కొన్ని క్షణాలు తర్జనభర్జన పడి, ధైర్యంగా లేచి నిల్చుని సెల్యూట్ కొట్టారు మంజీత. అంత వరకు బాగానే ఉంది. ఆమె వెనుక చాలామంది అధికారులు ఉన్నారు. ఆమె కదిలితేనే గానీ వాళ్లు కదలడానికి లేదు. లేస్తే వాళ్ల కంట్లో మరక పడుతుంది. ఇదీ ఆమె సంకోచం.
గోడలపై మరకలు ఉంటాయి. రోడ్లపై మరకలు ఉంటాయి. వాహనాలపై మరకలు ఉంటాయి. మరకలేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేదు. అవన్నీ మనం పట్టించుకోం. అసలు మరక ఉన్నట్లుగానే గుర్తించం. అదే మరక ఒక మహిళ బట్టల మీద ఉంటే? ఆ మరకనూ మనం పట్టించుకోకపోవచ్చు.. కానీ ఆ మహిళ పట్టించుకుంటుంది. ఎవరైనా చూస్తున్నారేమోనన్న అనుమానంతో ఆమె కదలికలు ఇబ్బందిగా మారతాయి. అందులో ఆమె తప్పులేదు. ఆమె దేహధర్మం.. ఆమెకు అంటించిన మరక అది. నలుగురిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పైకి కనిపించిన ఆ మర క ఆమెను నిలువెల్లా బిడియంతో కుంగిపోయేలా చేస్తుంది. ఆ క్షణంలో అక్కడి నుంచి తన మాయం అయిపోతే ఎంత బాగుండు అని కూడా అనుకుంటుంది.
అహ్మదాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మంజీతకు కూడా ఇటీవల ఇలాంటి అనుభవమే ఎదురైంది. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఆమె. ఆ రోజు అహ్మదాబాద్‌లో నేరాలపై పోలీసు అధికారుల సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆ సదస్సు జరిగింది. మంజీత యూనిఫామ్‌లో ఉన్నారు. కుర్చీలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ఆమె నెలసరి వచ్చినట్లు అర్థమైంది. పైగా అక్కడ తను ఒక్కరే మహిళా అధికారి. చుట్టూ అంతా పురుషులు. పైకి లేవాలన్నా ఇబ్బంది, అక్కడి నుంచి వెళ్లాలన్నా ఇబ్బందే.
సాయంత్రం సదస్సు పూర్తయ్యేవరకు అలాగే కూర్చొని ఉన్నారు మంజీత. ప్రొటోకాల్ ప్రకారం పై అధికారికి సెల్యూట్ చేసే వంతు వచ్చింది. కొన్ని క్షణాలు తర్జనభర్జన పడి, ధైర్యంగా లేచి నిల్చుని సెల్యూట్ కొట్టారు మంజీత. అంతవరకు బాగానే ఉంది. ఆమె వెనుక చాలామంది అధికారులు ఉన్నారు. ఆమె కదిలితేనే గానీ వాళ్లు కదలడానికి లేదు. లేస్తే వాళ్ల కంట్లో మరక పడుతుంది. ఇదీ ఆమె సంకోచం.
‘‘అంతకుముందు ఇటువంటి సందర్భంలో నేను వెనకవైపు డైరీ కాని ఫైల్ కాని అడ్డు పెట్టుకుని నడిచేదాన్ని. ఇప్పుడు అలా చేయకూడదను కున్నాను.. ఏదైతే అదైందని ముందుకు నడిచేశాను. నా తోటి ఆఫీసర్లంతా మౌనంగా నా వెనక నడిచారు. కాని నా గన్‌మెన్ మాత్రం ‘మేడమ్ మీ బట్టల మీద మరక ఉంది’ అని చెప్పాడు. అందుకు నేను నవ్వుతూ, ‘ఇది మామూలే. ఏం పర్వాలేదు’ అని చెప్పి కారు ఎక్కేశాను’’ అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు మంజీత.
ఆ తర్వాత ఆమె ఇదే విషయం తన కింది అధికారులకు కూడా చెప్పారు. విధులలో ఉండగా మహిళా సిబ్బందికి నెలసరి వస్తే వారికి కాస్త విశ్రాంతి ఇవ్వండి అని సలహా ఇచ్చారు. ‘‘ఒక మహిళగా ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఆ మరకతో ఎలాంటి సమస్యా లేదు. ఎప్పుడైనా మరక కనిపిస్తే, నాకు చెప్పమని నా గన్‌మెన్‌కి చెప్పాను. ఇటువంటి మార్పు ప్రతి మహిళలోను రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అన్నారు మంజీత వంజర.
– రోహిణి
Comments
Please login to add a commentAdd a comment