అబద్ధం రాజ్యమేలుతుంటే | lying Kingdom | Sakshi
Sakshi News home page

అబద్ధం రాజ్యమేలుతుంటే

Published Tue, Jun 2 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

అబద్ధం రాజ్యమేలుతుంటే

అబద్ధం రాజ్యమేలుతుంటే

‘‘ఇదిగో రెండు నిమిషాల్లో వస్తున్నా’’ అని పది నిమిషాల తర్వాత వచ్చినా ఎవరికీ మనస్సు చివుక్కుమనడం లేదు.
 రుణమాఫీ అని చెప్పి చేయక పోయినా, ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోయినా, సాయం చేస్తామని చేయకపోయినా...  ‘ఆఁ... అబద్ధం మామూలేలే’ అన్న ధోరణి మన ఇంట్లోకి కూడా వచ్చేసింది. పిల్లలు అబద్ధం చెప్పినా క్షమించేస్తున్నాం. పరస్పరం అబద్ధాలను సహిస్తున్నాం. మొత్తానికి అబద్ధం రాజ్యమేలుతోంది. యథా రాజా... తథా కుటుంబం. లీడర్లను మార్చే శక్తి మనకు ఉందో, లేదో చెప్పలేము కానీ... కుటుంబాన్ని మాత్రం మార్చుకునే అవకాశం ఉంది. ఏమో ఇంట గెలిస్తే రచ్చ గెలుస్తామేమో!

 మోసం చేయాలనో, లాభం కోసమో, భయంతోనో చెప్పే అబద్ధాలు చేటు చేసే అబద్ధాలు. అలా చేయకుండా ఉండాలంటే... ముందు చేటు చేయని అబద్ధాలు కూడా మానేద్దాం. అదే ‘అబ్బా... ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావే’’ లాంటివి. అప్పుడు మెల్లగా నిజం చెప్పడం అలవాటవుతుంది. మీ అందమైన కుటుంబం ‘నిజంగానే’ విల్ లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్.
 
 
 సమాజాన్ని కుటుంబం అనుకునే వ్యక్తి గొప్ప లీడర్.కుటుంబాన్ని సమాజం అనుకునే వ్యక్తి గొప్ప పేరెంట్. ఆ లీడరు, ఈ పేరెంట్ ఎప్పుడూ సత్యమే పలకాలి. సత్యాన్ని నిలబెట్టాలి. కానీ మనం అబద్ధానికి అలవాటు పడిపోయాం. అబద్ధాన్ని సహించడానికి, భరించడానికీ అలవాటు పడ్డాం. అబద్ధాన్ని క్షమించేస్తున్నాం కూడా. లీడర్ అబద్ధం ఆడితే ‘మన ఖర్మింతే’ అని సరిపెట్టుకుంటున్నాం. ఇంట్లో చిన్నారి అబద్ధం చెబితే, మురిసిపోయి బుగ్గలు పుణుకుతున్నాం. ఈ ‘టాలరెన్స్’ మంచిది కాదు. ఇంతకీ మనం అబద్ధాన్ని ఎందుకు సహిస్తున్నాం? మన ఇంట్లో, సమాజంలో నిజానికి ‘రివార్డు’ ఉండడం లేదనా? చిన్న ఉదాహరణ: కాలేజీ ఎగ్గొట్టి సినిమాకు వెళ్లానని నిజం చెబితే పనిష్మెంట్. సినిమాకు వెళ్లి, స్పెషల్ క్లాసుకు వెళ్లొచ్చానని అబద్ధం చెబితే రివార్డు.

 అంత తేలికా!
 లోకంలో తేలికైన పని అబద్ధం చెప్పడం అని అంటారు. ఎంతో  కష్టమైన పనిని కూడా ఒక్క అబద్ధంతో నమ్మించేయొచ్చు. ఎదుటివారిని ఏమార్చవచ్చు. అబద్ధాలు చెప్పి పవర్‌లోకి వచ్చిన వారు చరిత్రలో ఉన్నారు. వర్తమానంలోనూ ఉన్నారు. తలెత్తి సూర్యుణ్ణి చూస్తే మనకు కిరణం తాకాలి. శిరస్సెత్తి శిఖరాన్ని చూస్తే మనకు స్ఫూర్తి అందాలి. కాని కళ్లు తెరిచినా మూసినా అబద్ధమే కనిపిస్తుంటే... అబద్ధమే నిజమైన రూపంలా ప్రచారం పొందుతుంటే.... ఆ ధోరణి పై నుంచి కిందకు దిగుతుంది. కుటుంబాలలోకి కూడా పాకేంతగా బలపడుతుంది.
 
 ఇంట గెలిచి రచ్చ గెలవాలి!
 మార్పు ఎక్కడ మొదలవ్వాలి? ముందు మన ఇంట్లో అబద్ధాన్ని సహించడం మానేస్తే, నిజాన్ని గౌరవిస్తే, నిజం చెప్పడాన్ని ప్రోత్సహిస్తే, నిజం చెప్పే ధైర్యాన్ని మెచ్చుకుంటే మన ఇంటి నుంచి ఒక నిజమైన సమాజం నిర్మితమవుతుంది. అలా కాకుండా అబద్ధాన్ని ప్రోత్సహించి, అబద్ధం చెప్పేవాళ్ళని గౌరవించి, అబద్ధపు బతుకుని ఆరాధిస్తే, అబద్ధాల లీడర్లు నిజాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇష్టానుసారంగా రాజ్యమేలతారు. ‘మార్పును నీతోనే మొదలుపెట్టు’ అన్నాడు గాంధీ మహాత్ముడు. ఆయన అందించి సత్యం అనే చేతికర్రను ఇవాళ ప్రతి చిన్నారి పట్టుకుని ముందుకు నడపాలి. ఆయన ఆదర్శాన్ని ముందుకు నడిపించాలి.
 
 అప్పుడు నిలదీయొచ్చు!
 అబద్ధం చెపితే కష్టాల నుంచి సులువుగా తప్పించుకోవచ్చు. అయితే  అది కొద్ది సమయమే. కాని, ఒకసారి నిజం రుచి ఎరిగితే అబద్ధమే చేదు అనిపిస్తుంది.  తర్వాత మన చుట్టూ, మన ఎదుట నిజమే ఉండాలన్న ఆకాంక్ష పెరుగుతుంది. అప్పుడు  నిజం చెప్పని వారిని నిలదీయాలనిపిస్తుంది. నిజం మనలో అలాంటి శక్తిని ఇస్తుంది. మన పిల్లలకు ఒక నిజమైన సమాజాన్ని అందిస్తుంది.
 
 అబద్ధాల వెనుక అసలు కారణాలు
అవసరమున్నా, లేకపోయినా... అతి తేలిగ్గా ఆడే అబద్ధాల వెనుక కూడా కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఆ కారణాల్లో కొన్ని...    ‘నిజం చెప్పే ధైర్యం లేకపోవడం’ వల్ల చాలాసార్లు అబద్ధాలు చెబుతుంటాం. నిజం చెబితే - అవతలి వ్యక్తి ఏమనుకుంటాడో, ఎక్కడ తప్పుగా అనుకుంటాడో అని భయపడి అబద్ధాన్ని ఆశ్రయిస్తుంటాం.   ‘బాధ్యత తీసుకోవడం ఇష్టలేకపోవడం’ వల్ల అబద్ధాలు చెబుతుంటాం.   ‘అవతలి వాళ్లను మంచి చేసుకోవడం కోసం... వాళ్ల నుంచి మంచి మార్కులు కొట్టేయడం కోసం...’ లేనిది కూడా ఉన్నట్లు చెప్పేస్తుంటాం.
     
చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం...  అబద్ధాన్ని ఆశ్రయిస్తుంటాం. అది స్కూల్‌లో హోమ్ వర్క్ చేయకపోవడం కావచ్చు. బాస్ ఇచ్చిన పని టైమ్‌కు చేయకపోవడం కావచ్చు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం  అబద్ధాలు ఆడేస్తుంటాం.

ఇతరులను హర్ట్ చేయకుండా ఉండడం కోసం...
లాభం పొందడం కోసం... అసత్యాన్ని ఆశ్రయిస్తుంటాం. ఉద్యోగానికి పెట్టే అప్లికేషన్‌లో అర్హతలు, అనుభవం దగ్గర నుంచి చేసిన, చేయని పనుల దాకా... లేని గొప్పలు ఎంత చెప్పుకుంటే అంత బెటరని తప్పుగా అనుకుంటూ ఉంటాం.మన మాటే కరెక్టని ఒప్పించడం కోసం... అవతలి వ్యక్తి నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కోసం... అబద్ధాల్ని కూడా నిజం అన్నంతగా చెప్పేస్తుంటాం.
 
 నాన్నా పులి
 ఒక్కసారి ఆలోచించండి. ఈ అబద్ధాలు ఆడకపోతే ప్రాణాపాయం ఉందా? నిజం చెప్పలేనప్పుడు కనీసం అబద్ధాన్ని అవాయిడ్ చేయవచ్చు కదా. అంతరాత్మ ఒక శుభ్రమైన అద్దం లాంటిది. అబద్ధం ఆడిన ప్రతిసారీ దాని మీద ఒక గీత పడుతుంది. ఇప్పుడు ఈ అబద్ధాలన్నీ నిండిన అంతరాత్మను ఊహించుకోండి. ఎలా ఉంది? నిజం స్వేచ్ఛనిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. మంచి జీవితాన్ని ఇస్తుంది.
 
 సరదా అబద్ధాలు
 
నిజం చెప్పులు వేసుకునేలోపు, అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందని సామెత. ఏదో ఒక చిన్న వెసులుబాటు కోసం ఒక అనవసరమైన అబద్ధం చెబుతూ ఉంటాం. ఇవిగో... కొన్ని డెయిలీ లైస్...అయిదు నిమిషాల్లో వచ్చేస్తా.... ట్రాఫిక్‌లో ఉన్నా...సార్! ఒంట్లో బాగా లేదు... జ్వరంగా ఉంది. ఇవాళ ఆఫీస్‌కు రాలేను. సెలవు కావాలి...ఈ డ్రెస్‌లో మీరెంత అందంగా ఉన్నారో... నువ్వు లేకుండా నేను బతకలేనుమీరు ఫోన్ చేసినప్పుడు చూసుకోలేదు. మొబైల్ ఇంట్లో పెట్టి మర్చిపోయా ‘ఆఫీస్‌లో పని ఉంది, మీటింగ్ ఉంది. లేటవుతుంది’ నేనెక్కడ కొన్నా. ఇది మా పుట్టింటివాళ్ళు పెట్టిన చీర ‘మీరు చెప్పింది (రాసింది) అద్భుతం. మీ లాగా చెప్పేవాళ్ళను, రాసేవాళ్ళను ఇంకొకరిని చూడలేదు’

నిన్ననే మీ గురించి అనుకున్నాం... మీకు ఫోన్ చేశా... దొరకలేదుమొన్ననేగా నాకు... 28 వెళ్లి  29 వచ్చింది...నాకేం బ్రహ్మాండంగా ఉన్నా. ఉద్యోగం, సంసారం - అంతా జాలీగా సాగిపోతున్నాయినేనస్సలు అబద్ధమే ఆడను. ఉన్నమాటే చెబుతాను
 
 సత్యాసత్యాలు అక్కచెల్లెళ్లు..
 మహాభారతంలో వినత, కద్రువ అనే అక్కచెల్లెళ్లు ఉన్నారు. వినతకు అబద్ధం చెప్పడం తెలియదు. కద్రువకు నిజం చెప్పడం తెలియదు. ఒకనాడు సముద్రతీరానికి విహారానికి వెళితే అల్లంత దూరంలో ఒక గుర్రం కనిపిస్తుంది. ‘అక్కా! గుర్రం తోక నల్లగా ఉంది కదూ’ అంటూంది కద్రువ. ‘లే దే! తెల్లగా ఉందే’ అంటుంది వినత. ఇద్దరూ పందెం వేసుకుంటారు. అప్పటికే చీకటి పడుతుండటంతో, మరుసటి రోజు సాయంత్రం అదే సమయానికి వచ్చి పరిశీలిద్దామనుకుంటారు. ఆ రాత్రి కద్రువ తన నాగ సంతానాన్ని పిలిచి, ‘మీలో ఎవరో ఒకరు వెళ్లి ఆ గుర్రం తోకకు చుట్టుకోవాలి’ అని ఆజ్ఞాపిస్తుంది. క ర్కోటకుడు అనే కుమారుడు అందుకు అంగీకరిస్తాడు. మరుసటి రోజు ఇద్దరూ సముద్ర తీరానికి వెళతారు. గుర్రం తోక నల్లగా కనపడుతుంది. వినత తన చెల్లెలు కద్రువకు సేవకురాలిగా మారుతుంది. కద్రువ తాత్కాలిక లాభం పొందింది. కాని  తరవాత నష్టపోయింది. వినతకు దాస్యవిముక్తి కలుగచేయడం కోసం ఆమె కుమారుడు గరుత్మంతుడు అమృతం సాధిస్తాడు. పాములకు శాపం కలిగి యజ్ఞకుండంలో పడి మరణిస్తాయి. అబద్ధం చెప్పిన కద్రువ తాత్కాలికంగా రాణివాసం అనుభవించిందే కాని, శాశ్వతంగా సంతానాన్ని కోల్పోయింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement