నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హలో గురువుగారూ, నమస్తే. ఎలా ఉన్నారు? మీకు ఏంటండీ, ఎంతో జాలీగా నీలాంబరిగారు అరటిపండ్లు ఇస్తూ ఉంటే, తింటూ గడిపేస్తున్నారు. మా బాధలకు ఒక్కసారైనా స్ట్రయిట్ ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఒక అమ్మాయితో బాగా క్లోజ్‌గా మూవ్ అయ్యేవాడిని. నాకు తెలియకుండానే తనపై నాకు ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ తనకు చెప్పలేదు, అది ప్రాక్టికల్‌గా వర్కవుట్ కాదు అని తెలుసుకుని కేవలం ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ, ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే, తనకు కూడా నా మీద ఫీలింగ్స్ మొదలయ్యాయని. అయితే తనకు ప్రేమ, దోమ మీద అంత నమ్మకం లేదు అని నాతో చెప్పింది. నాకు కూడా నా ఫ్యామిలీ, కెరీర్ చాలా ముఖ్యం. ఇంకా మా నేపథ్యాలు కూడా వేరు.
సో, లోకకల్యాణం దృష్ట్యా ఇంక మేము మాట్లాడుకోవద్దు అని డిసైడ్ అయ్యాం. కానీ, తనను నా ఆలోచనలు, నన్ను తన ఆలోచనలు వదలడం లేదు. నాకు ప్రతిరోజు తెల్లవారుఝామున తను కలలో వస్తోంది. ఉలిక్కిపడి లేస్తాను. ఇంక రోజంతా తన ఆలోచనలే. ఈ బాధ నుండి నాకు ఉపశమనం కలగడానికి మంచి మార్గం చూపించండి. – అమీర్ (పేరు మార్చడమైనది)
సినిమా కథలు చెబుతున్నాడు సినిమా కథలు. అమ్మాయిని లవ్ చేయకముందే క్లోజ్‌గా మూవ్ అయ్యాడట. ఆమెకు కూడా ప్రేమ పురుగు కుట్టిందని ముందే తెలిసిపోయింది. లోక కల్యాణం కోసం మాటల్లేవట. అర్లీ మార్నింగ్ డ్రీమ్స్ వస్తున్నాయట. ఉలిక్కిపడి లేస్తున్నాడట. రోజంతా ఏడుస్తున్నాడంట. ‘ఏంటి సార్ మీలో మీరే గొణుక్కుంటున్నారు?’ ఏమీ లేదు జస్ట్ లైక్ దట్. ‘పరవాలేదు చెప్పండి సార్’
స్నానం చేసి... గోచీ కట్టుకుని... అర్ధరాత్రి... ‘సార్ అర్ధరాత్రా?’ అర్ధరాత్రి నుంచి అర్లీ మార్నింగ్ దాకా బస్టాండ్ దగ్గర సింగిల్ లెగ్‌మీద 30 నైట్స్ నిలబడితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అమీర్ సారు గారూ. ‘ఏంటి.. సారూ గారు వెటకారాలూ అలా చేస్తే ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుద్ది సార్...’ రాత్రి పడుకోకపోతే మార్నింగ్ కల రాదు. ఉలిక్కిపడి లేవడు. సన్నాసి అయిపోయాడని తెలిస్తే అమ్మాయి\ పట్టించుకోదు. సమాజం పూజిస్తుంది. సమాజం పూజిస్తే ప్రేమా గీమా దోమా లాంటి పెంట ఆలోచనలు రావు. అంతా హ్యాపీస్!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com