నన్నడగొద్దు ప్లీజ్
రామ్‌గారూ... నేను ఇంటర్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. తను నా ఫ్రెండ్. తనతో అన్నీ షేర్ చేసుకునేవాడిని. ఫిబ్రవరి 14న ప్రపోజ్ చేశాను. తను రిజెక్ట్ చేసింది. బహుశా నేను సీరియస్ కాదు అనుకుందేమో. ప్రస్తుతం నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఇద్దరి మధ్య మాటలు లేవు. ఇప్పటికీ తనని ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవాలని ఉంది. కాని ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కావడం లేదు. నిజమైన ప్రేమను అమ్మాయిలెప్పటికీ అర్థం చేసుకోలేరా? మీ సమాధానంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
– రమేశ్, నెల్లూరు
మనం ప్రేమించాం కాబట్టి మనని ప్రేమించాలనేది రూల్ కాదు. ప్రేమికుడివి కాబట్టి స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మాయికి ప్రపోజ్ చే శావు. నీ స్నేహం నచ్చినా నీ ప్రేమకు తను కమిట్ కావాలని అనుకోలేదు. అది తన తప్పెలా అవుతుంది? తను రిజెక్ట్ చేసిన తర్వాత కూడా తనే కావాలనే ప్రయాసపడ్డంలో, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కాని ఆ ప్రయత్నంలో గెలవాలనుకోవడం మాత్రం తప్పే. నువ్వు కోరుకుంటే తను నిన్ను ప్రేమించదు. తను తలుచుకుంటే ప్రేమేంటి, పెళ్లేంటి, జీవితాన్నే రాసిస్తుంది. అంత ఉన్నతమైంది స్త్రీ. అనవసరంగా అమ్మాయిలకు ప్రేమను ఆదరించడం రాదని నిందించొద్దు. నీకే ఓ చెల్లెలు ఉందనుకో... సొంత చెల్లెలు కాకపోయినా ఓ కజిన్ సిస్టర్ అయితే ఉండే ఉంటుంది. తనని ఎవరో వెంటబడి ఆరేడేళ్లుగా ప్రేమించమని వేధిస్తుంటే నువ్వేం చేస్తావ్? నీ చెల్లెలిని ఒప్పిస్తావా? లేక ఆ ప్రేమికుడి దగ్గరికెళ్లి ‘నా చెల్లెలు నిన్ను ప్రేమించడం లేదు, అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు, కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’ అని వార్నింగ్ ఇస్తావా? నాకు తెలిసి బాధ్యత గల అన్నయ్యగా నువ్వు రెండో ఆప్షనే ఎంచుకుంటావు.
ఇంకొకరికి చెప్పగలిగిన నీతి మనకు వర్తించదా? నీ ప్రేమ గొప్పది కాదని నేను అనడం లేదు. గొప్పదని నువ్వు అనుకోవడంలో కూడా తప్పులేదు. కాని నీ ప్రేమ వల్ల ఇంకొక వ్యక్తికి కష్టం కలుగుతుందన్న విషయం అర్థం చేసుకోలేకపోవడం తప్పు. జీవితంలో ప్రయోజకుడిగా ఎదుగు. సమాజాన్ని ప్రేమించడం నేర్చుకో. ఒక్క హృదయంలో హీరోగా నిలబడే బదులు, వేలాది మనసుల్లో చెరగని ముద్ర వేసుకో. ప్రేమ సంతోషానికి విత్తనం కావాలి. కష్టాలకు బీజం కాకూడదు. ప్రేమను ఇవ్వు... కోరుకోవద్దు. అప్పుడు అదే వస్తుంది. ‘సార్... మీకివాళ అరటిపండు లేదు’ అంది నీలాంబరి. ‘ఏం’ అన్నాను. ‘ప్రేమ క్వశ్చన్‌కు తిక్క ఆన్సర్లు ఇస్తారనుకుంటే ఇంత భారీ డైలాగులు ఏంటి సార్? మీ ఆన్సర్ వారికి అరగదు. నా అరటి పండు మీకరగదు’ అని తేల్చేసింది నీలాంబరి.
లవ్ డాక్టర్ రీవిజిట్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్
ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్