అర్ధాంగీకారం | marriage life same equal to husband and wife | Sakshi
Sakshi News home page

అర్ధాంగీకారం

Published Tue, Jan 3 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

అర్ధాంగీకారం

అర్ధాంగీకారం

వివాహ జీవితంలో ఇద్దరికీ.. అన్ని విషయాల్లో..
అంటే.. కష్టసుఖాల్లో సగం సగం బాధ్యత ఉంటుంది.
పెళ్లిలో సగం బాధ్యత ఇద్దరికీ ఉన్నప్పుడు
విడాకులలో ఉండదా?!
‘ఉంటుంది’ అంటోంది మన చట్టం.
ఏ పెళ్లయినా వర్ధిల్లాలని మనందరం కోరుకుంటాం.
వివాహం స్వర్గతుల్యం కావాలని ఆకాంక్షిస్తాం.
కానీ పెళ్లి నరకం అయినప్పుడు
విడాకులే స్వర్గ ద్వారాలు అవుతాయి. ముఖ్యంగా స్త్రీకి!
అందుకే మహిళలు మాట్లాడాలి.
మౌనం ‘అర్ధాంగి’కారం కాకూడదు.
విడాకులకు ఒప్పుకునీ, తప్పుకుంటుండే భర్తలకు
చట్టంతో కట్టు వదిలించాలి. వదిలించుకోవాలి.


‘మాటిమాటికీ ఇలా సెలవులు ఇవ్వడం కుదరదు యామినీ! మీకున్న సమస్య పరిష్కారం అయ్యేవరకు లాంగ్‌ లీవ్‌ పెట్టుకోండి...’ బాస్‌ గొంతులో కరుకుదనం లేకపోయినా ఆయన వ్యక్తపరిచిన భావనలో అది వినిపించింది యామినికి.‘సారీ.. సర్‌!’ అంతకన్నా ఇంకేం ఎక్స్‌ప్లనేషన్‌ ఇవ్వలేకపోయింది. వచ్చి సీట్లో కూర్చుంది. దుఃఖం ఆగట్లేదు. ఎంతమంది దగ్గర తల దించుకోవాల్సి వస్తోంది? ఇంకెంత మంది దగ్గర అవమానపడుతోంది? ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపతరం కావట్లేదు యామినికి. వాష్‌రూమ్‌లోకి వెళ్లింది దుఃఖాన్ని వెళ్లగక్కడానికి. చుడీదార్‌ చున్నీలో మొహం దాచుకొని, పొగిలి పొగిలి ఏడ్చింది! ఏడుస్తూనే ఉంది!

అసలేం జరిగిందంటే...
యామిని, శేఖర్‌లకు పెళ్ళయి ఎనిమిదేళ్లవుతోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆరేళ్ల  పాప ఉంది. యామిని డిగ్రీ చదివింది. ఓ ప్రైవేట్‌ సంస్థలో చిన్న ఉద్యోగి. శేఖర్‌ ఎంబీఏ చేశాడు. పేరున్న కంపెనీలో చక్కటి ఉద్యోగం. మంచి జీతం. పెళ్లయిన మూడేళ్ల దాకా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నుంచే అతని వేధింపులు మొదలయ్యాయి యామినికి. ఆమె కూర్చున్నా తప్పే! నిలబడ్డా తప్పే! ‘ఆఫీస్‌కి వెళ్లకపోతే మొగుడి సంపాదన మీద పడి అప్పనంగా బతికేద్దామనే...’ అంటూ సూటిపోటి మాటలు. పోనీ వెళితే... ‘ఎవడికి సోకు చూపించడానికి వెళ్తున్నావు’ అని సాధింపులు. నీట్‌గా రెడీ అయితే ఒక బాధ! రెడీ కాకపోతే... ‘పాచిమొహందానా! నేనంటే ఇష్టం లేదని ఇలా సింబాలిక్‌గా చెబుతున్నావా’ అంటూ ఇంకో నరకం.

పాపను కూడా సహించేవాడు కాదు. పాప ఏడిస్తే... ‘వెధవ కొంప’ అంటూ విసుక్కుంటూ బయటకు వెళ్లిపోయేవాడు. ఒక రకంగా యామినిని నిప్పుల్లో నిలబెట్టసాగాడు. అకారణంగా గొడవ సృష్టించేవాడు. చినికి చినికి గాలివాన చేసి, చివరకు యామిని మీద చేయి చేసుకునేవాడు. అనుమానంతో చిత్రవధ చేసేవాడు.

వేధింపుల ప్లాన్‌...
 ఇక భరించలేకపోయింది. కట్టుబట్టలతో, పాపను తీసుకొని ఇల్లు వదిలి బయటకొచ్చింది. విడాకుల కోసం కేసు వేసింది. అతను కాపురం హక్కుల కేసు వేశాడు. తనను ఇంకా ఇబ్బంది పెట్టడానికి  పాప కస్టడీ కోసం పిటిషన్‌ వేసుకున్నాడు. ఆ కేసులతో మాటిమాటికీ కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. లీవ్‌ల కోసం తంటాలుపడుతోంది. భర్త అటు కాపురమూ చేయడు... ఇటు విడాకులూ ఇవ్వడు. విడాకులిచ్చేస్తే భార్య స్వేచ్ఛా జీవి అవుతుందని భయం. అందుకే విడాకులివ్వకుండా... పాపను కూడా దూరం చేసి, యామినిని మానసికంగా ఇంకా హింసించాలని శేఖర్‌ ప్లాన్‌!

ఒకవైపు ఆర్థిక భారం, ఇంకోవైపు భర్త సమస్య, మరోవైపు ఆఫీస్‌... ఒత్తిళ్లతో సతమతమవుతోంది యామిని. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావట్లేదు. కాపురం హక్కుల కోసం కేసు వేసుకుంటే వెళ్లింది. కానీ శేఖర్‌ పరివర్తన చెందలేదు సరి కదా... మరింత శాడిస్టిక్‌గా ప్రవర్తించసాగాడు. అందుకే తిరిగి మళ్లీ బయటకు వచ్చేసింది. విడాకుల కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. శేఖర్‌ సాగనివ్వట్లేదు. మరి ఎలా?

దేవుడి ‘లా’...
అప్పుడే తన చిన్నప్పటి స్నేహితురాలు కలిసింది. ఆమె భర్త లాయర్‌. స్నేహితురాలి ద్వారా యామిని సమస్య అతనికి తెలిసింది. యామినికీ, శేఖర్‌కూ మధ్య నడుస్తున్న కేస్‌ల వివరాలన్నీ తెలుసుకున్నాడు. కాగితాలు తెప్పించుకొని చూశాడు. అన్నీ సవ్యంగానే ఉన్నా శేఖరే సరిగ్గా సాగనివ్వట్లేదని అర్థమైంది అతనికి. ‘మెయింటెనెన్స్‌ కోసం ఎందుకు వేసుకోలేదమ్మా...?’ అని అడిగాడు. ‘ఆ దుర్మార్గుడి సొమ్ము నాకొద్దు! నాకు విడాకులిస్తే చాలు’ అంది యామిని.

‘విడాకులు వస్తాయి. ముందైతే మెయింటెనెన్స్‌కి వెయ్యండి’ అంటూ బలవంతంగా యామిని చేత మెయింటెనెన్స్‌కి వేయించాడు. అప్పటి దాకా విర్రవీగిన శేఖర్‌ కాస్త తగ్గాడు. తన భార్య నిరక్షరాస్యురాలు, నిరుద్యోగి కాదనీ... సంపాదించుకునే సామర్థ్యం ఉన్నదనీ, ఆల్‌రెడీ ఉద్యోగం చేస్తోందనీ, తనకు చాలా తక్కువ సేలరీ అనీ అంటూ ఏవేవో సాకులు చూపబోయాడు. కానీ ఆయన పప్పులు ఉడకలేదు. దాంతో కన్సెంట్‌ డైవోర్స్‌(పరస్పర అంగీకారంతో విడాకులు)కి ఒప్పుకున్నాడు కష్టం మీద!

కొత్త జీవితం
అప్పుడు యామిని, శేఖర్‌లు ఇద్దరూ కలిసి జమిలీగా కన్సెంట్‌ డైవోర్స్‌ కోసం పిటిషన్‌∙వేశారు. ఆరునెలల తర్వాత రమ్మన్నారు కోర్టు వారు. అయితే ఆరునెలల తర్వాత మళ్లీ శేఖర్‌ తన బుద్ధి చూపించాడు. కోర్ట్‌కి హాజరు కాలేదు. దాంతో ఇంకో వాయిదా ఇచ్చింది కోర్ట్‌. ఇక, తప్పకపోవడంతో హాజరయ్యాడు. లోలోపల కోపంతో ఉడికి పోతున్నాడు. విడాకులతో యామిని సుఖపడిపోతుందనీ... స్వేచ్ఛగా బతుకుతుందనీ... ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుందేమోననీ అతని బాధ. విడాకులు ఇవ్వడం తనకు ఇష్టం లేదని కోర్టులో వాదించాడు. ఎలాగైనా యామినిని ఇబ్బంది పెట్టాలని మూర్ఖంగా ప్రవర్తించాడు. కానీ, కోర్టు చివరకు యామిని పక్షం వహించింది. విడాకులు మంజూరయ్యాయి. యామిని కొత్త జీవితంలోకి అడుగులు వేసింది.    – సరస్వతి రమ

ఈ సమస్యకు పరిష్కారం?
హిందూవివాహ చట్టం 1955లోని సెక్షన్‌ 13 బి ప్రకారం భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు అభ్యర్థన పిటిషన్‌ వేసుకోవచ్చు. దీన్నే ‘కన్సెంట్‌ డైవోర్స్‌’ అంటారు. పిటిషన్‌ దాఖలు చేసుకున్న ఆరు నెలల తర్వాత భార్యాభర్తలిద్దరూ కోర్ట్‌కు హాజరై, తమ నిర్ణయంలో మార్పులేదని విన్నవిస్తే వెంటనే విడాకులు మంజూరవుతాయి. ఇంకా టైమ్‌ కావాలని అడిగితే టైమ్‌ ఇస్తారు. దీన్ని ‘వెయిటింగ్‌ పీరియడ్‌’ అంటారు. పిటిషన్‌ వేసుకున్న నాటి నుంచి 18 నెలల వరకు పెండింగ్‌లో పెట్టవచ్చు. ఇష్టం లేకుంటే మధ్యలో ఎవరైనా సరే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే యామిని, శేఖర్‌ కేసులో... యామినిని ఆమె భర్త కావాలనే సతాయిస్తున్నాడని కోర్టు గ్రహించింది. భర్త ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రవర్తిస్తే అది మానసిక హింస కింద పరిగణిస్తుంది కోర్ట్‌. అంతేకాక గత అయిదేళ్ల నుంచి ఆమె విడాకుల కోసం అభ్యర్థిస్తోందనీ, భార్యభర్తల సంబంధం దెబ్బతిన్నదనీ, పునరుద్ధరించే పరిస్థితులు లేవనీ కోర్టు గ్రహించి .. ఆమెకు విడాకులు మంజూరు చేసింది. ‘కన్సెంట్‌ డైవోర్స్‌’కి పిటిషన్‌ వేసుకున్నాక ఒకరు ఇలా ఏకపక్షంగా వైదొలగడం క్రూరత్వమని ఇటీవలే ఢిల్లీహైకోర్ట్‌ తీర్మానించింది.

ఇ. పార్వతి, అడ్వకేట్‌ అండ్‌ ఫ్యామిలీ కౌన్సెలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement