్, బీరుట్ ఉత్తర శివారు ప్రాంతాలపైనే ప్రధానంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర భాగంపై దాడికి దిగడం ఇదే మొదటిసారి.
‘ఐరాస దళాల మాటున హెజ్‌బొల్లా’
లెబనాన్‌లోని శాంతి పరిరక్షక దళాలు హెజ్‌బొల్లా మిలిటెంట్లకు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఐరాస దళాల ముసుగులో హెజ్‌బొల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించారు. తమ బలగాలు హెచ్చరికలను పాటించి, ఆ ప్రాంతం నుంచి వెంటనే ఐరాస బలగాలు వైదొలగాలన్నారు.
ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం
ఉత్తర గాజా ప్రాంతంలో ఉన్న సుమారు 4 లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల ఒకటోతేదీ నుంచి ఈ ప్రాంతానికి ఆహార సరఫరాను సైతం నిలిపివేసింది. వెళ్లకుండా అక్కడే ఉండే వారిని మిలిటెంట్లుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ప్రణాళికను మాజీ సైనిక జనరళ్లు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment