సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల రైళ్లు భారంగా నడుస్తున్నాయి. క్రమంగా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నగరంలో చిక్కుకుపోయిన దూరప్రాంతాల ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు 23 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. మే నెలలో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లకు జూన్, జూలై రెండోవారం వరకు బాగానే డిమాండ్ కనిపించింది. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మరింత పెరగడంతో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రత్యేక రైళ్లను ప్రారంభించిన తొలిరోజుల్లో ప్రతి రోజూ వివిధ నగరాలకు 25 వేల నుంచి 30 వేల మంది వరకు ప్రయాణం చేశారు. వెయిటింగ్ లిస్టు కూడా బాగానే ఉండేది.
అయితే ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 20 వేలు కూడా దాటడం లేదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఓ వైపు అన్‌లాక్ ప్రక్రియ మూడోదశకు చేరుకుంది. లాక్‌డౌన్ నిబంధనలను మరింత సడలించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినా, ప్రజల రాకపోకలు మాత్రం ఇప్పట్లో మెరుగుపడే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు దేశంలోని పలు నగరాల్లో వారం, పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తుండడంతో ప్రత్యేక రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి కోల్‌కతాకు వెళ్లే హౌరా ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్ వరకే పరిమితం చేశారు. ఇటీవల కొన్ని సర్వీసులను సైతం రద్దు చేశారు.
ప్రయాణికులు పరిమితం....
లాక్‌డౌన్ కాలంలో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ, తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం మొదట బెంగళూర్–ఢిల్లీ, సికింద్రాబాద్–ఢిల్లీ మధ్య రెండు రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత సికింద్రాబాద్ నుంచి ముంబై, కోల్‌కతా, విశాఖ, తిరుపతి, బెంగళూర్, న్యూఢిల్లీ, తదితర ప్రాంతాలకు సర్వీసులను పెంచారు. దీంతో 23 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వివిధ కారణాల వల్ల హైదరాబాద్‌లో ఉండిపోయిన వారు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జనరల్ బోగీలకు సైతం రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మొదట్లో ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగానే సాగాయి. దీంతో వంద వరకు వెయిటింగ్‌లిస్టును కూడా అమల్లోకి తెచ్చారు. అయితే జూలై నుంచి తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మరింత ఉధృతం కావడంతో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
తగ్గిన ఆదాయం ...
సాధారణంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో రోజుకు 750 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 10.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు.ఒక్క సికింద్రాబాద్ నుంచే సుమారు 220 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తాయి. 1.85 లక్షల మంది బయలుదేరుతారు. దక్షిణమధ్య రైల్వేకు మొత్తంగా రోజుకు రూ.12 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. కానీ ఈ ఆదాయం ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ప్రత్యేక రైళ్ల నిర్వహణ కూడా భారంగా మారింది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్లు మాత్రమే వస్తున్నట్లు అంచనా.
ఆర్టీసీ బస్సుల్లోనూ అంతంతే....
సాధారణంగా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. కరోనా కారణంగా ఏపీకి బస్సులను పూర్తిగా నిలిపివేశారు. పునరుద్ధరణ చర్యలకు ఇటీవల బ్రేక్ పడింది. ప్రస్తుతం తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు మాత్రమే 50 శాతం బస్సులు నడుస్తున్నాయి. వాటిలోనూ ఆక్యుపెన్సీ రేషియో 30 శాతం నుంచి 40 శాతం వరకే ఉంటుందని అధికారులు తెలిపారు. తప్పనిసరైతే తప్ప జనం బస్సుల్లో వెళ్లడం లేదు. ఇటీవల ఒకటి, రెండు రూట్లలో కోవిడ్ పేషెంట్‌లు సైతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు వార్తలు రావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత తగ్గినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్ ఉధృతి కారణంగా హైదరాబాద్‌లో సిటీ బస్సులను ఇప్పట్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment