
ఈ విషయంలో అన్నీ డిస్‌లైక్‌లే!
ఇప్పటికే అనేక రకాలుగా యూజర్లను నియంత్రిస్తున్న ఫేస్‌బుక్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఫేస్‌బుక్ యూజర్లకు తెగ ఇబ్బంది కలుగుతోంది. ఫేస్‌బుక్ ఖాతాల్లోకి తరచూ తొంగిచూసే వాళ్లకు ఇప్పటికే ఈ విషయం అర్థమై ఉంటుంది. ఎఫ్‌బీ పేజీల్లో వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అయిపోతున్నాయి. ఎవరెవరో షేర్ చేసిన వీడియోలు, ఏ పేజీలోనో పోస్టైన వీడియోలు, మనస్నేహితులెవరో లైక్ కొట్టిన వీడియోలు... మన పేజీల్లో ప్లే అయిపోతున్నాయి. మన ప్రమేయం లేకుండానే అవి ప్లే అవుతుండటమే ఇక్కడ సంకటం.
డాటా ప్లాన్ దారి తప్పుతోంది!
ఫేస్‌బుక్ పేజీలో డిస్‌ప్లే అయ్యే వీడియోల్లో మనకు ఇష్టమైన వాటిని సెలెక్ట్ చేసుకుని ప్లే చేసుకుంటే అదో తుత్తి. అయితే ఇలా యాంత్రికంగా అవే ప్లే అయిపోవడం వల్ల చాలామందికి డాటా ప్లాన్ యూసేజ్‌లో ఇబ్బందులు వ స్తున్నాయి. వీడియో ప్లేయింగ్‌కు ఎక్కువ డాటా వినియోగం అవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. ఇలా పేజీలో ప్రతి వీడియో ప్లే అయిపోవడం వల్ల తక్కువ రీచార్జ్ ప్లాన్‌లతో ఇంటర్నెట్ డాటాను వేయించుకున్న వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. బ్రౌజింగ్ చార్జీలు పెరిగిపోతాయి. ఆలోచిస్తే ఇదో పెద్ద సమస్యే. అనుభవించే వాళ్లకు ఇంకా పెద్ద సమస్య.
అన్ని వీడియోలూ చూడాలా?
ఇప్పటికే ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్ అవుతున్న కంటెంట్ చూడదగిన, చూడాల్సిన దాని కన్నా.. చూడ కూడని కంటెంటే ఎక్కువగా ఉంటోంది! అవాంఛితమైన, అనుచితమైన వీడియోలు ఎన్నో అప్‌లోడ్ అవుతున్నాయి. ఈ విషయంలో జుకర్‌బర్గ్ టీమ్‌కు డిస్‌లైక్‌లు తప్పవు. అయితే ఈ వీడియో ప్లేయింగ్ విషయంలో ఫేస్‌బుక్ యాజమాన్య ప్రయోజనాలు ఏమున్నాయో ఈ ఆటోమెటిక్ ప్లే సిస్టమ్ వల్ల కొన్ని అరుదైన వీడియోలు కూడా హఠాత్తుగా యూజర్ల కంట పడుతున్నాయి. మామూలుగా వీడియోలను ప్లే చేసి చూసే అలవాటు లేని వాళ్లు కూడా ఇప్పుడు వారి ప్రమేయం లేకుండా వీడియోలను వీక్షిస్తున్నారు.
దీనివల్ల కొంత మంది నెటిజన్లకు ఫేస్‌బుక్ నుంచి కలిగే వినోదపు పాళ్లు పెరిగి ఉండవచ్చు. కానీ వాళ్లు కోరుకోకుండానే.. అందించే ఈ (అ)సౌకర్యం మాత్రం వారి స్వేచ్ఛా హననమేనని చెప్పాలి.