లైఫ్ ఆఫ్ చార్మినార్ | Life of Charminar | Sakshi
Sakshi News home page

లైఫ్ ఆఫ్ చార్మినార్

Published Wed, Jun 29 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

లైఫ్ ఆఫ్ చార్మినార్

లైఫ్ ఆఫ్ చార్మినార్

రంజాన్ వస్తే చార్మినారే అతి పెద్ద వాల్‌మార్ట్. ఇక్కడ గుండుసూది దొరుకుతుంది. గోల్డ్ బిస్కెట్ దొరుకుతుంది. సేమ్యా దొరుకుతుంది. షేర్వాణీ దొరుకుతుంది.రాళ్ల గాజులు దొరుకుతాయి. రాతి బొమ్మలు దొరుకుతాయి. రంజాన్ అంటే ఒక పండగ మాత్రమే కాదు.వేలాది మందికి ఉపాధి చూపే కల్పతరువు. పని వెతుక్కుంటూ వచ్చేవారి కూడలి. ఈ రంజాన్ నెలలో చార్మినార్ దగ్గర చిరు వ్యాపారాలు చేసుకుంటున్న బతుకు చిత్రం రంగుల రాట్నం ఈ కథనం.

 

ఏదైనా రెండు రూపాయలే... 
‘మేము నలుగురం పిల్లలం. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ల పెళ్లిళ్లు చేయాలి. అబ్బాకు తోడుగా ఉండాలి. అందుకే చదువుకు బ్రేక్ ఇచ్చి ఈ సీజన్‌లో మార్కెట్‌లో ఉంటా’ అన్నాడు రంజాన్ మార్కెట్‌లో టేలాబండిపై ఆడవాళ్ల అలంకరణ వస్తువులను  అమ్ముతున్న మహ్మద్ సోహేల్. ఇతడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇల్లు పాతబస్తీ తలాబ్‌కట్టాలో ఉంది. ఇతని తండ్రి మహ్మద్ చోటు ఇదే చార్మినార్‌లో  పండ్లు,ఫలాలు అమ్ముతున్నాడు. ‘ఇంటి పిల్లాడంటే బాధ్యత తీసుకోవాలి కదా. సినిమాలు షికార్లు చేసే నెల కాదు ఇది. రంజాన్‌లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. మాలాంటి పేదవాళ్లు పైసలు చూడొచ్చు’ అన్నాడు సొహేల్. ఈ రోజుల్లో రెండు రూపాయలకు ఏం దొరుకుతుంది? కాని ఏమేమి దొరుకుతాయో తెలియాలంటే చార్మినార్‌కు రావాలి. సొహేల్ టేలా బండిని చూడాలి. పేద ఆడవాళ్లకు ఈ బండే ఒక షాపింగ్ మాల్.

 

బీహార్ నుంచి వచ్చాడు
‘రంజాన్ కోసమే వచ్చాను. ఇక్కడ పని దొరుకుతుంది కదా’ అన్నాడు బీహార్‌కు చెందిన దీపక్‌కుమార్. ఇతని రాష్ట్రంలో ఇతని ఊరిలో సేద్యం సరిగా లేదు. తినడానికి తిండి కూడా లేదు. ‘ఆ బాధ పగవాడికి కూడా వద్దు’ అన్నాడు దీపక్ కుమార్. ‘రంజాన్ నెలలో చార్మినార్‌లో ఎవరికైనా పని దొరుకుతుందంటే వచ్చాను. వెంటనే దొరికింది. మా సేట్ నాకు రోజుకు రెండు వందలు ఇస్తున్నాడు’ అన్నాడు సంతృప్తిగా.  సేట్ దగ్గర కంటి అద్దాలు పిల్లల వాచ్‌లు తీసుకొని రోజంతా అమ్ముతాడు దీపక్. వచ్చినదంతా సేట్‌కే ఇచ్చేయాలి. కూలీగా రెండు వందలు తీసుకోవాలి. ‘ఈ నెలంతా చేసి పైసలు ఇంటికి తీసుకెళతా. మా వాళ్లు కడుపు నిండా రోటీ తింటాడు’ అని గొప్ప ఆశగా నవ్వాడు దీపక్.

 

హర్ ఏక్ మాల్
‘హర్ ఏక్ మాల్ దస్ రుపయ్’ అని అరుస్తుంటాడు అంజద్ ఖాన్. అంటే ఏ వస్తువైనా పది రూపాయలే అని అర్థం. అతని షాప్ అంతా కలిపి అతడి చేతిలో ఉన్న థర్మాకోల్ షీటే. ఆ షీట్‌కు కమ్మలు, రింగులు గుచ్చి చార్మినార్ కూడలి అంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటాడు. ‘మాది కర్ణాటక. ఇంట్లో చాలా గరీబీ ఉంది.  ఆదుకునేందుకే ఈ రంజాన్ మార్కెట్‌కు వచ్చా’ అన్నాడు అంజద్. ‘శివారు ప్రాంతంలోని గౌస్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నా. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేనే రోజూ బేగంబజార్‌కు వెళ్లి అవసరమైన సరుకులను తెచ్చుకుంటా. దందా బాగానే ఉంది’ అన్నాడు. ఇతను చదువుకోలేదట. ఇతని తర్వాత పుట్టిన నలుగురు తోబుట్టువుల చదవుకు ఈ హర్ ఏక్ మాలే దందానే ఆధారం. ‘చిన్నపిల్లలు వచ్చి ఇంకా తక్కువకు అడుగుతుంటారు. ఇచ్చేయాలని ఉంటుంది. కాని పది రూపాయల కంటే తక్కువకు ఏం ఇవ్వను’ అని నవ్వుతూ వెళ్లిపోయాడు అంజద్.

