మ్యారేజ్ కౌన్సెలింగ్ | Marriage Counseling | Sakshi
Sakshi News home page

మ్యారేజ్ కౌన్సెలింగ్

Published Tue, Jun 2 2015 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

మ్యారేజ్ కౌన్సెలింగ్

మ్యారేజ్ కౌన్సెలింగ్

గతంలో పిల్లలెంతమంది? అని అడిగేవారు.
ఇప్పుడు పిల్లలు ఎవరితో ఉంటున్నారు? అని అడిగే దురవస్థకు వివాహ వ్యవస్థ చేరిందా?
 స్త్రీ పురుషుల స్పర్థలు సంతానానికి తీవ్రమైన చేటు కలిగిస్తున్నాయి.
అమ్మ కావాలా? నాన్న కావాలా?  అనే ప్రశ్న ఏ చిన్నారికీ రాకూడదు. అలా వచ్చిందంటే అది కుటుంబం కాదు.

 
 ప్రశ్న - జవాబు
 

 
మా పెళ్లయ్యి పద్నాలుగేళ్లయింది. మా మధ్య అన్యోన్యత ఏమాత్రం లేదు. చట్టప్రకారం విడాకులు తీసుకోలేదు కానీ నేను, నా భర్త చాలా ఏళ్లనుంచి విడివిడిగా జీవిస్తున్నాం. మా ఇద్దరు కూతుళ్లూ నా దగ్గరే ఉంటున్నారు. ఈ మధ్యే నా భర్త, పిల్లల కస్టడీ కోసం కోర్టులో కేసు వేశారు. నాకేమో పిల్లల్ని ఆయనకు ఇవ్వడం ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి?
 - ప్రసన్న, భద్రాచలం


 పిల్లలు మీ ఇద్దరికీ పుట్టినవారు. మీరింకా లీగల్‌గా విడాకులు తీసుకోలేదు. నిజానికి చట్టప్రకారం మైనర్ పిల్లల సంరక్షణ బాధ్యత తండ్రికే ఉంటుంది. అయితే మైనర్లయిన మీ పిల్లలు ఎన్నో ఏళ్లుగా మీతోనే కలిసి ఉంటున్నారు, అదీగాక మైనర్ పిల్లలకు తల్లి అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జడ్జిగారు పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుని, తీర్పు ఇస్తారు. మీ పిల్లలిద్దరూ ఆడపిల్లలంటున్నారు కాబట్టి తండ్రికి కస్టడీ ఇచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే ఎదిగే ఆడపిల్లలకు తల్లి అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి మీకే ఇస్తారు. అయితే తండ్రికి వారానికో పదిహేను రోజులకో ఒకసారి పిల్లలను చూసేందుకు విజిటేషన్ రైట్స్ ఇస్తారు. మీరు అందుకు అంగీకరించక తప్పదు.

 నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. ఆయన సంసారానికి పనికిరారు. ఆ విషయం కప్పిపుచ్చి ఆయన నన్ను మోసపూరితంగా పెళ్లి చేసుకున్నారు. నా సవతి తల్లి పోరు భరించలేక మా నాన్న ఈ పెళ్లి చేశారు. ఎటువంటి సుఖమూ ఇవ్వలేని ఈ వైవాహిక బంధాన్ని కొనసాగించటం నాకు ఇష్టం లేదు. దీని నుంచి బయట పడాలంటే ఏం చేయాలి?
 - విరజ, విజయవాడ


 మీకు ఇష్టం లేకుండా బలవంతంగా జరిగిన పెళ్లి అంటున్నారు. పైగా ఆయన సంసారానికి పనికి రాడని కూడా అంటున్నారు. కాబట్టి మీరు ఈ విషయాలను వివరిస్తూ, మీ వివాహాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతూ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయండి. మీరు చెప్పిన విషయాలను కోర్టులో నిరూపించగలిగితే కోర్టు మీ పెళ్లిని నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేస్తూ, మీకు విడాకులు మంజూరు చేస్తుంది. తర్వాత మీకు నచ్చినట్లు జీవించవచ్చు.

మా పెళ్లయి 15 సంవత్సరాలైంది. మాకు పదేళ్ల కొడుకు ఉన్నాడు. ఇన్నాళ్లూ అన్యోన్యంగానే ఉన్నాం. అయితే నా భార్య తన చిన్ననాటి స్నేహితుడితో సంబంధం పెట్టుకుంటున్నట్లు ఈ మధ్యే బయటపడింది. నేను అది జీర్ణించుకోలేకపోతున్నాను. నాకిక ఈ వైవాహిక బంధాన్ని కొనసాగించడం ఇష్టం లేదు. నేను ఏం చేయాలి?
 - ఉమాశంకర్, నిజామాబాద్


 మీరు ఇప్పుడు చెప్పిన విషయాలను రుజువు చేస్తూ, కోర్టులో డైవోర్స్ ఆఫ్ క్రూయెల్టీ కింద కేసు వేసి, కోర్టులో అక్రమ సంబంధాన్ని ప్రధాన కారణంగా చూపిస్తూ విడాకులు తీసుకోవచ్చు. వివాహిత స్త్రీ, భర్త బతికుండగా వేరొకరితో అక్రమ సంబంధం నడపటం చట్టవ్యతిరేకం కాబట్టి మీకు కచ్చితంగా విడాకులు మంజూరవుతాయి.

 మాకు పెళ్లయి ఏడేళ్లయింది. ఆరు సంవత్సరాల బాబు, నాలుగు సంవత్సరాల పాప ఉన్నారు.  నా భర్య నాతో గొడవ పెట్టుకుని, నా మీద అలిగి, ఏడాది క్రితం యూఎస్ వెళ్లిపోయింది. అప్పటినుంచి పిల్లలిద్దరూ ఆమె తలిదండ్రుల సంరక్షణలోనే ఉన్నారు. వృద్ధులైన నా అత్తమామలు నా పిల్లల్ని సరిగ్గా చూడలేకపోతున్నారు. నా పిల్లల బాధ వర్ణనాతీతం. వాళ్లంతా కలిసి పిల్లల్ని నాకు చూపించకుండా నన్ను నరకయాతనకు గురి చేస్తున్నారు. నా భార్య నాకు డైవోర్స్ ఇవ్వకుండా, నా అనుమతి లేకుండా ఇలా విదేశాలకు వెళ్లడం భావ్యమేనా?
 - జితేందర్, నెల్లూరు


 మీరన్నట్లు మీ అనుమతి లేకుండా మీ భార్య పిల్లల్ని తన తలిదండ్రుల సంరక్షణలో ఉంచి, విదేశాలకు వెళ్లిపోవడం, తన అడ్రస్ కూడా మీకు తెలియకుండా రహస్యంగా ఉంచటం చట్ట వ్యతిరేకమే. పిల్లలకు చట్టప్రకారం తండ్రే నేచురల్ గార్డియన్. మైనర్ పిల్లలు తల్లి లేదా తండ్రి సంరక్షణలో ఉండటం సహజం. కానీ ఈ కేసులో మీ భార్య తన బాధ్యతను విస్మరించి పిల్లల సంరక్షణను తీసుకోకపోవడమే గాక తన తలిదండ్రులకు ఇచ్చి వెళ్లిపోవడం చట్ట వ్యతిరేకం. కాబట్టి మీరు మీ పిల్లల కస్టడీ కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేయండి. తల్లి మైనర్ పిల్లల సంరక్షణ సరిగా చేయలేకపోతోంది కాబట్టి తండ్రిగా మీకు పిల్లల కస్టడీ పొందే అధికారం, హక్కు న్యాయబద్దంగా దక్కవచ్చు. మీరు నాతో చెప్పినవన్నీ కోర్టులో జడ్జిగారికి కూడా వివరించండి. జడ్జిగారు మీ సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని, మీ పిల్లల సంరక్షణను మీకు తప్పక అప్పగించే అవకాశం ఉంది. మీరు ప్రయత్నించి చూడండి.

నిశ్చల సిద్ధారెడ్డి
అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement