కూతురు కమలతో కౌసల్య (98)
కొద్దిరోజులుగా టిఫిన్‌లు లేవు. కౌసల్య నీరస పడిపోయారు. ఇళయరాజా వచ్చేవారు. పొంగలి అడిగేవారు. జీఆర్టీ రాధాకృష్ణన్ వచ్చేవారు. ఇడ్లీ వడ అడిగేవారు. కౌసల్య టిఫిన్ సెంటర్ మరి! రోజుకు నాలుగొందల మందికి బ్రేక్‌ఫాస్ట్. లాక్‌డౌన్‌తో బ్రేక్ పడింది. పెట్టే చెయ్యికి.. పని లేదు. వచ్చేవాళ్లు లేక ఉత్సాహం లేదు. ఒంటరి తల్లిపక్షి తనిప్పుడు!
ఉదయం పళ్లు తోముకోవడం పూర్తి కాగానే చెన్నై, నంగనల్లూర్‌లోని 45వ నంబరు వీధి వీధంతా ‘కమల పాటీ కడాయ్’ టిఫిన్ సెంటర్ ముందు ఆకలి రెక్కల్ని కట్టుకుని మరీ వాలిపోయేది. ఆకలి లేకున్నా అలవాటుగా వెళ్లి ఆరగించేంత రుచిగా ఉంటాయి అక్కడి ఇడ్లీ, వడ, పూరి, పొంగలి! నాలుగు తరాల మహిళలు ఆ టిఫెన్ సెంటర్‌ని నడుపుతున్నారు. 98 ఏళ్ల కౌసల్య, ఆమె కూతురు 72 ఏళ్ల కమల, ఆమె కూతురు 47 ఏళ్ల జయంతి, ఇంకా.. జయంతి కూతుళ్లు. రోజుకు నాలుగు వందల మంది వచ్చేవారు.
ఆరుగంటల నిర్విరామ జ్వాలల తర్వాత గానీ వాళ్ల టిఫిన్ సెంటర్ స్టౌలు చల్లారేవి కావు. లాక్‌డౌన్‌తో ఇప్పుడా సెంటర్‌తో పాటు, వీధీ కళ తప్పింది. టిఫిన్ ప్రియులు దిక్కులేని గూటి పక్షులు అయ్యారు. వారికన్నా ఎక్కువ డీలా పడింది కౌసల్యమ్మ. మూత వేసిన టిఫిన్ సెంటర్ తలుపుల గ్రిల్స్ సందుల్లోంచి నిరంతరం ఆమె అలా నిలబడి నిర్మానుష్యమైన వీధిలోకి చూస్తూనే ఉంటున్నారు. డబ్బు కోసమే ఆమె ఈ టిఫిన్ సెంటర్‌ని నడుపుతున్నప్పటికీ.. కడుపు నిండా తినేవాళ్ల ను చూస్తున్నప్పుడు కలిగే ‘ఎటాచ్‌మెంట్’ ఆమెకు తన క్యాష్ కౌంటర్‌తో ఏనాడూ ఏర్పడలేదు!
∙∙l
ఎనభై ఎనిమిదేళ్ల వయసులో కూతురి పేరుతో ‘కమల పాటీ కడాయ్’ టిఫిన్ సెంటర్ తెరిచారు కౌసల్య. చిదంబరం దగ్గరి సిర్కళిలో ఉండేవారు. భర్త చనిపోవడంతో చెన్నై వచ్చారు. ఈ పదేళ్లలో ఆమెకెప్పుడూ వయసు మీద పడినట్లుగా అనిపించలేదు. లాక్‌డౌన్ మొదలైన ఈ ఇరవై రోజుల్లోనే వృద్ధాప్యాన్ని ‘ఫీల్’ అవుతున్నారు. ఆ భారం నుంచి తేలిక పడేందుకు మునిమనవరాళ్లతో గడుపుతున్నారు. పూజలో మనసు లగ్నం చేస్తున్నారు. టీవీ ముందు కూర్చోగానే మళ్లీ టిఫిన్ సెంటర్ గుర్తొచ్చి గ్రిల్స్ దగ్గరికి వెళ్లిపోతున్నారు.
లాక్‌డౌన్ తర్వాత కూడా కొన్నాళ్ల వరకు కస్టమర్ల దగ్గర్నుంచి కౌసల్యకు ఫోన్‌లు వస్తుండేవి.. డోర్ డెలివరీ చేస్తారా? అని. కొందరైతే.. మీరు డెలివరీ చెయ్యక్కర్లేదు. మేమే మీ దగ్గరికి వచ్చి డెలివరీ తీసుకుంటాం అనేవారు. ఇవన్నీ ఇప్పుడు ఆమెకు గుర్తుకొస్తున్నాయి. ఉదయాన్నే 8 గం.కి హోటల్ మొదలయ్యేది. పొంగలి, ఇడ్లీ వడ, పూరీ కోసం కస్టమర్‌లు కిక్కిరిసేవాళ్లు. కమల, జయంతి, మునిమనవరాలు శాయా.. వడివడిగా ఎవరికి కావలసినవి వారికి అందించేవారు. ఇళయరాజా, జీఆర్టీ ఓనర్ వంటి వాళ్ల కార్లు వచ్చి హోటల్ ముందు ఆగినప్పుడు కౌసల్యే మర్యాదపూర్వకంగా లేచి వారి దగ్గరకు వెళ్లేవారు. ‘అయ్యో.. మీరెందుకమ్మా.. మేము తెప్పించుకుంటాం లే..’ అని వాళ్లు వారించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
వారసత్వంగా టిఫిన్ సెంటర్ బాధ్యతలు తీసుకున్న కమల, జయంతి.. ఆ ఇంట్లో తొలి గ్రాడ్యుయేట్‌లు. ఉద్యోగాల్లోకి వెళ్లకుండా కౌసల్యకు తోడుగా ఉండిపోయారు. కమల కొన్నాళ్లు ప్రముఖ జర్నలిస్టు చో రామస్వామి ఇంట్లో సహాయకురాలిగా ఉన్నారు. ఇప్పుడీ హోటల్ పేరు ఆమెదే అయినట్లుగా, హోటల్ నిర్వహణలో కీలకమైన వ్యక్తి కూడా ఆమే. తెల్లవారు జామున 3.30 కి లేచి, తల్లి కాళ్లకు నమస్కరించి పనిలో పడతారు కమల.
Comments
Please login to add a commentAdd a comment