 

ప్రతి పైసా దాచుకుంటా...
ఖాళీ సంచులు బరువు ఉండకపోవచ్చు. కాని ఆ తండ్రి గుండెల మీద ఇద్దరు ఆడపిల్లల బరువు ఉంది. అందుకే అతడు రోజూ తెల్లవారు జామునే చార్మినార్ వస్తాడు. ఏ అర్ధరాత్రో ఇల్లు చేరుకుంటాడు. ‘మరి వారి పెళ్లిళ్లు చేయాలి. ఇప్పుడు చదువుతున్న వారి చదువుకు సాయపడాలి’ అన్నాడు ఎస్.ఆనంద్. చార్మినార్-చార్ కమాన్ వద్ద ఖాళీ సంచులు అమ్మే ఆనంద్‌కు ఇద్దరు ఆడపిల్లలు.  ప్రస్తుతం ఆ ఇద్దరిని చదివిస్తున్నాడు. పెళ్లి చేయాల్సి ఉంది. తను ఉంటున్న కార్వాన్ నుంచి ప్రతిరోజూ వచ్చి ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగులు అమ్మి రోజుకు అయిదు వందల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. సాధారణ రోజులలో ఈ మొత్తం రెండు మూడు వందలకు మించదు.  రంజాన్ మార్కెట్‌లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయంటున్న ఆయన రోజుకు బయట నయాపైసా కూడా ఖర్చు చేయనంటున్నాడు. ‘సంపాదించేదాని కంటే ఎక్కువ ఖర్చు పెడితే ఎలా? అందుకే నేను ప్రతి పైసా జాగ్రత్తగా దాచి పెడతా. నా కూతుళ్ల కోసం నా ఖర్చులు కూడా తగ్గించుకున్నా. రోజూ వచ్చిన ఆదాయాన్ని ఇంటికి చేరుస్తా’ అన్నాడు ఆనంద్.

 

ఆయుర్వేద రంజాన్
పాతబస్తీలో రంజాన్ మార్కెట్లో కేవలం గృహోపకరణ వస్తువులే కాదు... ఆయుర్వేద ఔషద మూలికలు కూడా దొరుకుతాయి. అలాంటి వర్తకుల్లో ఒకడైన తాండూర్ గ్రామానికి చెందిన నర్సింహులు 1984లో పదో తరగతికి ఫుల్‌స్టాఫ్ పెట్టినప్పటి నుంచి చార్మినార్‌లో ఆయుర్వేద మూలికలు అమ్ముతున్నాడు. ‘నాకు తెలిసిన ఒక మొక్క ఆకుతో పసరు తీసి ఒకరి కాలుకు కడితే మంచి ఫలితం వచ్చింది. అప్పటి నుంచి నేనే అడవిలోకి వెళ్లి ఔషదాలను తెచ్చి విక్రయిస్తున్నాంటా’ అన్నాడు నర్సింహులు. ప్రస్తుతం జియాగూడలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న నర్సింహులు వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు అడవుల్లో తిరిగి ఆయుర్వేద ఔషదాలను తెచ్చి రంజాన్ మార్కెట్‌లో అమ్ముతున్నాడు. ‘రంజాన్ మార్కెట్ ముగిసినా ప్రతి రోజు చార్‌కమాన్ ఫుట్‌పాత్‌పైనే వ్యాపారం చేస్తుంటా. గిరాకీని బట్టి రోజుకు రెండు మూడు వేల వరకు సంపాదిస్తున్నా’ అన్నాడు నర్సింహులు.

 

బతుకు.... ఒక ప్లాస్టిక్ పువ్వు
చేతిలో ప్లాస్టిక్ పూలు ఉన్నాయి. ఇంటి దగ్గర రెండు నిజం పూలు ఉన్నాయి. పాతబస్తీ రణగొణులలో మెల్లగా వినిపించే ఆ గొంతు వెనుక విషాదమూ ఉంది. గుల్జార్‌హౌజ్ వద్ద ప్లాస్టిక్ పూలు అమ్మే మంజుల బతుకు ఇది. భర్త తాగి తాగి చనిపోయాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘ఏం చేయను... ఈ ప్లాస్టిక్ పూలతో వారిని పోషించుకుంటున్నా’ అందామె. మంజులది ఆదివాసీల తెగ. దాదాపు సంచార జీవితమే. జాతరలు, ఉత్సవాలు జరిగే చోటల్లా ప్రత్యక్షమై చిరు వ్యాపారాలు చేస్తూ జీవిస్తోంది. ‘ఈ రంజాన్ అయ్యే వరకూ ఇక్కడే నా బతుకుతెరువు. ఆ తర్వాత ఎక్కడికి పోవాలో తెలియదు’ అంది మంజుల గిరాకీ కోసం వళ్లంతా కళ్లు చేసుకుని అటూ ఇటూ చూస్తూ. ‘ఈ రంజాన్‌లోనే ఒక్కోసారి రోజుకు వెయ్యి రూపాయలకు అమ్ముతా. అప్పుడు మాత్రం ఇంటికి వెళుతూ వెళుతూ పిల్లలకు బిరియానీ తీసుకెళతా’ అని చెప్తున్న ఆమెలో ఒక అలసిపోని అమ్మ కనిపించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement