నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
సార్! నా పేరు మూర్తి. నా వయసు 19. నాకు నా మరదలంటే చాలా ఇష్టం. తనకి ఆరు నెలల క్రితం ప్రపోజ్ చేశాను. కాని తను రిజెక్ట్ చేసింది. మంచి ఫ్రెండ్స్‌గా ఉందామని చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది. దానికి నేను ఒప్పుకోవడం లేదు. అయినా నాతో బాగానే మాట్లాడుతోంది. తనకి అసలు నా పైన ఎలాంటి అభిప్రాయం ఉందంటారు? – మూర్తి, ఈమెయిల్
ఇంత చిన్న వయసులో నీకెంత ప్రాబ్లమ్ వచ్చింది భయ్యా! నువ్వు అవునన్నా, అమ్మాయి కాదంది కదయ్యా. మాట్లాడడం మానేసి చెంప మీద పీకుంటే బాగుండేదనుకుంటున్నావ్ కదూ! నీ చెంప ఛెళ్లు మనేది, సమాజం ఘొల్లున నవ్వేది, నీ ప్రేమ చెల్లయ్యేది. దెబ్బకు దిమాక్ ఫ్రీ అయిపోయేది. చక్కగా చదువుకునే వాడివి, లేకపోతే ఇంకో అమ్మాయి దగ్గర చెంప ఛెళ్లుమనిపించుకోవడానికి రెడీ అయిపోయేవాడివి. ఇప్పుడా అమ్మాయి నవ్వుతూ మాట్లాడడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇది నిజంగా చాలా పెద్ద ప్రాబ్లమే. నాకు తెలుసు తను నీతో ఎందుకు చక్కగా మాట్లాడుతుందో. సంస్కారవంతురాలు. మంచి పెంపకంలో ఎదిగిన బంగారం. నీ ప్రేమను తిరస్కరించినా, నీ అభిమానాన్ని గౌరవించింది. నీ జీవితం కూడా చల్లగా ఉండాలని నువ్వు గొప్పవాడివి కావాలని ఆ మంచి మాటకీ, ఆ చిరునవ్వుకీ అర్థం. నీ మరదలు కాబట్టి నీ కంటే చిన్నదే అయి ఉంటుంది.
అంత చిన్న వయసులో కూడా తను చూపిన బ్యాలెన్స్ నిజంగా గ్రేట్. తనని చూసి... ప్రేమించడానికి బదులు గౌరవించడం నేర్చుకో. నువ్వు రెండు విషయాల్లో చాలా అదృష్టవంతుడివి. మొదటి విషయం దేవుడు నీకు అంత మంచి శ్రేయోభిలాషిని ఇచ్చాడు. ఇక రెండవ విషయం ఏంటంటే కొంచెం సిగ్గేస్తోంది... ఇబ్బందిగా ఉంది...‘నువ్వు తప్పదు చెప్పాలి’ అంటేనే చెబుతున్నా. దేవుడు నీకు నా లాంటి లవ్ డాక్టర్‌ని ఇచ్చాడు. అంటూ నవ్వుతూ తలకాయ పైకెత్తాను. బల్లమీదున్న అరటిపండును నీలాంబరి వెనక్కు లాగింది. మర్చిపోయాను, మూడో విషయం. మా ఇద్దరికంటే సూపర్ బెటర్. నీలాంబరిని ఇచ్చాడు దేవుడు. నీలాంబరి నవ్వుతూ అరటిపండును మళ్లీ ముందుకు తోసింది. బై! అల్ ది బెస్ట్.
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్
ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1,
బంజారా హిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com