![మలోరీనా... మజాకా!](/styles/webp/s3/article_images/2017/09/2/41398623277_625x300.jpg.webp?itok=D-mtb6uj)
మలోరీనా... మజాకా!
విచిత్రం
‘ఈ బాధ పగవాళ్లకు కూడా వద్దు బాబోయ్’ అని మాట సామెతగా అనేవాళ్లను చూశాం కానీ, అది నోటిమాటగా కాదు, నీటైన వెద్యం రూపంలో రుజువు చేసి చూపింది ఈ పదమూడేళ్ల అమ్మాయి. అమెరికాకు చెందిన మలోరీ కివ్‌మాన్‌కి తరచు ఎక్కిళ్లు వస్తుండేవి. డాక్టర్ల చుట్టూ తిరగలేక ఉప్పునీటితో పుక్కిలించటం, పంచదార చప్పరించటం, ఆపకుండా ఏడుగుక్కల నీళ్లు తాగటం వంటి గృహవైద్య చిట్కాలు కూడా పాటించేది.
అలా ఎన్నో పాట్లు పడితే ఎప్పటికో గానీ ఎక్కిళ్లు తగ్గేవి కావు మలోరీకి. దాంతో ఆమె ఎక్కిళ్ల మీద దృష్టి పెట్టింది. వాటిని త్వరగా తగ్గించే మార్గం కోసం రకరకాల ప్రయోగాలు చేసింది. చివరికి యాపిల్, వెనిగర్, చక్కెర మిశ్రమంతో వెక్కిళ్లకు చెక్ పెట్టవచ్చని కనిపెట్టింది. ఆ మూడూ కలిపి ఒక లాలీపాప్ తయారు చేసింది. అంతేకాదు, దానికి ‘ది హికప్ పాప్’అని పేరు కూడా పెట్టింది.
కొందరు డాక్టర్లు దీనిని రకరకాలుగా పరీక్షించారు. పరిశోధన జరిపారు. చివరికి ఈ మందు ఎక్కిళ్లకు చాలా బాగా పని చేస్తుందని నిర్థారించారు. దాంతో తను కనిపెట్టిన లాలీపాప్‌ను... సారీ.. హికప్ పాప్‌ను తల్లిదండ్రులు, స్నేహితుల సాయంతో భారీ ఎత్తున తయారు చేసి, దానిని మార్కెట్టులోకి దింపడానికి సన్నాహాలు చేస్తోంది మలోరీ.
ఆమె ఆలోచన, పరిశోధన ఫలితాల గురించి తెలుసుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు లాలీపాప్స్‌ను తామే ఉత్పత్తి చేసి, ఎక్కిళ్లతో బాధపడేవారికి ఉచితంగా పంచిపెట్టేందుకు ముందుకొచ్చాయి. దాంతో ఒకప్పుడు మలోరీని ‘హికప్ బేబీ’ అని గేలిచేసి, దూరం పెట్టిన వారు ఇప్పుడు ఆమె తమ స్నేహితురాలని చెప్పుకుంటూ, ఆమెని అంటిపెట్టుకుని ఉంటున్నారు. అంతేకాదు, ఆమె తయారు చేసిన హికప్ పాప్స్‌ను మార్కెట్ చేసేందుకు ఎంబిఏ విద్యార్థులు కొందరు ఆమె చుట్టూ తిరుగుతున్నారు. మరి మలోరీనా మజాకా!