
మల్హోత్రా లైబ్రరీ వెనుక...
మనిషి... తాను సంపాదించిన విజ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడం, వారిని విజ్ఞానవంతులను చేయడం కష్టమైన విషయం. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం ‘పుస్తకం’. పుస్తకం విజ్ఞాన వారధి.
మనిషి... తాను సంపాదించిన విజ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడం, వారిని విజ్ఞానవంతులను చేయడం కష్టమైన విషయం. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం ‘పుస్తకం’. పుస్తకం విజ్ఞాన వారధి. అలాంటి విజ్ఞానాల వారధులెన్నో ఉన్న ఆలయం ‘గ్రంథాలయం’. అయితే ఈ ఆలయం అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రభుత్వం చేత, ప్రజల చేత, ఉపాధ్యాయుల చేత, స్కూల్ యాజమాన్యాల చేత..! పబ్లిక్ లైబ్రరీలను నిర్లక్ష్యం చేయడంలో ప్రభుత్వం పాటు పడుతుండగా.. పిల్లల్లో పఠనం అనే ఆలోచననే లేకుండా చేయడానికి స్కూల్ యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. క్లాస్ పుస్తకాలు తప్ప.. మరో పుస్తకం ఉంటుందనే ఐడియా కూడా లేకుండా చేస్తున్నాయి యాజమాన్యాలు...
ఈ విషయం గురించే మల్హోత్రా ఆందోళన. ఐఐటీ అల్యూమినీ అయిన మల్హోత్రా కొన్ని సంవత్సరాల పాటు అమెరికాలో పనిచేసి వచ్చారు. భార్యాపిల్లలతో సహా అమెరికా నుంచి వచ్చి బెంగుళూరులో సెటిలైన మల్హోత్రాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అందులో ఆయన తీవ్రమైనదిగా భావించింది తన కొడుకు కోసం బెంగుళూరు వంటి మహానగరంలో ‘చైల్డ్ లైబ్రరీ’ లేకపోవడం. అమెరికాలో ఉన్నన్ని రోజులూ తన ఆరేళ్ల కొడుకుని దగ్గరలోని లైబ్రరీకి తీసుకెళ్లి ఎన్నో పుస్తకాలను పరిచయం చేసేవాడు మల్హోత్రా. అక్కడ పిల్లల కోసం ప్రత్యేకంగా లైబ్రరీలుంటాయి..
వాటిల్లో ఎన్నో పుస్తకాలంటాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం పిల్లల కోసం ఎటువంటి లైబ్రరీలూ నిర్వహించడం లేదని తెలుసుకున్నాడు. పబ్లిక్ లైబ్రరీల పరిస్థితి కూడా అంతంత మాత్రమేనని అర్థం చేసుకొన్నాడు. ఇది తన కొడుకు ఒక్కడి కి మాత్రమే సంబంధించిన సమస్య కాదని.. దేశంలో అనేకమంది చిన్నారులకు సంబంధించిన సమస్య అని గుర్తించాడు. ఈ నేపథ్యంలో ఆయనకు చిన్నారుల కోసం ఒక గ్రంథాలయాన్ని నడపాలనే ఆలోచన వచ్చింది. ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి చిన్నారుల కోసం బెంగళూరులోనే ఒక ప్రత్యేక లైబ్రరీని ఏర్పరిచాడు మల్హోత్రా.
ఈ లైబ్రరీకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పిల్లలు ఇక్కడికి వచ్చి పుస్తకాలు చదవాల్సిన అవసరంలేదు. పుస్తకాలనే పిల్లల దగ్గరకు తీసుకెళ్తారు. అలాగని ఇది సాధారణ సంచార గ్రంథాలయం కాదు. కొంతమంది వలంటీర్ల సహాయంతో.. మల్హోత్రా ఈ గ్రంథాలయాన్ని నడుపుతున్నాడు. ఆయన ఆలోచనకు వారు సహకరించి పుస్తకాలను గ్రామస్థాయిల్లోని స్కూళ్ల వద్దకు తీసుకెళుతున్నారు. అక్కడి విద్యార్థులకు పుస్తకాలను చూపించి వాటిని చదవడం మీద ఆసక్తిని పెంపొందిస్తున్నారు. వారానికి ఒక్కో స్కూల్‌కు వెళుతూ.. పిల్లలకు పుస్తకాలను ఎక్స్ఛేంజ్ చేస్తారు వలంటీర్లు.
ఈ విధంగా బెంగళూరుకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లోని స్కూళ్ల విద్యార్థులకు మల్హోత్రా లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. మల్హోత్రా లైబ్రరీలో చిన్నారులకు సంబంధించిన సర్వసాహిత్యం ఉంటుంది. ఫిక్షన్, నాన్‌ఫిక్షన్, ఆర్ట్, సినిమా, చిట్టిపొట్టి కథల పుస్తకాలు, నవలలు.. అన్నీ ఉంటాయి. వీటిని వలంటీర్లు విద్యార్థుల వద్దకు తీసుకెళ్తారు. పిల్లలు తమకు ఇష్టమైన వాటిని సెలెక్ట్ చేసుకొంటారు. చదివి ఎక్స్ఛేంజ్ చేసుకొంటారు.
ఈ విధంగా చిన్నారులను విజ్ఞానవంతులను చేసే ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాడు మల్హోత్రా. ఈ ప్రయత్నం అనేక మంది చిన్నారులకు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. చదవడం మీద ఆసక్తి ఉన్నవారికి వరంగా మారింది. ఆసక్తిలేని వారిలో ఆసక్తిని పుట్టిస్తోంది. మరి కొంతమంది ఔత్సాహిక వలంటీర్లతో కలిసి మల్హోత్రా చేస్తున్న ప్రయత్నం సఫలం అయ్యిందని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలి?