మ్యారేజ్ కౌన్సెలింగ్
పరిష్కారం వున్నదాన్నే సమస్య అంటారు. విప్పగలిగినదాన్నే ముడి అంటారు. పరిష్కారం వున్న సమస్యలు, విప్పగలిగిన చిక్కుముళ్లు కాపురాల్లో సహజం. కూర్చుని మాట్లాడుకుంటే, ఏకాంతంలో అవలోకన చేసుకుంటే విడిపోయే మబ్బులే అన్నీ. కాదు... దారి దొరకటం లేదంటారా? ఈ శీర్షిక మీ కోసమే...
ప్రశ్న - జవాబు
నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్
మాకు 2015 జనవరిలో పెళ్లయింది. నా భర్త అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని, ఆలస్యం చేస్తే మళ్లీ అంత మంచి సంబంధం రాదనీ చెప్పి మా పెళ్లి చేశారు. అయితే పెళ్లయినప్పటినుంచి తను నాతో అంటీ ముట్టనట్లు ఉన్నాడు. ఆ తర్వాత వారం రోజులకే తనతో నన్ను అమెరికా తీసుకెళ్లాడు. అక్కడికెళ్లాక అప్పటికే ఆయనకు ఓ అమెరికా అమ్మాయితో పెళ్లయిందనీ, ఇద్దరు పిల్లలున్నారనీ తెలిసింది. తరువాత నెలరోజులకే నన్ను ఇండియా తీసుకొచ్చి వదిలి పెట్టి వెళ్లిపోయాడు. నా పాస్‌పోర్ట్ కూడా తీసుకెళ్లిపోయాడు. నాకు అతనితో కలిసి ఉండటం ఇష్టం లేదు. ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు.
- లావణ్య, పెనమలూరు
మీ పెళ్లి కంజుమేట్ అవలేదు. అంటే భార్యాభర్తలుగా మీ మధ్య ఎటువంటి అనుబంధమూ ఏర్పడలేదు. పైగా మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారని అర్థం అవుతోంది. కాబట్టి ఈ పెళ్లి నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేయమని కోరుతూ ఫ్యామిలీ కోర్టులో కేసు వే యండి. మీ పాస్‌పోర్ట్‌తో సహా మీరిచ్చిన కట్నకానుకలు, నగలు వంటివన్నీ తిరిగి ఇప్పించమని ఐ.ఏ (ఐ.అ) వేయండి. దీనికి లిమిటేషన్ ఉంది కాబట్టి సంవత్సరంలోపు కేసు ఫైల్ చేయడం మంచిది. వెంటనే డైవోర్స్ మంజూరయే అవకాశం ఉంది.
అనేక గొడవలతో క్రుయాలిటీ డిజార్షన్ కింద కోర్టులో మేము విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాం. మూడేళ్లుగా ఫ్యామిలీ కోర్టులో కేసు నడుస్తోంది. మాకు ముగ్గురు పిల్లలు. మా గొడవల మూలంగా పిల్లలు నలిగిపోతున్నారు. కేసు ఇప్పట్లో తేలేలా లేదు. నిజానికి నా భర్త చెడ్డ ్డవాడేమీ కాదు. ఇద్దరికీ చిన్న చిన్న ఇగో సమస్యలు మాత్రమే ఉన్నాయి. పిల్లల కోసం మేం మళ్లీ కలిసి జీవించాలనుకుంటున్నాం. ఏం చేయాలి?
- శ్యమంతక మణి, రాజమండ్రి
పిల్లల కోసం మీరిద్దరూ మళ్లీ కలిసి జీవించాలనుకోవడం హర్షణీయం. లాయర్ ద్వారా కాంప్రమైజ్ పిటిషన్, ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నట్లుగా ఎవిడెన్స్ అఫిడవిట్లు, జాయింట్ మెమో కోర్టులో దాఖలు చేస్తే కాంప్రమైజ్ బుక్ అయి, కేసు క్లోజ్ అవుతుంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇకైనైనా చిన్న చిన్న విషయాలకు గొడవలు పడటం, విడాకుల ఆలోచనలు చేయడం మానేసి హాయిగా కలిసి జీవించండి.
నేను నా తలిదండ్రులకు ఒక్కడినే కొడుకును. రెండేళ్ల క్రితం వివాహమైంది. నాకొక కొడుకు. నా భార్యకు, నా తలిదండ్రులకు తరచు గొడవలవుతున్నాయి. ఎవరి తరఫునా మాట్లాడలేని పరిస్ధితి నాది. నా భార్య వేరుకాపురం పెడదామని, లేదంటే నా మీద, తలిదండ్రుల మీద 498 ఎ పెడతానని బెదిరిస్తోంది. ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి.
- మోహనరావు, ఆదోని
నిజానికి మీ భార్య చెబుతున్నది తప్పేమీ కాదు. కానీ కేసు పెడతానని బెదిరించడం మాత్రం దారుణం. మీరు ఒక్కడే కొడుకు కాబట్టి మీ తలిదండ్రులను చూడవలసిన బాధ్యత మీ మీదే ఉందంటున్నారు కాబట్టి వారికి దగ్గరలోనే ఇల్లు తీసుకుని ఉంటూ, తలిదండ్రుల బాగోగులు విచారిస్తుండటం మంచిది. కొంతకాలం పాటు దూరంగా ఉంటేనయినా వారి పరిస్థితిలో మార్పు రావచ్చునని ఆశిద్దాం. అదేవిధంగా డొమెస్టిక్ వయొలెన్స్ కింద మీ మీద కేసు పెడతానంటున్న మీ భార్యను తీసుకుని ఒక సారి ఫ్యామిలీ కౌన్సెల ర్‌ను సంప్రదించండి. దానివల్ల పరిస్థితి కొంత మెరుగు పడవచ్చు.
మా వివాహమై ఏడేళ్లయింది. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తున్న సమయంలో మా అక్కచెల్లెళ్లకు, మా ఆవిడకు మధ్య గొడవలయ్యాయి. నా భార్యను తన పుట్టింటివాళ్లు తీసుకెళ్లిపోయారు. తర్వాత మా ఆవిడ మా అందరి మీదా కేసు పెట్టింది. మేమందరం జైలులో ఉండి, బెయిలుపై బయటికొచ్చాం. అవమానంతో మా నాన్న హార్ట్ అటాక్‌తో చనిపోయారు. మా అమ్మగారికి పక్షవాతం వచ్చింది. నా భార్య వచ్చి నిజానికి కేసు పెట్టడం తనకు ఇష్టం లేదనీ, తనవాళ్లే బలవంతంగా కేసు పెట్టించారని బాధపడింది. నాతో కలిసి జీవించాలని ఉందని చెప్పింది. నాకు కూడా ఇష్టమే. కానీ కేసు ఉందిగా... ఏం చేయాలి?
- బి.సన్యాసిరావు, హైదరాబాద్
మీరు మళ్లీ కలిసి జీవించాలనుకోవడం మంచి పరిణామం. వెంటనే మీ కేసును లోక్ అదాలత్‌కు రెఫర్ చేయమని, అక్కడే కాంప్రమైజ్ అవుతామని లాయర్‌తో చెప్పండి. దాంతో కేసు క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే హైకోర్టులో క్వాసీని నియమించుకుని అక్కడ కాంప్రమైజ్ అయి కేసు క్లోజ్ చేసుకోవచ్చు. మరో మార్గం ఏమిటంటే మీ కేసు ఏ కోర్టులో ఉందో ఆ కోర్టులో మీ భార్య హోస్టైల్ అయ్యి, ఇద్దరం కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నా మని చెప్పి కేసు క్లోజ్ చేసుకోవచ్చు. అనుకూలమైన మార్గం ఎంచుకుని, అది ఫాలో అవ్వండి.
పెళ్లయిన పన్నెండేళ్ల తర్వాత మేం చట్టపరంగా విడిపోయాము. అయితే ఆయన మా ఇద్దరు పిల్లలను చూడటానికి నెలకోసారి ఇంటికి వ చ్చి వెళుతుంటాడు. వచ్చినప్పుడల్లా పిల్లలకు ఏదో ఒకటి తెచ్చి ఇస్తుంటాడు. పిల్లలు తండ్రి మాయలో పడి ఆయనకు వత్తాసు పలుకుతారేమోనని నా భయం. వాళ్లని చూడటానికి ఆయనను రాకుండా చేయవచ్చా?
- ప్రవీణ, ఆదిలాబాద్
భార్యాభర్తలు విడిపోయినా, పిల్లల బాగోగులు చూడటం తండ్రి బాధ్యత, హక్కు కూడా. కోర్టు కల్పించిన ఆ సదుపాయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. మీ భయంలో అర్థం లేదు. వారి బంధాన్ని పాడుచేయవద్దు. అనవసరంగా టెన్షన్ పడకండి.