మ్యూరల్‌ మహాభారతం | Mahabharata was written in murals | Sakshi
Sakshi News home page

మ్యూరల్‌ మహాభారతం

Published Sat, Jul 21 2018 12:09 AM | Last Updated on Sat, Jul 21 2018 12:09 AM

Mahabharata was written in murals - Sakshi

ఒక గురువు. ముప్పై ఐదు మంది శిష్యులు. అంతా మహిళలు. నాలుగేళ్లు. వేర్వేరు రాష్ట్రాలు. వేర్వేరు ప్రాంతాలు. విభిన్న భాషలు. అంతా కలిశారు. కుడ్యచిత్రాలలో మహాభారతాన్ని లిఖించారు. ఆ కుడ్యచిత్ర కళ కూడా అతి ప్రాచీనమైనది. ఇక వీరు సృష్టించిన అద్భుతమైతే వర్ణనాతీతమైనది.

కుడ్యచిత్ర కళ (మ్యూరల్‌ పెయింటింగ్‌) అనేది దక్షిణ భారతదేశంలో ప్రత్యేక కళ. ఇది ‘టెంపుల్‌ ఆర్ట్‌’గా కూడా ప్రసిద్ధి. ఆలయాల పైకప్పుల మీద ఎక్కువగా ఈ కళావైభవం కనిపిస్తుంటుంది. వీటిల్లో మళ్లీ కేరళ మ్యూరల్‌ పెయింటింగ్స్‌ ది ప్రత్యేక శైలి. గురువాయూరులోని శ్రీకృష్ణ ఆలయంలో, మరికొన్ని ఆలయాల్లో ఇవి విశేషంగా సాక్షాత్కరిస్తాయి. ఈ చిత్రకళా ప్రక్రియ 9 – 12 వ శతాబ్దాల మధ్యలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ కాలంలో రాజుల ప్రోత్సాహంతో కుడ్యచిత్రకళ మనుగడ సాగించింది. ముఖ్యంగా కేరళలోని ఎట్టమన్నూరు శివాలయంలో, మట్టన్‌ చెరి రాజప్రాసాదంలో.. రామాయణ ఘట్టాల మ్యూరల్స్, కృష్ణపురం ప్యాలెస్‌లో గజేంద్రమోక్షం ఘట్టం,  అనంత పద్మనాభస్వామి ఆలయం పైకప్పు మీద.. ఈ మ్యూరల్‌ పెయింటింగ్స్‌ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అయితే.. ఇంత వరకు ఎక్కడా మహాభారతంపై మ్యూరల్‌ పెయింటింగ్స్‌ పెద్దగా లేవు. ఈ లోటును భర్తీ చేయడానికా అన్నట్లు ఇప్పుడు ప్రిన్స్‌ తొన్నక్కల్‌ కుడ్య చిత్రాలను రూపొందించి, వాటితో ఒక విశేష ప్రదర్శన ఇచ్చారు. 

నూటా పదమూడు ఘట్టాలు
ప్రిన్స్‌ తొన్నక్కల్‌ కేరళకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు. ఆయన శిష్యురాళ్లైన ముప్పై ఐదు మంది రూపొందించిన ‘మ్యూరల్‌ మహాభారతం’ ఇప్పుడు దక్షిణ భారతంలో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంటోంది. భారతీయ ఇతిహాసమైన మహాభారతాన్ని ఈ బృందం 113 కుడ్య చిత్రాలనుగా ప్రదర్శించింది. చెన్నైలోని లలిత కళా అకాడమీలో పదిరోజులు జరిగిన ఈ మ్యూరల్‌ మహాభారతం చిత్రలేఖనాల ప్రదర్శన ముగింపులో వీటిని రూపొందించిన మహిళామణులు, వారి గురువు సత్కారాలను అందుకున్నారు. 

విశేషం.. విశ్వరూప దర్శనం
ప్రిన్స్‌ తొన్నక్కల్‌కు ‘మహాగురువు’ అని పేరు. మ్యూరల్‌ పెయింటింగ్స్‌లో మహాభారతాన్ని రూపొందించాలన్నది ఆయన కల. దీనిని సాకారం చేసేందుకు ఆయన శిష్యురాళ్లు నడుం బిగించారు. మొత్తం కుడ్య చిత్రాలలో మహిళా శిష్యులు ఒక్కొక్కరూ 3 నుండి 4 పెయింటింగ్స్‌ ను రూపొందించగా గురువు ప్రిన్స్‌ తొన్నక్కల్‌ మహాభారతంలోని చివరి ఘట్టమైన విశ్వరూప దర్శనాన్ని ఒక చిత్రంగా తయారుచేశారు. ఈ ప్రాజెక్టులో కేరళలోని కొల్లం, కొట్టాయం, తిరువనంతపురానికి చెందిన మహిళా చిత్రకారులు అధికం ఉన్నారు. తమిళనాడు నుండి 8 మంది, ఢిల్లీ నుంచి ఒకరు, దుబాయ్‌ నుండి ఒకరు ఉన్నారు. ముందుగా మహాభారత ఘట్టాలను చిత్రీకరించి, ప్రకృతి సహజమైన పంచవర్ణ రంగులతో వాటిని తీర్చిదిద్దారు. ఈ మొత్తం ‘మ్యూరల్‌ మహాభారతం’ థీమ్‌ తయారీకి వీళ్లంతా నాలుగేళ్లు శ్రమించాల్సి వచ్చింది. 
– సంజయ్‌ గుండ్ల, సాక్షి టీవీ, చెన్నై 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement