మా అమ్మ పులి | Mamata started training in body building | Sakshi
Sakshi News home page

మా అమ్మ పులి

Published Mon, May 20 2019 12:56 AM | Last Updated on Mon, May 20 2019 12:56 AM

Mamata started training in body building - Sakshi

పుట్టిన బిడ్డను ఆకాశంలోకి ఎత్తి గర్వంగా ప్రపంచానికిచూపించుకుంటుంది తల్లి.అలాంటప్పుడు..బిడ్డ పుట్టాక, కడుపు మీద పడిన చారలు మాత్రంగర్వకారణం కాకుండా ఎలా ఉంటాయి?!జీవితంలోని కొన్ని మచ్చలు.. ఒక్కోసారి కొన్ని గాయాలు..అవి వదలే గుర్తులు, ఆనవాళ్లు.. గర్వించదగ్గవే అయి ఉంటాయి.ఒక మొటిమ.. ఒక మచ్చ.. ఒక చార..ఏదైనా మన ఆత్మవిశ్వాసానికే ఆనవాలు కావాలి.బిడ్డ పులిబిడ్డ అయితే.. తల్లి మీద ఉన్న చారలు పులిచారలే కదా!అప్పుడు.. ఏ బిడ్డ అనుకోదూ.. ‘మా అమ్మ పులి’ అని!

టీన్స్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయికి ఉదయం నిద్రలోంచి లేవగానే అద్దం చూసుకోవాలంటే భయం! బుగ్గ మీద కొత్త మొటిమ ముత్యంలా మెరుస్తూ ఎక్కడ కనపడ్తుందోనని!ఇరవై ఏళ్ల అమ్మాయి పార్టీకి రెడీ అయ్యి... విరబోసుకున్న జుట్టుతో  చెంపల మీది యాక్నేను దాచేందుకు నానా తంటాలు పడ్తూంటుంది!నెలరోజుల్లో మొహాన్ని తెల్లగా మార్చేసే క్రీమ్‌లతో కుస్తీ పడ్తూంటుంది ఓ నల్ల కలువ!చీర కుచ్చిళ్లు దోపుకుంటున్న ఓ బిడ్డ తల్లికి తన నాభి మీది స్ట్రెచ్‌ మార్క్స్‌ నిలువుటద్దంలో ప్రస్ఫుటంగా కనిపించేసరికి ఆందోళన ఆవహించేస్తుంది.మొటిమలు.. యాక్నే.. నలుపు రంగు.. స్ట్రెచ్‌ మార్క్స్‌.. ఎట్‌సెట్రా.. స్త్రీకి అవమానాన్ని, ఆత్మన్యూనతను కలిగించేలా తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌ చేస్తుంటాయి.

కాస్మోటిక్స్‌ను ఉత్పత్తి సంస్థలు! ఇది ఎవరికి తెలియని విషయమేమీ కాదు.. ‘కాస్మోటిక్‌ ఇండస్ట్రీస్‌ మార్కెటింగ్‌ కాన్సిపరసీస్‌లో ఇదీ ఒకటి’ అని!  అందుకే..క్రీమ్స్‌ కన్నా అత్యుత్తమ ప్రొడక్ట్‌ మన ఆత్మవిశ్వాసమే అని చాటిన మహిళల గురించి తెలుసుకోవాలి. సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌ మ్యాటర్స్‌ కాబట్టి!  స్ట్రెచ్‌ మార్క్స్‌ను పైటతో కప్పేసుకోకుండా.. కుచ్చిళ్లతో దోపేయకుండా.. తన బిడ్డ జ్ఞాపకంగా గర్వంగా భావిస్తూన్న ఓ తల్లిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం! తను సాధించిన విజయంతో ఈ స్ట్రెచ్‌మార్క్స్‌ను ప్రైడ్‌గా భావించే క్యాంపెయిన్‌లాంటిది ఆ మహిళ మొదలుపెట్టారు. ఆమె పేరు మమతా సనత్‌కుమార్‌. వయసు 27 ఏళ్లు. బెంగళూరు నివాసి. బాడీ బిల్డర్‌. ఆమెకు అయిదేళ్ల కూతురు. పూర్విక.

బాధ్యతల బరువు
మమతది సాధారణ మధ్యతరగతి కుటుంబం. భర్త ఉద్యోగి. తను ఇంటి బాధ్యతలు చూసుకునేది. ప్రెగ్నెన్సీ ఆమెను తొంభై కిలోల బరువుకు చేర్చింది. డెలివరీ తర్వాత కూడా తగ్గలేదు. బిడ్డకు మూడో యేడు వచ్చాక.. పాపను నర్సరీలో జాయిన్‌ చేసి తను జిమ్‌లో చేరింది. ఆ వర్కవుట్స్‌తో 62 కేజీలకు తగ్గింది. అది ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వర్కవుట్స్‌ను మరింత పెంచింది. ఈ క్రమంలోనే భర్త ఉద్యోగం పోయింది. ఆ కోపం, బాధతో చీటికిమాటికి మమతతో గొడవపడేవాడు. ఇంట్లో అశాంతి బిడ్డ మీద పడకుండా చాలా సహనంగా ఉండేది మమత. తను ఉద్యోగం చేయాలనే నిర్ణయాన్నీ తీసుకుంది. జిమ్‌లో వర్కవుట్లు ఆమెకు కొత్త అవకాశాన్ని చూపించాయి. బాడీబిల్డర్‌గా.

కసరత్తు..!
బాడీ బిల్డింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది మమత. అయితే ఇంట్లో వాళ్లంతా.. ఆమె తల్లిదండ్రులు సహా  మమతను  వ్యతిరేకించారు. బయట కూడా సానుకూల వాతావరణమేమీ కనిపించలేదు ఆమెకు. బాడీబిల్డింగ్‌ పూర్తిగా పురుషుల రంగం అవడం, మమతది గ్రామీణ (బసవపుర గ్రామం) నేపథ్యం కావడం వంటివన్నీ ఆమెకు అడ్డంకులుగానే మారాయి. అయినా పట్టు వీడలేదు.  బాడీ బిల్డింగ్‌ పోటీలకు హాజరవడం, పాల్గొనడం స్టార్ట్‌ చేసింది. బాడీ బిల్డర్‌గా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసేది.

దాంతో  ఆ ఫోటోలు తీసేయమని ఇంట్లో వాళ్ల దగ్గర్నుంచి ఒత్తిడి, హెచ్చరికలు కూడా! కాని ఆమె సాహసానికి  ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ పెరిగారు. అడ్మైర్‌ అవుతూ కామెంట్లు పెట్టేవారు.  ‘‘గృహిణి నుంచి  బాడీబిల్డింగ్‌కు మళ్లారు.. ఫ్యామిలీ సపోర్ట్‌ చేస్తోందా?’’ అని ప్రశ్నలు. ఇంట్లోవాళ్ల సపోర్ట్‌ లేకుంటే వచ్చేదాన్నే కాను.. వాళ్లు నాకెప్పుడూ నో చెప్పలేదు’’ అంటూ సమాధానాలు ఇచ్చేది. ఇవన్నీ చదివిన భర్త.. వారించడం మానేశాడు. తల్లిదండ్రులూ మిన్నకుండిపోయారు. అదే ఆమె తొలి గెలుపు అయింది. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లింది.

బరిలో..
జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు స్పాన్సర్స్‌ దొరకలేదు. అలా అనేకంటే స్పాన్సర్‌షిప్‌ ఇచ్చేందుకు ముందుకు రాలేదు అనడం సబబేమో! ధైర్యం ఆమె గుణం. కాబట్టి బెంబేలెత్తలేదు. సొంతంగా జిమ్‌ పెట్టుకుంది. ట్రైనర్‌గా కొలువు తీసుకుంది. బాడీబిల్డింగ్‌లో అమ్మాయిలను ట్రైన్‌ చేయడం మొదలుపెట్టింది. బిడ్డ తల్లులూ రావడం ప్రారంభించారు. అప్పుడే తల్లులు తమ స్ట్రెచ్‌ మార్క్స్‌ పట్ల ఇబ్బందిగా ఫీలవడం గమనించింది మమత. ఆ టాబూని తుడిచేయాలనుకుంది. తన బాడీబిల్డింగ్‌ పోజులను.. స్ట్రెచ్‌ మార్క్స్‌ స్పష్టంగా కనపడేలా ఫోటోలు తీసి..  ‘‘స్ట్రెచ్‌ మార్క్స్‌.. వట్టి చారలు కావు.

ఎక్స్‌ట్రా స్కిన్‌ అంతకన్నా కాదు! మనల్ని నిర్వచించే గీతలు! మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి విజయం వైపు నెట్టే స్ట్రింగ్స్‌! ఇంత పాజిటివ్‌గా చూడలేకపోతే.. అవి ఏర్పడ్డానికి పడ్డ కష్టాన్ని, వెంట్‌ త్రూ అయిన వైనాన్ని గుర్తుపెట్టుకుందాం, మనలో భాగంగా సొంతం చేసుకుందాం! వేలాడే చర్మం మీది చారలుగా చూసి కుంగిపోకుండా.. శారీరక ధృడత్వంతో మానసికంగా బలపడి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే! మనల్ని మనం ప్రేమించుకోవాలి.. సొంతం చేసుకోవాలి.. స్ట్రెచ్‌మార్క్స్‌తో సహా!’’ అంటూ కామెంట్‌ రాసి మరీ ఆ ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం ప్రారంభించింది మమత.

మజిల్‌ మామ్‌..!
ఈ పోస్ట్‌లు ఎంత ప్రాచుర్యం పొందాయంటే.. స్ట్రెచ్‌మార్క్స్‌ను ఓన్‌ చేసుకునే ఓ ప్రచారంలా భావించేంతగా! దాంతో మమతా చాలా ఫేమస్‌ అయిపోయింది ‘‘మజిల్‌ మామ్‌’’గా! ఇప్పటికీ రోజుకు పది గంటలు జిమ్‌లో చెమటోడుస్తుంది. ట్రైన్‌ అవుతూ.. ట్రైన్‌ చేస్తూ! గుడ్‌ న్యూస్‌ ఏంటంటే.. 2017లో ఆరంభమైన ఆమె ఈ ప్రయాణానికి ఇప్పుడు స్పాన్సరర్స్‌ వచ్చారు. ఓ పోటీలో.. గెలిచి ట్రోఫీ అందుకుంటున్నప్పుడు.. ఆడియెన్స్‌లోంచి తన అయిదేళ్ల (ఇప్పుడు పూర్విక వయసు) కూతురు ‘‘మమ్మీ.. ’’ అంటూ స్టేజ్‌ మీదకు వచ్చి ఆమె మెడకు అల్లుకుపోతుంటే ఆడియెన్స్‌ అంతా ‘‘మజిల్‌ మామ్‌ (సంతూర్‌ మామ్‌ స్టయిల్లో)’’ అంటూ చప్పట్లు కొట్టారట.

‘‘నా ఇన్సిపిరేషన్, నాకు ప్రేరణ  లడ్డూ (కూతురి ముద్దు పేరు)నే. నా తపనంతా నేనూ తనకు ఇన్సిపిరేషన్‌గా నిలబడాలనే. నా ప్రొఫెషన్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఇంట్లో మాత్రం నా బిడ్డకు బానిసనే. తనే నా బలం.. బలహీనత’’ అంటుంది మమత.  ఒక్కో గెలుపుతో  ఇంట్లో వాళ్ల పూర్తి సపోర్ట్‌ను సాధించింది. ఇప్పుడు భర్తకూ ఉద్యోగం దొరికింది.  ట్రైనింగ్‌.. పోటీలు.. బిడ్డ పెంపకం.. స్ట్రెచ్‌ మార్క్స్‌ క్యాంపెయిన్‌తో క్షణం తీరకలేకుండా సాగిపోతోంది ఈ మజిల్‌ మామ్‌.
– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement