ఇంట్లో... ఇలా..!
సహజంగా!
మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వాడే కన్నా, ఇంట్లో తీసుకునే జాగ్రత్తల వల్లే చర్మం, శిరోజాల సౌందర్యం మెరుగ్గా ఉంటుంది. వంటింటి దినుసులతోనే ఒంటికి మెరుగులెన్నో పెట్టి, మేలైన ప్రయోజనాలన్నో పొందవచ్చు.
టొమాటోను మెత్తగా చేసి, అందులో టేబుల్‌స్పూన్ పాలు కలపాలి. దూదితో ఈ మిశ్రమాన్ని అద్దుకుంటూ ముఖానికి, మెడకు, చేతులకు రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకుంటే ఎండకు కమిలిన చర్మం సహజరంగుకు వస్తుంది. చర్మం బిగుతుగా మారి, ముడతలూ తగ్గుతాయి.
పంచదార, అలోవెరా, ఓట్స్ రెండేసి టీ స్పూన్ల చొప్పున తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మృదువుగా అయ్యేంత వరకు కలిపి, ముఖానికి ప్యాక్‌లా వేయాలి. వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడిని నీళ్లలో వేసి నానబెట్టాలి. తెల్లవారిన తర్వాత ఆ నీటితో జుట్టును తడిపి, ఆరనివ్వాలి.
ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తలకు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. జుట్టు నిగనిగలాడుతుంటుంది.
మూడు టేబుల్ స్పూన్ల ఓట్ పౌడర్‌లో తగినంత ద్రాక్ష రసం కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. పొడి చర్మం గలవారు ఓట్స్‌లో తేనె, పాలు కలపాలి.