స్టేషన్‌ ఎప్పుడొస్తుందో.. ఎదురు చూడ్డమెందుకు? | Life Journey Special Story | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ ఎప్పుడొస్తుందో.. ఎదురు చూడ్డమెందుకు?

Published Fri, Sep 27 2019 8:33 AM | Last Updated on Fri, Sep 27 2019 8:33 AM

Life Journey Special Story - Sakshi

పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా? అప్పుడే వచ్చేసిందా?నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసి మురిసి ముక్కచెక్కలయిందీ ! ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్‌ చేసింది నిన్న మొన్నేగా! నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగు మీద పెళ్ళి, పెరట్లో కొబ్బరి చెట్టు కింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి, ఇంటి ఇల్లాలినయి ఎన్నాళయిందనీ ! ముగ్గురు పిల్లల్నేసుకుని రిక్షాలెక్కుతూ దిగుతూ, హాస్పిటళ్లూ, స్కూళ్లూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ, తద్దినాలూ, నోములూ, వ్రతాలూ... ఎన్నెన్ని పండుగలూ, ఎంతెంత హైరానాలూ. ఇంతట్లోకే పెద్దయిపోయామా! అప్పుడే అందరూ అమ్మగారనడం మానేసి మామ్మగారంటున్నారు! అంటే అన్నారుగాని పాపం లేవబోతుంటే చేయందిస్తున్నారు! చేతనున్న చిన్న బ్యాగు తామే తెస్తామని లాక్కుంటున్నారు.

పెద్దయితే అయ్యాం గానీ ఎంత హాయిగా ఉంటోందో!
మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు, ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు, గజగజలాడే చలి వణుకులు వణికాక వెచ్చటి కమ్మటి మట్టి గాలి పలకరించినట్టు... ఎంత హాయిగా వుందో! ఇంకొక పెద్ద విశేషం ఉందండోయ్, ఎవరికీ తెలియనిదీ మనం పైకి చెప్పనిదీ .. ఎవరూ మన మాట వినిపించుకోరు కాబట్టి మనమూ ఎవరి మాటా వినిపించుకోనక్కర్లేదు ! అంతా నిశ్శబ్ద సంగీతం! ఏరుని ఎప్పుడూ గలగలా ప్రవహించమంటే కుదుర్తుందా? సముద్రం దగ్గర పడుతుంటే హాయిగా నిండుగా హుందాగా అడుగులేస్తుంది కదా! అయినా ఎపుడేనా మనకి తిక్క పుట్టినపుడు అడ్డంగా, అర్థంపర్థం లేకుండా వాదించి ఇవతల పడచ్చు. ఇంత వయసు వచ్చాక ఆ మాత్రం చేయ తగమా ! ఈ మధ్యనే నేను కనిపెట్టాను ఇంకొక పెద్ద విశేషం... అస్తమానం ప్రవచనాలు వింటూ హైరానా పడక్కర్లేదు. మనకి చెప్పడం రాదు గానీ వాళ్లు చెప్పేవన్నీ మనకూ తెలుసు! అవునూ... మనం కనపడగానే మొహం ఇంత చేసుకుని ఆనందపడిపోయే మన పిన్నులూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఏమయిపోయారు? ఎప్పుడెళ్లిపోయారు?

అంటే మనమే పెద్దవాళ్లయిపోయామన్నమాట! చూస్తూండగానే సాటివాళ్లు కూడా కనిపించడం మానేస్తున్నారు. కొందరుండీ లేనట్టే. లేకా వున్నట్టే. జీవితానికి విశ్రాంతి దానంతటదే వస్తోంది.
అయినా రైలెక్కాక కిటికీ పక్కన కూచుని దారిలో వచ్చే పొలాలూ, కాలవలూ, కుర్రకారూ, పల్లెపడుచులూ, టేకు చెట్లూ, భవనాలూ, వాటి పక్కనే గుడిసెలూ, అక్కడాడుకుంటూ చేతులూపే చిన్నారులూ, ఉదయిస్తూ అస్తమిస్తూ అలుపెరగక డ్యూటీ చేసే సూర్యనారాయణమూర్తులూ, మిణుకు మిణుకుమని హొయలుపోయే చుక్కలూ చూస్తూ ప్రయాణం ఎంజాయ్‌ చెయ్యాలి గానీ స్టేషనెప్పుడొస్తుందో అని

ఎదురుచూడడం ఎందుకూ?
తీరా అదొస్తే ఏముందీ! జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా!– ‘ప్రయాణం’ అనే పేరుతో డాక్టర్‌ సోమరాజు సుశీల ఇటీవలే రాసుకుని ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన పోస్టులోని కొన్ని భాగాలు.

సోమరాజు సుశీల
ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, రసాయన శాస్త్రవేత్త, ‘సోషల్‌కాజ్‌’ సంస్థ అధ్యక్షురాలు డా. సోమరాజు సుశీల (75) గురువారం మరణించారు. రసాయనశాస్త్రంలో పరిశోధన చేసిన సుశీల ఆ విభాగంలో పి.హెచ్‌డి. చేసిన తొలి తెలుగు మహిళ. రెండు సంవత్సరాల పాటు విజయవాడలోని మేరిస్‌స్టెల్లా కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా ఉన్నారు. 1966 నుంచి 1974 వరకు పుణేలోని నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీలో పనిచేశారు. అనంతరం హైదరాబాద్‌లో భాగ్యనగర్‌ లేబొరేటరీస్‌ పేరున ఒక సంస్థను స్థాపించారు. ‘అఖిల భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం’ సభ్యురాలిగా, ‘భారతీయ తయారీ సంస్థల సంఘం’ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. బాధ్యతలతో ఎంత తీరికలేకపోయినా సేవా కార్యక్రమాలు మాత్రం మానలేదు. తెలుగులో ఎన్నో జాతీయవాద రచనలు చేశారు. దాదాపు ప్రతి కథలోనూ మానవతా స్పర్శ, హృదయావిష్కరణ ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement